మా చిన్నప్పుడు మానాన్నగారి వుద్యొగరీత్యా వరంగల్ ,ములుగు ,ఖమ్మం లాటి ప్లేస్‌లలో వుండటము వలన మా స్నేహితులతో కలిసి బతకమ్మలాడే వాళ్ళము .కాని మాఇంట్లో ఆనవాయితి లేక పోవటము వలన దాని గురించి తెలీదు. మా అత్తవారింట్లో బతకమ్మ ఆనవాయితి వుండటము తో నాకూ అలవాటైంది. ప్రతి సంవత్సరము తప్పకుండా బతకమ్మని పెట్టేవాళ్ళము. మా సందులోని అమ్మయిలంతా వచ్చేవారు. ప్రతి రోజూ నైవేద్యము చేయటము నాకు సరదాగా వుండేది. .తొమ్మిదో రోజు రిక్షాలలో వెళ్ళి టాంక్ బండ్ లో నిమజ్జనం చేసేవారము. మాఇంట్లో ఇది ముఖ్యంగా ఆడపడుచుల పండగ.ఏ పండగకి బట్టలు పెట్టినా లేకపోయినా ఈ పండుగకి మాత్రము తప్పక ఆడపిల్లలని ఇంటికి పిలిచి చీర ,పసుపుకుంకుమ తప్పక ఇచ్చేవారు మా అత్తగారు. మా అడపడుచులకు , మా అమ్మాయికి పెళ్ళిల్లు అయ్యాక చిన్న బతకమ్మని ,గౌరమ్మని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాను. ఇదో ఇన్నేళ్ళకు నాలుగు సంవత్సరాలనుండి మా మనవరాలు మేఘ, మా ఈతరం ఆడపడుచు వచ్చాక మళ్ళీ పెద్ద బతకమ్మని పెట్టి అందరిని పిలిచి ఆడిస్తున్నాను. ప్రతి సంవత్సరమూ ఏదో ఒక పూజ ఐనా చేసి ముత్తైదువులను పిలిచి తాంబూలము ఇవ్వటము నాకు అలవాటు. .
ఈ రోజు అమావాస్య . ఈ రోజు బతకమ్మని మొదలు పెట్టి తొమ్మిది రోజులు పెడతాము.
వుదయమే దేవుడి దగ్గర పసుపు తో గౌరమ్మని చేసి ఓ తమలపాకు లో పెట్టి ,పూజ చేసి ,నైవేద్యము పెట్టాలి. మొదటి రోజు పులగం,రెండో రోజు పెరుగన్నం ,మూడోరోజు చలిమిడి ముద్దలు, నాలుగో రోజు నానుపాలు ( అటుకులని పాలలో నానవేసి , బెల్లం, కొద్దిగా ఇలాచి పొడి కలిపినది ) ,ఐదోరోజు అట్లు, ఆరోరోజు సున్నుండలు ,ఏడోరోజు పరవాన్నం ఎనిమిదోరోజు గారెలు ,తొమ్మిదో రోజు చద్దులు ( మేము పెట్టేవి ,పులిహోరా , దద్దోజనం ,చక్ర పొంగలి ) నైవేద్యం పెట్టాలి.
మద్యాహనం రకరకాల ,రంగురంగుల పూలతో బతకమ్మని పేర్చాలి. బతకమ్మ తల పైన మద్యలో ఓ చిన్న పసుపు గౌరమ్మని ,తమలపాకు లో పెట్టి పెట్టాలి.సాయంకాలము పూల గౌరమ్మ తో పాటు దేవుడి దగ్గరి గౌరమ్మని కుడా తెచ్చి ,ఇంటి ముందు శుభ్రంగా వూడిచి ముగ్గు వేసిన చోటులో పెట్టాలి.ముందుగా దీపారాధన చేయాలి.
తరువాత,
ఒక్కొక్క అక్షింతలే గౌరమ్మా , ఒక్క మల్లె సాలెలూ ,
చిన్న చిట్టివత్తులూ గౌరమ్మ సన్న దీపాలూ ,
నీలాటి జలతి వద్దా గౌరమ్మ నీ నోము నాకు చెల్లె,
బంగారు మేడ లోనా గౌరమ్మ నా నోము ఫలము చెప్పు.
ఈ పాట మూడేసి సార్లు పాడుతూ పసుపు ,కుంకుమ , అక్షితలూ బతకమ్మ మీద వేస్తూ పూజ మొదలు పెట్టాలి.ఆ పై రకరకాల పాటలు పాడుతూ ,చుట్టూ తిరుగుతూ పూజించాలి. ఆ తరువాత కోలాటము.అంతా ఒక లయ ప్రకారము , చూడముచ్చటగా ,కనులకింపుగా వుంటుంది.పూజ తరువాత కత చెప్పుకొని ,తలపై అక్షింతలు వేసుకొని, నైవేద్యం పెట్టాలి. పొద్దున చేసినదానిలోనే కొద్దిగా వుంచి ఐనా పెట్టవచ్చు. లేదా పప్పు బెల్లం అయినా పెట్టవచ్చు. పొద్దుటి గౌరమ్మని తీసి దేవుడి దగ్గర పెట్టేయాలి. ఆ రోజు బతకమ్మ మీద పెట్టిన చిన్న గౌరమ్మని ఓ బకెట్ నీళ్ళ లో పోయిరా మాయమ్మ పొయిరావమ్మ ,పోయి నీ అత్తింటనూ సుఖముగా నుండు ,ఎవ్వరేమన్ననూ ఎదురాడబోకు ,మగడేమన్ననూ మారాడ బోకూ అంటూ అప్పగింత పాటలు పాడుతూ ఓలలాడించాలి.ఆ పసుపును ముత్తైదువులు కొద్దిగా తాళికి రాసుకొని , ఆ నీటిని చెట్టు మొదలులో పోసేయాలి. వచ్చిన ముత్తైదువులకి పసుపు ,కుంకుమ తాంబూలం ఇవ్వాలి.
ఈ విధముగా తొమ్మిది రోజులు పూజించి , తొమ్మిదో రోజు పెద్ద గౌరమ్మని కూడా బతుకమ్మ మీద వుంచి వొడి బియ్యం ( చిన్న కొత్త్త బట్ట లో కొద్దిగా బియ్యం ,ఒక రుపాయి పెట్టి ముడి వేయాలి ) పెట్టి, కొత్త జాకెట్ బట్ట పెట్టాలి.పూజా విధానమంతా మామూలుగానే చేసి , ఏదైనా చెరువులో నిమజ్జనం చేయాలి. అప్పుడు బతుకమ్మ మీద చిన్న చిన్న కొవ్వొత్తులు వెలిగించి పెడితే చూడటానికి
చాలా బాగుంటుంది. కొవ్వొత్తుల వెలుగు లో నీటిమీద బతుకమ్మ తేలి పోతూవుంటే చూడటనికి రెండు కళ్ళూ చాలవు.
బరువు బాధ్యతలతో అలిసిపోయిన అమ్మాయి తీసుకొచ్చి ,సేదతీర్చి పంపటమే ఈ కథ లో పరమార్దము అని నాకనిపిస్తుంది.
15 comments:
చాలా చక్కగా వివరించారు. నేను కూడా స్నేహితుల వలనే ఈ సరదాలో పాల్గుంటాను కానీ ఇన్ని తెలియవు.థాంక్స్.
చాల బాగా వివరించారు..
బతుకమ్మ అంటే నాకు చాల ఇష్టం..
ఈ సంవత్సరమే పెళ్లై నేను వేరే దేశం వచ్చానండి..
మొదటి సారి బతుకమ్మని మిస్ అవుతున్నా..
మల్లి ఆ సంబరాలు అన్ని చూస్తున్నట్టుంది మీ టపా చదువుతుంటే..
థాంక్స్ సాహితి గారు..
చాల బాగా వివరించారు..
బతుకమ్మ అంటే నాకు చాల ఇష్టం..
ఈ సంవత్సరమే పెళ్లై నేను వేరే దేశం వచ్చానండి..
మొదటి సారి బతుకమ్మని మిస్ అవుతున్నా..
మల్లి ఆ సంబరాలు అన్ని చూస్తున్నట్టుంది మీ టపా చదువుతుంటే..
థాంక్స్ సాహితి గారు..
మీరు ప్రతి పండుగనీ శ్రద్ధగా, వేడుకగా జరుపుతారనిపిస్తుంది మీ టపాలు చదువుతుంటే.. తెలంగాణా జిల్లాల్లో బతుకమ్మ పండుగ చూడాల్సిందే కానీ మాటల్లో చెప్పలేం. ఇప్పుడు చాలా టీవీ చానళ్ళు వచ్చాయి కాబట్టి ఎవరైనా లైవ్ ఇస్తే చూడాలి...
చాలా బాగా వివరంగా రాసావు (రాసారు).బతుకమ్మ పండుగ అంటే నాకు పొట్టిచెల్మ నే గుర్తుకు వొస్తుంది. పొటీ పడి పూలు పట్టుకొచ్హి బతుకమ్మలు పేర్చే వాళ్ళం. చుట్టూ అడివి ఉండేది. ఎన్నో తంగేడు పూలు కోసుకొచ్హేదాన్ని. పిల్ల లందరం ఒకరికి తెలియకుండా ఒకరి ఇంట్లొంచి ఒకరం పూలు ఎత్తుకొచ్హేసే వాళ్ళం. పెద్ద పెద్ద బతుకమ్మలతో ఎంతో సరదాగా ఆడుకొనే వాళ్ళం. ఒకసారి ఒక 'అత్తయ్య గారు '(అప్పుడు ఆంటీ అనే అలవాటు లేదు) నన్ను పట్టుకొని కొట్టబోయింది. ఎలాగో తప్పించుకొని, అమ్మకి తెలిస్తే ఎక్కడ కొడుతుందో అని ఇంటికి చాలా సేపు పొనే లేదు. మీ ఇంట్లో ఒకసారి బతుకమ్మలకు ఒచ్హినప్పుడు నాకు అంతా అదే గుర్తుకు ఒచ్హింది.
బతుకమ్మ పండుగ చిన్నప్పటి నుంచీ చూస్తున్నదే అయినా మీ వ్యాసం చదువుతుంటే కొత్తగా అనిపించింది. ఉదయం నుంచీ తన పనుల్లో బిజీగా వున్న మా ఆవిడని కేకేసి >>>బతకమ్మ తల పైన మద్యలో ఓ చిన్న పసుపు గౌరమ్మని ,తమలపాకు లో పెట్టాలి ట <<< తెలుసా అని అడిగాను బడాయిగా.! అంతే, మా ఆవిడ నన్ను కంప్యూటర్ ముందునుంచి లేపి తీసుకెళ్ళి తను రకరకాల పూలతో ఎంతో శ్రద్ధ గా పేర్చి దేవుడి ముందు పెట్టి పూజించిన బతుకమ్మని చూపించింది. తమలపాకులో పసుపు పచ్చని గౌరమ్మ మిలమిల మెరిసిపోతూ కనిపించింది. నేను తల వెలాడేయక తప్పింది కాదు. భక్తి లేక పోయినా నాకు మన పండుగలూ పబ్బాలు అంటే చాలా ఇష్టం.బతుకమ్మ అంటే మరీ ఇష్టం. అయితే ఇష్టమే కాకుండా మన పండుగల గురించి కనీస అవగాహన ను కలిగి వుండాలని ఇప్పుడు తెలిసివచ్చింది. ధన్యవాదాలు.!
బతుకమ్మ పాట చాలా బాగుంది.
బాగా చెప్పారు. దాదాపు 20 సంవత్సరాలనుండి తెలంగాణాలో ఉన్నా ఈ పండుగ వేడుకలని ఎప్పుడూ దగ్గరగా చూడలేదు. ఈ తొమ్మిది రోజులు ఒక వీడియో తీసి మీ బ్లాగులో పెడితే చూసి ఆనందిస్తాం.
batukamma sketch chala bagundi,,
nuvvu chivara rasina mata,inka correct..a aa mata touching ga vundi.
parvathi
బలే వుందండి బతుకమ్మ. ఎంత అందం గా కళ గా వుందో... మేము కోస్తా వాళ్ళము కదా మాకు అస్సలు తెలియదు ఇక్కడ తెలంగాణా స్నేహితులు పిలిస్తే వెళ్ళి తాంబూలం తీసుకోవటం తప్ప, తెలంగాణా రచయతల పుస్తకాలలో బతుకమ్మ ను ఒక్క సారైనా స్మరించుకోకుండా వుండరు... తెలంగాణాలో ఏ పండగకు దసరా కేనా? ఆఖరి రోజు వెళ్ళి జమ్మి చెట్టు మీద పక్షులను ఏవో చూసి వస్తారు... మనదంతా నవలా పరిజ్ఞానమే...
ఉదయము పూజ చేసుకున్నాక ఇది బ్లాగ్ లో రాస్తే బాగుంటుందేమో ( ఈ మద్య ప్రతిదీ బ్లాగ్ లో రాయాలి అనే కోరిక ఎక్కువైనట్లుంది ) అనిపించి అప్పటికప్పుడు ఏదో రాసి పొస్ట్ చేసాను ,కాని ఎవరినుండీ స్పందన వుంటుంది అనుకోలేదు, పైగా ఇదెవరు చూస్తారులే అనుకున్నాను. ఇన్ని స్పందనలు చూడగానే చాలా చాలా సంతోషం అనిపిస్తోంది !
మన పండుగలు, సాంప్రదాయాలు , పద్దతులు , బర్త్ డే అంటే కేక్ కట్టింగ్ నే కాదు మంగళహారతికూడా వుంటుంది లాటివి మా మనవళ్ళు ,మనవరాళ్ళకి తెలుపాలని సాద్యమైనంతవరకు చేస్తుంటాను, వాళ్ళతోటీ చేయిస్తుంటాను . పైగా భవిష్యత్తు లో వాళ్ళు నన్ను ఈవిధముగా గుర్తుంచుకోవాలి అనే దురాశ !
స్పందించిన అందరికీ పేరు పేరునా ధన్య వాదాలు.
meemu kuda batukammani maa chinnappudu baagaa aadevaaramu .maa naannagaaru manushulato chaalaa rakaala pulu teppinchi tane perchevaallu.naa pellayyaka maa attagaarintlo kuda vundi daanito marchipokundaa inni eellu aadaamu ee year neenu maa ammaayi deliveryki USki vachaanu miss avutaananu konna kaani ikkada kudaa chaalaa bhagaa aadaaru mana telugu vaallu.mee bhatukamma photo chudagaane naaku maa naanna gurtochaaru .appati rojulu ani.
మా చిన్నప్పుడు , మానుకోటలో మీ ఇంట్లో బతుకమ్మలాడిన గుర్తు కొద్ది కొద్ది గా వుంది .
అయితే అమెరికా లో కూడా బతుకమ్మలాడించావన్నమాట ! గుడ్ .
చక్కగా చెప్పారు, సంతోషం మరియు ధన్యవాదాలు.
మా మనవళ్ళు ,మనవరాళ్ళకి తెలుపాలని సాద్యమైనంతవరకు చేస్తుంటాను, వాళ్ళతోటీ చేయిస్తుంటాను . పైగా భవిష్యత్తు లో వాళ్ళు నన్ను ఈవిధముగా గుర్తుంచుకోవాలి అనే దురాశ ! ఆశ కదా జీవతాన్ని నడిపించే శక్తి బాగు బాగు మీ బ్లాగ్ కి మా నమోన్నమహ
బవదీయుడు
బాలసుబ్రమణ్యం పెరుగు
Post a Comment