Tuesday, July 6, 2010

రాకోయీ అనుకోని అతిధి

పక్క తలుపు వంటింటి తలుపు వేసి వుంచు మాలా అన్నది మా ఫ్రెండ్ ప్రేమ . కుక్కలొస్తాయని అంటుందేమో అనుకుంటూనే దేనికి అని అడిగాను . ఏమిలేదు అప్పుడప్పుడు పాములొస్తాయి అందుకని అంది . వెంటనే ఎలర్ట్ ఐపోయి , పాములా అని భయం భయం గా అడిగాను . మీదగ్గర రావులే మా ఇంటి వెనుకంతా అడవి కదా అందుకే అందుకే మా ఇంటిని అప్పుడప్పుడు విజిట్ చేస్తూవుంటాయి . భయం లేదు , నేనొక నంబర్ ఇస్తాను . పాము రాగానే వాళ్ళకి కాల్ చేస్తే పది నిమిషాలలో వచ్చి పట్టుకెళుతారు అంది . అప్పటికే నా మొహం , గొంతు మారి పోయి , ఇంట్లోకి కూడా వస్తాయా అని అడిగాను . ఇంట్లోకెందుకొస్తాయి ? ఐనా ముందు జాగ్రత్త గా ఎప్పుడూ తలుపులేసి వుంచు అని ఓ సలహా పడేసింది .

ఎరక్క పోయి ఇక్కడికి వచ్చానురా దేవుడా అనుకుంటూ పొద్దున షకీలా రాగానే , షకీలా ఇక్కడ పాములొస్తాయా అని అడిగాను . ఇటువైపు రావమ్మా . అటుపక్కనంతా అడవి కదా అటొస్తాయి . అక్కడ నేను పనిచేసే అమ్మా రోజూ రాత్రీ , ఓ గిన్నెలో పాలు , ఓ గుడ్డు వెనకవైపు జాగా లో పెడుతుంది . పామొచ్చి తాగి , తిని వెళుతుందిట అంది . ఓరి నీ భక్తి తగలెయ్య అనుకొన్నాను . ఐనా పక్కింటి సర్వమంగళ గారిని అడిగాను , ఇక్కడ పాములొస్తాయాండి అని . ఆవిడ ఎబ్బె లేదండి , ఇటువైపు మనుషులు తిరుగుతుంటారు కదా అందుకే రావు . పదిహేను ఏళ్ళనుండి ఇక్కడ వున్నాము . ఎప్పుడూ పాము రాలేదు అంది . ఐనా నా భయం నాది . పై ఇంటి పద్మ గారినడిగాను . ఏమోనండి , మేము ఇరవైదు సంవత్సరాలనుండి వున్నాము . మావారు , ట్రాన్స్ఫర్ ల మీద వెళుతుంటే నేనొక్కదాన్నే పిల్ల ల చదువుకోసం ఇక్కడే వున్నాను . ఎప్పుడూ ఇక్కడ పామును చూడలేదు . ప్రేమా వాళ్ళి ఇల్లు కాలనీ చివరకు వుంది కదా . పైగా ఆవైపు అడవి లా వుంటుంది . అందుకే అటొస్తాయి అంది . ఐనా ఏమిటో ప్రేమను చూడగానే పాము గుర్తొస్తుంది . ఈ రోజు మీ ఇంటి వైపు పాము గారొచ్చారా అని అడుగుతాను . ఓ సారి మాజాంగ్ ఆడుతున్నప్పుడు , అరుణ టీ తేవటాని కి లోపలికెళ్ళినప్పుడు అడిగాను . వెంటనే ఠప్ మని నెత్తినొకటి వేసింది . రోజూ రావటానికి అదేమైనా నా చుట్టమా ? ఫ్రెండా ? పదేళ్ళలో ఒక్క సారి వచ్చింది . పొరపాటున చెప్పాను . ఇక నన్ను వదిలేయి తల్లీ అని ప్రేమ చేతులు జోడించింది ! ఇంతలో అరుణ వచ్చి ఎందుకు , ఏమైంది అన్నది . అరే దిస్ మాడ్ గర్ల్ ఈజ్ ఈటింగ్ మై బ్రేన్ అని విషయం చెప్పింది . అంతే అరుణ , ప్రభ , ప్రేమ అందరూ కలిసి , ఓ అరగంట , హిందీ లో , ఇంగ్లీష్ లో ఇంకా అన్ని భాష లలో క్లాస్ పీకారు !

ఈ పాము గోల తోటే ఠారెత్తి పోతుంటే , మొన్న పొద్దున్నే , జహీరా పని లోపలికొస్తూనే , అమ్మా పీచేకా , యే బాజూ కా దర్వాజా హమేషా బంధ్ రకనా . ఆజ్ ఏక్ బందర్ కాల్ని మే ఘూం రై . అభి మై కాం కర్ రైనా ఉదర్ ఆయీ అని చెప్పింది . ఇదెక్కడి గొడవరా నాయానా !! అప్పటినుంచి ,రాత్రి పడుకునే ముందు ,
రాకోయీ అనుకోని అతిధి ,
నీకై తలుపులు తీసి ,
రెడ్ కార్పెట్ పరచి ,
వాకిట మంగళ హారతి తో సిద్ధం గాలేను . అని పాడుకుటూ పడుకుంటాను !!!
అవి నెట్ చూస్తాయేమో నని నా జి మేయిల్ దగ్గర , రాకోయీ అనుకోని అతిధి అని మెసేజ్ కూడా పెట్టాను . కాక పోతే ఆ మెసేజ్ చూసి నా చాట్ ఫ్రెండ్స్ , వాళ్ళనేమో ననుకొని అపార్ధం చేసుకున్నారనుకోండి . అది వేరే విషయం .
పొద్దున్నే పేపర్ వాడు , పాలవాడు బెల్ కొట్టగానే , పడగ విప్పి వూపూతూ బుసకొడుతూ పాము గారు , తోకూపుతూ కిచ కిచ లాడుతూ కోతిగారు ' హాయ్ మాలా గుడ్ మార్నింగ్ ' చెపుతాయేమోనని భయం తో , చిన్నగా తలుపు తీస్తూ అటూ ఇటూ చూసి , పేపర్ , పాల పాకెట్ ఘభుక్కున తీసుకొని తలుపేసేస్తాను .

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ** * * * * * * *


సీరియస్ గా పని చేసుకుంటున్నాను . గిన్నెల చప్పుడు వినిపించింది . పక్కింట్లో నేమో అనుకున్నాను . కొద్ది క్షణాలయ్యాక ఇంకా ఎక్కువగా దబ దబా మూతలు పడేస్తున్న చప్పుడొచ్చింది . పనిమనిషి వెళ్ళిపోయాక , తలుపులు వేసుకొనే వచ్చానే . ఏమిటా చప్పుడు చూద్దాం అనుకుంటూ బయటకి వచ్చాను . ఎదురుగా కనిపిస్తున్న దానిని చూసి నిశ్చేష్టనై పోయాను . ముందుకు తూలి పడబోయి , రేలింగ్ ను గట్టిగా పట్టుకొని ఆపుకున్నాను . అలాగే కొద్ది క్షణాలు చూస్తూ . . . వుండి పోయాను !!!

ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర , కుర్చీలో కూర్చొని ఓ కోతి హాయిగా ఓ చేత్తో చపాతి తింటూ , ఇంకో చేత్తో బాటిల్ లోని నీళ్ళు తాగుతూ కనిపించింది ! టేబుల్ మీదంతా , చపాతీ ముక్కలు , అన్నం , కూర , పప్పు వెదజల్లి వున్నాయి . అన్ని గిన్నెల మీది మూతలు అటూ , ఇటూ పడి వున్నాయి . నీళ్ళన్నీ కింద ఒలికి పోయాయి . రూం అంతా ఖంగాళీ గా వుంది . నేను అలా చూస్తుండగానే చేతిలోని చపాతి కిందపడేసి , ఇంకోటి తీసింది . దాన్ని కొంచం రుచి చూసి పడేసింది . అలా ఇంకా ఇంకా అన్ని తీసేసి పడేస్తొందే కాని తినటం లేదు . నేను తేరుకొని , మల్లేష్ , మల్లేష్ అని పిలిచాను . మల్లేష్ , మహేష్ ఇద్దరూ పైకి వచ్చారు . కాని వాళ్ళూ అలాగే దాన్ని చూస్తూ వుండి పోయారు . ఇహ తప్పదనుకొని , పక్కనే పిల్లల బాట్ వుంటే దాన్ని తీసుకొని కింద కొడుతూ ఉష్ ఉష్ అన్నాను . అప్పుడు ఆ కోతి మమ్మలిని చూసి వంట ఇంట్లోకి పరిగెత్తింది . అక్కడి నుండి దానికి వెళ్ళేదారి లేక నిలబడి పోతే పక్క తలుపు తీసాము . వెళ్ళి పోయింది . ఆ తరువాత రూం తుడుచుకునేసరికి నీరసమొచ్చి , తిందామన్నా ఏమిలేక పోయాయి అని చెప్పటం ముగించింది , మా కోడలు అను .

నువ్విక్కడ కోతొస్తుందని ఎదురుచూస్తున్నావు , అక్కడ నీ కోడలి దగ్గరకి వచ్చింది అని నిన్న మావారు చెప్పగానే ఏమిటో సంగతి కనుకుందామని గౌరవ్ ను తీసుకొని శ్రీనగర్ కాలనీ వచ్చాను . నేనూ , గౌరవ్ అడిగి అడిగి మరీ చెప్పించుకున్నాము . ఆ సమయము లో మేము లేక పోయామే అని విచారించాము ! కనీసం ఫొటో ఐనా తీయొద్దా అనూ , మేమూ చూసేవాళ్ళము కదా అంటే , పొద్దున కూడా వచ్చింది ఆంటీ . బ్రేక్ ఫాస్ట్ మొక్కజొన్నపొత్తు తిని వెళ్ళింది . అప్పుడు సరదా వేసి ఫొటో తీసాను , మీకు మేయిల్ చేస్తానులెండి అంది . అదీ సంగతి అలా చెప్పు , రెండు మొక్కజొన్న పొత్తులున్నాయ్ తిందువా అనినువ్వే పిలిచి వుంటావు . ఎంచక్కా నువ్వు కాల్చుకొని , ఉప్పూ , ఖారం , నిమ్మకాయ దట్టించి వుటావు . హాపిగా బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళింది . వంటావిడ సువర్ణ వంట నచ్చలేదేమో , అంతా వెదజల్లేసింది . మళ్ళీ డిన్నరు కొస్తుందేమో కాస్త రుచిగా వండమని చెప్పు , సువర్ణకి అన్నాను . ఐనా ఎలావచ్చింది మమ్మీ అని గౌరవ్ ప్రశ్న . వాడికేమిటో ఎన్ని ప్రశ్న లోస్తాయో ! బాదాం చెట్టు కొమ్మ మీద నుండి , వంట ఇంటి వెంటిలేషన్ లోనుండి వచ్చిందిరా . రాగానే గౌరవ్ , గౌరవ్ , మా ఫ్రెండ్ గౌరవ్ ఏడీ అని ఇల్లంతా వెతికింది . నువ్వేమో బామ్మ దగ్గర వున్నావు . నాకేమో ఎంత భయం వేసిందో అని కాసేపు వాడిని ఆట పట్టించింది .

6 comments:

పరిమళం said...

:) :)

hanu said...

saripoyimdi anDI..... chala baagaa raSaru

భావన said...

హి హి హి.... పాము పోయి కోతి వచ్చె ఢాం ఢాం ఢాం.. కోతి వచ్చి రొట్టే పోయే ఢాం ఢాం ఢాం.. రొట్టే పోయి నీరసం వచ్చె ఢాం ఢాం ఢాం... తొందరలోనే మీరు ఒక కోతి ను చూడ ప్రాప్తి రస్తు..

మధురవాణి said...

హమ్మో.. అలా పామోస్తుందని ఎవరన్నా చెప్తే ఇంక నేను తిండీ నీళ్ళు మానేసి మరీ గాభరా పడిపోగలను. నాకంత భయం పాములంటే! :( మీరు చెప్పిన కోతి సన్నివేశం నేరేశాను చూసి మీరేనేమో అక్కడ ఉంది అనుకున్నా! మీ అనూ చెప్పింది వినే మీరింత బాగా కళ్ళకి కట్టినట్టు చెప్పారన్నమాట! :-) మీ ఇంటికి ఓ కోతి రావాలని కోరుకుంటున్నా! అప్పుడు ఎంచక్కా ఫోటోలు తీద్దురు గానీ మీరు! ;-)

మాలా కుమార్ said...

పరిమళం గారు ,
ఈ మద్య చిరునవ్వులు కురిపిస్తున్నారే . థాంక్ యు అండి .

* హను గారు ,
థాంక్స్ అండి

మాలా కుమార్ said...

భావనా ,
కోతినే కదా చూడ ప్రాప్తిరస్తు అంటున్నారు . వేరే చూడట మెందుకండి , ఇదో చూస్తునే వున్నాను కదా .

*మధురవాణి ,
మా ఇంటికి కోతి రావాలని కోరుకుంటున్నావా ? అందుకేగా నిన్ను రమ్మని పిలిచేది . మరి ఎపుడొస్తున్నావో చెప్పు , కెమెరా చార్జ్ చేసి రెడీ గా వుంచుతాను .