' పొన్నాడ ' వారి '
పున్నాగ వనం . ' గ్రూప్ లో ఇచ్చిన #సాంప్రదాయం-సైన్స్# టాపిక్ కు నేను రాసిన కథ.
సువ్వీసువ్వీ పాడాలమ్మా!!!
రియా వెళ్ళి చాలా సేపైంది ఇంకా రాలేదేమిటీ అని
వాష్ రూంస్ వైపు వెళ్ళింది శ్రావణి.అక్కడ ఓ కుర్చీలో , మోకాళ్ళు పైకి ముడిచి పెట్టుకొని
కూర్చొని, మోకాళ్ళ
మీద తలానించి ఏడుస్తున్న రియాను ఆశ్చర్యంగా చూసి "ఏమైంది రియా ? ఎందుకేడుస్తున్నావు ?" అని కంగారుగా
అడిగింది.జవాబివ్వకుండా ఇంకా వెక్కిళ్ళు పెడుతున్న రియాను దగ్గరకు తీసుకొని
ఓదారుస్తే, చిన్నగా
తన యూనీఫాం కు అంటిన రక్తం మరకలను చూపించి "ఇవి ఎట్లా వచ్చాయో తెలీటం
లేదు.ఇప్పుడు ఏమి చేయను ? భయంవేస్తోంది అమ్మ ఏమంటుందో!"
పెద్దగా ఏడ్చింది. ఒక్క క్షణం శ్రావణి కంగారు పడింది. వెంటనే ఈ సంవత్సరము స్కూల్
మొదలయినప్పుడు అమ్మ జాగ్రత్తలు చెప్పి,
తన స్కూల్ బాగ్ లో ఎప్పుడూ ఉంచుకోమని ఇచ్చిన చిన్న కవర్
గుర్తొచ్చింది. వెంటనే క్లాస్ రూం కు వెళ్ళి తన బాగ్ లోని కవర్ తీసుకొచ్చి, అందులోని పాడ్ తీసి ,రియాకు ఇచ్చి , అది ఎలా వాడాలో చెప్పింది.
"నీకు తెలుసా ఇట్లా అవుతుందని ? నీకు కూడా
అవుతుందా ?" ఆశ్చర్యంగా అడిగింది రియా.
"నాకు ఇంకా కావటము లేదు కాని మా అమ్మ
చెపింది ఎప్పుడైనా కావచ్చు, కంగారుపడకు అని ఇది ఇచ్చి ఎలా వాడాలో చూపించింది. పద మేడం ను అడిగి
పర్మిషన్ తీసుకొని వస్తాను.ఇద్దరమూ ఇంటికి వెళుదాము" అంది శ్రావణి.
తొందరగా ఇంటికి వచ్చిన శ్రావణిని చూసి
"ఏమైంది?" కంగారుగా అడిగింది స్వాతి.
"నాకేమీ కాలేదమ్మా. రియాకు పిరియడ్
వచ్చింది.రియా ను ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను అంది.
మరునాడు నువ్వులు, ఎండుకొబ్బరి, బెల్లం కలిపి రోట్లో దంచి, చిన్న చిన్న ఉండలుగా చేసి
తీసుకొని, రియాను చూసొద్దామని
వెళ్ళింది స్వాతి."రారా స్వాతీ.చూసావా మా రియా మాకు పనిపెట్టింది." సంబరంగా
ఆహ్వానిచ్చింది రియా అమ్మమ్మ. అక్కడంతా సందడిగా ఉంది. రియా తాతగారు, డాడీ, ఇంకా ఎవరెవరో ఉన్నారు. రియా
తల్లి దీప పేపర్ లో ఏదో రాస్తున్నదల్లా,
ఆ పేపర్ పెన్ భర్తకిచ్చి, రా స్వాతీ అని లోపలికి
తీసుకెళ్ళింది. బెడ్ రూంలో మంచం మీద నీరసంగా ముడుచుకొని పడుకొని ఉంది రియా.
"నిన్న స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ,
నాకెందుకిట్లా అవుతోంది ఏడుస్తూ ఇట్లాగే పడుకుంది.ఏమీ తినటము లేదు. మమ్మీ
,డాడీ వచ్చారు. ఈ రోజు ఆంటీ అంకుల్ వస్తారు.పెద్ద ఫంక్షన్
చేయాలని ఏర్పాట్లు చేస్తున్నము. బయట చూసావుగా కాటరింగ్ వాళ్ళూ, పూల డెకరేషన్ అందరూ వచ్చారు. షాప్
కెళ్ళి పట్టుచీరా, నగా
తేవాలి. ఇంకా బోలెడు పనులున్నాయి. ఇదేమో ఇట్లా ఉంది చూడు." అంది దీప కాస్త
చిరాకుగా.
రియా పక్కన కూర్చొని మృదువుగా రియాను తట్టింది
స్వాతి. స్వాతిని చూసి లేచి కూర్చుంది రియా. "రియా నిన్నటి నుంచి ఏమీ
తిలేదటకదా! ఇదో నీ కోసం నేను స్పెషల్ స్వీట్ తెచ్చాను తిని చూడు." అని ఒక
చిమ్మిలి ఉండ రియాకిచ్చింది స్వాతి. ముందు కొద్దిగా కొరికి, పూర్తిగా తినేసింది రియా. అది
చూసి కాస్త మొహం చిట్లించి "ఏమిటిది నువ్వుండనా? ఇలా
నువ్వుండలు, పసుపు రాయటమూ
దూరంగా కూర్చోపెట్టి ఒక బొమ్మ చేతికివ్వటమూ లాంటి చాదస్తాలన్నీ మేము మానేసాము. పిరియడ్
వస్తే దూరంగా కూడా కుర్చోము. సెక్స్ ఎడ్యుకేషన్ అని అన్ని చెప్పటము నాకు ఇష్టం
లేదు." అంది కాస్త విసురుగా దీప.
దీపవైపు సాలోచనగా చూసి,"సెక్స్ ఎడ్యుకేషన్ అంటే నీ దృష్ఠిలో పత్రికలల్లో వచ్చే శృంగారకథలూ, సలహాలూ సంప్రదింపులా దీపా?
వాటి గురించి మనకెందుకు కానీ, నేను మా శ్రావణికి ముందుగా
చెప్పటము గురించి నువ్వు అంటుంటే మాత్రం నేను ఒప్పుకోను. వయసు వస్తున్న
అమ్మాయికి తన శరీరంలో జరిగే మార్పుల గురించి ముందుగా తెలియచెప్పటము, తగిన జాగ్రత్త తీసుకోవటము, మన బాధ్యత. తెలుసుకోవటము వాళ్ళ
హక్కు. ఈ మధ్య కొంతమంది స్కూళ్ళకు వెళ్ళి ఆడపిల్లలకు Menstruation గురించి వివరిస్తున్నారు. అమెరికా లో మాల్స్ లల్లో, స్కూల్స్ లల్లో, అన్ని పబ్లిక్ ప్లేస్
లల్లోనూ లేడీస్ వాష్ రూం లో సానిటరీ
నాప్కిన్స్ ఉంచుతారని విన్నాను. మరి మనదగ్గర ఆ ఏర్పాటు ఉందోలేదో నాకు తెలీదు.
ఇక దూరంగా కూర్చోబెట్టటమంటే వారి చిన్ని
శరీరానికి విశ్రాంతి ఇవ్వటము. పసుపు ,వేపాకులు
మరిగించిన నీటితో స్నానం చేయించటము,
ఈ నాలుగురోజులూ నూనేలో పసుపు కలిపి వంటికి రాయటమూ , ఈ మార్పులో సున్నితమైన వారి లేత
శరీరానికి ఏ బాక్టీరియా అంటకుండా రక్షణ కవచము ఏర్పరచటము. ఇక నువ్వులూ,బెల్లము, ఎండుకొబ్బరి, పులగము లాంటి వాటితో భోజనము
పెడితే సులువుగా జీర్ణము అవుతాయి. అంతే కాదు విటమిన్ సి, విటమిన్ డి , అంటూ నానా రకాల టాబ్లెట్స్
మింగించకుండా ప్రకృతిసిద్దమైన విటమిన్లను అందిస్తున్నాము. బొమ్మ ఇవ్వటము అంటే
ఇప్పుడంటే సెల్ ఫోన్ లల్లో రకరకాల ఆటలు ఆడుకుంటూ పిల్లలు బిజీగా ఉంటున్నారు కాని ఆ
రోజులల్లో తాటాకుబొమ్మలే కదా ఆడపిల్లలకు ఆటబొమ్మలు. వారికి ఆ సమయములో కలుగుతున్న
శారిరీక చికాకు , బాధ
మీద నుంచి ధ్యాస మళ్ళించి ,
బిజీగా ఉంచేందుకు ఇచ్చేవారేమో. ముత్తదువులు "సువ్వీ
సువ్వీ " అంటూ రోలురోకలి తో దంచుతే మిక్సీలో కన్నా చక్కగా మెదుగుతాయి అని
రొటితో దంచుతూ , పాటలు
పాడుతూనే బోలెడన్ని విషయాలు చెప్పేవారు. ఈ ఫంక్షన్ అనే కాదు, గొబ్బెమ్మైనా, బతకమ్మైనా, పెద్దమనిషి పేరంటమైనా, సీమంతమైనా ఏదైనా ఆపాటలల్లో జీవిత సత్యాలు , మనము ఎలా మెలగాలో భోదించేవారు.
ప్రతి నెలా స్త్రీలు మూడు నుంచి ఐదురోజుల వరకు
రుతుస్రావం అప్పుడు బాధ అనుభవిస్తారు . కొంత
మందికి విపరీతమైన బాధ ఉంటుంది. పూర్వకాలము లో ఉమ్మడికుటుంబాలు, అందరూ పని చేయక తప్పదు. అందుకని
మొదటి మూడు రోజులు పూర్తిగా , ఆ తరువాత పైపై పనులు చేసుకోవచ్చని , మామూలుగా చెపితే వినరని ఇలా దూరంగా
ఉంచే ఏర్పాటు చేసారు. కాకపోతే , మన పెద్దవాళ్ళు మంచికి ఏర్పాటుచేసిన అన్ని సాంప్రదాయాలలాగే ఇదీ
మూర్ఖమైపోయుంది . సువ్వీసువ్వీ అని పాడాలి. మన పిల్లలకు మంచీ చెడూ నేర్పాలి."
అని చెప్పి ఒక్క నిమిషం ఆగింది స్వాతి. ఏమి మాట్లాడలేక ఆలోచనలో పడింది దీప. కొద్ది
సేపు కూర్చొని తను తెచ్చిన బాక్స్ రియా చేతిలో పెట్టి లేచింది స్వాతి.
"ఇంతసేపు వెళ్ళావు?" అని అడిగాడు కిరణ్.
"ఏముంది చాలామందికి ప్రతిదీ చాదస్తం
అంటూ ఓ పాట అలవాటైపోయింది. ఆడంబరాల మీద ఉన్న ఇంట్రెస్ట్ అవసరాల మీద ఉండటం లేదు. ఐనా
నాకు తెలీక అడుగుతాను ఏది చాదస్తం ? మా తాతగారింటి ముందు
గాబు నిండా నీళ్ళు, పక్కన
ఒక చెంబు ఉంచేవారు. ఇంటికెవరొచ్చినా ఆ నీళ్ళతో కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవారు.
మడి తో వంట చేసేది అమ్మమ్మ. మా అమ్మ మేము స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి, బట్టలు మార్చుకుంటే నే కానీ
హార్లిక్స్ ఇచ్చేది కాదు. సారీ కిరణ్ ఇన్ని చెపుతున్న నేను , నువ్వు మార్కెట్ నుంచి తెచ్చిన
కూరలూ, పండ్లూ అన్నీ
విడివిడిగా గిన్నెలల్లో చాలా నీళ్ళు పోసి,
అందులో వేసి కడగ మంటే విసుక్కునేదానిని. సామాన్లు కూడా
కాసేపు బయట ఉంచి లోపల పెట్టమంటే అబ్బా అనేదానిని. ఇప్పుడు కరోనా దయవల్ల నాకే కాదు
అందరికీ అర్ధం అవుతోంది అవన్నీ ఎంత మంచి అలవాట్లో." అంది స్వాతి.
"కూల్ బేబీ కూల్" అని చిన్నగా
స్వాతి చేతి మీద తట్టాడు కిరణ్.
No comments:
Post a Comment