Saturday, October 12, 2013

కలికి చిలుకల కొలికిబతుకమ్మ తెలంగాణా వారి ఆడపడుచు.ప్రతి దసరాకు పుట్టింటి కి తీసుకొచ్చి ఆదరించి పంపుతారు. పంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఇలా చెపుతారు.

అత్తామామా పట్లా చారా,
వద్దిక కలిగి వుంటే బుద్దిమంతురాలివైతే,
మాయమ్మ లక్ష్మిదేవీ పోయీరావమ్మా.
పోయి మీ అత్తింట బుద్దికలిగి వుండు.
ఎవరేమన్ననూ ఎదురాడబోకమ్మా,
పలుమార్లు పన్నెత్తి నవ్వబోకమ్మ,
పరమాత్మ (భర్త)తో కూడి వెలుగు మాయమ్మ,
అరిటాకు వంటిదీ ఆడజన్మంబు,
అత్తగారి తో పోరు చేయబోకమ్మ,
మామగారి తో మాట్లాడబోకమ్మ,
వీధి నిలుచుండి , కురులిప్పబోకమ్మ,
సంధ్య నిద్ర మరువు తల్లి,
పాటించిన దీపావళి పండుగ పదినాళ్ళున్నది,
నాటికి నిన్ను తీసుకు వస్తు,
ఇంకా ఆరునెలలున్నది సంక్రాంతి పండుగ,
నాటికీ నిన్ను తీసుకు వస్తు,
మాయమ్మ లక్ష్మి దేవీ పోయీరావమ్మ.
ఏమిటీ అమ్మాయిల కు  ఇది చదువుతుంటే కోపం వస్తోందా :) ఆగండాగండి. ఇందులోని అర్ధం తెలుసుకుంటే కోపం ఉష్ మంటుంది. కుటుంబానికి మూల స్తంభం స్త్రీ.ఇంటి ని పిల్లలను తీర్చిదిద్దవలిసింది ఆమే.ముఖ్యంగా పిల్లలను.ఎంత తండ్రి భుజాల మీదికి ఎక్కి ఆడినా చివరకు తల్లి వడినే చేరుతారు.ఆమె వొద్దిక గావుంటేనే కదా ఇంట్లో సుఖ శాంతులు వుండేది.ఇష్టం వచ్చినట్లు చిర్రుబుర్రులాడుతూ వుంటే ఇల్లు నరకమే .ఇంక పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఇంటి వాతావరణం సంతోషంగా వుంటేనే పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు.ఇలా మంచి పౌరులను సమాజానికి అందించే భారాన్ని స్త్రీ భుజం మీద వుంచారన్నమాట :)

ఈ పాట విన్నప్పుడల్ల నాకు  మాంగల్యబలం సినిమా లోని ఇదో ఈ పాట గుర్తొస్తుంది:)ఇంకో బతకమ్మ పాట;

అమ్మాయి , నీళ్ళు తీసుకొద్దామని , కడవ చంకన బెట్టుకొని వెళుతోందిట. ఇంతలో ఆమె పుట్టింటి కి తీసుకెళుదామని అన్నలు వచ్చారట.వాళ్ళను చూడగానే ఆమెకు కళ్ళళ్ళో నీళ్ళోచ్చేసాయట.ఎందుకు తల్లీ కన్నీరు , మీవాళ్ళకు చెప్పిరా వెళుదాము అంటారుట అన్నలు. అప్పుడు అత్తమామలను, బావగారిని, తోడికోడలును, గోలీలాడుకునే మరిదినీ (ఆ పొట్టోడినీ ఎందుకో :)) చివరకు భర్తనూ అడిగి, వారికోసం అన్నలు ఏమి తెచ్చారో చెప్పి పుట్టింటికి బయిలుదేరుతుంది:)
సీతకాలమొచ్చేకోల్ చీరల్లూ చినిగే,
మారుకాలమొచ్చే కోల్, మడతల్లూ చినిగే,
సీత నీ పుట్టింటా కోల్ చీరలే లేవా ,
నీలు చీర కట్టీకోల్ , నీలు రవిక తొడిగీ,
నీలాలపేరేసి (నీలపు రంగు గొలుసు)కోల్ నీళ్ళకుతాబోయి,
వచ్చిరి అన్నల్లూ కోల్ వనముల్లూ దాటి,
నిలిచిరి అన్నల్లూ కోల్ నిండూ పందిట్లో,
కాళ్ళు కడుగ నీళ్ళిచ్చీ కోల్ కన్నీళ్ళూబెట్టే.
ఎందుకు కన్నీరు కోల్ ఏలా కన్నీరూ,
తుడుచుకో కన్నీరూ కోల్ ముడుచుకో కురులూ,
ఎత్తుకో పాపడిన్నీ కోల్ ఎక్కుటద్దమునా,
నువ్వు చెప్పేవారితో కోల్ చెప్పీరావమ్మా.
కుర్చీపీటా మీదా కూర్చునట్టీ కోల్ ఓ అత్తాగారు,
మా అన్నలొచ్చారూ కోల్ మమంపారండి.
మీ అన్నలొస్తేనూ కోల్ నీకేమీ తెచ్చారు?
నాకు నల్లచీరా కోల్ నెమలడుగుల రవికా,
అత్తకు పట్టిచీరా కోల్ అద్దాల పట్టు రవికా,
మామకు ధోతుల్లూ కోల్ మల్లెపూలా శాలువాలూ,
వారికి అంబర్షా కోల్ అంగీలా జోడూ,
పాపకు పట్టంగీ కోల్ పాలుతాగు గిన్నె.
అట్లతే నేనెరుగా కోల్ నీ మామానడుగు.

పట్టెమంచానా పవళించూ కోల్ ఓ మామాగారూ,
మా అన్నలొచ్చారు కోల్ మమంపారండీ.
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనెరుగా కోల్ నీ బావానడుగూ.

భారతము చదివేటీ కోల్ ఓ బావాగారూ,
మా అన్నలొచ్చారూ కోల్ మమపారండీ.
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .

అట్లైతే నేనెరుగా కోల్ నీ అక్కా నడుగూ.

వంటిల్లు దిద్దేటీకోల్ ఓ అక్కాగారూ,
మా అన్నలొచ్చారూ కోల్ మమపారండీ .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనురుగా కోల్ నీ మరిదీనడుగు.

బొంగరాలాడేటీ కోల్ ఓ చిన్నీ కృష్ణా,
మా అన్నలోచ్చారూ కోల్ మమంపారండీ?
మీ అన్నలొస్తేనూ కోల్ మీకేమీ తెచ్చారు?
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనెరుగా కోల్ నా అన్నా నడుగూ.

రచ్చలో వుండేటీ కోల్ ఓ రాజేంద్రా భోగీ,
మా అన్నలొచ్చారూ కోల్ మమంపారండీ.
మీ అన్నలొస్తేనూ కోల్ నీకేమీ తెచ్చారూ?
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
ఎప్పుడు వస్తావూ కోల్ ఎప్పుడు పోతావూ?
చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ కోల్ చేసీ వస్తానూ.
మరుదుల పెళ్ళిళ్ళకూ కోల్ మరలీ వస్తానూ,
తమ్ముళ్ళ పెళ్ళిళ్ళకూ కోల్ తరలీపోతాను.
ఎత్తర మేనాలూ కోల్ దించర దివిటీలూ!
హమ్మయ్య పర్మిషన్ వచ్చేసింది :)

ఈ పాట వింటుంటే సీతారమయ్యగారి మనవరాలు లోని 'కలికి చిలుకల కొలికి మాకు మేనత్త ' పాట గుర్తురావటం లేదూ :)

బతకమ్మ కథ లో నూ , పాటల్లో నూ చెప్పేది ఆడపిల్లను వొద్దికగా వుండమని , ఇంటి ఆడపడుచును గౌరవించమనీనూ.అమ్మాయికి పెళ్ళి చేసి పంపేసాము ఇహ మా బాధ్యత తీరింది అనుకోక, పండుగకు సాదరంగా ఆహ్వానించి, గౌరవించి, ఆదరించాలి. అప్పుడే అన్నదమ్ములు , అక్క చెళ్ళెళ్ళ మధ్య సంబంద బాంధవ్యాలు నిలుస్తాయి. కుటుంబవ్యవస్త పదిలంగా వుంటుంది. తద్వారా సామాజం వర్ధిల్లుతుంది.Monday, October 7, 2013

బతకమ్మ కథ


దేవీ నవరాత్రులు మొదలు అయ్యే ముందు వచ్చే అమావాస్య రోజున బతకమ్మను పెడుతారు.బతకమ్మ అంటే అమ్మవారి రూపం.రకరకాల పువ్వులు ఒకదానిమీద ఒకటిగా పేర్చి ఎంత ఎత్తు చేయగలుగుతే అంత ఎత్తున పేరుస్తారు.పైన ఓ తమలపాకు లో పసుపు తో గౌరమ్మను చేసి పెడతారు. సాయంకాలం ఇంటి ముందు కాని , ఏదైనా దేవాలయము ముందు కాని , శుభ్రంగా వూడ్చి, కళాపి చల్లి, ముగ్గులేసి ఆడవాళ్ళు  అందరూ తమ తమ బతకమ్మలను తెచ్చి అక్కడ వుంచి చుట్టూ తిరుగుతూ రకరకాల పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ పూజిస్తారు.పూజ అయ్యాక నైవేద్యం పెట్టి , నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. ఈ విధముగా తొమ్మిది రోజులు ఆడుతారు.రోజుకొక రకం నివేదన చేస్తారు.తొమ్మిదోరోజు వడిబియ్యం తో సాగనపుతారు.ఇది దసరా ముందు రోజు , అంటే నవమి రోజు అవుతుంది. కొంతమంది, మనము ఆడపిల్ల ను పండుగకని పుట్టింటికి తెస్తాము కదా , పండుగ  ముందు సాగనపటమేమిటని , తొమ్మిది రోజులలో వక రోజు ఆడకుండా వుంచి, పండుగ మరునాడు సాగనంపుతారు.

ఇది తెలంగాణప్రాంతము లో చాలా శ్రద్ధగా , ఉత్సాహం గా చేసే పూజ.దీనికి ఒక కథ వుంది.

"అనగనగా  ఒకాయన వుంటారు..ఆయనకు ఏడుగురు కొడుకులు , వక కూతురు.అందరికీ పెళ్ళిళ్ళు చేసి, బాధ్యతలన్నీ తీరాయికదా అని, ఆయన భార్య తో  తీర్ధయాత్రలకు వెళుతారు.అప్పుడే దసరా పండుగ వస్తుంది.మరి ఆడపిల్లను పుట్టింటి కి తేవాలికదా! అందుకని అన్నలు చెల్లెలిని తీసుకొస్తారు.చెల్లెలు బతకమ్మ లాడుదామనుకుంటుంది. కాని, పట్టుచీర, కాళ్ళకు కడియాలు లేవు.ఎలా మరి?అందుకని పెద్దవదినను అడుగుతుంది కాని ఆమె నాకూ కావాలి ఇవ్వను అంటుంది. అలా ఆరుగురు వదినలూ ఇవ్వమంటారు.ఏడో వదిన దగ్గరకు వెళ్ళేసరికి ఆవిడ స్నానం చేస్తూ వుంటుంది." శీలకు పట్టుచీర, గూట్లో కడియం వున్నాయి ,తీసుకుపో . కాని చీరకు కొర్రు పట్టినా, కడియం నొక్కుకుపోయినా , నీ రక్తం నా నుదుటను పెట్టుకుంటాను." అంటుంది. చెల్లెలు ఓ క్షణం ఆలోచిస్తుంది. ఆ ఏమవుతుందిలే జాగ్రత్తగా తెచ్చిస్తే సరి అనుకొని తీసుకొని, చీర కట్టుకొని,కాలికి కడియం పెట్టుకొని వెళుతుంది.

ఉత్సాహంగా,జోరుగా బతకమ్మ ఆడేస్తుంది.ఆ ఉషారులో పాపం చీరకు కొర్రు పడుతుంది,కడియం నొక్కుకుపోతుంది.ఏమిచేయాలో తోచదు.చడీ చప్పుడు చేయకుండా , నిశబ్ధంగా అవి తీసుకుపోయి ఎక్కడి నుంచి తెచ్చిందో అక్కడ పెట్టేస్తుంది.ఐనా వదినకు తెలీకుండా వుంటుందేమిటి? తెలుసుకుంటుంది. అంతే భర్త వచ్చే సమయానికి తలకు బట్ట కట్టుకొని పడుకుంటుంది.ఎందుకలా పడుకున్నావు ఏమైంది అని అడిగిన భర్తకు, నాకు చాలా తల నొప్పిగా వుంది, నీ చెల్లెలి ని చంపి ఆ రక్తం తో నా నుదుట బొట్టుపెట్టుకుంటేనే తగ్గుతుంది అంటుంది.అతను కొద్దిసేపు బయటకు వెళ్ళి , ఓ గిన్నె లో రక్తం తెచ్చి ఇస్తాడు. ఆమె సంతోషంగా ఆ రక్తం తో బొట్టుపెట్టుకొని నీళ్ళ కోసం బావి దగ్గరకు వెళుతుంది.

బావి దగ్గర వున్న ఆడవాళ్ళందరూ "మనమందరమూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే , ఇదేమిటీ కలవారి కోడలు గద్ద రక్తం పెట్టుకొచ్చిందీ"అని పకపకా నవ్వుతారు.అంతే కోడలి కి కోపం వచ్చి, చరచరా ఇంటి కి వచ్చి,తలకు బట్ట కట్టుకొని పడుకుంటుంది.భర్త ఈసారి కాకి రక్తం తెచ్చి ఇస్తాడు.అది తెలీక ఆవిడ ఆ బొట్టు పెట్టుకొని వెళుతుంది.మళ్ళీ అందరూ"ఈ సారి కాకి రక్తం పెట్టుకొని వచ్చింది " అని నవ్వుతారు.అంతే కోడలికి బోలెడు కోపం వచ్చేస్తుంది. వళ్ళు మండిపోతుంది.ఈ సారి నీ చెల్లి రక్తం తెస్తే కాని వీల్లేదని భర్తకు గట్టిగా చెప్పేస్తుంది.

పాపం అతను ఇంకేమి చేయగలడు. ముద్దుల భార్య కదా కోరిక తీర్చాలి కదా!అందుకని ఈ సారి చెల్లిని ప్రేమగా పిలిచి , నిన్ను బావ దగ్గర దింపివస్తాను పదా అని తీసుకెళుతాడు.పాపం, అన్నయ్య మోసం, వదిన కుట్ర తెలీని ఆపిల్ల అతనితో బయిలుదేరుతుంది. దారి మధ్యలో ఓ చెట్టుకింద ఆపి"అలిసిపోయాము కదా కాసేపు పడుకో "అని చెల్లిని వళ్ళో పడుకోబెట్టుకొని తల వత్తుతాడు. ఆమె నిద్రపోగానే చంపేసి , కాస్త రక్తం తీసుకొని ఇంటికి తిరిగి వెళుతాడు.ఈ సారి వదిన ఆ రక్తం బొట్టు పెట్టుకొని బావి దగ్గరకు వెళ్ళగానే అక్కడవున్న వారంతా "ఈ సారి కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకొని వచ్చిందే"అని పకపకా నవ్వుతారు.అప్పుడు వదిన తృప్తి పడుతుంది.

అమ్మానాన్నా తీర్ధయాత్రల నుంచి తిరిగి వస్తుంటారు.తమ వూరి దగ్గరకు రాగానే ఓ చక్కటి పూల తోట కనిపిస్తుంది.అరే ఇదేదో కొత్తగా వచ్చినట్లుందే మనము వెళ్ళేటప్పుడు లేదు , కాసేపు ఇక్కడ సేద తీరుదాము అనుకుంటారు.అక్కడే వున్న బావిలో నుంచి నీళ్ళు తోడుదామనుకొని తండ్రి చేద అందులో వేయబోతాడు. వెంటనే
"అంటకు అంటకు ఓ నాన్నా,
అంటితే నీ చేయి కందేనూ,
దోషకారి వదిన చేయబట్టి,
పాపకారి అన్న వచ్చి పడబొడిచి బోయినాడు."
అని వినిపిస్తుంది.వెంటనే నాన్న చేదవదిలేస్తాడు. అమ్మ చేద వేయబోతుంది. అప్పుడూ అలాగే వినిపిస్తుంది. ఇదేమిటి ఇలా అంటోంది. పైగా మన అమ్మాయి గొంతులా వుంది అని అమ్మానాన్నా కలవరపడిపోతారు.కొడుకులను రమ్మని కబురు పెడుతారు. వాళ్ళూ ఎవరు చేద వేయబోయినా అలానే వినిపిస్తుంది.చివరి అన్న వేయబోతే,

"అంటకు అంటకు ఓ అన్నా,
దోషకారి వదిన చేయబట్టి,
పాపకారి అన్నవు నీవొచ్చి పడబొడిచి బోయినావు"అంటుంది.

వదిన చేద వేయబోతే ,
"అంటకు అంటకు ఓ వదినా,
దోషకారి వదినవు నీవు చేయబట్టి,
పాపకారి అన్న వచ్చి పడబొడిచి బోయినాడు."అంటుంది.

దాని తో అందరికీ జరిగినది తెలిసిపోతుంది.ఇంతలో ఆ అమ్మాయి భర్త ఏమైంది, ఏడాదైనా భార్య రాలేదు అని చూసేందుకు వస్తాడు. అతనూ ఈ తోటను చూసి లోపలికి వస్తాడు.అక్కడ , అత్తమామలను, బావమరుదులను చూసి ఆశ్చర్యపోతాడు. జరిగింది తెలుసుకుంటాడు. భార్య మీద ప్రేమతో చాలా సేపు ధుఖించి, తనూ ఆ బావిలోపడి చనిపోదామనుకుంటాడు. ఇంతలో అశిరీరవాణి , "ఓయీ నీ భార్య క్రితం జన్మలో బతకమ్మ పూర్తిగా తొమ్మిదిరోజులు ఆడకుండా మధ్యలో వదిలేసింది. అందువలన ఈవిధముగా జరిగింది. నువ్వు శ్రద్ధగా చుటుపక్కల అమ్మాయిలతో బతకమ్మ ఆడించు. నీ భార్య మాములు రూపం పొందుతుంది". అని చెపుతుంది. అంత , చుట్టుపక్కల అమ్మాయిలందరినీ ప్రోగుచేసి, ఆ తోటలోని పూవులతోనే బతుకమ్మను పేరించి , తొమ్మిది రోజులూ ఆడిస్తాడు. తొమ్మిదోరోజు పూర్తికాగానే , ఆ తోట, బావి మాయమై అతని భార్య గా మారిపోతుంది.అందరూ సంతోషిస్తారు.చివరి అన్న, వదిన వారిని క్షమార్పణ కోరుతారు."

బతకమ్మ ఆడటం పూర్తికాగానే అందరూ చుట్టూ కూర్చొని ఈ కథ చెప్పుకొని , హారతి ఇచ్చి, నైవేధ్యం పెడతారు. కథా అక్షింతలు తలపై వేసుకుంటారు.ఆ తరువాత నీళ్ళలో నిమజ్జనం చేస్తారు.

ఇది ఇంతకు ముందు చెప్పిన "బతకమ్మ" విశేషాలు.

పైన వున్నది మా ఇంటి బుజ్జి బతకమ్మ :)