Friday, November 13, 2009

మా అమ్మానాన్నలుఈ ఫొటో మా నాన్నగారి చిన్నప్పటిది . బహుషా అప్పుడు ఆయనకి ఐదారుసంవత్సరాలు వుండవచ్చు. మా తాతగారి దూరపు బందువు ఒకరు , మా బామ్మగారి తో , "వదినా , బాబుకు ( మా నాన్నగారిని బాబు అనే పిలిచేవారు .) నగలన్నీ వేసి తయారు చేసి ఇవ్వు , ఫొటో తీయిస్తాను " అన్నాడట. ఆవిడ నగలు వేసి చక్కగా ముస్తాబు చేసి వెంట పంపారట . ఆయన ఫొటో మటుకు తీయించి , నగలు తీసేసుకొని , రోడ్ మీద వదిలేసి చక్కా పోయాడట. అప్పట్లో మా తాతగారు , విజయవాడ టు నందిగామ ప్రైవేట్ బస్సులు నడిపించేవారట . విజయవాడనుండి వస్తున్న ఓ బస్ డ్రైవర్ , రోడ్ మీద ఏడుస్తున్న మా నాన్నగారిని చూసి , అరే ఓనర్ గారి అబ్బాయిలా వున్నాడే అనుకొని బస్ ఆపి , నాన్నగారిని ఎక్కించుకొని , తీసుకొచ్చి ఇంట్లో వొప్పచెప్పారట !


మానాన్నగారు , చిన్నప్పుడే పరిస్తితులవలన , చదువు కొరకు , నల్లగొండ లో హాస్టల్ లో చేరారట. ఇక అప్పటి నుండి నాన్నగారి ఒంటరి పోరాటం మొదలయ్యింది . అప్పుడే పరిచయం అయ్యారు , అన్నమాచారి మామయ్య గారు . ఆయనే మా నాన్నగారి ఆత్మీయుడు , ఆప్తుడు , సహోదరుడు అన్నీనూ . ఇద్దరు కలిసే చదువుకున్నారు .. ఒకేసారి , 17 సంవత్సరాలకే , రాయచూర్లో తుంగభద్ర ప్రాజెక్ట్ లో సూపర్ వైజర్ గా చేరారు . పెళ్ళి కూడా ఇద్దరికీ ఇంచుమించు ఒకేసారి జరిగింది . చివరి వరకు ఒకే చోట కలిసేవున్నారు . బహుషా భగవంతుడు అలా ఓ ఆత్మీయుని తోడు ఇచ్చాడేమో ! కాని అదీ ఎక్కువ రోజులు వుంచలేదు . చారి మామయ్య గారిని ఆయన 50 వ సంవత్సరానికే తన దగ్గరికి తీసుకెళ్ళాడు . కాని మా కుటుంబాల మధ్య ఇప్పటికీ చెదరని ఆత్మీయతాబంధం అలానే వుంది . నా పెళ్ళి లో బావమరిది డ్యూటి , మా అమ్మాయి పెళ్ళిలో మేనమామ డ్యూటీ చేసింది వారి అబ్బాయిలు ఆనంద్ , విజయ్ లే .వారి అమ్మాయి సత్య , మేమూ ఒకే కుటుంబపు అక్క చెళ్ళెలలా వుంటాము . . ఇప్పటికీ వైదేహి అత్తయ్య , మా అమ్మా ఒకే ప్రాణం గా వుంటారు .మా నాన్నగారు స్వతహాగా చాలా తక్కువగా మాట్లాడేవారు . ఎపుడూ ఏదో ఆలోచనలో వుండేవారు . ఆయనకు అసలు కోరికలనేవి వున్నాయా అనిపించేది . మమ్మలిని ఎప్పుడూ కోపం చేసిన గుర్తు కూడా లేదు . ఒక యోగి లా వుండేవారు . నా పెళ్ళి తరువాత ఎప్పటికో నాకు నాన్నగారి తో చనువు ఏర్పడింది . మా వారితో మటుకు ఒక స్నేహితునిలా వుండే వారు . మామా అల్లుళ్ళు కలిసి సినిమాలకు వెళ్ళేవారు .ఇక అమ్మ విషయానికి వస్తే , కరణం గారి పెద్ద అమ్మాయిగారు . ఇంట్లో నుండి బయటకు కదలటాకి లేదు . మరి పుస్తకాలలో , సినిమాలలో చూపించే పల్లెటూరి పిల్లల సంబరాలు తనకేవీ తెలీదుట ! పైగా 11 సంవత్సరాలకే దొంగ పెళ్ళి ! అంటే ఏమీ లేదు , అమ్మ పెళ్ళప్పుడు , శారదా ఆక్ట్ అమలు లో ( పెద్దమనిషి కాని ఆడపిల్లకు పెళ్ళి చేయకూడదు అనే రూల్ ) వుండటము వలన విజయవాడలో ఓ సత్రములో దొంగతనముగా పెళ్ళిజరిపించారన్న మాట. అమ్మ , నాన్నగారి పెదమేనమామ కూతురు . అమ్మ లోకాన్ని చూసింది మాలతీ చందూర్ పుస్తకాలలో . చదువు అంటే చాలా ఇష్టము . ఇప్పటికీ ఏ వో గ్రంధాలు చదువుతునే వుంటుంది .


,

మా నాన్నగారికి చదువులో ఎప్పుడూ మొదటి రాంకే ఉండేది. చాలా తెలివైన వాళ్ళు.నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో చాలా ముఖ్యమైన దశలో అక్కడ ఇంజినీర్ గాపనిచేసారు. లంచగొండి తనమన్నది మా నాన్నగారికి తెలియదు. ఆ రోజుల్లో ఎంతోమంది ఇంజినీర్లు,హైదరాబాద్ లో స్తలం కొని ఇళ్ళు కట్టుకుంటు మానాన్నగారిని కూడా ఇక్కడ స్థలం తీసుకో మన్నారు. తను అక్కడ స్థలం కొనేస్థాయిలో లేనని అనేవారు. ఒక పెద్ద ఇంజినీర్ అయిఉండికూడా చివరి వరకు సొంతఇల్లు లేని ఇంజినీర్ ఆ రోజుల్లో ఒక్క మా నాన్నగారే. మా నాన్నగారుఅనుసరించే నీతినియమాలకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. తోటి వాళ్ళంతా ఎంతో గౌరవించేవారు. రిటైర్ అవ్వటానికి ముందుగా ఖమ్మంలో మాత్రం ఒక చిన్న ఇల్లుకట్టుకున్నారు. అందులో కూడా కాంట్రాక్టర్స్ మోసం చేసారు. అయినా ఎవ్వరినీ,ఏనాడు ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడి ఎరుగరు. రిటైర్ అయిన తరువాత కూడామా నాన్నగారు ఏనాడు ఊరికే కూర్చోలేదు. అంతవరకు తనకు పరిచయమే లేనిజ్యొతిష్య శాస్త్రాన్ని, స్వయంగా ఎన్నో గ్రంధాలు చదివి, ఎందరో పండితులనుకలిసి నేర్చుకున్నారు. పూర్తి పరిపక్వత పొందారు. అందరికి ఉచితంగాజ్యోతిష్యం చెప్పేవారు. ఎక్కడెక్కడినుంచో, ఎందరో ఒచ్చి మా నాన్నగారిదగ్గిర జ్యొతిష్యం చెప్పించుకునే వారు. ఏనాడు ఎవరి దగ్గిర ఒక్క పైసా కూడాతీసుకోలేదు. చివరికి ఎంత స్థాయికి ఎదిగారంటే, జ్యొతిష్య సమావేసాలకుఆహ్వానించే వారు. ఢిల్లీ లో అంతర్జాతీయ సమవేశాలకు కూడా అహ్వానించారు.ఎన్నో సన్మానాలు పొందారు. చక్కటి ఉపన్యాసాలు ఇచ్చే వారు. అప్పటి ఆ ఫొటోలేఇప్పడు మాకు మిగిలిన తీపిగుర్తులు.


మా అమ్మ కూడా ఎప్పుడూ మా నాన్నగారిని అనుసరించే ఉండేది. మా నాన్నగారికిఒచ్చే తక్కువ జీతం లోనే మా మామయ్యలకు చదువు చెప్పించారు. మా పెద్ద మామయ్యసంస్కృత పండితుడవ్వటానికి మూల కారణం మా అమ్మా, నాన్నగారే. మా అమ్మ తరువాతమా ఇంట్లో ఒక పెద్ద గ్రంధాలయాన్నే ఏర్పాటు చేసింది. మేము ముందుగా పుస్తకాలు చదివింది మా అమ్మ లైబ్రరీ లోనే. మా అమ్మకు చదువంటే చాలా ఇష్టం.చిన్నప్పుడు చదువుకోలేక పోయినందుకు ఎంతో బాధ పడేది. మా నాన్నగారు మాఅమ్మతోటి అప్పుడు మెట్రిక్ పరీక్ష రాయించారు కూడా. మా పెద్ద మామాయ్యవొచ్చినప్పుడల్ల, అమ్మ కి మామయ్యకి సాహిత్య గోష్టి జరిగేది. మా మామయ్య మాఇంట్లోని ఒక అల్మైరా నే బోర్డ్ గా చేసి ఎన్నింటినో మా అమ్మకి నేర్పించేవాడు. కళా పూర్ణోదయం వంటి గ్రంధాలను చదివింది. మా అమ్మ స్వయంగా రామాయణంకూడా రాసుకుంది. దానిగురించి నేను ఇప్పటికే మీకు పరిచయం చేసాను.మా నాన్న గారితోటి అప్పుడు రేడియో లో జరిగే సమష్యా పూరణం కార్యక్రమాలకిపద్యాలను వ్రాయించి పంపించేది. మా తల్లి దండ్రుల గురించి మేము ఎంతచెప్పినా అది తరగని సముద్రం. వారికి పిల్లలవటం మా పూర్వ జన్మ సుకృతం. మానాన్నగారిని తొందరగా కోల్పోవటం మా దురదృష్టం.

నేను కూడలి లో చేరిన కొత్తలో , ఒక బ్లాగ్ లో మీ తలితండ్రుల బాల్యము గురించి మీకు తెలుసా ? అన్న ఆర్టికల్ చదివాను . ఏ బ్లాగో గుర్తులేదు . ఈ రోజు మా నాన్నగారి జన్మదిన సంధర్భముగా ,అప్పుడు నాలో కలిగిన ఆలోచనలకు రూపమే మా ఈ మాల - జయ ల భావాల కలయిక .

15 comments:

శ్రీలలిత said...

మనం చూసిన అమ్మానాన్నలు వేరు. మనం చూడని వారి బాల్యం వేరు. అలాంటి మీ నాన్నగారి బాల్యాన్ని మీరిద్దరూ చక్కగా చెప్పారు. వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

పరిమళం said...

మాలా గారు , తల్లితండ్రుల బాల్యాన్ని తలచుకోవడం ఎంత మధురమో .....నేనూ ఇప్పటికీ నాన్నగారిచేత చెప్పినవే మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకుంటాను.అన్నట్టు మీరన్నది ....http://anu-parimalam.blogspot.com/2009/03/blog-post_18.html ఈ టపా గురించి కానీ కాదుకదా ?
నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు !

జయ said...

My Father,
My father is my friend...
A friend is
A guide, when you are lost;
An answer, when you are puzzled;
A smile, when you are sad;
A success, when you are failed;
A bright spot, when you are depressed;
A challenge, when you are disappointed;
A relief, when you are at a loss and above all,
"A friend in need is a friend indeed".
A loss of main is....now I have no friend!!!

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

పరిమళం గారు ,
మీ బ్లాగేనండి . కాని ఇది కాదు , నిన్న - నేడు - రేపు . అందులో కొత్తపాళి గారు , అడిగారు , మీ తల్లి ,తండ్రుల బాల్యం గురించి మీకుతెలుసా ? అని . అది చదివిన్నప్పుడు , మొన్న - నేడు అని మా అమ్మనాన్నగారి గురించి , మా గ్రాండ్ చిల్డ్రన్ గురించి రాద్దామనుకున్నాను . కాని అలాగే వుండి పోయింది ! నేనూ వీలైనప్పుడల్లా మా నాన్నగారిని , ఆయన చిన్నతనం గురించి అడుగుతూ వుండే దాన్ని . ఇప్పుడు కలుసుకున్నప్పుడల్లా , మా అత్తయ్యని అడుగుతుంటాము . ఎన్ని సార్లు విన్నా కొత్తగానే వుంటుంది .గుర్తు చేసినందుకు , అంత మంచి పోస్ట్ రాసినందుకు చాలా థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

జయ ,
పోస్ట్ లో రాయటమే కాకుండా కామెంట్లో కూడా రాసావు . చాలా బాగా రాసావు . అవును ఎంత చెప్పుకున్నా , చెప్పాల్సింది ఇంకా వుండి పోతుంది .

భావన said...

చాలా బాగుంది మాల గారు. ఆ కొమ్మ కు పూవులు కాబట్టే మీకు జయ కు ఇంత మంచి సాహిత్య శోభలు, సంస్కారపు సుగంధాలు అబ్బేయి.. మీ నాన్న గారి గురించి చదువుతుంటే మన వాళ్ళు నిర్వచించిన విధార్ధి, బ్రహ్మచర్యము, గృహస్తు, వానప్రస్త జీవితానికి నిర్వచనాలు చదువుతున్నట్లు వుంది. అదృష్ట వంతులు.. మీతో పరిచయ భాగ్యానికి మాది కూడా ఆ అదృష్టం..

భావన said...

జయ ఎంత బాగా రాసేవమ్మా. కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి..

మురళి said...

చాలా చాలా బాగుందండీ.. పెద్దవాళ్ళ గురించి యెంత తలచుకున్నా ఇంకా ఏదో మిగిలిపోతూనే ఉంటుంది.. జయ గారూ మీ వ్యాఖ్య కదిలించింది..

జయ said...

ఏం లాభం భావనా! మా నాన్నగారేరి? దేవుడికెందుకో అంత కుళ్ళు. మాకు సేవ చేసుకునే భాగ్యం లేకుండా, తనకోసం తీసుకెళ్ళి పోయాడు. God is too selfish ...కదా! ( అక్కా, నీ బ్లాగ్ లోనే రాసేస్తున్నాను.)

జయ said...

తల్లి తండ్రుల పట్ల ఏ పిల్లలకైనా ఇవే భావాలు కదండి మురళి గారు. మీ నాన్నగారి గురించి మీరు రాసిన ఎన్నో విషయాలు అప్పుడప్పుడు తిరిగి చదువుకుంటూ ఉంటాను నేను. అప్పుడు, ఎంత హాయిగా అనిపిస్తుందో. (అక్కా, ఇది కూడా నీ బ్లాగ్ లోనే!)

మాలా కుమార్ said...

జయ ,
అమ్మా నాన్నగారి గురించి ఇద్దరము కలిసి నా బ్లాగ్ లోనే రాసాము కాబట్టి , నువ్వు రిప్లై ఇవ్వచ్చు .

సుభద్ర said...

మన పెద్దలు మనకి నేర్పిన మాటల తో మన౦ వాళ్ళ గురి౦చి ఏ౦ చెప్పిన మనకి తనివి తీరదు..వాళ్ళకి "మా అమ్మ ,మా నాన్న" అని మన౦ తలుచుకు౦టే చాలు పులమారుతు౦ది.
మీ అమ్మగారి సాహిత్యాభిలాష గురి౦చి చదువుతు౦టే చాలా ఆశ్చర్య౦ ఆన౦ద౦ కల్గి౦ది.
మీ నాన్న గారిని మీ కోల్పోయిన౦దుకు చాలా బాధగా ఉ౦ది..దేవుడు ఎప్పుడు ఎప్పుడు అ౦తే మన౦ అపురుప౦ అనుకున్నవన్ని తనకి కావాలి అనుకు౦టాడు.
జయగారు:మీరు రాసి౦ది చదువుతు౦టే మాటలో చెప్పలేని భావ౦ కల్గి౦ది.
మెత్తానికి మీ ఇద్దరు చాలా చాలా మ౦చి పని చేశారు,మీ నాన్న గారి ,అమ్మ గారి గురి౦చి మాతో ప౦చుకున్న౦దుకు ధ్యా౦క్స్.

K Phani said...

mottam meeru raasina annitilo neenu coment raayalekhapotunnadi idi okkate anukontunna,meemu kuda maanaanna anni anubhavincha kundaa vellipoyaaru anedi maa akka chellellamu taluchukuntu bhadha [cheppaleni]padutuntaamu.ikkada taluchukotaaniki okkadaanne vunna eduposte vuradinche vaallu leru anduke chala time tisukoni raastunnaanu .evarini enta taluchukonna ammaa naannani taluchukone aanandame veregaa vuntundi .bhagaa raasaaru.

మాలా కుమార్ said...

పణి ,
మనసును భారం చేసేసావు .