Friday, September 11, 2020

వాలుచూపుల వయ్యారి!


 

 

 

#చిట్టి కథ#

 

వాలుచూపుల వయ్యారి!

"ఆపండి . . . ఆపండీ " పరిగెత్తుకొస్తున్న అమ్మాయిని చూసి , బస్ ఆపాడు కండెక్టర్.తలుపు దగ్గర నిలబడి ఉన్న హరి, ఆ అమ్మాయి కి చేయి అందించాడు.ఓసారి అతని వైపు వాలుగా చూసి, హరి చేతిని సుతారంగా అందుకొని ,కాలువ దాటి వచ్చి , బస్ ఎక్కింది.

"ఏం రాధమ్మా తోట నుంచి వస్తున్నావా ?" అడిగాడు బస్ లోని ఓ పెద్దాయన.

"అవును తాతా."జవాబిచ్చింది రాధ.

పల్లెటూరి అమ్మాయిలంటే లంగావోణీలతో ముద్దబంతిపూవులా ఉంటారు అనుకునేవాడు.కానీ ఈ అమ్మాయి పంజాబీ డ్రెస్ లో నాజుకుగా సన్నజాజిమొగ్గలా ఉంది. మాట్లాడుతుంటే కోయిల పాటలా ఉంది  అనుకుంటూ రాధ వైపు క్రీకంట చూసాడు. తననే వాలుచూపులు చూస్తున్న ఆ వయ్యారి  రాధమ్మకు ఫిదా ఐపోయాడు హరి.

 కళ్యాణ్ పెళ్ళిలో, కళ్యాణ్ వెనకెనుకే తిరుగుతూ చాలా ఆక్టివ్ గా ఉన్న రాధ కళ్యాణ్ బాబాయి కూతురని తెలియటం తో చాలా సంబరపడిపోయాడు.

"మా బాబాయి రాధకు ఆరు సంవత్సరాల వయసులోనే పోయాడు. అప్పటి నుంచి పిన్ని రాధను కంటికి రెప్పలా పెంచుకుంది.దాన్ని వదిలి ఉండలేక ఊళ్ళోనే హైస్కూల్ లో, పక్క ఊళ్ళో ఉన్న కాలేజీ లో చదివించింది.ఇద్దరికీ అటాచ్మెంట్ ఎక్కువ.వదిలి ఉండలేరు."అన్నాడు కళ్యాణ్.

"పరవాలేదు అత్తయ్యగారు మాతోపాటే ఉంటారు. నో ప్రాబ్లం."అని అప్పటికప్పుడే వరుస కలిపేసి మాటిచ్చేసాడు. మాట, మనసు ఇచ్చేసాక ఇక ఆలశ్యం ఎందుకు పెళ్ళున పెళ్ళైపోయింది.ఆ వెంటనే ఊటీకి హనీమూన్ వెళ్ళేందుకు టికెట్స్ కూడా కొనేసాడు.

"హరిగారూ, హరిగారూ మా అమ్మను కూడా తీసుకెళుదామండీ."గోముగా అడిగింది.

"ఓసి తింగరిబుచ్చీ హనీమూన్ కు అమ్మను తీసుకెళ్ళరే."అని మనసులోనే తల కొట్టుకొని,  మాట మరిపించి రాధతోనే ఊటీలో వాలాడు.

ఆడుతూపాడుతూ ఓ రోజు గడిచిపోయింది.మరునాడు పొద్దున లేవగానే జుట్టు విరబోసుకొని, నైటీ తో విచారం గా కూర్చున్న రాధను చూసి గాభరాపడి "ఏమైంది బంగారూ?"అడిగాడు.

"అమ్మ గుర్తొస్తోంది. ఊరికి వెళ్ళిపోదామండీ "కళ్ళ నిండా నీళ్ళతో అంది రాధ.

"నా రాణీవి కదూ! నిన్ననేగా వచ్చాము.వారం రోజులకు అన్నీ అరేంజ్ చేసుకున్నాము కదా.సరదాగా ఎంజాయ్ చేసి వెళుదాము."బుజ్జగించాడు.

బుజ్జి,కన్న,తల్లీ అని ముద్దుముద్దుగా బతిమిలాడగా బతిమిలాడగా లేచి తయారయ్యింది.బ్రేక్ ఫాస్ట్ తినిపించటం ఒక ప్రహసనం ఐపోయింది.కోరి చేసుకున్న గారాల భార్య ను ఏమీ అనలేడు.భోజనము కూడా సరిగ్గా చేయలేదు.వెళ్ళిపోదామూ వెళ్ళిపోదామూ ఒకటే పాట! అమ్మో రెండోరోజుకే కళ్ళల్లో ప్రాణాలొచ్చేసాయి.ఇలాగే ఉంటే ఇంకేమైనా ఉందా అసలుకే అత్తయ్యగారు మేము వస్తుంటే దేవకన్య ను ఎత్తుకుపోతున్న రాక్షసుడిలా నన్ను చూసారు.అప్పుడు అమ్మా, కూతురు కళ్ళు తుడుచుకుంటుంటే ఎప్పుడూ వదిలి ఉండక బెంగేమో అనుకున్నాడు కాని ఇంత ఘాడమైన సీనుందని తెలీలేదు.బాబోయ్ అని హడలిపోయి, ఓ ట్రావెలర్ చేతులూ గడ్డం పట్టుకొని టికెట్ సంపాదించాడు.

ఇంటికి చేరగానే అమ్మ ను వాటేసుకొని ఓసారి భోరుమని, ఆ తరువాత కిలకిలా నవ్వేసింది రాధమ్మ.ప్రేమయాత్రలో ప్రేమ ఏమోకాని ఏడ్చేపెళ్ళాన్ని, పుట్టబోయే పిల్లలను బతిమిలాడే అనుభవం సంపాదించేసాడు.అమ్మయ్య!

అత్తయ్యగారు ప్రేమారగా రకరకాల వంటలు చేసి కొసరికొసరి వడ్డిస్తే కడుపారా తిని భుక్తాయసం తో కూర్చున్న హరి తో " సన్నజాజి పందిరి కింద పక్క వేయించాను.రండి హరిగారూ."అని చేయి పెట్టుకొని, వాలుగాచూస్తూ  వయ్యారంగా తీసుకెళ్ళింది రాధ. పుచ్చపువ్వులా ఉన్న వెన్నెలలో, పందిరి నిండా విచ్చుకొని సువాసనలు వెదజల్లుతున్న సన్నజాజుల పరిమళం, తెల్లని పక్క మనోహరంగా ఉంది.

"కాశ్మీరు లోయలో కన్యాకుమారి తో" అని హనీమూన్ చేసుకుందామనుకున్నాను. వెధవ టెరరిస్ట్ ల గోల తో ఆ చాన్స్ పోయింది.పోనీలే ఊటీలో ఝామంటూ తిరుగుదామనుకుంటే చివరకు "సన్నజాజి పందిరి  కిందా  " అని పాడుకోవలసి వచ్చింది విరక్తి గా అనుకున్నాడు  పాపం హరి!

No comments: