Tuesday, April 4, 2017

స్నేహమా ఎక్కడా!

స్వాహాదేవి మీద కోపం వచ్చిందో, చాయాదేవి మీద కోపం వచ్చిందో సూర్యాదేవ్ గారు తెగ మండిపోతున్నారు!చివరాఖరుకి వరణుడు సంధి కుదిర్చి చల్లబర్చాడు!
హమ్మయ్య అనుకుంటూ బాల్కనీ లోని నా చేర్ లో సెటిల్ అయ్యాను.పారిజాతాల సీజన్ ఐపోయినట్లుంది అక్కడక్కడా పూసి పరిమళాలు వెదజల్లుతున్నాయి.కాంపౌండ్ వాలంతా అల్లుకొని విరగపూసిన రాధామాధవాల నుంచి సన్నని సువాసనలు వస్తూ ఏవో జ్ఞాపకాలను తట్టిలేపాయి.ఓ పూవు, ఓ పుస్తకం మనసును కదిలిస్తాయి.మ్నేను పి.యు.సీ గుంటూర్ వుమెన్స్ కాలేజీ లో చదివేటప్పుడు హాస్టల్ లో ఉండేదానిని.హాస్టల్ టెరస్ మీదకి రాధామాధవం ఓ పొదరిల్లు లా అల్లుకొని తీగ నిండా గుత్తులు గుత్తులుగా పూసేది.ఆ తీగ కింద మా స్నేహితులం నలుగురం, నేను, మణి,రత్న, కాంతి కూర్చొని కృష్ణశాస్త్రి కవితలు ,జంధ్యాల పాపయ్య కరుణశ్రీ,పుష్పవిలాపం చదువుకుంటూ ఉండేవాళ్ళం.మా సీనియర్ హేమ ఇది మల్లెల వేళ యనీ పాట ఎంత బాగా పాడేదో!ఆ పాట, పుష్పవిలాపం మమ్మలిని భలే ఏడిపించేవి.వెక్కి వెక్కి ఏడేచేవాళ్ళం . ఆ పాటలు, కవితలు , కబుర్లు, రాధామాధవుల పరిమళలాలు మమ్మలిని అక్కడి నుంచి కదల నిచ్చేవికావు.వాచ్ మాన్ వచ్చి డేస్కాలర్స్ బయటకు వెళ్ళిపోవాలి అనేవరకూ అలానే కూర్చునే వాళ్ళం.రత్న, కాంతి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయేవారు.నన్ను అందరూ రాధామధవం లోని తెల్ల పూవని,మణి ఎర్రపూవని అనేవారు.ఒకే గుత్తిలో రెండు రంగులు ఉన్నట్లు మేమిద్దరమూ ఎప్పుడూ కలిసే వుండేవాళ్ళం.
అప్పుడే ఆంధ్రప్రభ వీక్లీ లో ఒక సీరియల్ వచ్చింది.అందులో నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్స్.వాళ్ళూ మాలాగే కాలేజ్ ఐపోయాక,మేడ మీద కూర్చొని కవితలూ , కబుర్లూ చెప్పుకునేవారు.అందులో ఒక అమ్మాయికి తమిళనాడులో ఉన్న అబ్బాయి తో పెళ్ళవుతుంది.అత్తగారు తమిళ సాంప్రదాయం ప్రకారం , డైమండ్ దిద్దులు పెట్టమంటుంది.పెడతారు ఐనా ఆ అమ్మాయిని అష్టకష్టాలు పెడుతుంది అత్తగారు.అవి చదువుతూ ఎంత ఏడ్చేవాళ్ళమో!అదేమిటో అప్పుడు ప్రతిదానికి చలించిపోయేవాళ్ళము.కాంతి వాళ్ళ అమ్మ ప్రభ తెప్పించేది.అనుకోకుండా కాంతి ఆ సీరియల్ చదవటమూ , మాలాగే ఆ ఫ్రెండ్స్ ఉన్నారని తీసుకొస్తే మేము చదవటమూ జరిగింది.ఇక వారం వారం ప్రభ సంపాదించటానికి కాంతి తెగ తిప్పలు పడేది.ఎందుకంటే అప్పుడు మాకు అలాంటి పుస్తకాలు చదివటానికి పర్మిషన్ లేదు! అదే సంవత్సరం లో దాదాపు నాకు, కాంతి కి, రత్నకు పెళ్ళి కావటమూ మేమంతా విడిపోవటమూ జరిగింది.ఆ తరువాత సంవత్సరానికి మణి పెళ్ళి కూడా ఐపోయింది.పిట్టల్లా ఎగిరిపోయాము.ఆ తరువాత రెండుమూడేళ్ళు ఉత్తరాలు నడిచాయేమో .ఆ తరువాత అవీ లేవు.ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలీదు :( ఇక్ ఆ సీరియల్ పేరేమిటో, అది రాసిన రచయిత్రి పేరేమిటో ఎంత ఆలోచించినా గుర్తురావటం లేదు.ఆ రాధామాధవాలు,ఆ స్నేహమూ మనసుపొరలల్లో వుండిపోయాయి.ఆ గుర్తుగానే రాధామాధవ తీగ తెప్పించి వేసాను.నాలుగేళ్ళ కు ఇప్పుడు కాంపౌండ్ వాలంతా అల్లుకొని, గుత్తులు గుత్తులుగా పూస్తూ మాస్నేహపు పరిమళాలను వెలికిదీస్తోంది :)

ఇలా ఓపూవు,ఓ నవల ,ఓ పాట తీపిగుర్తులు :)
నా కుర్చీలో కూర్చొని, మల్లాది నవల "ష్ గప్ చుప్ " చదువుతూ, పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,ఇష్టమైన పాట వింటూ, చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.కొద్ది రోజులు రాతల కు విరామమిచ్చి ఇలా హాయిగా కూర్చోవాలని నా ప్లాన్ :( 

2 comments:

Lalitha TS said...

"కొద్ది రోజులు రాతల కు విరామమిచ్చి ఇలా హాయిగా కూర్చోవాలని నా ప్లాన్ :( "

అయ్యో ! అదేంటండి - అలా రాసేశారు? :( :(

మాలా కుమార్ said...

చదవాల్సినవి, చేయాల్సిన పనులు చాలా మిగిలిపోతున్నాయండి.మే లో యు.యస్ వెళుదామనుకుంటున్నాము.అందుకని కొన్ని రోజులు అవి చూసుకుందామని అంతే :) థాంక్స్ అండి.