Tuesday, July 20, 2010

సొరకాయ చాట్

పాము పగ పట్టినట్లు ఈ సొరకాయ వంట లేమిటి రా బాబూ , అని అనుకుంటున్నారా ? ఏం చెయ్యను చెప్పండి ? మొన్నటికి మొన్న సొరకాయ టిక్కీ తో ఐపోయిందనుకున్నామా , మళ్ళీ ఇంత బేద్ద సొరకాయా , నా తలకాయంతది , బిర బిర దొర్లుకుంటూ వచ్చేసింది . ఆ పోదురూ , దాంతట అది వచ్చేస్తుందే మిటి ఎవరో తెచ్చేవుంటారు అంటున్నారా ? నిజమేనండి , కాని మీరూహిస్తునట్లు గా , మావారు తెచ్చారు అని చెప్పటము లేదు . నాకు తెలుసు లెండి నేనలా చెప్పగానే , ఈ మధ్య మీవారిని ఆడిపోసుకోవటం ఎక్కువైంది ఆయ్ అని అరుద్ధామని చూస్తున్నారా ? ఆ చాన్స్ మీకివ్వనుగా ! పాపం ఈ సారి సొరకాయ రావటము లో మా ఆయనగారి హస్తం ఏమాత్రం లేదండి . పొద్దున్నే పిల్లలు వస్తున్నామని కాల్ చేసారా ? చేసారు కదా ! సరే ఏమైనా చేద్దామంటే ఇంట్లో కూరలు లేవు . మరెలాగా అనుకుంటూ వుంటే , మా పనమ్మాయి , ఈ రోజు కమల్ స్టోర్ వాలా కూరలు తెచ్చాడమ్మా అంది . ఓహో అనుకొని , కమల్ స్టోర్ కు కాల్ చేస్తే , ఒక్క సొరకాయ మాత్రమే వుందమ్మా అన్ని కూరలూ ఐపోయాయి అన్నాడు . హుం ! ఇంకేం చేయగలను ? అదే తెమ్మన్నాను . విధివిలాసము ను ఎవరు తప్పించగలరు ? దేవుడు రాశినరాతను చెరప నాతరమా ? ఈ రోజు కూడా సొరకాయ తినే ప్రాప్తం నాకు , నేను చేసిన చాట్ చూసే భాగ్యము మీకు రాసి పెట్టివుంది . అంతే ఇందులో నా తప్పు కూడా ఏమీ లేదు . దీని తరువాత , సొరకాయ కోఫ్తా చేసి పెడుతాను ఏం ? అవును మరి సౌమ్య గారికి ప్రామిస్ చేసాను కదా ! ప్రామిస్ ను ఎలా బ్రేక్ చేస్తాను చెప్పండి .

ముందుగా ఖట్ మీట్ చట్నీ చేయటము చూద్దాం .

కావలసిన పదార్ధాలు ;
కర్జూరం పళ్ళు - 500 గ్రాములు ,
చింతపండు 100 గ్రాములు ,
రెంటినీ కలిపి నాలుగైదు గంటలు నానబెట్టాలి . ఆ తరువాత , కావలిసినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పిసకాలి . అందులో చెత్త , గింజలు లేకుండా , రవ్వ జల్లెడ లో పట్టాలి . అసలు , గింజలు లేని కర్జూరాలైతే శ్రేష్టం . ఆ తరువాత , కొద్దిగా రుచి చూసి ఎక్కువ పులుపు కనుక వున్నట్లైతే , బెల్లము ముక్కలుగా చేసి రుచికి సరిపడా , అందులో కలుపుకొని , మిక్సీ లో వేసి మెత్తగా చేసుకోవాలి . ఆ పైన కొద్దిగా జీలకర్ర పొడి కలుపు కోవాలి . అంతే .
ఈ చట్నీ ఫ్రిజ్ లో వుంచుతే కనీసం ఆరునెలలైనా పాడుకాకుండా వుంటుంది .

తరువాత కావలసినది , గ్రీన్ చట్నీ ;
దానికి కావలసిన పదార్ధాలు ;
పుదీన ,
కొత్తిమీర ,
పచ్చిమిరపకాయలు ,
జీలకర్ర పొడి ,
ఆంచూర్ ,
ఉప్పు .
పుదీనా , కొత్తిమీర సమానంగా తీసుకోవాలి . పచ్చిమిరపకాయలు ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసు కోవచ్చు . ఈ మూడింటిని ని కలిపి , మిక్సీ లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి . తరువాత , ఉప్పు , జీలకర్ర పొడి , ఆంచుర్ వేసుకొని బాగా కలుపుకోవాలి . ఒకవేళ ఆం చూర్ లేక పోతే నిమ్మకాయ రసం కలపొచ్చు . కాని అది ఎక్కువ రోజులుండదు .
సరే ఖట్ మీట్ చట్ నీ , గ్రీన్ చట్నీ రెడీ అయ్యాయిగా . ఒక ఉల్లిపాయ , కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వుంచు కోవాలి .
ఓ కప్ పెరుగు , ఉండలు లేకుండా గిలక్కొట్టి , అందులో , ఉప్పు , చాట్ మసాలా పొడి , కొద్దిగా పంచదార , కొద్దిగా జీలకర్ర పొడి కలుపు కోవాలి .

సొరకాయ టిక్కి లు కూడా చేసేసుకొని ,

అన్నీ ఇలా సద్దు . . . . .

' అరే ఏమిట్రా మేఘమ్మా , వుండు నేను కలిపిస్తానుగా .'

'యమీ యమీ బామ్మా , వుండు నేనే చేసుకుంటాను . '

అంతేనండి ఈ పిల్లలు . ఇలా అన్ని చూడగానే యమీ అంటూ ఇదో ఇలా తనే చేసుకొని , ఫొటో కూడా తీసింది మా మనవరాలు .


ఈ రెండు చట్నీలు చేసుకొని , ఇలా సాస్ బాటిల్స్ లలో వేసుకొని , ఫ్రిజ్ లో రెడీ గా వుంచుకుంటే బోలెడు చాట్ లు చేసు కోవచ్చు .

సొరకాయ టిక్కి బదులు , ఆలు టిక్కి చేసు కోవచ్చు . లేదా సమోసా , కచోరీ , లేదా రెండు ఆలు గడ్డలు ఉడకపెట్టుకొని అవి . వాటిమీద , ఖట్ మీట్ చట్ నీ , గ్రీన్ చట్నీ , పెరుగు , ఉల్లిపాయముక్కలు . కొత్తిమీర ఇలా డ్రెసింగ్ చేసుకుంటే , ఎందులో వేస్తే ఆ చాట్ తయార్ . అంతే కాదు , చపాతి నైన పూరీనైన పెద్ద పెద్ద ముక్కలు గా చేసి , వాటి మీద ఈ చట్నీలు , పెరుగు , ఉల్లిపాయ ముక్కలు , కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ గావుంటుంది .

ఏవీ లేక పోతే మురమురాలు , కాస్త చుడవా కలుపుకొని , ఉల్లిపాయ ముక్కలు , కొత్తిమీర , , ఈ రెండు చట్నీలు కలిపేస్తే భేల్ పూరీ రెడీ .

నల్ల శెనగలు నానేసుకొని , ఉప్పేసి ఉడకబెట్టి , రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టి , పొట్టు తీసేసి , చిన్న ముక్కలుగా చేసుకోవాలి , గ్రీన్ చెట్నీ ని నీళ్ళలో వేసి , పలచగా కలుపుకోవాలి . అందులో కొద్దిగా పానీ పూరీ మసాలా వయాలి . పానీపూరీ , పూరిలు తెచ్చుకొని , అందులో ఈ నల్లశెనగలు , ఆలు ముక్కలు , ఖట్ మీట్ చట్నీ వేసుకొని , పానీపూరీ నీటి తో తినేయటమే .

అలా ఈ రెండు చట్నీల తో , కాదేది చాట్ కు అనర్హం అనుకొని , ఏదైనా చేసుకోవచ్చు . మన చాటూ , మన ఇష్టం !

2 comments:

ఆ.సౌమ్య said...

అబ్బబ్బబ్బా ఎన్ని వంటలో సొరకాయతో! మాలగారు మీరు సూపరండీ....నాకోసం ఎన్ని వంటలు చెబుతున్నారో, సొరకాయ టిక్కి అదిరిపోయిందనుకోండి...ఆలూ టిక్కీ కంటా నాకు ఇదే నచ్చేసింది. ఇప్పుడూ ఈ చాట్ ట్రై చెయ్యాలి.

అదేంటండీ "సొరకాయ తినే ప్రాప్తం" అని నీరసంగా చెప్తున్నారు? అదృష్టం అని ధైర్యంగా చెప్పండి :D

భావన said...

ఈ రెండు చట్నీ లూ బాగున్నాయి మాలగారు. ఎంచక్క గా చేసి పెట్టుకోవొచ్చు మా అబ్బాయి కి సమోసాలోకి.