Friday, October 16, 2020

నీ యెంటే నేనుంటా

 


మన కథలు- మన భావాలు గ్రూప్ లో ఇచ్చిన చిత్రం కు నేను రాసిన కథ-

#(చిట్టికథ)#


నీ యెంటే నేనుంటా


మొహానికి అంటుకున్న చెమటను చీరకొంగుతో తుడుచుకుంటూ వచ్చి చెట్టు కింద నిలబడి చుట్టూ చూసింది గౌరి. సూర్యుడు పడమటిదిక్కులకు పయనిస్తున్నాడు. ఎరుపు పసుపు కలిసిన ఆరెంజ్ రంగులో మెరిసిపోతున్నాడు. లేత ఆరెంజ్ రంగులో పరుచుకున్న సూర్యకిరణాలతో ఆకాశం ఆరెంజ్, నీలి రంగులలో మనోహరంగా ఉంది. చిరువేడి గాలులు వీస్తున్నాయి. పక్షులు చిన్నగా చప్పుడు చేసుకుంటూ గూళ్ళకు చేరే ప్రయత్నంలో ఉన్నాయి. సంధ్య అందాన్ని పరవశంగా చూస్తూ పొలం వైపు చూసింది. పొలం లో నిలిచి ఉన్న నీటిని కాలవలోకి మళ్ళిస్తూ పక్కనున్న రైతుతో మాట్లాడుతున్నాడు మహేష్. పైకి ఎగదోపి కట్టిన పంచ, తలకు కట్టుకున్న చిన్న రుమాలుతో గమ్మత్తుగా కనిపించాడు. చుట్టుపక్కల ఉన్న పొలల్లో వీళ్ళ వయసు వాళ్ళే కొంతమంది యువతీయువకులున్నారు. అందరినీ చూస్తుంటే గౌరి మనసు సంవత్సరం క్రితం కు జారుకుంది.

ఒక పేరు ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనిలో, ఒకే టీం లో పనిచేస్తున్నారు గౌరి, మహేష్. ఆ టీం లో ఉన్న పదిమంది అమ్మాయిలూ అబ్బాయిలూ అందరూ స్నేహంగా కలిసిమెలిసి వర్క్ చేసుకుంటూ వారాంతంలో ఏదైనా మల్టిప్లెక్స్ లోనో మరోచోటో ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఒక వారాంతం లో అందరూ కలిసి కాఫీ షాప్ లో ఉండగా " రోజూ పేపర్లో, వార్తలల్లో రైతుల ఆత్మహత్యల గురించి. అందరికీ మనము సహాయపడలేకపోవచ్చు కానీ కొంత మందికైనా మనము సహాయము చేయవచ్చుకదా అని ఈ రోజు పేపర్ లో ఒక రైతు గురించి చదివితే అనిపించింది." అన్నాడు మహేష్.

"అలాగే చేద్దాము. తలా కొంత మనీ వేసుకొని ఏ పేద రైతుకైనా ఇద్దాము" అన్నాడు శ్రవణ్.

"అలా కాదు. మనం ప్రతి వీకెండ్ ఇలా హోటల్స్ కు , సినిమాలకూ తిరుగుతూ మనీ, టైం రెండూ వేస్ట్ చేస్తున్నాము. అలా కాకుండా దగ్గరలో ఉన్న పల్లెటూరు కి వెళ్ళి, అక్కడి రైతు పొలం లో పని చేద్దాము. మనకు కూడా వ్యవసాయం లో ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి. ఇక్కడ నిపుణులను సంప్రదించి రైతులకు కావలసిన సలహాలు ఇద్దాము. మనము ప్రత్యక్షంగా చేస్తుంటే ఎవరికే అవసరమో మనకు తెలుస్తుంది " అన్నాడు మహేష్.

కొంత తర్జనభర్జనల తరువాత ప్రతి వారమూ కాకుండా రెండవ, నాలుగవ శని ఆదివారలల్లో వెళ్ళేట్టుగా అనుకున్నారు. ఆ విధంగానే దగ్గరగా ఉన్న ఒక పల్లెటూరిని ఎన్నుకొని, అక్కడి పేద రైతుల పొలం లో , రైతులతో పాటుగా పని చేసేందుకు వారిని ఒప్పించారు. అప్పటి నుంచి రెండవ, నాలుగవ శని ఆది వారాలల్లో అక్కడికి వచ్చి పొలంపనులు చేస్తూ రైతులకు సహాయంగా ఉంటున్నారు. ఆర్ధికంగా కూడా సహాయపడుతున్నారు. ఊరివాళ్ళు కూడా వీళ్ళను చూసి ముచ్చటపడి వీరిని ఆదరిస్తున్నారు.

నిన్న, మరునాటి ప్రొగ్రాం గురించి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి "రేపు అందరమూ సరదాగా పంచ కట్టుకొని వెళుదాము. అమ్మాయిలేమో చక్కగా చీరలు కట్టుకొని పల్లెటూరి అమ్మాయిల్లా తయారవండి" అన్నాడు.

ఇక్కడ నుంచి పంచ కట్టుకొని ఎట్లా వెళుదాము అంటే అక్కడి కెళ్ళి మార్చుకుందాము అన్నాడు. సరే ఇదీ సరదాగా బాగానే ఉంది అనుకున్నారు అందరూ. అలాగే ఇక్కడికి రాగానే అబ్బాయిలు షార్ట్స్ నుంచి పంచల్లోకి మారిపోయారు. అమ్మాయిలు చక్కగా చీర కట్టుకొని తయారయ్యారు. ఆలోచనల నుంచి బయటపడి మహేష్ వైపు చూసింది గౌరి. పొలం లో పనైపోయినట్లుంది రైతుతో కలిసి వస్తున్నాడు మహేష్. మహేష్ అంటే తనకున్న ప్రేమను, అతనితో జీవితాన్ని పంచుకోవాలన్న కోరికను మహేష్ చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతోంది. మహేష్ కు తనంటే ప్రేమ ఉన్నట్లుగా అతని కనులు చెపుతున్నాయి కాని  మరి ఎందుకు తనతో చెప్పలేకపోతున్నాడో తెలీటం లేదు. మహేష్ కు తనంటే ప్రేమ ఉందా లేక తనూహించుకుంటోందా? ఆలోచనలో ఉన్న గౌరి మహేష్ తన దగ్గరగా వచ్చి నిలబడగానే తత్తరపాటుగా చూసింది.

ఆకుపచ్చని చీర, ఎర్రని జాకెట్, వాలుజడ, నుదుటన గుండ్రని బొట్టు, మెడలో పూసలపేరు తో అచ్చమైన పల్లెపడుచులా ఉన్న గౌరిని మురిపెంగా చూస్తూ, చేతిలో ఉన్న ముద్దమందారం ను గౌరి జడలో పెట్టి, ప్రేమగా గౌరి చెంపలను పట్టుకొని తనవైపు తిప్పుకుంటూ "నన్ను మనువాడుతావా గౌరమ్మా?" అని అడిగాడు. అప్పటి వరకూ  అవే తలపులలో ఉన్న గౌరి సిగ్గుతో ముద్దమందారం లా ముడుచుకుంది.

హే హే హేయ్ అని అరుస్తూ స్నేహితులంతా చప్పట్లు కొడుతూ చుట్టూ చేరారు. రైతులందరూ సంతోషంగా వారి తో చేరారు.

"ఆకాశం లోనో, సముద్రం అడుగునో ప్రపోజ్ చేయలేను. పచ్చనైన చెట్లు, నీలి ఆకాశం, ఈ కమ్మనైన మట్టిసువాసనలు, అందమైన ఈ ప్రకృతి మధ్య సూర్యభగవానుని సాక్షిగా ప్రపోజ్ చేస్తున్నాను.  ఇలా ప్రపోజ్ చేద్దామనే ఈ డ్రస్ లో వద్దామన్నాను. ఇదిగో గౌరమ్మా ఇప్పుడే చెపుతున్నాను నేను ఇలా పల్లెటూరి రైతులా కూడా అవతారం ఎత్తుతుంటాను. అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడికీ పోను. మరి ఆలోచించుకొని చెప్పు." అన్నాడు మహేష్.

"నీయెంటే ఉంటాను మహేష్ మావా

నీ బాటే నాదీ మహేష్ మావా" అంటూ మహేష్ చేయి అందుకుంది గౌరి.

 

No comments: