Sunday, January 31, 2010

శ్రీమతి . డాక్టర్ . పద్మశ్రీ శోభారాజ్ గారికి అభినందన
" జో అచ్యుతానంద జో జో " పాట చిన్నప్పటి నుండి వింటున్నా , పిల్లలకు పాడినా అది అన్నమయ్య రచన అని నాకు తెలీదు . అలాగే " ముద్దు గారే యశోదా ముంగిట ముత్యము వీడు " అని మురిపెంగా పాడుకున్న పాట కూడా అన్నమయ కీరన అని , నాలాంటి సామాన్యుల కు తెలిసింది శ్రీమతి . డాక్టర్ . పద్మశ్రీ . శోభా రాజ్ గారి అన్నమయ్య కీర్తనల కాసెట్ల ద్వారానే . అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించటము లో శోభా రాజ్ గారి కృషి వెలలేనిది . వారి కృషిని " పద్మశ్రీ " బిరుదు తో ప్రభుత్వము సత్కరించటము సముచితము

శోభా రాజ్ గారికి " పద్మశ్రీ " లభించిన సంధర్భములో " అన్నమయ్య పురం " లో వారి విద్యార్ధులు నిన్న 30 - 1 2010 న సన్మానము జరిపారు . నా కంప్యూటర్ టీచర్ , అనిత , ఆవిడ విధ్యార్ధిని . నాకు శోభా రాజ్ గారిని కలిసి అభినందించాలన్న అభిలాష వుండటము వలన అనిత తో పాటు నేనూ ఆ సన్మాన సభ లో పాలుగొన్నాను .

అన్నమయ్యపురం లోనికి ప్రవేశించగానే ఇది అన్నమయ్య పురమా లేక ఆద్యాత్మిక పురమా అనిపించింది . అంతటా వెంకటేశుడే అగుపించాడు . పద్మశ్రీ . శోభా రాజ్ గారిని నేను , పుష్ప గుచ్చము తో అభినందించిన క్షణం , నాకు చాలా అపురూపం గా అనిపించింది . అనిత నన్ను పరిచయము చేయగానే , ఆప్యాయం గా నా చేయి అందుకున్నారు . చాలా సంతోషం వేసింది .

శ్రీమతి . డాక్టర్ . పద్మశ్రీ . శోభా రాజ్ గారికి విద్యార్ధు లందరూ దండలు వేసి , పుష్ప గుచ్చాలిచ్చి , శాలువా తో సత్కరించారు .అన్నమయ్య కీర్తనలు ఆలపించారు . చిన్న పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు .కుండల మీద నిలబడి , చేతుల లో కాండిల్స్ వెలింగించి పట్టుకొని , చిన్న పిల్లలు చేసిన భరత నాట్యం అద్భుతం . వేడుకుందా పాటకు ఆహుతుల లోనుండి కూడా కొంతమంది లేచి నర్తించారు . అందరిలో నెలొకొన్న భక్తి భావం పరమాద్బుతం ! వినాయకుడు , శ్రీదేవి , భూదేవీ సహిత వెంకటేశ్వరస్వామి , అన్నమయ్య , షిరిడీ సాయి , పకీరు వేషధారణల లో పిల్లలు చాలా ముద్దుగా అనిపించారు . అంతటా భక్తిరసం తో పులకించి పోయింది .

శోభా రాజ్ గారు , మీకు మరిన్ని పురష్కారాలు జరగాలని మనసారా కోరుకుంటూ , అభినందనలు .ఇంకా కొన్ని అన్నమయ్య సంకీర్తనలు ఇక్కడ వినవచ్చు.

Saturday, January 23, 2010

" జనగణమన " కు రేపటి తో అరవైయ్యేళ్ళు
అధినాయక జయహే . . భారత భాగ్య విధాత . . .అంటూ యావత్ దేశం లో జాతీయభావాన్ని పురికొల్పే " జన గణ మన " గీతం . . . మన జాతీయ గీతంగా ఏర్పాటు చేసుకొని రేపటికి సరిగ్గా అరవైయ్యేళ్ళు ! విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలం నుంచి జాలువారిన ఈగీతాన్ని 1950 జనవరి 24 న రాజ్యాంగసభ , జాతీయగీతం గా అధికారికం గా ఆమోదించింది . వాస్తవానికి ఈ గీతాన్ని గురుదేవుడు 1911 డిసెంబర్ 27నే రాసారు . 1919 ఫిబ్రవరి లో ఈ గీతాన్ని స్వరపరిచారు .అందుకు ఆంద్రప్రదేశ్ లోని మదనపల్లి వేదిక కావటం విశేషం . ప్రస్తుతం మనం అదే స్వరం లో ఇప్పటికీ పాడుకుంటున్నాము . ఈ గీతాలాపనకు సాధారణం గా 55 సెకెండ్లు పడుతుంది . సంక్లిష్టమైన బెంగాలీ సంస్కృతములో రాసిన ఈ గీతాన్ని రవీంద్రుడు అనంతరం ఇంగ్లీషు లోనికి అనువదించారు . బహుళ భాషలు , యాసలు సమ్మిళితమైన భారతదేశం లో అన్ని ప్రాంతాల్లోనూ ఈ గీతాన్ని ఆలపించినా . .ఆయా ప్రాంతాలను బట్టిపదాలలో మార్పులు కనిపిస్తుంటాయి . అసలు గీతం లోని కొన్ని నిశ్శబ్దాక్షరాలూ కనిపిస్తుంటాయి . 1911 లోనే ఈ గీతం రాసినా .. చాలాకాలం వరకు పెద్దగా వెలుగులోకి రాలేదు . అప్పట్లో రవీంద్రుని సంపాదకత్వములో వెలువడిన బ్రహ్మోసమాజ్ పత్రిక " తత్వ బోధ ప్రకాశిక " పాఠకులకు మాత్రం ఇది పరిచితం .

మన రాష్ట్రంతో సంబంధం
ఐరిష్ కవి , తన స్నేహితుడు జేంస్ హెచ్ క్యూజిన్స్ ఆహ్వానముతో ఠాగూర్ కొంతకాలం మదనపల్లి లోని బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ లో గడిపారు . ఆ కాలేజీకి క్యూజిన్స్ ప్రిన్సిపల్ గా వుండే వారు . ఫిబ్రవరీ 28 వ తేదీ సాయంత్రం గురుదేవుడు అక్కడి విద్యార్థులతో ఇష్టా గోష్టి జరిపారు . వారందరి విజ్ఞప్తి మేరకు బెంగాలి లో జనగణమన గీతాన్ని ఆలపించారు . ఆ సంధర్భంగానే ఆ గీతాన్ని ఆంగ్లం లోకి అనువదించారు . క్యూజిన్స్ భార్య మార్గరేట్ .. పశ్చిమ సంగీతములో నిపుణురాలు . ఆమె చివరిసారి ఈ గీతాన్ని స్వరపరిచారు . అలాగే ఈ గీతాన్ని , ఇప్పటికీ మనం పాడుకుంటున్నాము . మదనపల్లి లోని బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ లో ఆంగ్ల రాత ప్రతి ఇప్పటికీ ఫ్రేం కట్టి భద్రం గా వుంచారు .

వివాదాలూ వున్నాయి
ఈ గీతం పై వివాదమూ వుంది . ఈ గీతం బ్రిటిష్ వలస పాలకులను కీర్తిస్తూ వుందనేది ఆ వివాదం . ఈ గీతం తొలిసారి 1911 డిసెంబర్ లో కలకత్తా లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేసాల్లో ఆలపించారు . ఆ సదస్సు లో రెండవ రోజును బ్రిటిష్ నేత ఐదవ జార్జి రాకకు స్వాగతం పలికేందుకు వుద్దేశించారు . ఈ సంధర్బం గా స్టేట్స్ మన్ పత్రిక తన మరుసటి రోజు పత్రికలో " బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ .. చక్రవర్తిని ఆహ్వానిస్తూ , తను రాసి స్వరపరచిన గీతం ఆలపించారు " అని పేర్కొంది . దీనితో చక్రవర్తి గౌరవార్ధం ఈ గీతం రాసారనే దురభిప్రాయం నెలకొంది . అదే సదస్సు లో చక్రవర్తిని కీర్తిస్తూ మరో పాట కూడా పాడారు . దీంతో మీడియా ఈవిషయం లో పొరబడిందని కొందరు చెబుతుంటారు . అయితే తాను ఈ పాటను దేవుడి ( భారత భాగ్య విధాత ) ని ఉద్దేశించి రాసిందేనని , బ్రిటిష్ చక్రవర్తిని ఉద్దేశించి రాసింది కాదని ఠాగూర్ అప్పట్లోనే స్పష్టం చేసారు . 2005 లో ఈ గీతం లోని సింధు అన్న పదాన్ని తొలిగించాలని కొందరు వాదించారు . సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉందనేది వారి వాదన . అయితే , సింధు అనే పదం హిందూ , సింధూ నాగరికతలను ఉద్దేశించినదంటూ కొందరు ఆ ప్రతిపాదనను విభేదించారు .

ఈ ఆర్టికల్ ఈ రోజు 23- 1- 2010 ,ఆంధ్రజ్యొతి డైలీ పేపర్ లోనిది యధాతధంగా .

Friday, January 15, 2010

డబ్బులోయ్ డబ్బులు * * * * * 1
నిన్న రాత్రి విక్కీ వాళ్ళ స్కూల్ లో ఓ ప్లే చేసారని , అన్ని పోర్షన్ లూ వాడే ఆక్ట్ చేసి చూపించాడు . అందులో కొత్త అల్లుడు అత్తవారింటికి , పండగ కి మొదటిసారిగా వస్తాడు . అత్తగారు ఆప్యాయముగా రకరకాల పిండి వంటలు చేసి పెడుతుంది . అల్లుడు అన్నీ హాయిగా ఆరగించి , కడుపులో నొప్పని గోల పెడుతాడు . వెంటనే డాక్టర్ అల్లుడి కి ఆపరేషన్ చేసి , అల్లుడి కడుపు లో నుండి , బొబ్బట్లూ , అరిసెలూ , గారెలూ వగైరా తో పాటు కొన్ని చిల్లర నాణాలు కూడా తీసి చూపిస్తాడు . ఆ డబ్బులు ఎక్కడవా ? అని అందరూ విస్తు బోయి చూస్తుంటే, మామగారు " నీ దాపరికము మండా , చిల్లర డబ్బులు పప్పుల డబ్బాల్లో దాస్తావు . ఇప్పుడు చూడు ఏమైందో " అని అత్తగారిని తిడుతాడు !

అది వినగానే నేను , రింగులు తిప్పుకొని , బ్లాక్ అండ్ వైట్ రోజులలోకి వెళ్ళిపోయాను . నా పెళ్ళై రెండు నెలలైన రోజులు , నన్ను వంట నేర్చుకోమని మా వారు వాళ్ళ అమ్మ దగ్గర వదిలి , పటియాలా వెళ్ళిన రోజులు , నేను భయం భయం గా , బెరుకుగా వున్నరోజులు . ఆ రోజులలో , ఓరోజు , మా అత్తగారు , ఒక 100 రుపాయ నోటు నా చేతికి ఇచ్చి , బాంక్ కి వెళ్ళి మార్చుకు రమ్మన్నారు . మా ఆడపడుచు విజయ ను తను అప్పుడు 8 థ్ క్లాస్ చదువుతోంది , నాకు బాంక్ దారి చూపించటానికినూ , నాకు తోడుగానూ పంపారు . ఇద్దరమూ కోఠీ ఆంధ్రా బాంక్ కి వెళ్ళి , అక్కడ కౌంటర్ లో చిల్లర ఇవ్వమని ఇచ్చాము . అతను , మమ్మలినీ , నోటునూ ఎగాదిగా చూసి , నీకెక్కడిది అమ్మాయ్ ఈ నొటు అని అడిగాడు . నేను , మా అత్తగారు ఇచ్చారండి అని చెప్పాను. అక్కడ కూర్చోండి , ఇస్తాను అన్నాడు . ఇద్దరమూ ఆయన ఎదురుగా కూర్చున్నాము . ఆయన ఎవరినో పిలిచి దాన్ని చూపించాడు . అతను ఆ నోట్నూ , మమ్మలినీ మార్చి మార్చి చూసి , వెళ్ళి ఇంకెవరినో తీసుకొచ్చాడు . అలా ,అలా బాంక్ లో వున్న వాళ్ళంతా అక్కడ చేరి , మమ్మలినీ , ఆ నోటు నూ ఒకటే చూడటము . ముందు ఏమనుకోలేదు కాని , అందరూ చేరి అలా శల్య పరీక్షలు చేస్తుంటే చాలా భయం వేసింది . ఇక విజయేమో వదినా వెళ్ళి పోదాము పదా అంది . కాని నాకేమో చిల్లర తీసుకొని వెళ్ళక పోతే అత్తయ్య గారు ఏమంటారో నని భయం . ఇక వుండలేక , అతని దగ్గరికి వెళ్ళి , మాకు చిల్లర వద్దండి , మా నోట్ ఇచ్చేయండి , వెళ్ళిపోతాము అన్నాను . ఆయన వుండమ్మాయ్ , మా మేనేజరు గారు వస్తున్నారు , ఆయన రాగానే చిల్లర ఇస్తాను అంటుండగానే , మేనేజరు గారు వచ్చారు . ఆయన ఇక ప్రశ్నలు మొదలు పెట్టాడు .


నీకు పెళ్ళైందా ? మీ వారు ఏం పని చేస్తున్నాడు ? ఈ నోట్ నీకెక్కడి దీ ? ఇలా సాగిపోయింది . ఇక ఏడుపే తక్కువ . కాళ్ళూ , చేతులూ గజ గజ వణికి పోతున్నాయి . ఆయన , కాషియర్ వైపు తిరిగి , వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు అంటూ ఏదో చెప్ప బోతుండగా , విజయ , మేమేమీ చిన్నపిల్లలం కాదు . నేను రోజరీ కాన్వెంట్ లో 8 థ్ క్లాస్ చదువుతున్నాను . మా అన్నయ్య మిలిట్రీ లో కాప్టెన్ అని గడ గడా చెప్పింది . ఇంతలో మా అదృష్టవసాత్తూ , ఓ ముసలాయన అక్కడికి వచ్చాడు . ఆయన సంగతి విని , ఆ నోట్ ను చూసి , ఇది మా చిన్నప్పటి నోట్ అండి , మంచిదే అన్నాడు . ఈ లోపల వాళ్ళూ కన్ ఫర్మ్ చేసుకొని , చిల్లర ఇచ్చేసారు . బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి వెళ్ళి మా అత్తగారికి ఇచ్చి , జరిగీన హడావిడి చెపుతుండగా , మా మామగారు వచ్చారు . ఆయన అచ్చం , విక్కీ చెప్పిన ప్లే లోని మామగారిలాగానే మా అత్తగారి తో " నీ దాపరికం మండా . ఇంత పాతది ఎక్కడి నుండి తీసావు ? పైగా ఆడపిల్ల లిద్దరినీ పంపావా ? దొంగ నోట్ అనుకొని ఏ పోలీస్ లకో అప్ప చెప్పలేదు . ఇంకా ఏమైనా వుంటే బయటకు తీయి " అని కోపం చేసారు . ఈ సంగతి చెప్పగానే మా వారు అప్పుడు కాబట్టి అంత తర్జన బర్జన పడ్డారు . ఇప్పుడైతే దాన్ని మధ్యకు చింపేసి మిమ్మలిని లాకప్ లో పెట్టేవారు అన్నారు .


ఆ రోజుల లోనే ఓసారి , మావారిని దేనికో డబ్బులు అడుతుంటే మా అత్తగారు విని , ప్రతి పైసా అడగటమేమిటి అని , నాకు మావారు , నెలకు 10 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేసారు . అదేమిటో , మా వారికి , అప్పటికీ ఇప్పటికీ ఏ డబ్బులు గుర్తువుండవు కాని , నాకిచ్చినవి మాత్రము గుర్తు వుండి తీసేసుకునేదాకా తోచదు ! అలా ఒకసారి ఆయన అడుగుతుండగా మా అత్తగారు విని , " వాడు అడగగానే నీదగ్గర వున్న డబ్బులు ఇచ్చేయకు . ముందు ముందు పిల్లలు పుట్టినప్పుడు చాలా ఖర్చులు వుంటాయి .ఆడపిల్లైతే ఎక్కువ వుంటాయి . మగవాళ్ళకు అన్ని తెలీవు . మనము పెట్టే ప్రతి ఖర్చూ దండగ అనుకుంటారు . నీ దగ్గర లేవంటే , అవసరమైతే బయట తెచ్చుకుంటాడు . బయట వాళ్ళ కైతే తిరిగి ఇచ్చేస్తాడు . నీకైతే ఇవ్వడు . వాడు ఇవ్వగానే సగము తీసి జాగ్రత్తగా దాచు ." అని హితబొధ చేసారు .


ఇహ డబ్బులు ఎక్కడ దాచాలి ? నా పెట్టెలో పెట్టుకుంటే ఆయనకు తెలుస్తుంది . దానికి కూడా మా అత్తగారే ఉపాయం చెప్పారు , ఆవిడ అలమారలో , ఎవరికీ కనిపించని చోట , ఎవరికీ చెప్పకుండా , చివరకు ఆవిడకు కూడా చెప్పకుండా దాచమని . మొదటి ఐదు రూపాయలు చేతి లో పట్టుకొని , అలమారా తలుపు తీసి ఎక్కడ దాచాలా అని తెగ చూసాను . మావారి కోటు జేబులో లాభం లేదు .ఆయన సూట్ రెగ్యులర్ గా వేసుకుంటారు . మా మాగారి కోట్ కూడా లాభం లేదు .ఎందుకంటే ఆయన డబ్బులు అందులోనే దాచుకుంటారు .మా మరిదిగారి కోట్ ఐతే బెస్ట్ . ఆయన ఏదో మా పెళ్ళికి , మావారి బలవంతం మీద కుట్టించుకున్నారే కాని ఆ తరువాత ఎప్పుడూ వేసుకోలేదు . అందుకని , నేను పూనా నుండి వచ్చినప్పుడల్లా నేను దాచుకున్న , నా బ్లాక్ మనీ అందులో దాచేదానిని . అలా ఒకసారి వచ్చినప్పుడు చూద్దునుకదా నా డబ్బులు మటుమాయం ! మా అత్తగారిని అడుగుతే ఆవిడ , వెంకట్ , వదిన డబ్బులు తీసుకున్నావారా అని అడిగారు . నాకేం తెలుసు ? నా కోట్ జేబులో వుంటే నావనుకొని తీసేసుకున్నాను . నా కోట్ జేబు లో వున్నాయి కాబట్టి అవి నావే , నేను ఇవ్వను , అయినా ఖర్చైపోయాయ్ అన్నాడు . నా ఏడుపు మొహం చూసి పిచ్చిదానా , నాకైనా చెప్పొద్దా అన్నారు ,ఆవిడే చెప్పొద్దు అన్నది మర్చిపోయి !!!!


ఆ తరువాత , మా అత్తగారికే దాచమని ఇవ్వటము మొదలు పెట్టాను . నా బ్లౌజ్ పీస్ లోని దే కొంత ముక్క తెచ్చి ఆవిడకు ఇస్తే అందులోనే కట్టి , మావారు మొదటిసారిగా నాకు గిఫ్ట్ ఇచ్చిన చాకొలెట్ బాక్స్ లో , పెట్టి అలమారాలో ఎక్కడో దాచేవారు . మా మామగారేమో నాతో నారాయణగూడా , కోపరేటివ్ బాంక్ లో ఎకౌంట్ ఓపెన్ చేయించారు . అప్పటికి నా పాకెట్ మనీ 50 రూపాయలకు పెరిగింది . దాని తో 10 రూపాయలు మా అత్తగారి ఆధ్వర్యం లో , 10 రూపాయలు మా మామగారి ఆధ్వర్యం లో కోపరేటివ్ బాంక్ లో దాచేదానిని . నేను సిలిగురి వెళ్ళాక ఆ దాపుడు ఆగిపోయింది . నేను వాటి సంగతి మర్చి పోయాను కూడా . మా అమ్మాయి పెళ్ళై యు.యస్ వెళ్ళేటప్పుడు , మా మామగారు గుర్తుచేస్తే బాంక్ లో చూస్తే 10,000 రూపాయలు వున్నాయి . అవి సగం సగం మా పిల్లలిద్దరికీ ఇచ్చాను.


మా అత్తగారు మరణించాక ఆవిడ సామానులు తీసినప్పుడు అప్పుడు నేను , ఆవిడకు దాచమని ఇచ్చిన డబ్బులు , అలాగే ఆ మూటలోనే , ఆడబ్బాలోనే బయటపడ్డాయి . మొత్తం 120 రూపాయలు వున్నాయి . అప్పుడు అక్కడ వున్న పిల్లలకు , మా అత్తగారి సేవింగ్ కథ చెప్పి , ఆ గుర్తుగా తలా పది రూపాయలు ఇచ్చాను . 40 రూపాయలు , అప్పటి కింకా రాని , రాబోయే నా మనవళ్ళూ , మనవరాళ్ళ కు జ్ఞాపకముగా ఇవ్వటానికి దాచాను . . నేను వాళ్ళకు ఇవ్వగలిగిన సిరులు ఈ జ్ఞాపకాలే . పైన ఫొటో కనిపిస్తున్నవి అవే .

ఆ డబ్బులు తీసి చూపించగానే , మా మనవరాళ్ళు, మనవళ్ళు , అదితి , విక్కీ , మేఘ , గౌరవ్ చాలా త్రిల్ల్ ఐపోయారు . అంత పెద్ద 10 రూపాయలా అని హాచర్య పోయారు .

Tuesday, January 12, 2010

భారత్ మాతా కీ జై
ఈ. యం . ఈ స్లోగన్ " కరం హీ ధరం " .

ఈ.యం .ఈ ( ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీయర్ ) ఇండియన్ ఆర్మీ లో ఒక విభాగము . ఇది 1943 లో ఐ .ఈ.యం .ఈ గా ఏర్పడినది . తరువాత 1964 అక్టోబర్ 15 న ఈ. యం .ఈ గా మార్చారు . అప్పటినుండి ప్రతి సంవత్సరము అక్టోబర్ 15 న ఈ.యం .ఈ కోర్ డే గా జరుపుకుంటున్నారు . ప్రతి సంవత్సరము ఈ ఫంక్షన్ ను ఎవరి యూనిట్ లో వారు జరుపుకున్నాను , ప్రతి నాలుగు సంవత్సరములకు ఒకసారి , రీ యూనియన్ డే అని సికింద్రాబాద్ లో వున్న ఈ. యం. ఈ సెంటర్ మరియు యం .సి యం. ఇ ( మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీయర్ ) వారు సమ్యుక్తముగా ఇండియా మరియు విదేశములో వున్న ఈ.యం .ఈ ,రిటైర్డ్ అండ్ సర్వింగ్ ఆఫీసర్లను ఆహ్వానించి , కార్యక్రమములను నిర్వహిస్తారు . ఈ సంవత్సరము కొన్ని కారణాలవలన అక్టోబర్ 15 న కాకుండా , జనవరి 7 వ తారీకు నుండి 10 వరకు ఘనంగా జరుపుకున్నారు .

ఈ వేడుకలలో వివిధ బాద్యతలు నిర్వర్తిస్తున్న 8 వేలమంది అధికారుల తో పాటు , పదవీవిరమణ చేసినవారు కూడా పాల్గొన్నారు . సెరొమొనియల్ పెరేడ్ ,రీథ్ లేయింగ్ సెర్మొని , కార్నివాల్ , డిన్నర్ , బరాఖానా మొదలైన వివిధ కార్యక్రమాలను జరిగాయి . కార్నివాల్ లో సూర్య కిరణ్ సారంగ్ ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు , ప్యారాసైలింగ్ హాట్ ఎయిర్ బెలూన్ , శిక్షణ పొందిన డాగ్ షో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి . ఈ కార్యక్రమాలకు ,చీఫ్ లెఫ్ట్ నెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ చాంద్లే హాజరయ్యారు .

1 ఈ.యం .ఈ సెంటర్ లోని యుద్ధవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు .శత్రు సేనల తో పోరాడుతున్న వీరులను స్మరించుకున్నారు . దేశభద్రత కోసం ప్రాణాలర్పించిన వీరుల భార్యలను బహుమతులతో సత్కరించారు . రీథ్లేయింగ్ సెర్మొని లో ఈ కార్యక్రమము జరుగుతున్నంత సేపు , చెమ్మగిల్లని కనులు , భారమెక్కని గుండెలు లేవు అంటే అతిశయోక్తి కాదేమో ! ఎన్ని బహుమతులు ఇచ్చినా వారి ఋణమును తీర్చుకోగలమా ?

భారమెక్కిన హృదయాలను దలేర్ మెహంది తన ఆట , పాట తో బరాఖానా , ( ఆఫీసర్ లు , జేసిఓ లు , జవానులు , అందరూ కుటుంబాలతో కలిసి చేసిన విందుబోజనం ) లో తేలిక పరిచాడు . చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దలేర్ మెహంది తో అడుగులు కలిపి ఆనందించారు .

మరునాడు ఆఫీసర్స్ మెస్ లో జరిగిన డిన్నర్ లో ఈ. యం . ఈ జన్మదిన కేక్ కట్ చేసారు . 1943 లో ఈ.యం . ఈ లో చేరిన కల్నల్ . మదన్ సింగ్ ను , ఆయనకు 100 సంవత్సరాలు నిండిన సంధర్భము లో సత్కరించారు .

చివరగా రామోజీ ఫిలిం సిటీ లో పిక్నిక్ తో రీయునియన్ డే కార్యక్రమములు ఆనందముగా ముగిసాయి .

అన్ని కార్యక్రమములు ఒకెత్తైతే , 8 వ తారీకున , 1 ఈ . యం . ఈ సెంటర్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన సెరెమొనియల్ పెరేడ్ ప్రత్యేకమైనది . ప్రతి సంవత్సరమూ , మేము ఏ ప్రోగ్రాం కి వెళ్ళినా , మానినా , ఈ ప్రోగ్రాం కు మటుకు తప్పక వెళుతాము . ( మావారు ఈ.యం .ఈ నుండి మేజర్ గా వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ) ఉదయము 7.45 కు పెరేడ్ మొదలయింది . ఆహుతులందరూ వచ్చే సరికే సైనికులు పెరేడ్ గ్రౌండ్ లో వరుసలో పొజిషన్ తీసుకొనివున్నారు . కలర్స్ - ఏదైనా బ్రాంచ్ కొత్తగా మొదలు పెట్టి , అది సక్రమముగా పనిచేస్తూ నిలదొక్కుకున్నప్పుడు , మెచ్చుకోలుగా ఇచ్చే ఝండాను కలర్స్ అంటారు . ఆ బ్రాంచ్ కు కలర్స్ రావటమును ఘనంగా భావిస్త్తారు . ముగ్గురు సైనికులు కలిసి కలర్స్ ను తీసుకొని వస్తున్నప్పుడు , ఆహుతులందరూ గౌరవ సూచకముగా నిలబడి సెల్యూట్ చేసారు . పెరేడ్ జరిగేటప్పుడు , తిరిగి తీసుకొని వెళుతున్నప్పుడు కూడా నిలబడుతారు . " కదం కదం సే మిలాకె " అంటూ , ఈ. యం . ఈ అడాప్ట్ చేసుకున్న " సారే జహాసె అచ్చా హిందూ సితా హమారా " అనే పాటను బాండ్ వాయిస్తుండగా , సైనికులు లయ బద్ధముగా మార్చ్ ఫాస్ట్ చేస్తుంటే చూసేందుకూ రెండు కళ్ళూ చాలవనిపిస్తుంది . పెరేడ్ గ్రౌండ్ సైనికుల కవాతు తో పులకించి పోయింది . " భారత్ మాతాకీ జై " , " ఈ. యం. ఈ కోర్ కీ జై " అని మూడుసారులు నినాదించటము తో పెరేడ్ ముగిసింది .పెరేడ్ ముగిసినంతనే , ఆహుతులందరూ నిలబడి చప్పట్ల తో తమ అభినందనలను తెలిపారు .
పెరేడ్ ప్రాంగణమంతా దేశ భక్తి గేయాల తో మారు మ్రోగింది . అందులో కొన్ని పాటలను ఇక్కడ వినండి .

పైన ఫొటో లో వున్నది ఈ. యం. ఈ కలర్స్ .

భారత్ మాతాకీ జై .

Friday, January 1, 2010