Thursday, November 26, 2009

రామయ్య ( ఎవ్వరి మాట వినడు - ఎవ్వరికీ భయపడడు )

ఎదురింటి గోపాలరావు గారింట్లో పని చేసేవాడు , అయన వద్దని పంపించేసారు , మనింట్లో వుండమని పిలిచాను అంటూ మా వారు రామయ్యను , మా మామగారికి పరిచయము చేయగానే , ఆయన , ఈ ముసలోడేం పని చేస్తాడురా ? నెలకు 50 రూపాయలు దండగ , ఏం వద్దు పంపించేయ్ అన్నారు . కాని మా వారు వినలే , నేనిస్తానులే , కాస్త అన్నం పెట్టి , 50 రుపాయలిస్తె , ఇంటికి కాపలాగా మెట్లకింద వుంటాడు అని వాదించారు . పెద్దోడు చెపుతున్నాడు వుండనీయ రాదయ్యా అంటూ మా అత్తగారి సపోర్ట్ తో మా ఇంట్లో చేరాడు రామయ్య . ఇక అప్పటి నుండి ఇంటికే కాదు , ఇంటి మనుషులకు కూడా కాపలాదారైనాడు .

మా మామిడిచెట్టు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు సంవత్సరానికి ఒకటో , రెండో కాయలు కాసేది కాని , ఆకులు మాత్రము చెట్టునిండా ,గుబురుగా నవనవ లాడుతూ వుండేవి . మా వీధి లో పండగలకి , పబ్బాలకి మామిడాకులు , కొబ్బరాకులూ మా ఇంటినుండి తీసుకెళ్ళేవారు . మా రామయ్య వచ్చాక అదంతా బంద్ ! అరిచిఘీ పెట్టినా ఒక్కటంటే ఒక్క ఆకు కూడా ఇచ్చేవాడు కాదు .మా మామగారరిచినా , నీమ్మకు నీరెత్తినట్లు , దున్నపోతుమీద వానజల్లు పడ్డట్టు వుండేవాడు !

బయటి వాళ్ళకు సరే , ఇంట్లో వాళ్ళకు కూడా , ఏ ఆకు , పూవు ఏది ముట్టుకోవటానికి వీలులేదు . రామయ్య ఇస్తేనే , కొబ్బరికాయైనా , నిమ్మకాయైనా , పూవైనా చివరికి కరివేపాకైనా ! ఇంతకు ముందు ఇంటికెవరైనా వస్తే , వారికి బొట్టుపెట్టి , కొబ్బరికాయ ఇచ్చేవారు , మా అత్తగారు . రామయ్య హయాం వచ్చాక , రామయ్యకు , వచ్చినవారి ముఖారవిందం నచ్చి ఇస్తేనే ఇవ్వటము అలవాటు చేసుకున్నారు ఆవిడ . మా ఆడపడుచులు వచ్చినప్పుడు , రామయ్యా , ఆడపిల్లగాళ్ళు వచ్చారు , కొబ్బరికాయలు తే అని , మా అత్తగారు ఎంత పిలిచినా వినిపించుకునేవాడు కాదు . అన్ని స్టోర్ రూం లో ఎక్కడో దాచేసేవాడు . తనకు ,సబ్బు పైసలు అవసరమైనప్పుడు మాత్రము ,ఓ రెండు కొబ్బరికాయలు , ఓ రెండు నిమ్మకాయలు , కాస్త కరివేపాకు , సంచీ లో వేసుకెళ్ళి , వాళ్ళకిచ్చి , రెండు రూపాయలు తెచ్చుకునేవాడు ! మాకవసరమై ఎంత అడిగినా నిమ్మకు . . . . . దున్నపోతు . . . . . . . . రామయ్య దయ , మా ప్రాప్తం ! బయట అమ్ముకునేవాడా అంటే అదేం లేదు . తన ఇష్టప్రకారము మా కిచ్చేవాడన్నమాట .


పొద్దున లేచినప్పటినుండి , మా మామగారికి , రామయ్యకు ఏదోవక దాని మీద గొడవలే ! ఇద్దరూ మీద పడి కొట్టుకుంటారా అన్నట్లుండేవి . అలా ఇద్దరూ కాసేపు అరుచుకొని , బజారుకు బయిలుదేరేవారు . రామయ్య ఒక సంచీ పట్టుకొని , రామ భక్త హనుమాన్ లా ఆయన వెనుక వెళ్ళే వాడు . ఎంతైనా ఆయనకు నమ్మిన బంటు . మా అత్తగారికి , మామగారికి చాలానే సేవ చేసేవాడు .

మా ఇంటి ముందుకు కు , అసలు మా గేట్ దరిదాపులకు ఎవరూ వచ్చేందుకు వీలు లేదు . పిల్లల తో ఆడుకోవటానికి ఎవరైనా వస్తే , పక్కింటికి వెళ్ళమని పంపించేసేవాడు . ఒకసారి మా అబ్బాయి ఫ్రెండ్ , చదువుకోవటానికి వస్తాడని ఎదురుచూస్తూ వున్నాడు . ఆ అబ్బాయి రాలేదు . ఏమైందా అనుకున్నాడు మా వాడు . మరునాడు స్కూల్ కి వెళ్ళాక తెలిసింది , అతను వచ్చాడట. కాని మా ఇంటికి రావొద్దు , పక్కింటికెళ్ళు అని వెళ్ళ గొట్టాడట . మా వాడు ఒకటే ఏడుపు , వాడు ఒల్డ్ సిటీ నుండి వచ్చాడమ్మా . ఎవరొచ్చినా పక్కింటికి వెళ్ళమని పంపిచేస్తాడు అని . మావారు , రామయ్య ను పిలిచి కోపం చేసారు . అబ్బే నిమ్మకు . . . . . .దున్నపోతు . . . . .


ఇంతేనా ? ఒకసారి మావారికే తగిలింది ఆ దెబ్బ , ఆయన ఫ్రెండ్ , వాళ్ళ అమ్మాయిపెళ్ళికి పిలవటానికి రాత్రి 11 గంటలకి వచ్చారు .నాలుగు రోజులలో కుదిరిందిట . సమయము ఎక్కువ లేదు అందుకని వాళ్ళ దురదృష్టము ఆ టైం లో వచ్చారు . యధావిధి , మా రామయ్య గేట్ తీయనని , వాళ్ళను పక్కింటికెళ్ళమని పంపించేసాడు . ఆ తరువాత కథ ఎందుకులెండి .


మా గేట్ ఎట్టి పరిస్తితులలోనైనా , రాత్రి 10 గంటల కల్లా మూయాల్సిందే . తాళం పడాల్సిందే ! మా ఇంటికి ఎవరైనా వచ్చి 10 తరువాత వుంటే వచ్చి వాళ్ళనే , మీకేం పనిలేదా ? ఇంకెంతసేపుంటారు వెళ్ళండి అనేసేవాడు . అంత మాట అనిపించుకున్నాక ఎవరైనా ఎందుకుంటారు ? పక్కనుంచి మావారు అరుస్తున్నా సరే నిమ్మకు . . . . . . దున్నపోతు . . . . . . .


మా అమ్మాయి కి ఎదురింట్లోనే ఇద్దరమ్మాయి లు ఫ్రెండ్స్ వుండేవారు . ముగ్గురూ , రాత్రి చదువుకోవటము అయ్యాక మా ఇంటిముందు కూర్చొని కబుర్లాడుకునేవారు . మామూలుగానే , మా ఇంటిదగ్గరెందుకు పక్కింటికెళ్ళండి అని పంపేసాడు . వాళ్ళూ సరేనని ఎదురింటి గేట్ ముందు కూర్చున్నారు . 10 కాగానే సంజమ్మా వస్తున్నావా అని అరిచి , పిలిచాడు . పాపం తను రావటము 5 నిమిషాలు ఆలస్యం చేసింది . అంతే గేట్ తాళం పడిపోయింది . ఏంచేస్తుంది ? గేట్ తీయడు , అందుకని గోడ దూకి వచ్చింది . ఇహ చూస్కోండి నువ్వు ఆడపిల్లవి కాదా ? అట్లా గోడ దూకుతావా అని క్లాస్ పీకాడు . మా అబ్బాయి రామయ్య కళ్ళ పడకుండా గోడదూకి , రామాఫలం చెట్టెక్కి , బాల్కనీ లోకి దూకేవాడు . రామయ్య పుణ్యమా అని మా పిల్లలకు గోడలు దూకటము , చెట్లెక్కటమూ బాగా వచ్చింది !

మా అమ్మాయి పెళ్ళై తను వెళ్ళిపోయాక , మావారు కూడ ఎక్కువ టూర్స్ లలో వుండేవారు , ఇల్లంతా ఖాళీనే కదా అని మా అబ్బాయి ఫ్రెండ్స్ రాత్రుళ్ళు మా ఇంటికే వచ్చి , చదువుకునేవారు . మా ఇంట్లోకి నాలుగు మోటర్ సైకిళ్ళు రావటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు మా రామయ్య . అదీనూ రాత్రి 10 లోపలే రావాలి . పాపం పిల్లలు నలుగురైదుగురు ఒక్కొక్కదానిమీద వచ్చేవారు . ఎప్పుడైనా ఎవరికైనా ఆలస్యమై , గోడ దూకి వచ్చారో , వాళ్ళ నడ్డి విరిగిందే ! వాళ్ళ అమ్మలు మాత్రము మీఇంటికి వస్తే మాకు బెంగ లేదండి , మీ రామయ్య ఎటూ కదలనివ్వడుగా అని సంతోష పడిపోయేవారు .


నేను పార్లర్ కి వెళ్ళిన కొద్దిసేపటికే , పార్లర్ కొచ్చేసేవాడు . ఏమిటి అంటే , ఇంటికి చుట్టాలొచ్చారు , చాయ్ పెడుదువు పదా అని , నేను బయిలుదేరేదాకా అక్కడే బెల్ కొడుతూ కూర్చునేవాడు . ఇక నా క్లైంట్సేమో నేను చేసుత్తున్న ఐబ్రో నో , ఫేషియలో మద్యలో వదిలేసి పోతానేమో నని తెగ భయపడి పోయేవారు . ఆ తరువాత పార్లర్ చుట్టుపక్కల రామయ్య కనిపిస్తే రావటమే మానేసారు .ఇలా కనీసము రోజుకు ఐదారు సార్లన్నా ఇంటికి తీసుకెళ్ళేవాడు . సాయంకాలము గేట్ దగ్గరికి రాగానే ఒక రుపాయివ్వు , సబ్బు తెచ్చుకోవాలే అనేవాడు . నాకు వళ్ళు మండి ,నా దగ్గరలేవు అంటే , పొద్దటిసంది గిరాకి రాలే అని దబాయించేవాడు . నువ్వు నన్నెక్కడ పని చేసుకోనిచ్చావు ? ఇన్ని సార్లు తీసుకొచ్చావు అని నేను ఉక్రోశ పడితే , నీతాన పనిచేసే పిల్లలేం చేస్తున్నారు ? అని తిరిగి దబాయింపు ! ఇంటికి ఇంత దగ్గరగా పార్లర్ వద్దు , కొంచము దూరము వుండాలి అని మావారు చెపితే వినకుండా , ఇంటికి దగ్గరైతే ఇంటినీ , పిల్లలనూ చూసోకొవచ్చని , ఇంటిదగ్గరగా పార్లర్ పెట్టుకున్నందుకు నన్ను నేను తిట్టుకుంటూ రూపాయి సబ్బు కోసం సమర్పించుకునేదాన్ని . నాకు తెలుసు , మా పిల్లల లాగే మీకూ రోజూ సబ్బెందుకు అని అనుమానం వస్తోంది కదా ? సబ్బు అంటే , మా రామయ్య భాష లో సారాయి .

ఇంతేనా అంటే ఇంకా చాలా వున్నాయి చెప్పల్సినవి . కాని ఇంకా ఎందుకులెండి . ఇప్పటికే చాలా ఎక్కువైంది . మా మామగారు చనిపోయిన నెలకే రామయ్య కూడా చనిపోయాడు . అక్కడ కూడా వాళ్ళకు ( మా అత్తగారికి , మామగారికి ) సేవ చేయటానికే వెళ్ళాడు అని అందరూ అనుకోవటమే .

7 comments:

విజయభారతి said...

రామయ్య మీతో ఏదో అనుబందం వుండి మిమ్మల్ని కలిసి వుంటారు. అందుకే మీ సేవలో తరించి మీ కుటుంబం లో మమేకమై జీవించి మరణించారు

పరిమళం said...

రామయ్య స్వామిభక్తి బాగానే ఉంది కానీండీ ...పాపం పిల్లలే ఎలావేగారో ..తలుచుకుంటే జాలేస్తుంది :) :)

మురళి said...

హమ్మయ్య సెట్టింగులు మార్చారన్న మాట.. మీ ఉసిరి కాయల గురించీ, ఊర్వశి గురించీ నా బ్లాగులో చెప్పేశాను కాబట్టి రిపీట్ చేయను.. సీతయ్య లాగే రామయ్య కూడా ఎవరి మాటా వినడన్న మాట. నాకు మా కొండమ్మ గుర్తొచ్చింది.. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో.. అయినా మేమంటే ఎంతో అభిమానం ఆమెకి..

మాలా కుమార్ said...

విజయభారతి గారు ,
అందరు అదే మాట అంటారండి .

మాలా కుమార్ said...

పరిమళం గారు ,
నిజమేనండి , మా పిల్లలు , మా మరిది పిల్లలు ఇద్దరు ,నలుగురిని మహా కట్టడి లో వుంచేవాడు . పిల్లలంతా ఇది మన ఇల్లా ? , రామయ్య ఇల్లా ? అనిగోలచేసేవారు . కాని ఇప్పుడు తలుచుకొని తెగ నవ్వుతుంటారు .

మాలా కుమార్ said...

మురళి గారు ,
ప్రతి సంవత్సరము , మా అత్తగారి , మామగారి ఆబ్ధీకం అప్పుడు , అందరూ మా రామయ్యను కూడా తలుచుకుంటారు !
మార్చాలిగదండి , మీ కామెంట్సే మాకు బలం మరి . థాంక్ యు .

జయ said...

రామయ్య మాత్రం చిరస్మరణీయుడే. బాగా గుర్తు చేశావ్.