Tuesday, March 15, 2011

చెప్పు తెగుద్ది !!!!!అప్పటికే డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన టైం ఆపోవస్తోంది . ఎంత తొందరగా బయిలు దేరుదామనుకున్నా చివరి నిమిషము లో ఏదో వక పని . ఆలశ్యం అవనే అవుతుంది . పైగా ఈ ట్రాఫిక్ ఒకటి ! ఆలశ్యం ఐందంటే డాక్టర్ తరువాత వాళ్ళను పిలుస్తాడు . అందరి చెకప్ లూ అయ్యేవరకూ వుండి , ఆ తరువాతా డాక్టర్ గారికి టైం వుంటే చూస్తాడు . లేదంటే ఊసురో మంటూ మళ్ళీ రేపు రావలసిందే . ఆలస్యం చేసిన మా పనమ్మాయి శైలజ నూ , ట్రాఫిక్ నూ తిట్టుకుంటూ గబ గబా నడుస్తున్నాను . నావెనుకనే శైలజ స్పీడ్ గా వచ్చేస్తోంది . ఇంతలో ఎవరో మా స్పీడ్ కు బ్రేకేశారు . గబుక్కున ఆగిపోయాను . నాతో పాటే ఆగబోయిన శైలజ కిందపడబోయి , నన్ను పట్టుకొని ఆగిపోయింది . ఆ ఊపులో నా చెప్పులో కాలేసింది . అంతే " పుటుక్ " * * * * *
నా చెప్పు తెగిపొయి నేను కిందబడబోయి ఎలాగో బాలెన్స్ నిలుపుకున్నాను ! పక్క నుంచి ఎవరో " కిసుక్ " * * * * *
వాళ్ళ వైపు కొంచం సీరియస్ గా , కొంచం నవ్వు మొహం తో ( అవును మరీ కాస్త నవ్వు మొహం పెట్టక పోతే ఎలా ?) చూసి , నా గొలుసు తీసి చూసుకున్నాను , పిన్నీస్ ఏమైనా వుందా అని . లేదు . శైలజ గొలుసు తీసి చూశాము . ఊమ్హూ లేదుగాక లేదు ." చమక్ " * * * మంటూ గుర్తొచ్చింది , ఆ మద్య నేను సుల్తాన్ బజార్ లో బేరమాడి కొన్న పిన్నీసులు నా పర్స్ లోనే వుండాలి అని . వెంటనే పర్స్ తీసి చూసాను . వున్నాయి . అమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ పిన్నీస్ తీసా . ఇటివ్వండమ్మా నేను పెట్టిస్తాను అంది శైలజ . చి చీ నువ్వు నా చెప్పు ముట్టుకోవటమేమిటి వద్దులే అని నేనే పిన్నిస్ ను చెప్పుగారికి అలంకరించి ఉస్స్ అనుకుంటూ , ముందు ముందూ ఇంకా బోలెడు ఉస్స్ బుస్స్ లున్నాయని తెలీక పాపం ముందుకెళ్ళాను .

ఎదురుగా మెట్లు లేకుండా జారుడు బండ లాంటి స్లోప్ నవ్వుతూ ఆహ్వానించింది . అయ్యో రామా అనుకుంటూ చిన్నగా ఎక్కాను . పక్కన లిఫ్ట్ వుందమ్మా అంది అక్కడ వున్న ఆయా . తెలుసు తల్లీ తెలుసు , పక్కన లిఫ్ట్ వుందనీ తెలుసు , అది క్లోజ్డ్ లిఫ్ట్ అనీ తెలుసూ అని స్వగతం అనుకుంటూ ఆయా మాట విననట్లుగా పైకి నడిచా . మూడు అంతస్తులు ఎలా ఎక్కాలో అనుకుంటూ వుండగానే మళ్ళీ " పుటుక్ . . . " మళ్ళీ శైలజ ' అమ్మా ఇటివ్వండి . . . . ." మళ్ళీ నేను " చీ చీ . . . . . " సరే మొదటి అంతస్తు ఎక్కాము . మళ్ళీ హిస్టరీ రెపీట్సూ . . . . . శ్రీరామ చంద్రా నారాయణా ఎన్ని కష్టాలు పెట్టావురా తండ్రీ . . . . . అడుగడుగునా హిస్టరీ రిపీట్సే !!!!!!

అమ్మయ్య ఎలాగైతే నేమి శ్రీరామచంద్రుడు డాక్టర్ దగ్గరకు చేర్చాడు . డాక్టర్ ఏమి చెప్పాడో నేనేమి విన్నానో ఆ శ్రీరాముడికే తెలియాలి , అవును మరి చిత్తం శ్రీరాముడి మీద భక్తి చెప్పులమీదాయే !

మళ్ళీ తిరుగు ప్రయాణం జారుడు బండ మీద . సేం ఓల్డ్ స్టోరీ ! ఈ సారి విసుగొచ్చి శైలజా ఎక్కడైనా డస్ట్ బిన్ వుందేమో చూడు ఈ వెధవ చెప్పులని పారేస్తాను అన్నాను .
" అమ్మా . గేట్ దగ్గర రోడ్ మీద తారు ఇప్పుడే పోసారు . ఎండకు కరిగి వుంటే , మీరు రోడ్ దాటి కార్ లోకి ఎలా వస్తారు ? "
ఓహ్ నిజమేకదూ ! ఆ తారు లో పాదం కూరుకు పోయినా , ఈ జారుడు బండ మీదనుంచి నేను జారినా ఈదరం బోయి బాదరం చుట్టుకుంటుంది ! అసలే నీరసం గా వున్నాను . ఆపైన ఇదొకటి . నేను జారబోవటము , శైలజ పట్టుకోవటము , పట్టుకుంటూ సారీ అమ్మా నామూలంగానే మీరు ఇబ్బంది పడుతున్నారు అంటమూ ఏమి చెప్పాలి నా కష్టాలు పగవాళ్ళంటూ ఎవరైనా వుంటే వాళ్ళకు కూడా వద్దు . ఎలాగో కిందకి దిగాను . లాంజ్ లో కూర్చున్న వాళ్ళ జాలి చూపులను తప్పించుకుంటూ శైలజను పట్టుకొని కుంటు కుంటూ నడుస్తూ వుంటే అటుగా వచ్చిన వార్డ్ బాయ్ శైలజ తో

" అలా మేడం వెనుకే నడుస్తావేమిటి ? నీ కాలు పడిందంటే మేడం చెప్పు తెగుద్ది " * * * * *

10 comments:

మధురవాణి said...

టైటిల్ చూసి కాస్త భయపడుతూ చదివా! మీరు ఇబ్బందులగురించి రాసినా అదేంటో మహా సరాదాగా అనిపిస్తుంది నాకు.. :P

కృష్ణప్రియ said...

:) బాగా రాసారు..

భాస్కర రామి రెడ్డి said...

:-))

లత said...

ఆఖరి లైన్ తో నవ్వించేశారు , బావుంది

ఆ.సౌమ్య said...

హహహహ బలే రాసారండీ...చిన్న విషయమే అయినా మంచి హాస్యం పండించారు...బావుంది.

అయితే మీకు లిఫ్ట్ భయం ఇంకా పోలేదన్నమాట :)

సుమలత said...

:)చాల బాగా రాసారు

మాలా కుమార్ said...

మధురవాణి ,
భయపెట్టానా? కొంచమేగా పరవాలేదులే :)

*కృష్ణప్రియ గారు ,
థాంక్ యు .

* భాస్కర రామిరెడ్డి గారు ,
:-))

మాలా కుమార్ said...

లత గారు ,
థాంక్ యు .

* అ.సౌమ్య ,
నా పోస్ట్ నచ్చినందుకు థాంక్ యు .
ఆ భయము పోయేది కాదు :))

* సుమలత గారు ,
థాంక్ యు .

స్ఫురిత said...

:-D

శ్రీ said...

మాలా కుమార్ గారు, చాలా ఇబ్బంది పడుంటారు కదా. అదేంటోనండి నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా నా చెప్పులు ఎవరో కొట్టేసేవారు. ఈ మధ్య గుళ్ళలో డబ్బులు తీసుకొని చెప్పుల స్టాండ్లు నిర్వహించడం నా అదృష్టం.