Wednesday, February 6, 2019

ఆత్మీయులు


ఆత్మీయులు
జ్ఞాపకాలు-12
30-1-2019
నాతో బ్లాగ్ లో ఒక అమ్మాయి,"మీరు చాలా అదృష్ఠవంతులు.మీకు ఏమీ కష్టాలు లేవు.ఎప్పుడూ మీ కుటుంబం గురించి హాయిగా, సంతోషంగా చెపుతుంటారు.చక్కగా ఎంజాయ్ చేస్తారు."అంది.దేవతల రాజు ఇంద్రుడి కే తప్పలేదు బోలెడు కష్ఠాలు.మానవమాత్రురాలిని నేనెంత :) కాకపోతే గతం గతః అనుకోవాలి.చిన్న బాధను భూతద్దంలో పెట్టిచూడగలిగే మనం,చిన్న ఆనందాన్ని కూడా అలాగే అనుభవించాలి.గతం లోని ఇబ్బందులను గతః అనుకోవాలి.ముళ్ళున్నాయని గులాబీ అందాన్ని,నాగులకోన నుంచి వచ్చిందని మొగలి సువాసనను ఆస్వాదించకుండా ఉండగలమా? అలాగే ఇబ్బందులున్నాయని జీవితాన్ని ఎంజాయ్ కుండా ఏడుస్తూ ఉండలేముకదా!. సంతోషం అన్నది ఎక్కడి నుంచో రాదు.మనలో మన మనసులోనే ఉంటుంది అన్నది నా భావన.
పువ్వు ఎంత అందమైనదైనా ఒక్కటే ఎంత సేపు ఉంటుంది.కొద్ది సేపు కాగానే  నీరసంగా తల వాల్చేస్తుంది.అదే పూవుకు ఒక్కోపూవును ను చేర్చి, మరువం దవనం లతో కలిపి కడితే అందమైన కందంబమాలవుతుంది.అమ్మ నుంచి పుట్టింటికీ, ఏమండీ చిటికెన వేలు పట్టుకొని అత్తింటికీ చేరిన నన్ను , కుటుంబసభ్యులు, స్నేహితులూ నా జ్ఞాపకాలను అందమైన కదంబమాల లా మార్చారు.వీరిలో ఎవరూ లేకుండా నా జ్ఞాపకాలు లేవు ..ఆకాశమంత అవధులులేని ఆనందానీ ఇచ్చిన, జగమంత కుటుంబాన్ని నాకు ఇచ్చిన ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞురాలిని.
కొత్త సంవత్సరము కొత్తగా మొదలు పెడుదాము,మీమీ మధురిమలను పంచుకోండి అని, జ్ఞాపకాల జావళీలు పాడించిన  భానక్క ( మంథా భానుమతిగారు)కూ, నా జ్ఞాపకాలను ఆదరించిన మితృలకూ ధన్యవాదాలు.
once again Happy & Healthy 2019 to you all.
thank you.

తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ . . . తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్


తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ . . . తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్
జ్ఞాపకాలు -10
25 -1-2019
తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ . . . తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ మని ఎగిరిపోతున్నాననుకుంటున్నారా లేదండీ బాబూ లేదు.ఇక్కడే ఉన్నాను :) మా మనవరాలిని ఫొటో తీయించేందుకు మాల్ లో ని స్టూడియో కు తీసుకెళ్ళాము.నేను "ఇంత చిన్న పాపకు ఫొటో ఏమిటి? అసలు ఎట్లా కూర్చోబెడుతారు?" అని గొణిగాను మా అమ్మాయితో."కూర్చో బెట్టటమే కాదు, నవ్విస్తారు కూడా చూద్దువుగాని రా " అంటే మూడు నెలల పాపను నవ్విస్తారా ఏమిటో చోద్యం చూద్దామని నేనూ వెంట వెళ్ళాను. చక్కగా బాక్ సీట్ వేసి కూర్చోబెట్టింది ఫొటో పిల్ల.సరిగ్గా కూర్చోబెట్టాక , మమ్మలిని పక్కకు జరగమని, ఓ వింజామర తీసుకొని ,పాప ముందు ఊపుతూ, తుర్ర్ర్ర్ర్ర్ తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ మంటూ పక్కకు గెంతి, క్లిక్ మనిపించింది.పాప ముద్దు ముద్దుగా నవ్వుతూ ఎంత బాగుందో! మా ఫామిలీ ఫొటో తీసేటప్పుడుకూడా, అలాగే తుర్ర్ర్ర్ తుర్ర్ర్ర్ర్ మంటూ గెంతింది.ఇక మేమైనా నవ్వక చస్తామా :) అందుకే ఇక్కడ ఎవరి ఫొటో చూసినా నవ్వుతూ ఉంటారు. ఓరినీ ఇదా రహస్యం:) ఎంతైనా ఈ అమెరికావాళ్ళ తెలివే వేరు 😊
అర్ధమైంది కదా ఈరోజు నా ఫొటోల ఎపిసోడ్ చెప్పబోతున్నానని :) నాన్నగారికి ట్రాన్స్ ఫర్ ఐయింది.వరంగల్ నుంచి వెళ్ళిపోతున్నాము. నా జిగిరీ దోస్త్ సరోజ తో ఫొటో తీయించుకుందామనుకున్నాను.అనుకున్న దానిని సరోజ కు కూడా చెప్పి ఒక రోజు ప్లాన్ వేసుకోవాలా వద్దా ? తనను సర్ప్రైజ్ చేద్దామని చివరి రోజు వరకూ చెప్పలేదు.అన్నీ పిచ్చి తెలివితేటలే, పనికొచ్చేది ఒకటి లేదు :) ఇక రేపటి నుంచి స్కూల్ ఉండదు.ఆ తరువాత రోజే వెళ్ళిపోతున్నాము.అప్పటికే టి.సి తీసేసుకున్నాను. ఆ రోజు పొద్దున్నే అమ్మను అడిగి డబ్బులు తీసుకున్నాను.నేను ఫొటో అనగానే సరోజ ఎంత ఆశ్చర్యపోతుంది,ఎంత సంతోషపడిపోతుందో ఊహించుకుంటూ ,ఉరుకులు పరుగుల మీద స్కూల్ కు వెళ్ళాను.సరోజ రాలేదు :( వాళ్ళ పక్కింటి అమ్మాయి స్వర్ణ సరోజకు బాగా జ్వరం వచ్చింది, లేవలేదు, అందుకే రాలేదు అని చెప్పింది.ఇంక ఏమి చేయను ? అమ్మ ఎప్పుడో చెప్పింది ముందుగానే ఫొటో తీయించుకోండి, చివరిదాకా ఆగకు అని.వింటేనా! ఏడుపు మొహం వేసుకొని డబ్బులు చూసుకుంటూ కూర్చున్నాను. ఏమైందే అని అడిగింది స్వర్ణ.చెప్పాను."పోనీ మనిద్దరం తీయించుకుందామా?"అంది ఆశగా.ఇక చేసేదేమీ లేక, ఫొటో కోరికను వదులుకోలేక దానితోనే ఫొటో దిగాను :(  ఆ తరువాత సరోజ నేను గుంటూర్ లో ఉన్నప్పుడు వస్తే, శంకర్ విలాస్ లో మసాలా దోశ తిని, నాజ్ లో ఓ సినిమా చూసి,ఓ ఫొటో తీయించున్నాము. అలా నా చిన్నప్పటివి, నా స్నేహితుల తో దిగినవి అన్నీ ఒక ఆల్బం లో పెట్టుకున్నాను
ఈ ఫొటోల సరదా మా బామ్మకు ఉండేదిట.మా నాన్నగారిది, అత్తయ్యది చిన్నప్పటి ఫొటోలు ఉన్నాయి.అమ్మకూ ఫొటోల సరదా ఉంది.మా ఫొటో లు దాదాపు అన్ని వయసులవీ ఉన్నాయి.చక్కగా రకరకాల జడలు వేసి, వెరైటీ డ్రెస్ లు వేసి తీయించేది.నాకు సరేసరి. నేను ఫొటో తీస్తుండగానే ఈ ఫొటో ఫేస్ బుక్ లో వచ్చేస్తుంది అని జోక్ చేస్తారు.నవ్వుతే నవ్విపోదురుగాక నాకేమిటి అనుకొని నాకు కావలసినవి నా సెల్ లోనే తీసుకుంటాను. నేను బ్లాగ్ రాసేటప్పుడు నా సరదా చూసి మా అబ్బాయి కొడక్ కెమెరా కొని ఇచ్చాడు. (మా పాత కెమెరా లో లాప్ టాప్ కు ఫోటో లు అప్ లోడ్ చేసే వీలు లేదు ).ఆ తరువాత ఈ సెల్ ఇచ్చాడు. ఈ మధ్య వాడి సెల్ లో ఫొటోలు క్లారిటీ బాగుంది అంటే తీసుకో అని ఇచ్చేసాడు.ఎంతరా ఈ సెల్ అంటే 75 వేలు అన్నాడు.బాబోయ్ నాకొద్దు అని తిరిగి ఇచ్చేసాను.ఫొటో ఆల్బం (పికాసా కాదు) లు చూసుకుంటూ, ఆ ఫొటోల వెనుక జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటే ఎంత సమయమూ తెలీకుండానే ఇట్టే గడిచిపోతుంది :)
 అబ్బ ఉండండహే , నేను మాట్లాడుతున్నాను కదా, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు రాకుడదని అమ్మ చెప్పింది అప్పుడే మర్చిపోయారా ? వస్తున్నా  ఇట్లా పిల్ల పిశాచాల్లా మీద పడిపోకండి. మా పిల్లకాయలు ( మా నాన్నగారు మమ్మలిని ముద్దుగా పిల్లకాయలు అని పిలిచేవారు ) గ్రూప్ ఫొటో దిగుదాము ఇంకెంత సేపు అని గొడవ చేస్తున్నారు.


నల్లంచు తెల్ల చీర


నల్లంచు తెల్లచీర
జ్ఞాపకాలు-11
28-1-2019

నేను రెండు జడల నుంచి ఒక్క జడకు, లంగావోణీ నుంచి చీరకు నా పెళ్ళిచూపులరోజే మారాను :) అంతకు ముందు టైఫాయిడ్ వచ్చి జుట్టు ఊడిపోయి,మళ్ళీ చాలా తొందరలోనే భుజాలదాకా పెరిగింది.ఆ రోజులల్లో జుట్టును కత్తిరించే అలవాటు లేదు  కాబట్టి, భుజాల దాకా ఒత్తుగా,ఆ కింద నడుముదాకా సన్నగా ఉన్నది నాజంపు జడ.రెండు జడలు కాబట్టి,సన్నగా ఉన్న జుట్టును ఒత్తుగా ఉన్న జడ దాకా చుట్టి రిబ్బెన్లు పెట్టుకునేదానిని.కాని ఒక్క జడ కు అలా బాగుండదని, ఎదురింటి అత్తయ్యగారి దగ్గర ఒకటి, పక్కింటిపిన్నిగారి దగ్గర ఒకటి సవరం అప్పు తెచ్చి మొత్తానికి కింది దాకా ఒక్క జడను వేసి,అమ్మ కొత్తగా కొనుకున్న క్రీం కలర్ ప్లైన్ కంచి పట్టుచీర,(సన్నటి జరీ అంచుతో చాలా బాగుంది) ను కట్టి ముస్తాబు చేసింది మా కజిన్ గిరిజ.అబ్బో దానికోసం ఎంత కష్టపడ్డామో మా ఇద్దరికే తెలుసు.ఆ చీర మా ఏమండీకి నచ్చిందని ఆ తరువాత అది నాకే ఇచ్చేసింది అమ్మ.దాని మీద ఇంక్ బ్లూ కలర్ ఫాబ్రిక్ పైయింట్ తో,చిన్న చిన్న పూలు పైయింట్ చేసి, ఆ పూల అంచులకు జరీ పోగు తో ఎంబ్రాయిడరీ చేసాను.ఆ విధంగా నా దగ్గర మొదటి చీర చేరింది.
అమెరికా పెళ్ళిళ్ళ లా నా పెళ్ళీ పదిరోజులల్లో కుదిరిపోయింది.నాకు పెళ్ళి చీరలు కొనటానికి , తీసుకెళ్ళేందుకు పెళ్ళి వాళ్ళు వస్తున్నారని, నేను వాళ్ళు ఏచీర బాగుంది అని అడుగుతే మీ ఇష్టం అని చెప్పాలని, ఇది బాగుంది, అది బాగుంది అని మర్యాదలేకుండా ప్రవర్తించవద్దు అని అమ్మ నాకు మరీ మరీ క్లాస్ పీకింది.నాతో వచ్చే మా బర్కత్పుర అమ్మమ్మగారికి కూడా వాళ్ళేది కొనిస్తే అదే తీసుకోండి అని చెప్పింది.ఇద్దరమూ అట్లాగే అని బుర్రూపాము.మా పెద్దాడపడుచు,ఏమండీగారి మేనమామ భార్యా , మేమిద్దరమూ కోఠీ లోని నీలకంఠం బాలకృష్ణయ్య చీరల దుకాణం కు వెళ్ళాము.కూర్చోగానే మా వదినగారు నీకు ఏ కలర్స్ ఇష్టం అని అడిగారు.అమ్మ మాట మర్చిపోకుండా ఏదైనా మీ ఇష్టం అన్నాను.కంచిపట్టు,బెనారస్ పట్టు చీరలు తెచ్చి మా ముందు వేసారు.అందులో చూడగానే క్రీం కలర్ కు బెత్తెడు వైలెట్ కలర్ జరీ అంచు, వైలెట్ కలర్ మీద జరీ తో చిన్న చిన్న బూటా ఉన్న కంచి పట్టుచీర తెగ నచ్చేసింది.అమ్మ మాట గుర్తొచ్చింది.వదినగారు ఇంత లైట్ కలర్స్ వద్దు .పెళ్ళికి కొంచం ముదురు రంగులైతే బాగుంటాయి అంటే వాళ్ళు అవన్నీ తీసేస్తున్నారు.నాకేమో ఆ చీర మీద మనసు కొట్టుకుపోతోంది.చిన్నగా తీసి నా పక్కన పెట్టుకున్నాను.ఆ తరువాత ఎన్ని ముదురు రంగువి చూపించినా వాళ్ళకూ అంత నచ్చలేదు.నేను, అమ్మమ్మగారు చిలకపలుకుల్లా మీ ఇష్టం అంటున్నాము.వెతికీ వెతికీ చివరకు చాక్లెట్ కలర్ కు పారెట్ గ్రీన్ కలర్ జరీ అంచు ఉన్న బెనారస్ చీర తీసారు.అదీ నాకు నచ్చింది.ఇంకోటి బ్రౌన్ కలర్ చీర తీసుకున్నారు.అదీ బాగుంది.మూడో చీర ఏదా అని చూస్తుంటే షాప్ పిల్లవాడు అమ్మగారు ఇది తీసి పెట్టుకున్నారు కదా అని నా దగ్గర ఉన్న చీర చూపించాడు.అది నచ్చిందా తీసుకుంటావా అని అడిగారు వదినగారు.అవునూ కాదూ అన్నట్లు తల వంచుకున్నాను.నచ్చినట్లుంది ఇచ్చేయ్ అన్నారు.అమ్మయ్య అనుకున్నాను.ఆ చీర ఎంత ఇష్టం అంటే అన్ని ఫంక్షన్ ల కూ, పార్టీలకూ అదే కట్టుకునేదానిని.పాపం కొన్నేళ్ళకు నీరసించిపోయింది. ఐనా నిన్ను నేను వదలను అని , బార్డర్,కొంగు తీసి ,క్రీం కలర్ ప్లేయిన్ పట్టు చీర కొని దానికి వేసాను.ప్రస్తుతం చీర బాగుంది కాని అంచులు, కొంగు జీర్ణించిపోయాయి.
పెళ్ళి తరువాత , నార్త్ లో అందరూ పెళ్ళికి ఎర్ర చీరలు కట్టుకుంటారు,అని ఏమండీ, ఎల్.బి స్టేడియం లో ఉన్న కాశ్మీరీస్టాల్ కు తీసుకెళ్ళి ఒక ఎరుపురంగు కాశ్మీరీ సిల్క్ చీర కొని ఇచ్చారు.దానికి పసుపు రంగులో చక్కగా ఎంబ్రాయిడరీ చేసి ముద్దుగా ఉంది.అందులోను ఏమండీగారి మొదటి బహుమతి మరీ అపురూపం కదా.చాలా సంవత్సరాలకు ఆ స్టాల్ వాళ్ళ అమ్మాయి, మా అమ్మాయికి తోటి కోడలు అయ్యింది.తను మా ఇంటికి వచ్చినప్పుడు నా చీర తీసి చూపించాను.తను అది ఫొటో తీసి , వాళ్ళ డాడీకి చూపిస్తే, "అప్పుడు ఇవి 50 రూపాయలకు అమ్మాము.ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ ఎవరూ చేయటం లేదు.ఇప్పుడైతే కనీసం పది హేను వేలు ఉంటుంది."అన్నారట.
పెళ్ళికి అమ్మ ఎరుపు,పసుపు కలనేత ధర్మవరం పట్టుచీర కొన్నది.అదీ నా ఫేవరేట్ చీరనే.ఒకసారి చుట్టాలావిడ ఏదో పెళ్ళికి కట్టుకుంటాను అంటే ఇచ్చాను.అది ఆవిడ తరువాత రిటర్న్ ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయింది.మొహమాటంతో నేనూ ఇవ్వమని అడగలేకపోయాను :( ఏడుపు మొహం వేసుకొని అమ్మకు చెపితే కాసిని అక్షింతలు వేసి, మా పదవ పెళ్ళిరోజు కు  గోధుమరంగు కు ఎర్ర అంచున్న కంచి పట్టుచీర కొని ఇచ్చింది.
నా మటుకు నాకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చీరలు చాలా ఇష్టం. నా మొదటి చాయిస్ అవే.గద్వాల్,పోచంపల్లి, ఇక కాటన్ లో ఐతే నలుపు, తెలుపు కలిసిన చీరలు ఉన్నాయి.నా చిన్నప్పుడు అమ్మ తెల్ల గ్లాస్కో బట్ట తో గౌన్లు కుట్టించటం వల్లనో ఏమో తెల్ల చీరలంటే మరీ మరీ ఇష్టం.ప్రతి ఎండాకాలం కూ సుల్తాన్ బజార్ లో కృష్ణాక్లాత్ స్టోర్ లో తెల్లవి రంగు రంగుల అంచులున్న గ్లాస్కో చీర కొనుక్కునేదానిని.ఈ మధ్య ఎక్కడ వెతికినా దొరకలేదు.చివరకు కృష్ణాక్లాత్ స్టోర్స్ కే వెళ్ళి అడుగుతే వాళ్ళకు ముందు అర్ధం కాలేదు.చివరకు ఎవరో పాత అతనట పైనుంచి నాలుగు చీరలు తీసి ఇచ్చాడు.అవే మహాద్భాగ్యంగా తెచ్చుకున్నాను.నాకు పార్లర్ ఉన్న రోజులల్లో నా అసిస్టెంట్ భవాని మూతైదువులు ఇలా తెల్ల చీరలు కట్టుకోకూడదు అంటే సెంటిమెంట్ తో కొనటం తగ్గించాను.అసలు తెలుపు మీద నల్ల గళ్ళు ఉన్న బెంగాల్ కాటన్ చీర ఎంత బాగుంటుంది.చాలా ఏళ్ళే కట్టుకున్నాను కాని మళ్ళీ దాని మీద ఇష్టం తో మహాలక్ష్మి కి వెళ్ళి అడుగుతే లేవన్నాడు.మొన్న శ్రావణ శుక్రవారం తెలుపు కు ఆకుపచ్చ అంచున్న ఖాదీ చీర కొనుక్కొని అమ్మకు చూపించి,"ములుగులో కృష్ణవేణి అత్తయ్య (ఆవిడ గ్రామసేవిక.అన్నీ ఖాదీ తెల్ల చీరలే కట్టేది.)కట్టుకునేది కదా ." అంటే నీకెంత జ్ఞాపకం అంది.అలా ఖాదీ చీర కొనుక్కోవాలని నాకు చాలా కోరిక గా ఉండేది.కాని ఖాది చాలా బరువు.ఈ మధ్య లైట్ వేట్ లో వస్తున్నాయని చదివి తెచ్చుకున్నాను .
ఆకుపచ్చకు ,ఎర్ర అంచు ఉన్నది మొదటి గద్వాల్ చీర. అమ్మవారికి మొదటిసారి పెట్టిన ఎర్ర చీర.మా అమ్మాయి తన మొదటి జీతం తో కొనిచ్చిన చీర,పిల్లల పెళ్ళికి అమ్మ కొనిచ్చిన పట్టుచీరలు,మనవళ్ళు మనవరాళ్ళు పుట్టినప్పుడు పిల్లలు కొనిచ్చిన చీరలు,ఏమండి షష్ఠిపూర్తికి పిల్లలు కొనిచ్చిన పెద్ద పట్టుచీర, మా చెల్లెలి అత్తగారు కుట్టిచ్చిన పసుపురంగు అద్దాల చీర, ఆవిడే ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చిన లైట్ వైలెట్ కలర్ ఆర్గండీ చీర, కుటుంబసభ్యులు అభిమానం తో ఇచ్చిన చీరలు, మనవరాలు కొనిచ్చిన ముద్దొచ్చే చీర మరీ అపురూపం. ఇలా ప్రతి చీరకూ ఓ కథ ఉంది.బీరువా తలుపు తీయగానే సన్నాయి రాగాలూ, పసిపిల్లల కేరింతలు వీనుల విందుగా వినిపిస్తాయి. జ్ఞాపకాల తెరలు కప్పేస్తాయి.కొనగోటితో మీటితే కోటిరాగాలు పలుకుతాయి.చేతితో తడితే ఎటో వెళ్ళిపోతుంది మనసు.మధుర భావాల సుమమాలలు నా చీరలు.
నా బీరువాకూ ఓ కథ ఉంది.నా పెళ్ళైనాక,అమ్మ నా బట్టలు రెండు వి.ఐ.పి సూట్ కేస్ లల్లో పెట్టి ఇచ్చింది.మేము తిరుపతి ,మద్రాస్ వెళ్ళేటప్పుడు ఏమండి నా బట్టలు ఆయన నల్ల పెట్టెలో పెట్టారు.నా సూట్కేస్ ఊరికి తీసుకెళ్ళాము.ఏమండీ సెలవైపోయి పటియాలా తిరిగి వెళ్ళేటప్పుడు, పెట్టె ఖాళీ చేసి ఇవ్వబుద్ది కాలేదు.పెట్టెలో ఓ పక్కన చిన్న అరలాగా ఉంది.దానిలో నా గొలుసులు, డైరీ పెట్టుకున్నాను.పెట్టె కూడా విశాలంగా నా చీరల మడతలు నలగకుండా పట్టాయి.ఆయనకూ ఆ పెట్టె నాకు నచ్చిందని అర్ధమైపోయి నాకు ఇచ్చేసి వెళ్ళారు.కింద ఫొటోలో కనిపిస్తోందే అదే .ఆ పెట్టెలో బట్టలు, దాని కింద ఉన్న చెక్క పెట్టలో వంటసామానుతో ,యాభై ఏళ్ళ క్రితం నా కొత్తకాపురం పాటియాలా లో మొదలైంది :) మేము హైదరాబాద్ తిరిగి వచ్చాక , నా పార్లర్ కోసం చీరలు కొంచం ఎక్కువ కొనాల్సి వచ్చింది.అవి పెట్టెలో సరిపోవటం లేదని బీరువా కొనిచ్చారు ఏమండి.ఇప్పుడు దాని హాండిల్ కొంచం వంకరబోయింది, లాక్ కూడా కొన్ని సార్లు మొరాయిస్తుంది ఐనా మార్చాలనిపించటం లేదు.