Monday, February 1, 2010

డబ్బులోయ్ డబ్బులు # # # # # 2మా మామగారికి నా షాప్పింగ్ మీద బొత్తిగా నమ్మకం లేదు . దానికి తగ్గట్టుగా నే , కూరగాయల రాజమ్మ దగ్గరి నుండి , బియ్యం కిరాణా దుకాణదారు వరకు నాకొక ధర , మామయ్యగారికొక ధర చెప్పేవారు . కూరగాయల రాజమ్మ , నాకు రూపాయన్నర కిలో చెబితే , రూపాయకి బేరమాడే కొనేదానిని . మామయ్యగారికేమో అదే కూర రూపాయి ముప్పావలాకి చెప్పి , అర్ధ రూపాయకి ఇచ్చేది . అదేమిటి రాజమ్మా అంటే పెద్దయ్య ఎట్లాగూ బేరమాడుతాడని రూపాయి ముప్పావలా చెప్పాను అనేది . మరి అర్ధరూపాయకే ఇచ్చావుకదా అంటే ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి చెప్పకుండా తప్పించుకునేది . బియ్యం వాడూ అంతే !!! నాకు రెండురూపాయలకు కిలో ఇస్తే , మా మామగారికి రూపాయన్న రకే ఇచ్చేవాడు . అదేమిటో నామటుకు నేను చాలానే బేరమాడే దానిని . హూం !!!!!

ఓసారి ఏమైందంటే , మావారు ఓ పనివాడి ని తీసుకొచ్చారు . మావారు ఎవరిని పనికి పెట్టుకున్నా , వాళ్ళకి డిప్ప కట్టింగ్ చేయించేస్తారు . అలా కట్టింగ్ చేయించుకోని వాడికి ఉద్యోగం ఇచ్చే మాటే లేదు . సరే , ఈ సారి ఆయనకు తప్పనిసరిగా వూరెళ్ళాల్సిన పని వచ్చి , పనివాడు రమేష్ కి కట్టింగ్ చేయించమని , నాకు రూపాయిచ్చి , పైగా చెప్పారు , నాన్నకు తెలీకుండా తీసుకెళ్ళు .నాన్నకు తెలిస్తే , నారాయణగూడా బ్రిడ్జ్ మీద చారాణా కే చేయించుకొస్తానంటాడు అని చిలక్కు చెప్పినట్టు మరీ చెప్పెళ్ళారు . తప్పేదేముంది , అలాగే వైయంసి దగ్గర , మా వారు చెప్పిన నైస్ హేర్ కట్టింగ్ సెలూన్ కే తీసుకెళ్ళాను . అతనూ , పాపం నాకు చాలా మర్యాదలు చేసి , మేజర్ గారి కాండిడేట్ కదమ్మా , నాకు తెలుసు ఎలా కట్టింగ్ చేయాలో అని నైస్ గా డిప్ప కట్టింగ్ చేసేసాడు . హమ్మయ్య , మావారు చెప్పిన పని చేసాను అని నిట్టూర్చినంతసేపు పట్టలేదు , నా నిట్టూర్పు మధ్యలో ఆగిపోవటానికి . " పనివాడికి సెలూన్ లో కట్టింగా ? రూపాయి పెట్టా ? పైగా నువ్వు తీసుకెళ్ళావా ? నేనింట్లోనే వున్నాగా ? నాకు చెప్పొచ్చుగా ? నారాయణగూడ బ్రిడ్జ్ మీద పావలా కే చేయించుకొచ్చేవాడిని . నీకు , నీ మొగుడికి బొత్తిగా డబ్బులంటే లక్షం లేకుండా పోతోంది " అని ఇంకా హాట్ బూట్ గా మా మామగారు క్లాస్ పీకేసారు . అదే సమయములో , మా మామగారికి తెలిసిన ఒకాయన వచ్చి , కాచిగూడా లో ఇండియన్ బాంక్ , బ్రాంచ్ పెట్టారని , దానికి వాళ్ళ అబ్బాయిని మేనేజర్ గా వేసారనీనూ , మీ కెవరైనా తెలిసిన వాళ్ళుంటే , అక్కడ ఖాతాలు ఓపెన్ చేయించండి అని ప్రాధేయ పడ్డాడు . ఇంకెవరో ఎందుకు మా పెద్ద కోడలి తోనే చేయిస్తానని , నాతో అక్కడ ఎకౌంట్ ఓపెన్ చేయించి , ఇక పైన ఇలాంటి పనికి మాలిన దండగ ఖర్చులు చేయొద్దని , ఏమైనా ప్రతినెల ఆ ఎకౌంట్లో పది రూపాయలు వేసి , ఆయనకు చూపించాలని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.

మా మామగారికి నమ్మకస్తులు , మా తోడి కోడలు లక్ష్మి , మా అబ్బాయి బిపిన్ . లక్ష్మి కుడిచేయైతే , బిపిన్ ఎడంచేయి . రామయ్య ఎడమ కాలు . ( మరి ఇంకో చేయి వుండదుగా . అందుకని కాలన్న మాట .) ఆయన బజారుకు వెళ్ళలేక పోతే , ఈముగ్గురిలో ఎవరితోనైనా తెప్పిస్తారన్నమాట. వీళ్ళూ బేరమాడటములో మా మామగారి వారసత్వం పుణికి పుచ్చుకున్నారు . ఇక తాతా మనవడు ఏదైనా కొనటానికి వెళ్ళారంటే , చిక్కడపల్లి , సుల్తాన్ బజార్ , కోటీ అన్నీ తిరిగి , అదీనూ నడుచుకుంటూ ఓ రూపాయి తక్కువకే తెచ్చుకుంటారు . ఓసారి , మంచం నవారు కొనటానికి హోల్ మొత్తం హైదరాబాద్ , ఆబిడ్స్ తప్ప , తిరిగారు . ఆబిడ్స్ లో అంతా మోసగాళ్ళన్నమాట . అందుకని అటెళ్ళరు .

అలా పొదుపు చేసిన డబ్బులు ఏ బాంక్ లో ఎన్ని నెలలకు యఫ్ . డి వేస్తే ఎంత వడ్డీ వస్తుంది అన్నది ఆయనకు కరతామలకం . కోపరేటివ్ బాంక్ , బర్కత్పురా , బాంక్ ఆఫ్ బరోడా కు ప్రతిరోజూ వెళ్ళొస్తూ వుండేవారు . నా దగర 100 రూపాయలు జమ అయ్యాయంటే వాటిని ఏదో ఒక విధం గా యఫ్. డీ చేసేసేవారు . ఆ పేపర్లన్ని ఆయన పేపర్ల తో పాటు ఒక రేకు పెట్టెలో వుంచి , దానిని మంచం కింద వుంచేవారు . తెల్లవారుఝామున లేవగానే బర్ర్ర్ర్ర్ర్ మంటూ ఆ పెట్టిని మంచం కిందనుండి లాగి , ఓ గంట సేపు ఆ పేపర్లు అన్నీ తిరగేసేవారు . ఇక డబ్బులేమో ఆ పైన కనిపిస్తుందే ఆ కోట్ లో దాచేవారు . అందులో అన్నీ ముఖ్యమైనవి వుంచేవారన్నమాట. అలా దాపుడు కే కాని , ఆ కోట్ ఆయన ఎప్పుడూ వేసుకోగా నేనైతే చూడలేదు . అది ఆయన పర్సనల్ బాంక్ అన్న మాట . మా అత్తగారు డబ్బులు అడగగానే ఎందుకు ఎంత అని సవాలక్ష ప్రశ్నలు వేసి , నువ్వు జమిందారిణివే ( మా అత్తగారి పూర్వీకులు జమిందారులట ) , నీకూ , నీ పెద్ద కొడుకుకు డబ్బు విలువ తెలీదు అనేసి , ఆ కోట్ లోనుండి తీసి ఓ పదిసారులు లెక్కపెట్టి మరీ ఇచ్చేవారు . పాపం అంటమే కాని ఎప్పుడూ ఇచ్చేందుకు లోటు చేయలేదు .

మా అబ్బాయి అక్షరాలా తాత పోలికే ! అరిచి ఘీ పెట్టినా వాడి దగ్గరనుంచి ఓ పైసా రాలదు . మా వారు వాడిని " చిన్న కిషన్ రావ్ " అని , " డబ్బులుగా " అని ముద్దు ముద్దుగా పిలుచుకుంటారు .

అలా , అలమారాలో డబ్బులు దాచటము , మా అత్తగారి దగ్గర నేర్చుకుంటే , కొద్దో గొప్పో ఎలా సేవ్ చేయాలి , ఆ డబ్బును బాంక్ లో ఎలా దాచాలి అన్నది మా మామగారి దగ్గర నేర్చుకున్నాను . మా అత్తగారు చెప్పినప్పుడు , నా కళ్ళు అలా చుక్కల్లా మెరిసాయి . అందుకని ఆవిడ గురించి రాసినప్పుడు చుక్కలు పెట్టాను . మా మామగారు చెప్పినప్పుడు ఒక ప్లస్ కాదు రెండు ప్లస్ లు కనిపించాయి అందుకని రెండు ప్లస్లు పెట్టాను . ఇక నేనెంతవరకు నేర్చుకున్నాను , ఎంతవరకు దాచుకున్నాను , ఎలా బేరాలాడాలి ( ఐనా , మా మామగారికి , నాకు బేరాలాడటము రాదనే ప్రగాఢ విశ్వాసము వుండేది . కొన్ని సారులు నిజమే నేమో నని నాకూ అనిపిస్తుంది సుమీ ) అని చెప్పేదానికి ఏమి గుర్తులు , ఎక్కడా అని దీర్ఘం వద్దు టైటిల్ దగ్గర ఆలోచించుకొని , ( ఓవేళ మీరేమైనా సూచిస్తే ) ఆ గుర్తుల తో , నా దాపరికపు అనుభావాల తో , వచ్చే వారం , ఇదే రోజు , ఇదే సమయానికి , ఇదే బ్లాగ్ లోకి వస్తాను . అంతవరకు సెలవా మరి .

10 comments:

అమ్మఒడి said...

కంటి ముందు ఒక్కసారిగా పాతతరాన్ని చూపించారండి. చాలా బాగుందండి.నెనర్లు!

శేఖర్ పెద్దగోపు said...

:-) :-)
నిజంగా బేరాలాడటం అనేది ఒక కళండి...మొదట్లో నేను ఏదైనా పండు ఒకటి రూపాయి చెబితే మూడు పళ్ళు మూడున్నరకు ఇవ్వవా అని అడిగే టైపు...ఏంతైనా డబ్బు జాగ్రత్త, పొదుపు ఆ తరం వాళ్ళ ముందు ఇప్పటి వాళ్ళు చాలా వెనకబడే ఉన్నారనుకుంటా...

శ్రీలలిత said...

మాలాగారూ,
డబ్బుల విషయంలో మీ అత్తగారూ, మామగార్ల దగ్గర మీరు బలే ట్రైనింగ్ తీసుకున్నారండీ.. వారి సలహాలు, సూచనలూ బలే బాగున్నాయి..

మురళి said...

నాకు బేరాలాడడం అంత బాగా రాదండీ.. తిట్లు తినకుండా ఉండడం కోసం రేట్లు కొంచం తగ్గించి చెబుతూ ఉంటా.. (అనుభవం మీద నేర్చుకున్న పాఠం అన్నమాట.. )

సృజన said...

నేను బేరాలాడతాను కాని వాళ్ళు ఇవ్వరుగా నేనడిగినంతకి:)

Srujana Ramanujan said...

బాగుంది బాగుంది. మీ పాతోళ్ళ కథలు బాగా చెప్తారు

భావన said...

అబ్బ సూపరండి బాబు మీ మావ గారు. మా అక్క వాళ్ళ మావ గారు కూడా అచ్చం గా ఇలానే వుండే వారు. కోడళ్ళకు, భార్య కు ఏమో కాని మాకు మాత్రం ఫుల్ అండ్ ఫుల్ గా ఎంజాయ్ చేసే వాళ్ళం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడూ. మాకు కూడా క్లాస్ లు పెట్టేవారు బేరమాడే విద్య గురించి. ఆ టైం లో ఎవడైనా అమ్మే వాడు వస్తే మాకు డెమో కోసం వాడు ఐపోయాడే.. ;-)
బేరాలు కాదు కాని డబ్బుల పీనాసి తనం దగ్గర మా నాన్న కూడా అంతే.. చుక్కలు చూపించే వారు.

మధురవాణి said...

మీ అత్తగారి, మావగారి డబ్బుల కబుర్లు భలే బాగున్నాయండీ మాలా గారూ :) :)

మాలా కుమార్ said...

అమ్మ ఒడిగారు ,
థాంక్స్ అండి .

శేఖర్ గారు ,
మీరింతకూ బేరాలాడే కళ నేర్చుకున్నారా లెదా ?

శ్రీ లలిత గారు ,
మరి నేనెంత నేర్చుకున్నానో తరువాత పోస్ట్ చదివి చెప్పండి .

మాలా కుమార్ said...

* మురళిగారు ,
మీ అనుభవం మీద నేర్చుకున్న పాఠాలు మాకూ నేర్పించండి ప్లీస్ .

*సృజనా ,
మీరూ నా టైపే నన్న మాట . సేం పించ్ .

*సృజనా ,
పాత కథలు బాగుంటాయ నే వినమంటాను . థాంక్ యు .

*భావన గారు ,
డెమో తో సహా నేర్చుకున్నారన్న మాట . ఐతే మీరు బేరాలాడటములో ఎక్స్పర్ట్ అన్న మాట .

*మధురవాణి గారు , థాంక్ యు.