Thursday, December 8, 2011

అన్నపూర్ణావారి ఆణిముత్యాలు


యుట్యూబ్ లో ఏవో పాటల కోసం వెతుకుతుంటే "దొంగరాముడు " సినిమా కనిపించింది . దొంగరాముడు చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను . సి.డి కోసం వెతికాను కూడా ! అప్పుడు దొరకలేదు . అనుకోకుండా ఇప్పుడు చేతికి చిక్కింది అనుకొని హాపీగా చూసేసాను :) అప్పుడే ఎందులోనో అన్నపూర్ణావారు సినిమాలు తీయబట్టి 60 సంవత్సరాలు అయ్యింది అని చదివాను . అంతే అన్నపూర్ణావారి సినిమాలు చూద్దామని కోరిక పుట్టింది . నెట్ లో వెతికితే ఇదో లిస్ట్ దొరికింది . ఆ లిస్ట్ తీసుకొని కోటీ వెళ్ళి సి. డి షాప్ లో వెతికాను . " పెళ్ళీడు పిల్లలు " , " సుడిగుండాలు " తప్ప మిగితావన్నీ దొరికాయి . ఈ లిస్ట్ లో " పల్నాటి యుద్దం " కూడా వుంది కాని అది అన్నపూర్ణావారిది కాదు . మరి అన్నపూర్ణావారిది కూడా పల్నాటియుద్దం సినిమా వుందేమో మరి నాకైతే కనిపించలేదు ...
"దొంగరాముడు " చూస్తూవుంటే చాలా ముచ్చటగా అనిపించింది . ఏ. నాగేశ్వరరావు , సావిత్రి , జమున ఎంత చిన్నగా వున్నారో . పరిస్తితులు మనుషులను ఎలా దొంగ గా మారుస్తాయో చూపిస్తారు ఇందులో . నాకైతే తెగ నచ్చేసింది . హీరో పరిస్తితుల ప్రభావం తో దొంగ గా మారటము కాదు నచ్చింది , సినిమా నచ్చింది :)
శరత్ నవల " నిష్కృతి " ఆధారం గా నిర్మించిన చక్కటి కుటుంబ కథా చిత్రం " తోడికోడళ్ళు " . ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ . . . . . ఎవర్ గ్రీన్ సాంగ్ . . .
తెలిసీ తెలియని వయసు లో జరిగిన పెళ్ళికి , కట్టిన మాంగల్యానికి ఇచ్చిన విలువే " మాంగల్య బలం ". నావరకు నాకైతే పాటలన్నీ సూపర్ హిట్ .
ఒకే పోలికల తో వున్న అజయ్ , విజయ్ వారి స్తానాలు మార్చుకొని , వారి ఇంటిని సరిదిద్దుకున్న , ఇద్దరు యువకుల కథే " ఇద్దరు మితృలు ". ఆద్యంతమూ సరదాగా సాగిపోతుంది .
ముగ్గురు స్నేహితురాళ్ళ జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చెప్పే కథ " చదువుకున్న అమ్మాయిలు ."
తనను పెంచినవారి కోసం పాటుబడిన ఓ మంచి అమ్మాయి జీవితం లో సుఖ దుఖాల కథే "వెలుగునీడలు ."
కోడూరి కౌసల్యా దేవి వ్రాసిన నవల " చక్రభ్రమణం " కు సినిమా రూపమే " డాక్టర్ . చక్రవర్తి ." ఈర్శ , అసూయలు ఒక ముచ్చటైన దంపతులను ఎలా విడదీస్తాయో చూస్తూవుంటే చాలా బాధ కలుగుతుంది .
ఇద్దరు నాయికల మద్య అందమైన నాయకుడు . ఎక్కడా ? ఇంకెక్కడ " ఆత్మగౌరవం " లో :)
తలితండ్రుల అదుపు , ఆప్యాయత ఎరుగని ఓ అబ్బాయి , తన స్నేహితురాలి సంతోషం కోసం ఓ హత్య చేస్తడు . పిల్లలకు కుటుంబం లో సరి ఐన ఆప్యాయత , క్రమశిక్షణ లేకపోతే ఎలా తయారవుతారు ? ఎలా అంటే ఇదో " సుడిగుండాలు " లోని అబ్బాయి , అమ్మాయిలా .
హత్య చేసాడని జైలుకు వెళ్ళిన తండ్రి , నిరపరాధి అని నిరూపిస్తాడీ "పూలరంగడు ."
ఓ స్వాతంత్ర్య సమరయోధుని కొడుకు ఓ జవాన్ . అతను పెళ్ళిచేసుకో బోతున్న ప్రేయసి కార్ ఆక్సిడెంట్ లో చనిపోయింది . కాని ఆమె కొన్ని రోజుల తరువాత అతనికి ఓ గైడ్ గా కనిపించింది ! ఇదేమి వింత ! తెలుసుకోవాలని వుందికదూ ఐతే చూడండి " జై జవాన్ ".
ప్రేమించి పెళ్ళి చేసుకోబోతూ , కాదనుకొని తనను పెంచిన మేనమామ కూతురిని పెళ్ళిచేసుకోవటానికి సిద్దపడ్తాడు హీరో గారు . ఎందుకంటే " అమాయకురాలు " చూస్తే కాని తెలీదు !
ఓ జమిందారు కూతురు , పొగరుబోతు అమ్మాయి తనను ఏడిపించిన అబ్బాయికి బుద్ది చెప్పబోయి జీవితమే నాశనం చేసుకుంటుంది పాపం , యద్దనపూడి సులోచనారాణి నవల విజేత ఆధారం గా తీసిన " విచిత్రబంధం " లో .
ఎంత చదువుకున్నా , ఎంత తెలివి కలదైనా అమ్మాయికి నా అనే వారి అండ చాలా అవసరం . ఈ సంగతే చెప్పారు , యద్దనపూడి సులోచనారాణి నవల " బంగారుకలలు " అధారం గా తీసిన " బంగారుకలలు " సినిమాలో .
విభిన్న మనస్తత్వాలు కల ఇద్దరు అమ్మాయిలు వారి జీవితాన్ని ఎలా తిప్పుకున్నారో చెప్పే కథ , యద్దనపూడి సులోచనారాణి నవల "ప్రేమలేఖలు " ఆధారం గా తీసిన సినిమా " ప్రేమలేఖలు ."
అంతస్తుల భేధం ప్రేమికుల మద్య ఎడబాటును కలిగిస్తుంది . అవును వారు ఎంత ప్రేమించుకున్నా విడిపోకతప్పదు , యద్దనపూడి నవల " రాధాకృష్ణ " నవల ఆధారం గా తీసిన " రాధాకృష్ణ " సినిమాలోలా !
"అమెరికా అబ్బాయి " పాపం ఏమయ్యడో ఏమో ! షాపువాడు పని చేయని సి.డి ఇచ్చి నన్ను సినిమా చూడనీయకుండా చేసాడు హుం !

గత ఆరు నెలలుగా వీలు చిక్కినప్పుడల్లా " అన్నపూర్ణావారి ఆణిముత్యాల " ను చూసాను. దొంగరాముడు లో నాగేశ్వరరావు బంగారు కలలు లో ఎంతా మారిపోయారో ! దొంగరాముడు లో " అందచందాల గడుసరివాడు విందు భోంచేయ వస్తాడు నేడు " , అని చక్కగా డాన్స్ చేసిన సావిత్రి కి , వెలుగునీడలు లో " చిట్టీ పొట్టీ చిన్నారీ పుట్టినరోజు " లో కదలలేక కదిలిన సావిత్రి కి ఏమాత్రం పోలికలేదు . నటనలో కాదు ఆకారం లో :) ఆ రోజులలో నటన మీద తప్ప ఆకారం మీద అంత శ్రద్ద పెట్టినట్లు లేరు . వాళ్ళు అసలు నటిస్తున్నట్లుగా లేదు . ఆ పాత్రలలో ఇమిడిపోయారు . అరే సూర్యకాంతం తోడికోడళ్ళు లో ఎంత బాగుంది . గయ్యాళితనం మటుకు మారలేదు :) పాపం రేలంగి కి ముందునుంచీ ఒకటే పర్సనాలిటీ . అన్ని సినిమాలల్లో పాత్రదారులనందరినీ ఆ ఆ పాత్రలకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసారు .

నటీ నటులకు తగ్గట్టు కథ ఎంపిక చేసారా ? కథకు తగ్గట్టు నటీ నటులను తీసుకున్నారా ? చెప్పటం కష్టమే ! అన్నీ చక్కటి కథా చిత్రాలే . కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు . కుటుంబ సబ్యులకు మద్య వుండే అనురాగాలు , ఆప్యాయతలు , ఈర్శాద్వేషాలు బాగా చూపారు . ఎక్కువగా నవల ఆధారం గా , ఎక్కువగా యద్దనపూడి సులోచనారాణి నవలల ఆధారంగా తీసారు . దాదాపు చాలా వరకు మద్య తరగతి వారి కథలే .

40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా వుండేదో ఈ సినిమాలలో చూడవచ్చు . గండిపేట , కాలాపహాడ్ , నౌబత్ పహాడ్ , రిట్జ్ హోటల్ , నేను చదువుకున్న రెడ్డీవుమెన్స్ కాలేజ్ చూస్తూ వుంటే తప్పిపోయిన పిల్ల ను చూసినంత ఆనందం వేసింది . ఇప్పుడు ఆ పరిసరాలు చాలావరకు మారిపోయాయి . ఇప్పుడు గండిపేట అంత అందం గా ఎక్కడుంది ? కాలపహాడ్ , నౌబత్పహాడ్ లేనే లేవు . రూపు మార్చేసుకొని , బిర్లా మందిర్ , బిర్లా సానిటోరియం అయ్యాయి . అప్పట్లో కాలపహాడ్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించేది .

నటీ నటులు , కథలు , హైద్రాబాద్ పరిసరాలు బాగా చూపించటం సరే , చందమామను ఎంత అందముగా చూపారని ! బాల్కనీ , అందులో గుత్తులు గుత్తులు గా పూసిన మాలతీ తీగ , ఆకాశం లోని జాబిల్లి , ఆ బాల్కనీ లో పరవశించిపోయిన నాయికా , నాయకులు , ఎంత అందమైన దృశ్యం ! చందమామ పాట తో పాటు , దాదాపు ప్రతి సినిమాలోనూ దేశభక్తి గేయం కూడా తప్పకుండా వుంది .

అన్ని సినిమాలు చూడ చక్కగా వున్నాయి . ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలే ఐనా కలర్ వి కూడా వున్నాయి . కొన్ని సినిమలైతే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత బాగున్నాయి . మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత వినసొంపైన పాటలు , మంచి కథలు తో హాయిగా ఆహ్లాదంగా సాగిపోయే సినిమాలే అన్నీనూ . పోట్లాటలు , కాట్లాటలు , రక్తపాతాలు , రౌడీయిజాలు , దయ్యాలు , భూతాల తో వున్న సినిమాలే కాని ఇంత చక్కటి కథా చిత్రాలు ఈ రోజులలో ఎందుకు తీయరో !

9 comments:

రాజ్యలక్ష్మి.N said...

అన్నపూర్ణా వారి సినిమాలని చాలా చక్కగా పరిచయం చేశారండీ..
"బాల్కనీ , అందులో గుత్తులు గుత్తులు గా పూసిన మాలతీ తీగ , ఆకాశం లోని జాబిల్లి , ఆ బాల్కనీ లో పరవశించిపోయిన నాయికా , నాయకులు , ఎంత అందమైన దృశ్యం !"

బాల్కనీ సీన్స్ గురించి కళ్ళకి కట్టినట్లు వర్ణించారు..

Rao S Lakkaraju said...

అన్నపూర్ణా వారి సినీమాల మీద సంక్షిప్త రివ్యు బాగుంది.

కృష్ణప్రియ said...

మీ సంక్షిప్త సమీక్ష బహు చక్కగా ఉంది.

Dr.Suryanarayana Vulimiri said...

అన్నపూర్ణా వారు తీసినవన్నీ నిజంగా ఆణిముత్యాలు. చక్కని కథావస్తువు, ఇతివృత్తం, కథనం, నిత్యజీవితంలో ఎదురయే సమస్యలు, పాత్రలు, పరిచయాలు, ప్రణయాలు, వీటన్నిటితో పాటు చక్కని పాటలు, సాహిత్యం, సంగీతం ఒకటేమిటి అన్నీను. మీ సమీక్ష చదివాక ఎవరైనా ఉపేక్షించకుండా వెంటనే ఒక మంచి పాత సినిమా చూడాలన్న ఆరాటం కలుగుతుంది. అంత బాగా వ్రాసారు. ఒక్కసారి గత స్మృతులు సింహావలోకనం చేసాయి. ధన్యవాదాలు.

Maitri said...

ఏమిటో మాలగారూ చెయ్యి తిరిగిన సమీక్షలని మించిపోయి రాస్తున్నారని తప్పితే ఇంకేం చెప్పలేను. చక్కటి వర్ణనలతో రాసేరు. చాలా బాగా రాసేరు.
క్రిష్ణవేణి

Maitri said...

" చెయ్యి తిరిగిన సమీక్షకులని" అని చదవండి మాలగారూ టైపో.

మాలా కుమార్ said...

రాజీ ,
ఆ బాల్కనీ , ఆ పూల తీగ వున్న ఇళ్ళు సారధీ స్టూడియో లొ వున్నయట :)

& లక్కరాజు గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

కృష్ణప్రియ గారు ,
థాంక్ యు .
&సూర్యనారాయణ గారు ,
నా పోస్ట్ మీకు నచ్చినందుకు థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

కృష్ణవేణి గారు ,
అలాగే సమీక్షకులు అనే చదువుకుంటానండి . థాంక్ యు .