Friday, October 9, 2020

సాలీ ఆధీ ఘర్ వాలీ!

 

సాలీ ఆధీ ఘర్ వాలీ!

మన కథలు- మన భావాలు గ్రూప్ లో ఇచ్చిన కథకు నేను రాసిన కొనసాగింపూ, ముగింపు. చుక్కలు ఉన్నంతవరు గ్రూప్ లో ఇచ్చిన కథ. ఆ తరువాతది నా కొనసాగింపు.

 

"ఏంటండీ అది!? చదవగానే అలా మ్రాన్పడ్డారు!?" చేతిలో కాఫీతో వరండాలోకి వచ్చిన విజయమ్మ, రెండు చేతులతో ఉత్తరం పట్టుకుని నించుండిపోయిన భర్త జనార్థనాన్ని చూస్తూ కంగారుగా అడిగింది.

భార్య వైపు అయోమయంగా చూస్తూ...

"అదేంటి విజ్జీ! నిశ్చితార్థం చేసుకున్నాక, మాకు మీ సంబంధం వద్దంటూ ఉత్తరం రాస్తాడేం ఆ నరసింహం!?" అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోతూ.

"అయ్యో!? ఇదేం అన్యాయం అండీ!? కారణం ఏంటట!?" ఆందోళనగా అంటూ, కాఫీ అక్కడ టీపాయ్ పై పెట్టి, ఆయన మోకాళ్ళపై చేయివేసి, కాళ్ళ వద్ద కూర్చుంది విజయమ్మ.

"అదేం చెప్పలేదే. 'మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వదలుచుకోలేదు. మీతో మాకే సంబంధం వద్దనుకుంటున్నాం.' అని మాత్రం రాసాడు." ఇంకా అయోమయం నుండి తేరుకోని జనార్థనం.

"హయ్యో! నేను చెబుతూనే ఉన్నా ముందు నుండి...! ఈ వేలు విడిచిన చుట్టరికాలంటూ సంబంధాలు ఖాయం చేసుకోకండి, బంధువులన్న మాటేగానీ, ఎప్పుడో పరాయి రాష్ట్రం లో స్థిరపడిన వాళ్ళ గురించి మనకేం తెలీదంటూ....!" సన్నగా రాగం తీయటం మొదలు పెట్టింది విజయమ్మ.

"కారణం చెప్పకుండా ఇలా చేయటం ఏంటసలు. ఊరంతా పిలిచి వేడుకగా నిశ్చయం చేసుకున్న సంబంధం. ఇప్పుడు ఎందుకు క్యాన్సిలయిందని అడిగవారికి మనం ఏం చెప్పాలి!? పిల్లాడిలో ఏం లోపం ఉందో అనుకుని ఇకపై మన వాడికి సంబంధాలు వస్తాయా!?" ఆందోళనగా అన్నాడతను.

"ఓరి భగవంతుడా!? ఇదేం ప్రారబ్ధం మాకు!? చక్కని పిల్లాడు. బ్యాంకీ మేనెజరూ. ఒక్కడే కొడుకు. ఉన్న ఒక్క ఆడపిల్ల, అక్కకు పెళ్ళి అయ్యి, పురుళ్ళు, పుణ్యాలు పూర్తయి, బాదరబంధీ లేని బతుకు వాడిది. ఒకరిని నొప్పించే మనస్తత్వం కాదు. ఒక్క దురలవాటు లేదు. పైగా మనమంటే పల్లెటూరిలో ఉన్నాం కానీ, వాడు ఉద్యోగం చేసుకుంటూ పట్నం లోనే ఉన్నాడు కదా! ఇక మన పిల్లాడిని వద్దనుకుంటున్న కారణం ఏంటి!?" చిన్నగా శోకాలు మొదలు పెట్టింది విజయమ్మ.

ఆలోచిస్తున్న జనార్థనం కాస్త తేరుకుని, అర్జంటుగా ఈ సంబంధం కుదిర్చిన మీ తమ్ముడు సూర్యాన్ని, మన అమ్మాయి లావణ్యను, ఆమె భర్తను, మన వంశోద్ధారకుడు రాహుల్ ను వెంటనే రమ్మని ఫోన్ చెయ్యి. విషయం చెప్పకు. వాళ్ళు వచ్చాక ఏం చేయాలో అంతా కలిసి నిర్ణయించుకుందాం." ఏదో నిశ్చయించుకున్నట్లు అన్నాడు అతను.

·        * * * * * * * * * * * * * * * * * * * *

లావణ్యా,అశీష్, సూర్యం హడావిడిగా లోపలికి వచ్చి , బయట నే వరండాలో వెనక కు చేతులు పెట్టుకొని అచార్లూ, పచార్లూ చేస్తున్న జనార్ధనం ను, కాఫీ కప్ పట్టుకొని లోపలి నుంచి వస్తున్న  విజయమ్మను చూసి కాస్త స్థిమిత పడ్డారు. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి  అర్జెంట్ గా రమ్మని, ఇంకో మాటైనా చెప్పకుండా ఫోన్ చేసావు. అప్పటికప్పుడు వీళ్ళిద్దరినీ కూడా తీసుకొని కార్ లో వచ్చేసాను ఏమైందక్కా ?" అడిగాడు సూర్యం.

ఏమీ జవాబు చెప్పకుండా భర్తవైపోసారి చూసి లోపలికెళ్ళి, ముగ్గురికీ కాఫీ లు తెచ్చి ఇచ్చింది. అప్పటికే జనార్ధనం సూర్యం కు ఉత్తరం చూపించి సూర్యం పై చెడుగుడాడేస్తున్నాడు. ఇంతలో కార్ వచ్చి ఇంటి ముందు ఆగగానే అటువైపు చూసారు అందరు. కార్ పార్క్ చేసి, పెరిగిన గడ్డం, లోపలికి పోయిన కళ్ళు, పీక్కుపోయిన మొహం, అరచేతికి బాండేజ్ తో నీరసంగా లోపలికి వచ్చిన రాహుల్ ను ఆశ్చర్యంగా చూసారు.

"రాహుల్ ఏమైందిరా? అట్లా ఉన్నావేమిటి?" దగ్గరికి తీసుకుంటూ గాభరాగా అడిగింది విజయమ్మ.

"ముందు వాడిని ఫ్రెషపై రానీయండి అత్తయ్యా చెపుతాడు" అన్నాడు ఆశీష్.

లోపలికెళ్ళి వచ్చి మౌనంగా అమ్మ దగ్గర కింద కూర్చుండిపోయాడు రాహుల్.

రాహుల్ జుట్టు ప్రేమగా నిమురుతూ " ఏమంది కన్నా ?" అడిగింది విజయమ్మ.

ఇంక ఆగే ఒపికలేక "నరసింహం మీ అబ్బాయి మాకొద్దు అని ఉత్తరం రాసాడు." అన్నాడు జనార్ధనం.

అభావంగా తలెత్తి చూసి, తెలుసన్నట్లు తలూపాడు రాహుల్.

"తెలుసా? అసలేమి జరిగింది ? నువ్వేం చేసావు?" ఇరిటేట్ ఐపోయాడు జనార్ధనం.

"నేను చెప్పలేను. చూపిస్తాను చూడండి." అని పైన తిరుగుతున్న ఫాన్ ను చూపించాడు రాహుల్. అందరూ ఫాన్ వైపు చూస్తుండగా అది తిరిగీ తిరిగీ వీళ్ళనోచోట ఆపింది!

పెళ్ళిచూపులలో చిలకాకుపచ్చ డ్రెస్ లో చిలకలా కనువిందు చేసి, నిశ్చితార్ధం రోజున రాణీకలర్ గాఘ్రా లో తన పక్కన రాణీలా మెరుపులు చిందించిన నిషా, కలలో రారమ్మని పిలుస్తుంటే ఆగలేకపోతున్నాడు. నిషాకనులదానా నన్ను నిషాలో ముంచేస్తున్నావు అని పాడుకునే విరహగీతాలు సాంత్వన కలిగించటము లేదు. ఇక ఉండలేక, పెళ్ళికి నెలరోజులు సెలవు తీసుకున్నావు, ఇప్పుడు వారం సెలవు కావాలంటే ఇవ్వనని చిందులు తొక్కుతున్న పిల్లిగడ్డం బాస్ ను చేతులూ, గడ్డమూ పట్టుకొని బతిమిలాడి, బాస్ గారి పెళ్ళిచూపులను గుర్తుతెచ్చి ఊహలలో తేలిస్తే  సెలవిచ్చేసాడు.  చలో ఢిల్లీ అని డిల్లీ లో నిషా ఇంటి ముందు వాలిపోయి బెల్ కొట్టాడు.

చేతిలో పిల్లి తో, జీన్స్ పాంట్ మీద లేత మబ్బురంగు టాప్ వేసుకొని, అలవోకగా జుట్టును వదిలేసి తలుపు తెరిచిన నిషాసుందరిని పరవశంగా చూస్తూ ఉండిపోయాడు. "వావ్ వాటే సర్ప్రైజ్." అని సంబరపడిపోతూ లోపలికి ఆహ్వానించింది నిషా. నిషాను పరవశంగా, నిషా చేతిలోని పిల్లిని భయంభయంగా చూస్తూ లోపలికి నడిచాడు. మిస్టర్&మిసెస్ నర్సింహం గారు చాలా ఆదరంగా  మాట్లాడారు.

" బేటీ   రాహుల్ ను నీ గదిలోకి తీసుకెళ్ళు. నేనిప్పుడే పదినిమిషాలల్లో వస్తాను." అని నిషా తో ,  "రాహుల్ బేటా లంచ్ చేసి వెళ్ళు. నాకు అర్జెంట్ గా వెళ్ళాల్సి ఉండి వెళుతున్నాను తొందరగానే వచ్చేస్తాను" అని రాహుల్ తో చెప్పి నరసింహంగారు బయటకు వెళ్ళారు.

మిసెస్.నరసింహం కాబోయే అల్లుడి కి వింధుభోజనం ఏర్పాటు చేసేందుకు వంటింట్లోకి వెళ్ళింది. సుతారంగా జుట్టును మునివేళ్ళతో సద్దుకుంటూ ముందుకు వెళుతున్న నిషాను మబ్బుల్లో తేలిపోతున్నట్లుగా అనుసరించాడు రాహుల్.

"వావ్ నీ గది ఎంత అందంగా పెట్టుకున్నావు" ఎదురుగా పిల్లిపిల్లను ఎత్తుకొని ఉన్న నిషా ఫొటోను చూస్తూ , మనసులోనే దేవుడా అని తల కొట్టుకుంటూ అన్నాడు.

" ఫొటో బాగుంది కదూ?" మురిపెంగా చేతిలోని పిల్లిపిల్లను నిమురుతూ అంది నిషా.

"ఊ చాలా బాగుంది. నీ పిల్లి  కూడా చాలా అందంగా ఉంది. ఆడపిల్లా మగపిల్లా?." నిషా చేతిలోని పిల్లిని చూస్తూ ఏదో మాట్లాడించాలనట్లు అడిగాడు.

" బేబీ గర్ల్. పేరు తోఫీ. తోఫీ జిజియాజీ కో హాయ్ బోలో ." తోఫీని నిమురుతూ అంది నిషా.

చేదుమాత్ర మింగినట్లు ఓ గుటకవేసి  " హాయ్ తోఫీ.  తోఫీ నాకు సాలీనా. సాలీ అధీ ఘర్ వాలీ." అని ఓ ఏడుపునవ్వు నవ్వాడు.

అంతే  కోపం తో ముక్కుపుటాలు అదురుతుండగా, "ఆ ఏమిటీ నీకు ఆధీ ఘర్ వాలీ కావాలా?" అని చివ్వున కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలుచుంది.

"నిషా, నిషా సరదాగా అన్నాను సారీ సారీ." అంటూ వెనుకనే వెళ్ళి నిషా చేయి పట్టుకోబోయాడు. ఆ చేయి తోఫీకి తగిలి అది  రాహుల్ స్పర్స భరించలేనట్లు కోపంగా చూసి కదిలింది. ఆ కదలటం లో నిషా చేతిలో నుంచి జారి, కిటికీ లో నుంచి కింద పడిపోయింది. నిషా కెవ్వ్ మని అరుస్తూ కిందికి పరిగెత్తింది. నిషా వెనుకనే రాహుల్ పరిగెత్తాడు. తోఫీ ది గట్టిప్రాణమేమో  కింద పడ్డా ఏమీ కాలేదు. కాస్త సొమ్మసిల్లింది. నిషా చేతిలోకి తీసుకోగానే కాస్త అటూఇటూ కదిలి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాహుల్ ను గుర్రున చూసింది. నిషా దానెత్తుకొని ఫ్లాట్ లోకి వెళ్ళిపోయి, వెనుకనే వస్తున్న రాహుల్ తో " నీ మూలంగా తోఫీ ఆపదలో పడింది. ఇంక నీ దగ్గర ఉంటే ఏమి చేస్తావో!  పైగా ఇంత బుజ్జిదాన్ని ఆధీ ఘర్ వాలీ అంటావా? ఇంక నీ మొహం నాకు చూపించకు." అని తలుపు వేసేసింది.

ఆగిన ఫాన్ తిరుగుతోంది.

"పిల్లికే అంత భయమేమిటి రాహుల్. అది నీకు ఆధీ ఘర్ వాలీ నా ? లంచ్ పోయే,వారం సెలవా పోయే. " పొంగివస్తున్న నవ్వును దాచుకునేందుకు సతమవుతూ అన్నాడు ఆశీస్.

"అలా జోక్ చేస్తే ఇష్టపడుతుందేమో అనుకున్నాను బావా. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు." దీనంగా జవాబిచ్చాడు.

"అదేం జోక్ రా. అంతా తగలేసావు." విసుక్కున్నాడు సూర్యం.

"అబ్బా మీరుండండి. అంతేగా పోతేపోయిందిలే. వెధవ పిల్లి గోల మనకెందుకు? మనకసలే పిల్లులూ, కుక్కలు పడవు. ఐనా అదేమిటిరా తమ్మూ అలా ఐపోయావు? చేతికి ఆ కట్టేమిటి?" అడిగింది లావణ్య.

" పిల్లిని అలవాటు చేసుకుందామని మా అపార్ట్మెంట్ దగ్గర ఒక పిల్లి పిల్లలను పెడితే దాన్ని ఎత్తుకుందామని పట్టుకున్నాను. పెద్ద పిల్లి వచ్చి చేతిని కరిచింది. ఇంజెక్షన్ తీసుకొని వచ్చాను. కాని అమ్మా నాకు నిషా కావాలి." అమ్మ వళ్ళో తల దూర్చాడు.

సెల్ రింగవుతుంటే జనార్ధనం ఎత్తాడు. అవతల నుంచి నరసింహం "బావగారూ ఏమనుకోకండి. పిల్లలేదో పిల్లి కోసం పోట్లాడుకున్నారు. అప్పటికప్పుడు మీ సంబంధం కాన్సిల్ చేసుకోమని నిషా గొడవ చేస్తుంటే ఫోన్ లో చెప్పలేక ఉత్తరం రాసాను. ఇప్పుడేమో రాహుల్ రోజూ చేస్తున్న ఫోన్ కాల్స్ కు కరిగిపోయింది. ముందు అనుకున్నట్లుగానే పెళ్ళి చేసేద్దాము." అంటున్నాడు.

అమ్మ వళ్ళో నుంచి తలెత్తి , రింగవుతున్న తన సెల్ ను చూసి "అమ్మా నిషా ఫోన్ చేస్తోంది." అని సెల్ ఆన్సర్ చేస్తూ చెంగున బయటకు పరిగెత్తాడు.

వెయ్యి ట్యూబ్ లైట్ల వెలుగుతో మొహం వెలిగిపోతుండగా నిషాతో మాట్లాడుతున్న రాహుల్ ను చూస్తూ " సరే కానీయండి." అన్నాడు జనార్ధనం.

 

2 comments:

Sri[dharAni]tha said...

यदि साली आधी घरवाली कहलाए तो फिर बीवी क्या कहलायेगी? माला जी, वाकई बात कुछ और हुई होगी, बीवी के रहते कभी भी साली के साथ ऐसी नख़रें कोई नहीं कर सकता, क्योंकि पति की टेडी उंगली यदि घी में अचानक रह भी जाये तो आग के ताप में उंगली को ही जला देगी और फिर वही उंगली पर शङ्कराभरणम चलनचित्र में दर्शाये गये गम गम गम गम की तरह मक्खन मल देंगी, व्यंग्य टिप्पणी

~श्रीता धरणी

Anonymous said...

ఇంతకీ ఇది తెలుగు సంబంధమా లేక నార్త్ఇండియన్ సంబంధమా? తెలుగు అయితే, ఆడపడుచు (భర్త చెల్లెలు, హిందీలో ननद) అర్థమొగుడు. నార్త్ఇండియన్ అయితే साली (భార్య చెల్లెలు) आधी घरवाली