Wednesday, June 24, 2009

మా పెరటి బాదం చెట్టు


 
అదృష్టవశాత్తూ,మేమే ఇంటికి వెళ్ళినా కొద్దిగా పెరడు అందులో చెట్లు వుంటున్నాయి.సో, అనందమే ఆనందం. ఈ ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు మెట్ట్ల పక్కన పారిజాతం చెట్టు చూడగానే వావ్ అనుకున్నాను.అందరూ ఇల్లు చూస్తుంటే నేను ఇంకా ఏమేమి చెట్లున్నాయా అని చూసుకున్నాను. ఈ ఇల్లు కొందామా అని మా అబ్బాయి అడగగానే కొనేద్దాం అన్న! నువ్వు ఇల్లు చూడలేదుగా అన్నాడు. ఎందుకురా పారిజాతాన్ని చూసాగా అనేసా.అలా చూడగానే నా మదిని దోచిన పారిజాతం పాపం నన్నెప్పుడూ నిరుత్సాహ పరచలేదు .సాయంకాలం కాగానే ,పిట్ట కొంచం ,కూత ఘనం అన్నట్లు చిన్న చెట్టైనా బోలెడు పూలు పూస్తుంది. కొద్ది కొద్దిగా చీకటి పడుతుండగా కొద్ది కొద్దిగా ,ముందు బాల్కనీ లోకి తరువాత డైనింగ్ రూం లోకి,ఆపై బెడ్రూం లో దాకా పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది.రాత్రి పడుకోబోయే ముందు దాని కింద ప్లాస్టిక్ షీట్ ని పరుస్తాను.పొద్దునకల్లా ఆ షీట్ నిండా ఆరెంజ్ రంగు కాడతో తెల్లని సుకుమారమైన రేకుల తో బుజ్జి బుజ్జి పూలు ముద్దుగా సొగసు చూడ తరమా అంటూవుంటాయి.. వాటి తో మా దేవుళ్ళు పరిమళించి పోతుంటారు.


ఇంటి ముందు అయ్యిందా .వెనకకి వెళదాము.అక్కడ వున్నారండీ మా రాజాధి రాజు మహరాజు,మా పెరటి హీరోగారు.యద్దనపూడి హీరో లా నిలువెత్తు అందగాడు.అదేనండీ బాదం చెట్టు.ఇంటి గృహ ప్రవేశం అప్పుడే పిల్ల లందరికి మా ఆడపడుచు ఉష బాదం చెట్టును పరిచయం చేసింది.ఇంటికి వచ్చినవారంతా మీ ఇంట్లో బాదం చెట్టువుందా అని తెగ చూసి, వాళ్ళ వాళ్ళ చిన్నపుడు వాళ్ళ ఇళ్ళ లో వున్న బాదం చెట్టును గుర్తు తెచ్చుకొని దిష్ఠి పెట్టేసారు. అందరూ వెళ్ళాక దానికి దిష్టి తీసి మా కోడలి తో అన్నాను..అన్నం అరిటాకులో,తాటిముంజలు మోదుగాకులో , ఉప్మా తామరాకులో, బాదం ఆకులో తింటే మహారుచిగా వుంటాయి.బాదం ఆకులో గారెలు చేస్తె బాగుంటాయి.ఇన్ని రోజులూ వెధవ ప్లాస్టిక్ పేపర్ మీద చేసాము. ఇకపై బాదం ఆకు మీద చేసుకోవచ్చు ఇంచక్కా (అత్తలకి చిన్న సలహా ఇలాంటివి కొడళ్ళకే చెప్పాలి.వాళ్ళైతేనే మనం చెప్పేవి మొహమాటానికైనా వింటారు అని.. :).ఇక మరునాటినుంచి బ్రేక్ ఫాస్ట్ ఉప్మా బాదం ఆకులో , సాయంకాలం బాదం ఆకుమీద చక్కగా పరచి చేసిన గారెల టిఫిను,అల్లం పచ్చడీ .ఎంచక్కా తినొచ్చుగా ! కొన్ని రోజులు కాగానే జనతాపార్టీ గోలెట్టేసారు.సో. అప్పడప్పుడుకే పరిమితమైపోయాను.


మా బాదం చెట్టు గారికి మహా దర్జా .బోలెడు పొగరు. పక్కన గన్నేరు ,సువర్ణ గన్నేరు ,నందివర్ధనం వున్నాయి కొంచం వాటినీ రానీ అంటే వినదు.ఆ పూలు వస్తె దేవుడిని ఇంకా అలంకరించవచ్చుగా అని నాకోరిక.అయినా ససేమిరా అంటూ పెరడంతా పరుచుకుంది.మేఘా ,విక్కీ ,గౌరూ వంటింటి గట్టు మీద కుర్చొని బయటకి చూస్తూ కిస్కీ కిస్కీ నవ్వుతున్నారు.ఏమిటర్రా అని చూద్దునుగా పక్కింటి బాల్కనీ రెయిల్ మీద చేతులు పెట్టుకొని వాటిమీద గడ్డం పెట్టుకొని వీళ్ళంత అబ్బాయే వీళ్ళవైపు గుర్రున చూస్తున్నాడు.ఏమైంది అంటే మా చిన్నోడికి అనుమానం బామ్మా మన బాదం కొమ్మ చూడు వాళ్ళింట్ళోకి ఎలా వెళుతోందో. అది అలాగే వాళ్ళ బాత్ రూం దాకా వెళితే వాడు (ఆ ఎదురింటి అబ్బాయి) లోపలి కి వెళ్ళిన్నప్పుడు తలుపెలా వేసుకుంటాడు?పెద్ద సందేహమే!నిజమే మా కొమ్మ గారు వాళ్ళ గుమ్మం లోంచి లోపలికి తొంగిచూస్తున్నారు. వాళ్ళని మందలించి ,జాజి విరజాజీ ఎలా వున్నారో చూద్దామని కింది కి వెళ్ళాను.పక్కింటావిడ మాలా గారూ అని పిలిచి కాసేపు ఆ కబురు ,ఈ కబురు చెప్పి ఏమండీ మీ బాదం చెట్టు మా ఇంట్లోకి వచ్చేస్తోంది.కొంచం కొట్టేయించండి అని సలహా ఇచ్చింది.కాని మా అబ్బాయి వింటేనా !ఎలాగో వాడిని ఒప్పించి వాళ్ళ వైపు కొమ్మలు కొట్టించాను.కాని ఏం లాభం చూసారుగా ! పక్కింట్లో కి వెనకింట్లో కి అలా తొంగి చూడద్దు అంటే వినదు.మరీ ఇంత మొండిఘటం అయితే ఎలా చావను.దీని మూలంగా పక్కింటోళ్ళ తో తగవు తప్పదా ?

3 comments:

సుభద్ర said...

meeru chepi upma teast nenu chusanu.gaarelu try chestanu.memu prati friday evening ring adatani beach ki vellatam .chinna chinnaa snakes pattukuni naaku always masala upma vastundi.nenu paperplates marchi poyanu.naa friend badam akula salaha eexchcharu.so naaku plates karchu taggindi.now plates tisukellinaa antaa aake antaru.bagundi..mee hero kaburlu.

పరిమళం said...

నాకిష్టమైన పారిజాతాలూ ..నాకంటే మా కన్నయ్యకన్నమాట ! పూ పరిమళాలు మీ ఇంటినుండి బ్లాగులోకి తర్వాత మావరకూ వ్యాపించాయి .అన్నట్టు బాదం ఆకులని ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చన్న మాట !thanks!

మాలా కుమార్ said...

subhadra garu,
parimalam garu,
thank you.