Thursday, May 26, 2011

వెల్లుల్లి కష్టాలు !!!!!


వెల్లుల్లి కష్టాలు !!!!!పొద్దున లేచినప్పటి నుంచి , రాత్రి పడుకునేవరకూ తిండి గోలే . ఏమి వండాలి అనే ఆలోచనలే ఎంతకూ తెగవు . అసలు జనాభాకి ఎందుకింత తిండి రంధి ? ఏమైనా అంటే " కోటి విద్యలూ కూటికొరకే " అనే సామెతొకటి ! మా కజిన్ సత్య అంటుంది రాత్రి పడుకుంటే ఓ పట్టాన నిద్ర పట్టదక్కా అని . ఎందుకు అంటే పొద్దున లేవగానే బ్రేక్ ఫాస్ట్ ఏమి చేయాలి అని ఒకటే టెన్షన్ . మా ఆయన్ని అడుగుతే పొద్దున లేచాక చూసుకోవచ్చుగా పడుకో అంటారు . ఏదో వకటి చెప్పండి అని పదే పదే అడుగుతుంటే విసుక్కుంటూ ఏదో చెప్తారు . అప్పుడు హమ్మయ్యా డిసైడ్ అయ్యింది అనుకొని హాపీగా నిద్రపోతా అని చెప్పింది :) హుం . . .

సరే ఇంట్లో అంటే ఎలాగో ఓలాగా తిప్పలు పడి సద్దుకుంటాము కాని , బయటకి వెళ్ళి నప్పుడు తిండి కోసం తిప్పలు చెప్పలేనన్ని . అసలే మా ఇంట్లో వెల్లుల్లి , మసాలాలు గట్రా తినము . మా తాతగారి ఇంట్లో ఐతే రాములక్కాయలు ( టమాటాలు ) కూడా నిషేదం ! మా ఇంట్లో మా అమ్మ ఉల్లిపాయలు , ఆలుగడ్డ కూర, టమాటాకూర , పప్పుచారు , పకోడీలు మొదలైన వాటిల్లో వేసేది . మా అత్తగారి ఇంట్లోనూ అంతే తప్ప వెల్లుల్లి అనే ఒక పదార్ధం వుంటుంది అని కూడా నాకు తెలియదు . అవునా అలాంటి అమాయకురాలిని ఈ వెల్లుల్లి ఎన్ని కష్టాలపాలు చేసిందో !

మాపెళ్ళైనాక మూడు నెలలు అత్తగారింట్లో ఆడుతూ పాడుతూ వంట నేర్చుకున్నాక ఓ శుభరాత్రి ఏమండీ  నన్ను పటియాలా తీసుకెళుదామని సదరన్ ఎక్స్ ప్రెస్ ఎక్కించారు . ఆ రాత్రి కి ఎలాగూ ఇంట్లోనే భోజనం చేసాము కాబట్టి , మరునాడు వుదయము తినేందుకు పూరీలు , కొబ్బరి పచ్చడి , మద్యాహ్నం కోసం పులిహోర , పెరుగన్నం కట్టి ఇచ్చారు మా అత్తయ్యగారు . అవే ఆ రోజు రాత్రి కూడా తినేసాము . మరునాడు వుదయము నుంచి మొదలయ్యాయి కష్టాలు ! ట్రేన్ లో బ్రెడ్ & ఆంలెట్ తెచ్చారు . చీపాడు ఆంలెట్ నేను తినను అనేసాను . పోనీ బ్రెడ్ సాండ్విచ్ తిను అన్నారు మావారు . ' బ్రెడ్డా ' అది జ్వరం వచ్చి నప్పుడు కదా తింటారు అన్నాను . ఇంతలో అరటిపళ్ళు వస్తే అవి తిని బ్రేక్ ఫాస్ట్ పని ముగించా . మొదటిసారి కాపురాని కి వెడుతున్నానని అమ్మ ఇచ్చిన కారపూస , మైసూర్పాక్ , పళ్ళతో ఆ రోజూ ఎలాగో నెట్టుకొచ్చాను . మరునాడు ఆగ్రా లో దిగాము . రైల్వే కాంటిన్ కు తీసుకెళ్ళి చపాతీలు , పాలక్ పన్నీర్ తెప్పించారు . చపాతీలుకూడా జ్వరం వచ్చినప్పుడు మాత్రమే తినే పదార్ధం అని అప్పట్లో నా ఘాడాభిప్రాయం . అప్పటికి నవలా సాహిత్యము తెలీదు కాబట్టి , భానుమతి అత్తగారి కథ లు చదవలేదు కాబట్టి పన్నీరు వంటకాలలో వాడుతారు అని తెలీదు కాబట్టి అదికూడా తిన్లేదు ! ఆ రోజు కు ఆపిల్స్ తో సరిపెట్టుకున్నాను . అలాగే ఆగ్రా అంతా తిరిగాము . రాత్రి కి డిల్లీ వెళ్ళాము . అక్కడ పొద్దున తెప్పించిన పూరీ , ఆలూ కూరలో ఏదో వాసన . అదేమిటో తెలీదు . ఎప్పుడూ తిన్లేదు . ఎలాగో కూర లేకుండా పూరీ మటుకు తినేసాను . మద్యాహ్నమూ హోటల్ లో అన్నీ కూరలలోనూ ఏదో వాసన . అబ్బే ఇంత పిచ్చి వాసన తో ఇక్కడి వాళ్ళు ఎలా తింటారు బాబు అని బోలెడు హాచర్య పోయాను . ఆ రోజంతా నీరసము గా డిల్లీలో చూడవలసినవి చూసాను . మరునాడు ఉదయానికి పాటియాలా చేరుకున్నాము . యూనిట్ వాళ్ళు పాపం ఎంటో ప్రేమగా పూరీ కూరా పంపారు . అదేమిటి బాబూ ఇక్కడా కూరలో అదేవాసన ! అంతే మళ్ళీ ఉత్త పూరినే తిన్నాను . లంచ్ కు పక్కింట్లో వున్న మేజర్ . జగనాథ్ వాళ్ళు పిలిచారు . వెళ్ళామా . . . ఏవో డ్రింక్స్ ఇస్తారు కాని భోజనము పెట్టరే ! పెట్టినా వీళ్ళింట్లోవి ఏమి వాసనలొస్తాయో ! ఆకలి నక నక లాడిపోతోంది . చివరాఖరికి భోజనము వడ్డించారు . ఎదురుగా టేబుల్ మీద ఘుమ ఘుమ లాడుతూ టమాటో పప్పు , కొబ్బరి పచ్చడి , బీన్స్ కొబ్బరి కూర , సాంబారు , తెల్లటి అన్నం కనిపించాయి . కొంచం కొంచం చిన్నగా . . . నోట్లో పెట్టుకున్నాను . ఏ వాసనలూ లేవు . అంతే అటాక్ . . . ఏమండీ  ఉరుము చూపులు , మేజర్ . జగనాథ్ హాచర్య చూపులూ ఏవీ పట్టించుకోలేదు . హాయిగా సుష్టుగా భోంచేసేసాను :) మిసెస్ జగనాథ్ కు మావారు బోలెడు బోలెడు థాంకూలు చెప్పేసారు . మిసెస్. జగనాత్ ద్వారా ఆ వాసనలు వెల్లుల్లి , గరం మసాలాలవని అతికష్టం మీద తెలుసుకోగలిగాను . వాళ్ళూ అవి తినరు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆ వాసనలు రాలేదు :)

ఆ విధము గా మూడు రోజులు నన్ను ముప్పతిప్పలు పెట్టిన వెల్లుల్లి మీద నాకు ద్వేషం కాక ప్రేమ వస్తుందా ? ద్వేషమైనా ప్రేమైనా పార్టీలలో మా ఏమండీ  ఉరుము చూపులు , ఇంటి కి వచ్చాక క్లాస్లూ భరించలేక తినక తప్పలేదు . అలా చిన్నగా నామీద కొద్దిగా విజయము సాధించింది వెల్లులి . కొద్దిగానే సుమా ! నార్థ్ ఇండియన్ కూరలలో మాత్రము వెల్లుల్లి తినగలను అంతే . డెలివరీ లు అయ్యాక వెల్లుల్లి ఖారప్పొడీ తినక తప్పలేదు . అలా ఏదో వాసన వచ్చీ రానట్లు ఒక్క పాయ వేస్తే తినగలిగిన స్తితికి వచ్చాను . ఐనా దాని మీద నాకేమీ ప్రేమకారిపోదు ! మా రోజువారి వంటలలో మాత్రము ఏమాత్రమూ తినను గాక తినను . ఏదైనా వూళ్ళ కెళ్ళినప్పుడు మ ఏమండీ  తో చివాట్లు తింటాను . ఎప్పుడూ చివాట్లు తిని ఏమి బతుకుతాము లే అనుకొని ఇలా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ రోజు ఏ దేవుడి రోజైతే ఆ దేవుడి పేరు మీద వుపవాసము వుంటాను :) అదీ ఎక్కువరోజులు వెళితే కష్టమే ! అదేమిటో ఇదివరకు హోటల్స్ లలో టిఫిన్స్ బాగుండేవి . ఇప్పుడు దోస , ఇడ్లీ చట్నీలలో కూడా వెల్లుల్లి వేస్తున్నారు . అదేమిటో అర్ధం కావటము లేదు . ఆ మధ్య రాజమండ్రి వెళ్ళి నప్పుడు హోటల్లో వెల్లుల్లి లేకుండా ఏమిస్తావు బాబూ అంటే పెరుగన్నం అన్నాడు .పోనీ అదే తే అన్నాను . వాళ్ళ టేస్ట్ తగలెయ్య ! పెరుగన్నము లో ఉల్లిపాయ వేసాడు . అదీ తినే ఆశ లేదు . హుం . . .

ఈ మధ్య పెళ్ళిళ్ళల్లో కూడా మసాలా కూరలు ఎక్కువైపోయాయి . అక్కడా పెరుగన్నము , ఇంకా సుగర్ వారు దయ తలచలేదు కాబట్టి , స్వీట్స్ తోనూ సరిపెట్టేసుకుంటున్నాను . ఏదైనా వూరు వెళ్ళినప్పుడు పూరీ పంచదార , (మళ్ళీ కూర్మా అంటే బోలెడంత మసాలా , నూనే వేస్తారు ) పెరుగన్నము , పండ్లు వీటి తోటే గడుపుకుంటాను . అలా ఎన్ని రోజులుండగలను ? మరునాటికి నీరసం మొహం పడుతుంది . ఈ మద్య మా ఏమండీ  తోనే కాక లక్ష్మిగారి తోకూడా చివాట్లు తింటున్నాను . ఇలా ఐతే ఎలా మాలా ? మనము ఇంకా బోలెడు వూళ్ళు తిరగాలి . మీరిట్లా నీరసపడిపోతే ఎట్లా . ఇదివరకు ఎప్పుడూ వెల్లుల్లి వేసారా లేదా అని ఎప్పుడూ గమనించలేదు . ఈ మధ్య మీకోసమని అన్ని చోట్లా అడుగుతున్నాను అంటారు !

ఓసారి సుజ్జి నాకు హాస్టల్ లో తినాలనిపించటము లేదు అంది . ఐతే మాయింటికి వచ్చేయి మంచి లంచ్ పెడతాను కాకపోతే మేము ప్యూర్ వెజిటేరియన్స్ మి . కూరలలో వెల్లుల్లి , మసాలా కూడా వేయము అన్నాను . అదేమిటి నేనేమన్నా ఆశ్రమానికి వస్తున్నానా ? ఇలా ఐతే నేను సన్యాసం పుచ్చుకోవలసిందే అన్నది . చూద్దాం రా అన్నాను . వచ్చి తిని వెళ్ళింది కాని ఇప్పటి వరకు సన్యాసుల్లో కలిసిన ధాఖలా ఐతే లేదు మరి :)

అసలు ఎక్కడికైనా వెళితే వెజిటేరియన్స్ మి అంటేనే తిండి దొరకటము కష్టం . ఆ పైన వెల్లులి లేకుండా అంటే అసలే దొరకదు . మా మాజాంగ్ ఫ్రెండ్సైతే దిస్ ఈజ్ ఫర్ యు అని ప్రత్యేకం గా చేసి పెడతారు . అన్ని చోట్లా అలా దొరకదుకదా ! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కష్టాలో ! చివరకు ఇంట్లో ఇప్పుడు వచ్చిన వంటావిడ కూడా వెల్లుల్లి లేకుండా అంటే ఎలా అమ్మా వండేది అంటుంది . మా వంటమనిషి , శైలజ అమ్మా మీకు మంచి ఖారం తేనా అని రాజమండ్రి నుంచి అడిగింది . సరే కొత్త ఖారం కదా తీసుకురా అన్నాను . తను వూరి నుంచి వచ్చాక ఓరోజు మామిడి కాయ పప్పులో లైట్ గా వెల్లులి వాసన వచ్చింది . ఆ మన ఇంట్లో ఎల్లుల్లి వాసనా నెవర్ (((( నా భ్రమేమో అనుకున్నాను . కాని రెండోరోజు మామిడికాయ ముక్కల ఖారం వేస్తూ శైలజ తెచ్చిన కొత్త ఖారం అందులో వేయబోయాను . శైలజ గాభరగా వుండండమ్మా అది వేయకండి అందులో కొంచం వెల్లుల్లి వుంది అన్నది . అదేమిటి అందులో వెల్లుల్లి వుండటమేమిటి అంటే మేము కొత్త ఖారం కొట్టించేటప్పుడు కొంచం వెల్లుల్లి అందులో వేస్తాము సువాసన వుంటుంది అన్నది . నీ సువాసన బంగారం కాను , నేను వెల్లుల్లి తిననని తెలుసుగా ఎందుకువేయించావు ? అందుకేనా రెండురోజుల నుంచి కూరలు వెల్లుల్లి వాసన వస్తున్నాయి అని కోపం చేసాను .అలా . . . ప్రస్తుతం ఆమెకు వంట నేర్పే పనిలో వున్నాను . ఆమె నాకు వెల్లుల్లి కొద్ది కొద్దిగా అలవాటు చేసే ప్రయత్నం లో వుంది . చూద్దాం ఎవరు గెలుస్తారో :)20 comments:

కృష్ణప్రియ said...

:) మాల గారు.. మీ కష్టాల సంగతి నాకు తెలుసు.. మా అమ్మ గారిది ఇదే కథ. ఆవిడకి వాసనకే వాంతులైపోతాయి. దానితో.. ఇంటి చుట్టూ ఎవరింట్లో వంట చేస్తే దానికి ఆపోజిట్ కార్నర్ కి వెళ్లి ఇంగువ కట్టిన రుమాలు తో కూర్చుంటుంది ... బయట కి వెళ్లినప్పుడు తను పడే కష్టాలు మేము పడకూడదని మా అందరికీ వేసుకొమ్మని ప్రోత్సహించటం తో.. మేమంతా ఇష్టం గానే తింటాము...

చాలా బాగా రాసారు...

లత said...

బావుంది మాలగారూ, కానీ ఉల్లి, వెల్లుల్లి లేకుండా వంట చెయ్యడం అంటే కష్టమే

శ్రీలలిత said...

బాగున్నాయి మీ వెల్లుల్లి ప్రహసనాలు...

మురళి said...

నాకెందుకో మీ వంటావిడే గెలుస్తుందేమో అని సందేహంగా ఉందండీ :))

శిశిర said...

చెప్తే నవ్వుతారేమో గానీ నావీ ఇవే పాట్లు. ఎంత అలవాటు చేసుకుందామన్నా నావల్ల కావడం లేదు. బయట భోజనం అయితే మీలాగే ఆవకాయ అన్నం, స్వీట్స్, పెరుగన్నంతో బండి లాగించేస్తున్నాను. :(

శిశిర said...

చెప్పడం మరచానండి.. రాములక్కాయలు అంటే ములక్కాడల్లో ఒకరకం అనుకునేదాన్ని. టమాటాలా!

మాలా కుమార్ said...

కృష్ణప్రియ గారు ,
నేను తినలేను కాని వాసనను అతి కష్టం మీద భరించగలను . మా పిల్లల కోసం కొన్నింటిలో వేసి చేస్తునే వుంటాను .
థాంక్ యు .

& లత గారు ,
అవునండి , అలవాటైతే ఉల్లి , వెల్లుల్లి లేకుండా వండటము కష్టమే !

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
ఇంకా బోలెడు ప్రహసనాలు వున్నాయండి . స్తలాభావం చేత అన్నీ వ్రాయలేక పోయాను :)

& మురళి గారు ,
మీ సందేహం నిజమైతే మంచిదేనండి , కాని ఆ సూచనలు కనిపించటము లేదండి :)

మాలా కుమార్ said...

శిశిరా ,
నాకు ఆవకాయ తినే అదృష్టం కూడా లేదండి . పచ్చళ్ళు చేయటమే కాని అసిడిటీ తో తినే రాతలేదు :(
మా అమ్మమ్మా వాళ్ళు టమాటా లను రాములక్కాయలనే అంటారు . మా తాతగారు బయటకు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ రహస్యం గా వండి పెట్టేది . ఆయన వచ్చేసరికి తినేసి , గిన్నెలు కూడా కడగటము ఐపోయేది :) టమాటా కూర , పప్పు పిల్లలందరికీ ఇష్టం . పాపం ఇంకేమి చేస్తుంది ? అప్పుడప్పుడు పట్టుబడి తిట్లు కూడా తినేది పాపం .

కొత్తావకాయ said...

:D ఉల్లి వెల్లుల్లి లేకుండా బతికేసే నాలాంటి వారు ఇంకొకరున్నారన్నమాట. బాగు బాగు!

Unknown said...

బావున్నాయి మాలా గారూ వెల్లుల్లి కబుర్లూ, కష్టాలూ. మా ఆఫీస్ లో ఒకమ్మాయి మీలాగే.. ఎప్పుడు పొట్ లక్ చేసినా ఆ అమాయికి వేరేగా ఎదో ఒకటి తెచ్చేవాళ్ళం. ఇస్కాన్ వారు నిర్వహించే 'గోవిందా' రెస్టారెంట్ లో ఉల్లి, వెల్లుల్లి లేకుండానే పదార్ధాలు తయారు చేస్తారు.. చాలా బావుంటాయి. మీకు తెలిసే ఉంటుంది. అక్కడైతే మీరు ధైర్యంగా తినేయవచ్చు.. అలాగే జైన్ దిషెస్ కూడా. గుడ్ లక్..

Rao S Lakkaraju said...

అమెరికాలో కాలిఫోర్నియాలో వెల్లుల్లి పండగ అని చేస్తారు. అన్నీ వెల్లుల్లి పొలాలు అక్కడ.అన్నీ వెల్లుల్లి వంటలు. వెల్లుల్లి ఐస్క్రీం స్పెషల్ అక్కడ. నాకు వెల్లుల్లి పడదు అందుకని వంటలు జాగర్తగా చూసి తినాలి. ఇక్కడ వాసన లేని వెల్లుల్లి చేస్తున్నారు అందుకని అప్పుడప్పుడు పప్పులో కాలేసి బాధపడాల్సి వస్తుంది. థాంక్స్ ఫర్ యువర్ వెల్లుల్లి పోస్ట్.

మాలా కుమార్ said...

& కొత్తావకాయ గారు,
మీరూ నా జాతే నన్నమాట :)

&ప్రసీద గారు ,
ఇస్కాన వారి గోవిందా సంగతి నాకు తెలీదు కానీయండి , ఈ మద్య కొన్ని హోటల్స్ లలో జేన్స్ ఫుడ్ రెడుతున్నారు . అలా దొరికినా హాపీగా తినేస్తాను . కానీ అదీ అన్ని చోట్లా దొరకదు .

& లక్కరాజుగారు ,
ఈ పోస్ట్ వ్రాసేందుకు స్పూర్తి మీరేనండి . నేనే మీకు థాంక్స్ చెప్పాలి . కావ్య వ్రాసిన "శాఖాహార కష్టాలు " పోస్ట్లో మీరు అడిగారు నన్ను వ్రాయమని . ఆ పోస్ట్ లింక్ ఇద్దామంటే కనిపించలేదు !
థాంక్ యు .

ఆ.సౌమ్య said...

హ్మ్ లాభం లేదండీ మిమ్మల్ని థాయ్ లాండ్ లోనో, చైనా లోనో ఓ పది రోజులు వదిలేయాలి :)

నాకు వెల్లుల్లి చాలా ఇష్టం...హైదరాబాదీలు పెట్టే అల్లంవెల్లుల్లి ఆవకాయ అంటే ప్రాణం.

డిలీ లో, నార్త్ ప్రాంతాలలో నాకు వెల్లుల్లితో సమస్య లేదుగానీ వాళ్ళు వాడే నూనే తో సమస్య...మస్టర్డ్ ఆయిల్, అదే ఆవ నూనె వాడతారు అన్నిట్లో...పూరీలు దాన్లోనే వేయిస్తారు...అబ్బ నేను అస్సలు భరించలేను ఆ వాసనని. అలా మస్టర్డ్ ఆయిల్ వాసనొస్తే నేనూ మీలాగే మజ్జిగన్నం పళ్ళు, స్వీట్లకి సెటిల్ అయిపోతా.

రాములక్కయలంటే టమాటాలా? ఏవో ములక్కాడలలో రకాలనుకున్నా? ఏ ప్రాంతం వాడుక ఇది?

Rao S Lakkaraju said...

ఆ.సౌమ్య గారూ ఎందుకు అల్లా గుర్తు చేస్తారూ. నాకు వెల్లుల్లి కారం అంటే చాలా ఇష్టం, ఉల్లావకాయ చాలా ఇష్టం, పిజ్జా అంటే ఇష్టం కూడా (ఇటాలియన్ ఫూడ్స్ అన్నిట్లో వెల్లుల్లి వేస్తారు), అవన్నీ ఒకప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు రేస్తోరెంట్ కి వెళ్తే గార్లిక్ లేని వేమిటి అని అడగాలి. తెలీకుండా తిన్నామనుకోండి దగ్గు, జలుబు,స్టీరాయిడ్స్. అంతకన్నా మాలా కుమార్ గారి పద్ధతే మంచిది. కొందరికి మనస్సే చెబుతుంది అది తినగూడదు అని. అదృష్టం.

మాలా కుమార్ said...

అమ్మో సౌమ్యా , వెల్లులి తినక పోతే ఇంత పన్షిమెంట్ ఇస్తారా ? నేను చైనా పోను . ఇండియా లోనే వుంటాను , వెల్లుల్లి తినను :)
మేము సిలిగురిలో వున్నప్పుడు సివిలియన్స్ భోజనానికి పిలిస్తే తెగ ఇబ్బంది పడేదానిని . ఫిష్ కూడా వెజిటేరీన్ ఫుడ్ . అన్నీ ఆవనూనె తో వంటలు . అసలు వాళ్ళ ఇంట్లోకి వెడుతుంటేనే ఆవనూనె వాసన తో కడుపులో తిప్పేసేది . ఇహ అక్కడా పూజ , వుపవాసం మంత్రం పటించక తప్పేది కాదు :) డిల్లీ లోనూ ఆవనూనెతోనే వండుతారా నేను వినలేదే !
మా అమ్మమ్మ ది గుంటూరు . బహుషా గుంటూరు , కృష్ణా జిల్లాల వాళ్ళు టమాటను రాములక్కాయ అంటారనుకుంటాను . నేను అమ్మమ్మ దగ్గరే ఆ పదం విన్నాను . ఇంకెక్కడా వినలేదు .

మాలా కుమార్ said...

లక్కరాజు గారు ,
అమ్మయ్య మీరైనా నా పద్దతి మంచిది అంటున్నారు . అందరూ నన్ను అరవటమే :)
థాంక్స్ అండి .

Rao S Lakkaraju said...

మాలా కుమార్ గారూ ఒకసారి భోపాల్ ట్రైన్ స్టేషన్ ప్లాట్ఫారం మీద బండిలో ఆవనూనె లో వేసి పూరీలు వేయిస్తున్నాడు. ఆ వాసన తలుచుకుంటేనే కడుపులో తిప్పుతుంది. చిన్నప్పటి నుండీ వాటితో పెరిగితే ఇష్టం అవుతుందేమో. మా అమ్మాయి కొన్ని రకాల చ్చీజులు తీసుకు వస్తుంది. ఇంక మేడ మీదికి వెళ్లి పోవటమే.

మీరన్నది నిజమే టమేటా లకి "రామ ములక్కాయ" పదం కృష్ణ గుంటూరులో వాడతారు. నిజంగా మాట్లాడితే టమేటా ఇంగ్లీషు పదం.

కొందరికి 6th sense ఉంటుంది మీలాగా. అది నీకు సరిపోదు ముట్టుకోవద్దు అని చెబుతుంది మనస్సు. నాలాంటి వాళ్లకి తిని అనుభవిస్తే కానీ తెలియదు. కొందరికి కొన్ని పడవు అంతే. వెల్లుల్లి ఉల్లిపాయ ఒకే జాతి అయినా నాకు ఉల్లి పాయలు తోటి ప్రాబ్లం లేదు.

దేముడి వంటల్లో ఉల్లి, వెల్లుల్లి వాడకూడదంటారు. ఎందుకో ఎవరన్నా చెబితే బాగుండు.

Krishnaveni said...

మాలగారూ నేను కూడా శాఖాహారినే. ఇతర దేశాలకి వెళ్ళినప్పుడల్లా నేను భోజనానికి పడిన తిప్పలు మరొకసారి చెప్తాను కానీ ఇక్కడ నేను ఆవనూనె గురించి చెప్తున్నాను. ఇక్కడ డెల్లీలో కూరలు ఆవనూనెతోనే చేస్తారు. ఆవనూనె పచ్చిగా ఉన్నప్పుడు వాసన వస్తుంది, చేతిమీదకి వేసుకోవడానికి పనికి రాదు తప్పితే కూరలు దానితో చేసినప్పుడు వాటి రుచి సరిగ్గానే ఉంటుంది. నిజం చెప్పాలంటే రిఫైన్డ్ నూనె వాడేకన్నా ఆవనూనెతోనే కూర ఎక్కువ రుచిగా ఉంటుంది. కానీ పప్పుకి మాత్రం కాదు సుమండీ! మా చిన్నప్పుడు చుట్టుపక్కల అందరూ ఆవనూనెని ముందర వాసన పోవడానికి మరిగించి పెట్టుకునేవారు. ఇప్పుడదేం లేదు. అప్పటికప్పుడే. ఆవనూనె ఒకసారి మరిగించిన తరువాత సరియైన temperature కి వచ్చిన తరువాత వాడి చూడండి. కానీ బాగా మరగాలి. తరువాత వాడి చూడండి. మాకైతే ఇది అలవాటే.
అయినప్పటికీ ఈ నూనెలు మనం ఉన్న ప్రాంతానికి ఎక్కువ సంబంధించి ఉంటాయి. కేరళాలో అన్నీ కొబ్బరినూనెతోనే చేస్తారు. కొన్ని ఇష్టం ఉంటాయి( ఆవిళ్ లాంటివి), కొన్ని ఉండవు. విజయనగరం వంటి ప్రాంతాలలో మంచి నూనె ( అంటే నువ్వులనూనెని) ఉపయోగిస్తారు. అక్కడ నువ్వులు ఎక్కువ పండుతాయి కనుక. చిన్నతనంలో మా ఊరుకి వెళ్ళినప్పుడు నాకది ఇష్టం లేకపోయేది. ఏ ప్రాంతంలో ఏది ఎక్కువ పండుతుందో దాన్నే ఉపయోగిస్తారు కదా!

మాలా కుమార్ said...

లక్కరాజు గారు ,
మా తాతగారిని ఒకసారి ఇలాగే అడిగాను , మనం ఉల్లిపాయ ఎందుకు తినకూడదని . అవి తింటే నాలుక మొద్దు బారుతుందని , తామసం పెరుగుతుందని , అప్పుడు బ్రాహ్మలు మంత్రాలు చదివితే వుచ్చారణ స్పస్ఠం గా వుండదని , మా తాతగారు జవాబిచ్చారండి :)

కృష్ణ వేణి గారు ,
అవునండి మీరు చెప్పినట్లు ఆ ప్రాంతపు , పంటలు , వాతావరణం కు అనుకూలంగా నే అక్కడి వారి అలవాట్లు వుంటాయండి . అవే వాళ్ళు ఇష్టపడతారు :) మా వారు మటుకు నాకెప్పుడూ చెబుతుంటారు , మనం ఎక్కడకెళితే అక్కడి భోజనం చేయాలి అని . నాకే అన్నీ ఎక్కవు :)
మీ కామెంట్ కు థాంక్స్ అండి .