Monday, April 24, 2017

అత్తయ్య మామయ్య





మా మామయ్య చింతలపాటి వెంకట కృష్ణారావుగారు మా అమ్మకు బాబాయిగారి అబ్బాయి,అన్నయ్య.మా అత్తయ్య చింతలపాటి సీత మానాన్నగారి ఏకైక చెల్లెలు,మా మేనత్త.మామామయ్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి.ట్రైబల్ వెల్ఫేర్ డైరక్టర్గా రిటైర్ అయ్యారు.ఉద్యోగం చేస్తున్నరోజులల్లో పసర,నాగోలు,రంపచోడవరం,కొత్తగూడెం దగ్గర, బూర్గుంపాడ్ దగ్గరి వివిధ గ్రామాలల్లో అనేక సంక్షేమకార్యక్రమాలు చేపట్టారు.అక్కడ అడవులల్లో నివసిస్తున్న గిరిజనులకు స్కూల్స్ కట్టించటము,వ్యవసాయ నీటి వనరులు ఏర్పరచటం, పాలకేంద్రాలు పెట్టటం మొదలైనవి చేయించారు.పసర లో పెట్టిన పాలకేంద్రానికి"క్షీరాబ్ధి"అని పేరు పెట్టారు.ఆయా ఊర్లకు వెళ్ళినప్పుడు ఏ కరణం ఇంటికో వెళ్ళటం కాకుండా సరాసరి గిరిజనుల ఇంట్లోకే వెళ్ళేవారు.వారి తో పాటే వారు పెట్టిన భోజనం చేసేవారు.ఎవరి నుంచీ ఏమీ ఆశించేవారు కాదు.కొన్ని సార్లు మా అత్తయ్య కూడా వెంట వెళ్ళేది.అప్పుడు ఓ పెట్టలో వంటకు కావలసిన సామాగ్రి అంతా తీసుకెళ్ళి, ఏ చెట్టు కిందో, మూడురాళ్ళు పెట్టి, కట్టెలతో వంట చేసేదట.ఓసారి ఒక చింత చెట్టు నిండా చిగురు ఉంటే అత్తయ్య బాగుందనుకుంటే అక్కడి గిరిజనులు కోసి ఇచ్చారట.వెంటనే మామయ్య మనము వాళ్ళకు ఇవ్వటానికి వచ్చాము కాని తీసుకోవటానికి రాలేదు అని అత్తయ్యను కోపం చేసి చింతచిగురు తిరిగి ఇచ్చేసారట.పెట్టెలో చింతపండు ఉంది,పప్పులో వేసి గట్టిగా చేస్తే పప్పు, నీళ్ళగా చేస్తే పప్పుచారు అవుతుంది,ఆ చిగురు ఎందుకు అడిగాను అని అభిమానపడిందిట అత్తయ్య!ఇది మామయ్య నిరాడంబరతకు ఓ ఉదాహరణ.
మామయ్య 45 సంవత్సరాలు "నెలనెలావెన్నల" అని కవిసమ్మేళనాలు,మితృఅమండలి సమావేశాలు నిర్వహించేవారు.వర్ధమాన కవులందరూ ముందుగా తమ కవితలను నెలనెలావెన్నెలలోనే చదివేవారు.మామయ్య రిటైర్ ఐయి హైదరాబాద్ వచ్చాక నెలనెలావెన్నల చాలామంది సభ్యులతో సాగింది.సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పొత్తూరి వెంకటేశ్వర రావు గారు,వాడ్రేవు చినవీరభద్రుడు గారు,దీవిసుబ్బారావుగారు,ముకుంద రామారావుగారు,రేణుకా అయోలాగారు,వాసాప్రభావతిగారు,మృణాళిని గారు,కొండెపూడి నిర్మల,శీలంవీర్రాజు గారు మొదలైన వారంతా కలిసి నెలనెలావెన్నలని జరుపుకునేవారు.ప్రస్తుతము కొంచము వినికిడిసమస్యల వల్లా,కొద్దిగా వయసుమీదపడటము వల్లా ఈ సమావేశాలు నిర్వహించలేకపోతున్నారు.అయినప్పటికీ ఆయన అభిమానులు అప్పుడప్పుడూ వచ్చి వారి కవితలు వినిపించి వెళుతుంటారు.
నేను కథలు వ్రాస్తున్నానని తెలిసి చాలా సంతోషించారు.నాదేముంది ,ఆయన వేసిన సాహితీవనం లో ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న చిరు మొలకని.అందుకని ఈ రోజు ప్రస్తుతం కూతురు పార్వతి వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తయ్యమామయ్యల దగ్గరకు వెళ్ళి నా పుస్తకాలని ఇచ్చాను.ఇలా పెద్దవారికి ఇచ్చేందుకే మా ఏమండీ , నా ఈ బుక్స్ ను కొన్ని ప్రింట్ ఔట్ చేయించారు మరి.చాలా సంతోషంగా నా పుస్తకాలను  అందుకొని ,అప్పటికప్పుడే తిరిగేసారు అత్తయ్య మామయ్య.
మా అత్తయ్య ఎప్పుడు నన్ను చూసినా చాలా ఎమోషనల్ అవుతుంది.ఆమె తిరిగే రోజులల్లో కనీసం నెలకోసారైనా వచ్చి నన్ను చూసి వెళ్ళేది.ఇప్పుడు నేను వెళుతున్నా అంత ఎక్కువగా వెళ్ళలేకపోతున్నాను.అత్తయ్య తో నాన్నగారి జ్ఞాపకాలను పంచుకోవటము, నాన్నగారి చిన్నతనము గురించి తెలుసుకోవటమూ నాకు ఇష్టము.ఈ రోజు మా అన్నయ్య ఫొటో ఒకటి తెచ్చి ఇవ్వవా అని అడిగింది.ఈ బుక్ లో ఉందత్తయ్యా అని అనగనగా ఒక కథ పుస్తకం లో ఉన్న నాన్నగారి ఫొటో చూపించాను.ఇది కాదు మా అన్నయ్య ఉద్యోగం లో చేరిన కొత్తల్లో హాట్ పెట్టుకోని తీయించున్నది కావాలి అన్నది , నా పుస్తకం లో నాన్నగారి ఫొటోను ఆప్యాయంగా తడుతూ.ఇంటికి రాగానే ఆ ఫొటో వెతికి తీసాను అత్తయ్యకు పంపటానికి.అత్తయ్య కాసేపు మా చెల్లెలి తో కలిసి పాటలు పాడుకుంది.మమ్మలిని అసలు వదలలేదు.

ఊళ్ళో ఉన్న కుమారి, సరళ మా కజిన్స్ కూడా వచ్చారు.నేను అమ్మ, మా చెల్లెలు వెళ్ళాము.అందరమూ కలిసి లంచ్ చేసాము.మళ్ళీ ఇన్నాళ్ళకు నీమూలంగా ఇంట్లో నెలనెలా వాతావరణం వచ్చింది అనుకున్నారు.ఈనాటి గెట్ టుగేదర్ సంతోషం గా,కొంచం సెంటిమెంటల్ గా జరిగింది.థాంక్ యు పార్వతి.

Tuesday, April 4, 2017

స్నేహమా ఎక్కడా!





స్వాహాదేవి మీద కోపం వచ్చిందో, చాయాదేవి మీద కోపం వచ్చిందో సూర్యాదేవ్ గారు తెగ మండిపోతున్నారు!చివరాఖరుకి వరణుడు సంధి కుదిర్చి చల్లబర్చాడు!
హమ్మయ్య అనుకుంటూ బాల్కనీ లోని నా చేర్ లో సెటిల్ అయ్యాను.పారిజాతాల సీజన్ ఐపోయినట్లుంది అక్కడక్కడా పూసి పరిమళాలు వెదజల్లుతున్నాయి.కాంపౌండ్ వాలంతా అల్లుకొని విరగపూసిన రాధామాధవాల నుంచి సన్నని సువాసనలు వస్తూ ఏవో జ్ఞాపకాలను తట్టిలేపాయి.ఓ పూవు, ఓ పుస్తకం మనసును కదిలిస్తాయి.మ్నేను పి.యు.సీ గుంటూర్ వుమెన్స్ కాలేజీ లో చదివేటప్పుడు హాస్టల్ లో ఉండేదానిని.హాస్టల్ టెరస్ మీదకి రాధామాధవం ఓ పొదరిల్లు లా అల్లుకొని తీగ నిండా గుత్తులు గుత్తులుగా పూసేది.ఆ తీగ కింద మా స్నేహితులం నలుగురం, నేను, మణి,రత్న, కాంతి కూర్చొని కృష్ణశాస్త్రి కవితలు ,జంధ్యాల పాపయ్య కరుణశ్రీ,పుష్పవిలాపం చదువుకుంటూ ఉండేవాళ్ళం.మా సీనియర్ హేమ ఇది మల్లెల వేళ యనీ పాట ఎంత బాగా పాడేదో!ఆ పాట, పుష్పవిలాపం మమ్మలిని భలే ఏడిపించేవి.వెక్కి వెక్కి ఏడేచేవాళ్ళం . ఆ పాటలు, కవితలు , కబుర్లు, రాధామాధవుల పరిమళలాలు మమ్మలిని అక్కడి నుంచి కదల నిచ్చేవికావు.వాచ్ మాన్ వచ్చి డేస్కాలర్స్ బయటకు వెళ్ళిపోవాలి అనేవరకూ అలానే కూర్చునే వాళ్ళం.రత్న, కాంతి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయేవారు.నన్ను అందరూ రాధామధవం లోని తెల్ల పూవని,మణి ఎర్రపూవని అనేవారు.ఒకే గుత్తిలో రెండు రంగులు ఉన్నట్లు మేమిద్దరమూ ఎప్పుడూ కలిసే వుండేవాళ్ళం.
అప్పుడే ఆంధ్రప్రభ వీక్లీ లో ఒక సీరియల్ వచ్చింది.అందులో నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్స్.వాళ్ళూ మాలాగే కాలేజ్ ఐపోయాక,మేడ మీద కూర్చొని కవితలూ , కబుర్లూ చెప్పుకునేవారు.అందులో ఒక అమ్మాయికి తమిళనాడులో ఉన్న అబ్బాయి తో పెళ్ళవుతుంది.అత్తగారు తమిళ సాంప్రదాయం ప్రకారం , డైమండ్ దిద్దులు పెట్టమంటుంది.పెడతారు ఐనా ఆ అమ్మాయిని అష్టకష్టాలు పెడుతుంది అత్తగారు.అవి చదువుతూ ఎంత ఏడ్చేవాళ్ళమో!అదేమిటో అప్పుడు ప్రతిదానికి చలించిపోయేవాళ్ళము.కాంతి వాళ్ళ అమ్మ ప్రభ తెప్పించేది.అనుకోకుండా కాంతి ఆ సీరియల్ చదవటమూ , మాలాగే ఆ ఫ్రెండ్స్ ఉన్నారని తీసుకొస్తే మేము చదవటమూ జరిగింది.ఇక వారం వారం ప్రభ సంపాదించటానికి కాంతి తెగ తిప్పలు పడేది.ఎందుకంటే అప్పుడు మాకు అలాంటి పుస్తకాలు చదివటానికి పర్మిషన్ లేదు! అదే సంవత్సరం లో దాదాపు నాకు, కాంతి కి, రత్నకు పెళ్ళి కావటమూ మేమంతా విడిపోవటమూ జరిగింది.ఆ తరువాత సంవత్సరానికి మణి పెళ్ళి కూడా ఐపోయింది.పిట్టల్లా ఎగిరిపోయాము.ఆ తరువాత రెండుమూడేళ్ళు ఉత్తరాలు నడిచాయేమో .ఆ తరువాత అవీ లేవు.ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలీదు :( ఇక్ ఆ సీరియల్ పేరేమిటో, అది రాసిన రచయిత్రి పేరేమిటో ఎంత ఆలోచించినా గుర్తురావటం లేదు.ఆ రాధామాధవాలు,ఆ స్నేహమూ మనసుపొరలల్లో వుండిపోయాయి.ఆ గుర్తుగానే రాధామాధవ తీగ తెప్పించి వేసాను.నాలుగేళ్ళ కు ఇప్పుడు కాంపౌండ్ వాలంతా అల్లుకొని, గుత్తులు గుత్తులుగా పూస్తూ మాస్నేహపు పరిమళాలను వెలికిదీస్తోంది :)

ఇలా ఓపూవు,ఓ నవల ,ఓ పాట తీపిగుర్తులు :)
నా కుర్చీలో కూర్చొని, మల్లాది నవల "ష్ గప్ చుప్ " చదువుతూ, పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,ఇష్టమైన పాట వింటూ, చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.కొద్ది రోజులు రాతల కు విరామమిచ్చి ఇలా హాయిగా కూర్చోవాలని నా ప్లాన్ :(