Thursday, December 27, 2012

హాపీ బర్త్ డే సాహితి


సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇదేసమయాని కి నేను ఓ సోఫాలో పడుకొని ఆంధ్రభూమి వీక్లీ చదువుతున్నాను . మా అబ్బాయి పక్క సోఫాలో లాప్ టాప్ మీద ఏదో పని చేసుకుంటున్నాడు . పొద్దటి నుంచి ఆలోచిస్తున్న విషయం మా వాడి ని అడగటాని కి ఇదే సమయం అనుకొని , " వరే బాబా " అని ముద్దుగా పిలిచాను . "ఏమిటి మాతే " అని అంతకన్నా గారంగా అన్నాడు మావాడు ." పొద్దున రవి బావ తెలుగు లో కూడా బ్లాగ్ వ్రాయవచ్చని చెప్పాడు కదరా ఎలా వ్రాయాలి " అని అడిగాను .జవాబు లేదు . కాసేపు వాడి వైపు చూసాను . చాలా సీరియస్ గా లాప్ టాప్ లో తలదూర్చి వున్నాడు . హుం కుయ్ అనడు , కయ్ అనడు . కాసేపు పైకి , కాసేపు లోపల విసుక్కొని , ఎవరిమీదైనా ఆధారపడితేలే అనుకొని నిరాశ తో బుక్ లోకి తల దూర్చేసాను


. కొద్ది నిమిషాలు నిశబ్ధం గా గడిచిపోయాయి . నేనూ చాలా సీరియస్ గా సీరియల్ చదువు కుంటున్నాను . " మాతే నీ బ్లాగ్ కు ఏమి పేరు పెడుదామనుకుంటున్నావు ?" అని వినిపించింది . నాకు వాడేమన్నాడో ఓ క్షణం అర్ధం కాలేదు . ఏమిటిరా అని అడిగాను . మళ్ళీ అదే ప్రశ్నను అడిగాడు . అప్పుడు నేను చదువుతున్న సీరియల్ లోని హీరోయిన్ పేరు సాహితి . ఆ పేరు నచ్చి వెంటనే " సాహితి " అన్నాను .

 మళ్ళీ నిశబ్ధం . నేను మళ్ళీ నా సీరియల్ లోకి ." మాం ఇదిగో నీ సాహితి " అని అరిచాడు . నేను ఒక్క ఉదుటున లేచి కూర్చొని ఏమిటీ అన్నాను . లాప్ టాప్ నా ముందు పెట్టి " సాహితి - మాల " అన్నది నీ బ్లాగ్ పేరు టెంప్లెట్ ఏమిపెట్టాలి అని అడిగాడు . ఒక్కసారే ఉక్కిరి బిక్కిరి ఐపోయాను . సింపుల్ టెంప్లెట్ అని చెప్పాను . నా ఆనందమో , ఆరాటమో ఏదో తెలీని స్తితిలో నేనుండగా ఇదిగో నీ బ్లాగ్ తయారైపోయింది . అని చూపించాడు . ఓ గంట సేపు దాని తో కుస్తీ పడి ఎలా వ్రాయాలి , ఎలా పోస్ట్ చేయాలి అన్నీ చూపించాడు . నా నోట్స్ లో గబ గబా రాసేసుకున్నాను . "ఇప్పుడేదైనా అందులో వ్రాయి " అన్నాడు . అమ్మో ఏమి వ్రాయాలి ? ఆలోచించుకొని రేపు వ్రాస్తాలేరా అన్నా .కాదు వ్రాయాల్సిందే అన్నాడు .

తడబడుతూ , సంతోషం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీక అబ్బ అప్పటి ఉద్వేగం చెప్పలేను . ఇదో ఇలా నేనూ , నా సాహితీ బ్లాగ్ లోకం లోకి వచ్చేసాము :) 

హాపీ బర్త్ డే సాహితి  :)





Friday, December 21, 2012

మిధునం



మావారు రవిశంకర్ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ 'క్లాస్ లో జాయిన్ అయ్యారు .అక్కడ ఆయనకు యోగా టీచర్ 'వెంకటేశ్'. ఓరోజు వాళ్ళ ప్రోగ్రాం వుందంటే నేనూ వెళ్ళాను . మాతోపాటు వెంకటేశ్ కూడా వచ్చారు . ఏదో మాటల్లో రేపు మా పిక్చర్ 'మిధునం'ప్రివ్యూ ప్రసాద్ లాబ్స్ లో వుంది మీరు రావాలి సార్ అన్నాడు . మీరు కూడా రండి మేడం అని నాతో అన్నాడు . ఒక్క నిమిషం నేను సరిగ్గా విన్నానా లేదా అనుకొని ఏది శ్రీరమణ రాసిన కథ , తణికెళ్ళ భరణి తీసిందేనా అన్నాను అనుమానంగా . అవును మేడం నేను దాని కి అసిస్టెంట్ డైరక్టర్ ని అని చెప్పాడు . అంతే ఎంత ఎక్సైట్ ఐపోయానో ! మావారి కంటే ముందే తప్పకుండా వస్తాము అనిచెప్పేసాను :) పొద్దున 8 గంటల కు అని చెప్పారు . రాత్రంతా నిద్ర పట్టలేదు , ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆరాటమే . బహుషా నేను ఏ పిక్చర్ కోసమూ అంత ఎదురుచూడలేదనుకుంటాను :)

 ప్రముఖ రచయత శ్రీరమణ రచించిన కథ "మిధునం " ను అదే పేరు తో తెరమీద అద్బుతంగా చిత్రీకరించారు తణికెళ్ళభరణి . టైటిల్ పాటలో చెప్పినట్లుగా ఆదిదంపతులు అభిమానించే చిత్రమే మిధునం .చిన్నపటి నుంచి కళ్ళల్లో పెట్టుకొని పెంచిన పిల్లలు పెద్దవాళ్ళై వారి బాధ్యతలలో వారు మునిగిపోయినప్పుడు , వంటరిగా మిగిలిపోయిన అమ్మానాన్నల కథే మిధునం .పిల్లలంతా విదేశాలకు వెళ్ళిపోయాక , వాళ్ళను తలుచుకుంటూ బాధ పడుతున్న భార్యతో , బాధ పడవద్దని , ఇంతకు ముందు సంసారబాధ్యతలో పడి తీర్చుకోలేని కోరికలను తీర్చుకునేందుకు చక్కని అవకాశమని , జీవితాన్నీ ఎంజాయ్ చేయవలసిన తరుణమిది అని భార్యను ఓదార్చి చాలా తమాషాగా చూపిస్తాడు భర్త. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు చెప్పుకుంటూ తన పెరటిలోని చెట్లకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు .అప్పదాసు , బుచ్చిలక్ష్మి ఓజంట . అరవై ఏళ్ళతరువాత వంటరిగా మిగిలిపోయి పోట్లాడుకుంటూ , కలుసుకుంటూ , మాటలాడుకుంటూ , చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మొత్తమీద చిన్నపిల్లలైపోతారు :)


సినిమా అంతా చాలా తమాషాగా వుంటుంది . మొత్తం రెండు పాత్రల తోనే ఈ సినిమా అంతా నడుస్తుంది . కాని ఎక్కడా బోర్ కొట్టదు .అప్పదాసుగా యస్.పి బాలసుబ్రమణ్యం , బుచ్చిలక్షి గా లక్ష్మి చాలా బాగా నటించారు . పెద్దవాళ్ళంతా వంటరితనం మరిచిపోయి ఇలా హాయిగా బతకవచ్చు అనే ఫీలింగ్ వస్తుంది .భార్యా భర్తల సంబంధానికి మంచి నిర్వచనం మిధునం . సినిమా అంతా సరదా సరదా గా తీసి , చివరిలో మటుకు కంట తడి పెట్టిస్తారు . ముగింపులో బుచ్చి స్వగతం విని కంటతడి పెట్టనివారు ఎవరూ వుండరంటే అతిశయోక్తి కాదేమో ! పాటలు కూడా చాలా బాగున్నాయి . తప్పక చూడవలసిన సినిమా . పాటలు ఇక్కడ వినండి .

 ఇది మటుకు ఇక్కడ కూడా చూడండి :)

Friday, December 7, 2012

లక్ష్మిగారు అభినందనలు





పి.యస్. యం లక్ష్మి గారు యాత్ర లక్ష్మి గా బ్లాగ్ లలో అందరికీ పరిచయమే . ఆవిడ హైదరాబాద్ లోని ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసు నుంచి సీనియర్ ఎకౌంటెంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు . అంతటి పదవిని నిర్వహిస్తూ , పిలల్లను , ఇంటినీ గృహిణిగా చూసుకుంటూ , తీరిక సమయాలలో  దేవాలయాలను దర్శించటం ఆవిడ హాబీ . అఫ్కోర్స్ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళై సెటిలైపోయారనుకోండి :) విచిత్రమేమిటంటే వారి శ్రీవారు శ్రీ.యం . వెంకటేశ్వర్లు గారి కి కూడా ఈ హాబీ వుండటం .భార్యాభర్తలిద్దరి కీ ఒకే హాబీలుండటం  , అవి పాటించటం చాలా అరుదు .నాకంతా మావారి సహకారమే . ఆయన సహకరించకపోతే నేను ఇన్ని వూళ్ళు తిరుగగలిగేదానిని కాదు అంటారు లక్ష్మిగారు .

మామూలుగా ప్రశిద్ది చెందిన దేవాలయాలనే కాదు , ఎక్కడెక్కడో వున్న చిన్న చిన్న దేవాలయాలనూ , పురాతన దేవాలయాలనూ దర్శించారు లక్ష్మిగారు . వూరికే చూడటమే కాదు , వాటిగురించి , అవి ఎక్కడవున్నాయి , ఎలా వెళ్ళాలి , అక్కడి సదుపాయాలేమిటి , వాటి చరిత్ర అన్నీ వివరం గా వారి బ్లాగ్ "యాత్ర" లో వ్రాశారు . చాలా వరకు వివిధ పత్రికలలో వ్యాసాలుగా కూడా ప్రచురించారు .అంతేకాదు  ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్తలాలను పుస్తక రూపంగా తీసుకురావాలనే ఆకాంక్షతో ఇప్పటిదాకా నల్గొండ , వరంగల్ జిల్లా  పుణ్యక్షేత్రాలు , 'యాత్రా దర్శిని -నల్గొండజిల్లా', 'యాత్రా దర్శిని -వరంగల్ జిల్లా ' లను ఈబుక్స్ రూపం లో కొనిగె. ఆర్గ్ వారు ప్రచురించారు . ఇవేకాక కొనెగె వారు ప్రచురించిన మరొక ఈపుస్తకం ' పంచారామాలు - పరిసర క్షేత్రాలు '. ఇంకా త్వరలో రాబోతున్న ఈ బుక్స్ ' కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లూ

' హైద్రాబాదు నుంచి ఒక రోజులో '

హైద్రాబాదు నుంచి రెండు రోజులలో '




ఈ బుక్స్ గానే కాక "యాత్రాదీపిక , వరంగల్ జిల్లా " , వరంగల్ జిల్లా లో వున్న పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తూ వ్రాసిన పుస్తకాన్ని ప్రింటు చేయించారు . మామూలుగా వరంగల్ అనగానే గుర్తువచ్చేది వేయిస్తంబాల గుడి , వరంగల్ దగ్గరగా వున్న రామప్ప దేవాలయం . కానీ ఈ పుస్తకం లో వరంగల్ , హనుమకొండ , ఖాజీపేటలలో వున్న 12 దేవాలయాల గురించి ,వరంగల్ చుట్టుపక్కల వున్న 11 దేవాలయాల గురించి వివరించారు .

ఈ రోజు 7-12-2012 శుక్రవారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు రంజని - తెలుగు సాహితీ సమితి, ఏ.జీఆఫీస్ హైద్రాబాద్ వారి ఆధ్వర్యం లో , ఏ. జీ ఆఫీస్ రంగస్తలం లో ఆవిష్కరించారు . ప్రక్యాత రచయత , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ గారు పుస్తకావిష్కరణ గావించారు .ఆచార్య అయినవోలు ఉషాదేవి , పిఠాధిపతి , భాషాబివృద్ధి పీఠం , పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం గారు వక్త గా వ్యవహరించారు . అనుకోకుండా ఇద్దరు గెస్ట్ లూ వరంగల్ వాస్తవులే అయ్యారు :)




కార్యక్రమము  ముందుగా శ్రీమతి శిష్టా లీలా వసంత లక్స్మి బృందము ఆలపించిన గానలహరితో ప్రారంభం ఐనది .



తరువాత డాక్టర్ నవీన్ గారు పుస్త్కావిష్కరణ గావించారు . ఆచార్య ఐనవోలు ఉషాదేవి గారు , పుస్తకం లోని అంశాలను చూపుతూ ప్రసంగించారు . ఆపైన రంజని -తెలుగు సాహితీ సమితి వారు లక్ష్మిగారి ని శాలువతోనూ , పూలమాల తోనూ , జ్ఞాపిక తోనూ సత్కరించారు






వారే కాదు , లక్ష్మిగారి అక్క చెళ్ళెళ్ళు , వారి కాలనీ లోనివారి స్నేహితులూ శాలువాలతో , పూలమాలల తో , చీరల తో సత్కరించారు . అన్నట్లు  నేనూ ఓ పూల బుకే ఇచ్చానండోయ్ :)

కార్యక్రమము ఆసాంతమూ చాలా చక్కగా జరిగింది .




లక్ష్మిగారు , మీరు మరిన్ని వూళ్ళు తిరగాలని , ఆ విశేషాలన్నీ చక్కని పుస్తకాలుగా ప్రచురించాలనీ , ఇంకా ఇంకా సత్కారాలు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ  మీకు అభినందనలు తెలియజేస్తున్నాను .  .

Wednesday, December 5, 2012

సౌందర్యం



ప్రఖ్యాతరచయత కొమ్మూరి వేణుగోపాలరావు గారి అబ్బాయి , కొమ్మూరి రవికిరణ్ రచించినదీ ఈ నవల " సౌందర్యం ". రచయత పేరు చూడగానే కొమ్మూరి వేణుగోపాలరావు గారి సంబందీకులదా అని తీసుకొని చూసాను . వారి అబ్బాయే అని తెలియగానే , ఎలా రాసారో చదువుదామనిపించి కొనేసాను .కొన్నందుకు , చదవగానే మంచి నవల అన్న సంతృప్తి కలిగింది . ఈ మధ్య తరుచుగా వినిపించేపదం "డిప్రెషన్" . అది ఎందుకొస్తోంది ? ఆ సమస్యమీద రాసినదే ఈ నవల . అలా అని ఏవేవో పెద్ద పెద్ద పదాలతోనో , నోరుతిరగని సమస్యల గురించో లేదు . ఐనా నేను చెప్పేదాని కన్నా , ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బరెడ్డి గారు ఈ నవల గురించి ఏమన్నారో చెపితే బాగా తెలుస్తుందేమో !

"సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబింపజేస్తుంది .కొందరి జీవితాలనైనా తీర్చిదిద్దగలుగుతుందని రచయత తనవంతు బాద్యత గా సమాజానికి తెలియజెప్పిన నవల 'సౌందర్యం' . నవల అనేది జీవితాని కి అద్దం లాంటిది . ఈనవలలోని ఇతివృత్తం చాలా విస్తృతమైనది .కథకు అవసరమైన జీవితము లోని ముఖ్యమైన సంఘటనలు మాత్రమే ఏరుకొని వాటిని అవసరం మేరకు వివరించరించటము లో రచయతగా కొమ్మూరి రవికిరణ్ సఫలుడయ్యాడని చెప్పవచ్చు .ఈ నవల చదువుతున్నంతసేపు ఈ కథ ఎక్కడో జరగలేదు , మన మధ్యే మన ముందే జరుగుతున్నట్టుగా ఈ పాత్రలన్నీ మన చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది .

మానవసమాజం లో ప్రస్తుతం వచ్చిన మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్త దూరమై , మానవ సంబందాలకంటే , ఆర్ధిక సంబంధాలకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల రక్త సంబందీకుల మధ్యే సంబంధాలు తెగిపోయి ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులను ,వానికనువైన రీతిలో పరిష్కరించేందుకు ఉన్నత వ్యక్తిత్వం వున్న వక వ్యక్తిని కథానాయకుడుగా నిలబెట్టి స్నేహపు విలవలకూ , రక్తసంబంధాలకూ ఎంత విలువ ఇవ్వాలి , వాటిని ఎలా కాపాడుకోవాలో ఈ నవలలో ఎంతో చక్కగా చెప్పాడీ రచయత ."

ఈ నవల గురించిన ముందుమాటలో డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు ఇంకా చెప్పారు . అది చదివాక నేను నవల గురించి రాస్తే ఆ ముందుమాటల ప్రభావం తప్పకుండా వుంటుంది అందుకని ఆయన మాటలు నామాటలు గాచెప్పటం ఎందుకు ఆయన చెప్పినవే కొద్దిగా రాస్తే అందరికీ నవల గురించి కొంత అవగాహన కలుగుతుంది అనిపించింది :)

నాకు ఈ నవలలోని మురళి పాత్ర చాలా నచ్చింది . ఎక్కడా టెన్షన్ పడడు. తొణకడు , బెణకడు . అందిరి నీ చాలా స్మూత్ గా డీల్ చేస్తాడు . రామ్మోహన్ , సునంద , సావిత్రి లలో మార్పు తెచ్చేందుకు ఎంతో సహనం చూపిస్తాడు .సంక్షోబాలను , సంఘర్షణలనూ సంతృప్తికరంగా పరిష్కరించుకోవాలని , మానసిక బలహీనతలనూ , స్వార్ధాన్నీ జయించాలని తెలియజేసాడు .ఎవరికి వారు నా అనే స్వార్ధం తో బతుకుతున్న ఈ కాలం లో కుటుంబం అంటే భార్యా , పిల్లలు మాత్రమే కాదు బంధువులు స్నేహితులు కూడా నావాళ్ళే అని తెలియజేసాడు . మురళి పాత్ర ను చాలా ఉన్నతం గా తీర్చి దిద్దారు .

రచయత శైలి కూడా చాలా సులభంగా వుంది . ఒకసారి చదవటం మొదలు పెడితే పూర్తి అయ్యేవరకూ ఆపలేకపోయాను . నాకు ఈ నవల చాలా నచ్చింది .