Saturday, October 12, 2013

కలికి చిలుకల కొలికి



బతుకమ్మ తెలంగాణా వారి ఆడపడుచు.ప్రతి దసరాకు పుట్టింటి కి తీసుకొచ్చి ఆదరించి పంపుతారు. పంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఇలా చెపుతారు.

అత్తామామా పట్లా చారా,
వద్దిక కలిగి వుంటే బుద్దిమంతురాలివైతే,
మాయమ్మ లక్ష్మిదేవీ పోయీరావమ్మా.
పోయి మీ అత్తింట బుద్దికలిగి వుండు.
ఎవరేమన్ననూ ఎదురాడబోకమ్మా,
పలుమార్లు పన్నెత్తి నవ్వబోకమ్మ,
పరమాత్మ (భర్త)తో కూడి వెలుగు మాయమ్మ,
అరిటాకు వంటిదీ ఆడజన్మంబు,
అత్తగారి తో పోరు చేయబోకమ్మ,
మామగారి తో మాట్లాడబోకమ్మ,
వీధి నిలుచుండి , కురులిప్పబోకమ్మ,
సంధ్య నిద్ర మరువు తల్లి,
పాటించిన దీపావళి పండుగ పదినాళ్ళున్నది,
నాటికి నిన్ను తీసుకు వస్తు,
ఇంకా ఆరునెలలున్నది సంక్రాంతి పండుగ,
నాటికీ నిన్ను తీసుకు వస్తు,
మాయమ్మ లక్ష్మి దేవీ పోయీరావమ్మ.
ఏమిటీ అమ్మాయిల కు  ఇది చదువుతుంటే కోపం వస్తోందా :) ఆగండాగండి. ఇందులోని అర్ధం తెలుసుకుంటే కోపం ఉష్ మంటుంది. కుటుంబానికి మూల స్తంభం స్త్రీ.ఇంటి ని పిల్లలను తీర్చిదిద్దవలిసింది ఆమే.ముఖ్యంగా పిల్లలను.ఎంత తండ్రి భుజాల మీదికి ఎక్కి ఆడినా చివరకు తల్లి వడినే చేరుతారు.ఆమె వొద్దిక గావుంటేనే కదా ఇంట్లో సుఖ శాంతులు వుండేది.ఇష్టం వచ్చినట్లు చిర్రుబుర్రులాడుతూ వుంటే ఇల్లు నరకమే .ఇంక పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఇంటి వాతావరణం సంతోషంగా వుంటేనే పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు.ఇలా మంచి పౌరులను సమాజానికి అందించే భారాన్ని స్త్రీ భుజం మీద వుంచారన్నమాట :)

ఈ పాట విన్నప్పుడల్ల నాకు  మాంగల్యబలం సినిమా లోని ఇదో ఈ పాట గుర్తొస్తుంది:)



ఇంకో బతకమ్మ పాట;

అమ్మాయి , నీళ్ళు తీసుకొద్దామని , కడవ చంకన బెట్టుకొని వెళుతోందిట. ఇంతలో ఆమె పుట్టింటి కి తీసుకెళుదామని అన్నలు వచ్చారట.వాళ్ళను చూడగానే ఆమెకు కళ్ళళ్ళో నీళ్ళోచ్చేసాయట.ఎందుకు తల్లీ కన్నీరు , మీవాళ్ళకు చెప్పిరా వెళుదాము అంటారుట అన్నలు. అప్పుడు అత్తమామలను, బావగారిని, తోడికోడలును, గోలీలాడుకునే మరిదినీ (ఆ పొట్టోడినీ ఎందుకో :)) చివరకు భర్తనూ అడిగి, వారికోసం అన్నలు ఏమి తెచ్చారో చెప్పి పుట్టింటికి బయిలుదేరుతుంది:)
సీతకాలమొచ్చేకోల్ చీరల్లూ చినిగే,
మారుకాలమొచ్చే కోల్, మడతల్లూ చినిగే,
సీత నీ పుట్టింటా కోల్ చీరలే లేవా ,
నీలు చీర కట్టీకోల్ , నీలు రవిక తొడిగీ,
నీలాలపేరేసి (నీలపు రంగు గొలుసు)కోల్ నీళ్ళకుతాబోయి,
వచ్చిరి అన్నల్లూ కోల్ వనముల్లూ దాటి,
నిలిచిరి అన్నల్లూ కోల్ నిండూ పందిట్లో,
కాళ్ళు కడుగ నీళ్ళిచ్చీ కోల్ కన్నీళ్ళూబెట్టే.
ఎందుకు కన్నీరు కోల్ ఏలా కన్నీరూ,
తుడుచుకో కన్నీరూ కోల్ ముడుచుకో కురులూ,
ఎత్తుకో పాపడిన్నీ కోల్ ఎక్కుటద్దమునా,
నువ్వు చెప్పేవారితో కోల్ చెప్పీరావమ్మా.
కుర్చీపీటా మీదా కూర్చునట్టీ కోల్ ఓ అత్తాగారు,
మా అన్నలొచ్చారూ కోల్ మమంపారండి.
మీ అన్నలొస్తేనూ కోల్ నీకేమీ తెచ్చారు?
నాకు నల్లచీరా కోల్ నెమలడుగుల రవికా,
అత్తకు పట్టిచీరా కోల్ అద్దాల పట్టు రవికా,
మామకు ధోతుల్లూ కోల్ మల్లెపూలా శాలువాలూ,
వారికి అంబర్షా కోల్ అంగీలా జోడూ,
పాపకు పట్టంగీ కోల్ పాలుతాగు గిన్నె.
అట్లతే నేనెరుగా కోల్ నీ మామానడుగు.

పట్టెమంచానా పవళించూ కోల్ ఓ మామాగారూ,
మా అన్నలొచ్చారు కోల్ మమంపారండీ.
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనెరుగా కోల్ నీ బావానడుగూ.

భారతము చదివేటీ కోల్ ఓ బావాగారూ,
మా అన్నలొచ్చారూ కోల్ మమపారండీ.
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .

అట్లైతే నేనెరుగా కోల్ నీ అక్కా నడుగూ.

వంటిల్లు దిద్దేటీకోల్ ఓ అక్కాగారూ,
మా అన్నలొచ్చారూ కోల్ మమపారండీ .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనురుగా కోల్ నీ మరిదీనడుగు.

బొంగరాలాడేటీ కోల్ ఓ చిన్నీ కృష్ణా,
మా అన్నలోచ్చారూ కోల్ మమంపారండీ?
మీ అన్నలొస్తేనూ కోల్ మీకేమీ తెచ్చారు?
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనెరుగా కోల్ నా అన్నా నడుగూ.

రచ్చలో వుండేటీ కోల్ ఓ రాజేంద్రా భోగీ,
మా అన్నలొచ్చారూ కోల్ మమంపారండీ.
మీ అన్నలొస్తేనూ కోల్ నీకేమీ తెచ్చారూ?
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
ఎప్పుడు వస్తావూ కోల్ ఎప్పుడు పోతావూ?
చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ కోల్ చేసీ వస్తానూ.
మరుదుల పెళ్ళిళ్ళకూ కోల్ మరలీ వస్తానూ,
తమ్ముళ్ళ పెళ్ళిళ్ళకూ కోల్ తరలీపోతాను.
ఎత్తర మేనాలూ కోల్ దించర దివిటీలూ!
హమ్మయ్య పర్మిషన్ వచ్చేసింది :)

ఈ పాట వింటుంటే సీతారమయ్యగారి మనవరాలు లోని 'కలికి చిలుకల కొలికి మాకు మేనత్త ' పాట గుర్తురావటం లేదూ :)

బతకమ్మ కథ లో నూ , పాటల్లో నూ చెప్పేది ఆడపిల్లను వొద్దికగా వుండమని , ఇంటి ఆడపడుచును గౌరవించమనీనూ.అమ్మాయికి పెళ్ళి చేసి పంపేసాము ఇహ మా బాధ్యత తీరింది అనుకోక, పండుగకు సాదరంగా ఆహ్వానించి, గౌరవించి, ఆదరించాలి. అప్పుడే అన్నదమ్ములు , అక్క చెళ్ళెళ్ళ మధ్య సంబంద బాంధవ్యాలు నిలుస్తాయి. కుటుంబవ్యవస్త పదిలంగా వుంటుంది. తద్వారా సామాజం వర్ధిల్లుతుంది.



1 comment:

Jai Gottimukkala said...

సద్దుల బతుకమ్మ నాడు సద్దిలా చల్లనయిన టపా రాసినందుకు థాంక్సండీ!