Wednesday, December 15, 2010

కదంబమాలిక -3

బ్లాగులో రాసేది ఒకే పోస్టు . ఒకే అంశం. లేదా ఒకే కథ.. కాని పది మంది కలిసి ఒకే కథను రాస్తే. అదే ఒక్కో పుష్పం కలిసి తయారు చేసే అందమైన కదంబమాలిక. అలాగే ఈ బ్లాగర్లు ప్రతి వారం ఒక్కొరుగా ఈ కథను అందిపుచ్చుకుని కొనసాగిస్తారు . కొత్తగా చేయాలనే కోరికతో ప్రమదావనం సభ్యులు కొందరు చేసే ఈ ప్రయోగాన్ని మీరు సహృదయంతో పరిశీలించి, సరిదిద్ది, ప్రోత్సహిస్తారని కోరుతున్నాను..


ఈ కదంబమాలిక లోని మొదటి భాగం సురుచి లో జ్ఞానప్రసూన గారు , రెండో భాగం మమత రెడ్డి గారు ప్రభాతకమలం లో వ్రాయగా , మూడో భాగం నేను వ్రాస్తున్నాను . ఇలా అందరమూ కలిసి గొలుసుకట్టు కథ రాద్దామని శ్రీలలిత ప్రతిపాదించగానే , అందరమూ ఉత్సాహంగా సరే నని అమోదించేసాము . నాలాగా కథలు వ్రాయటము రానివారికి జ్యోతి , శ్రీలలిత సహాయమందిస్తామన్నారు . అంతే ' ధైర్యే సాహసే లక్ష్మీ ' అని , వారి అండ , దండ చూసుకొని దూకేసాను . జ్యోతి గారు , శ్రీలలిత గారు , మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండి . నేను ఇంత వరకూ కథలు వ్రాయలేదు . ఇదే మొదటి సారి . మరి ఎలా వ్రాసానో ఏమో ? కొంచం టెన్షన్ గానే వుంది . ఏమైనా తప్పులుంటే నవ్వకండెం ! ఇహ కథ చదవండి . . .

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ఊ ఊ ఇక పని సంగతి చూడు పిల్లలకు స్కూల్ కు ఆలశ్యం అవుతోంది అంటూ లోపలికి వెళ్ళింది నారాయణమ్మ .

అమ్మా నేను పోతున్నా , మళ్ళొచ్చి చేస్తా అని జానకి వెళ్ళి పోయింది .
ఇంతలో 'రోజా ' అని గట్టిగా పిలిచాడు భాస్కర్ . వస్తున్నానండీ అంటూ వెళ్ళింది సరోజుని . చూడు , నా షర్ట్ హాండ్ కు బటన్ వూడి పోయింది . అసలు నువ్వు నా సంగతి పట్టించుకోవటమే మానేసావు . నా సాక్స్ , హాంకీ ఏవీ ? నా సెల్ చార్జింగ్ కు పెట్టనే లేదు . ఒక్కో పని పదిసార్లు చెప్పాల్సి వస్తోంది . అసలు రోజంతా ఏచేస్తున్నావు ? అని గట్టి గట్టిగా అరవటము మొదలు పెట్టాడు భాస్కర్ . భర్త అరుపులకు కళ్ళలోనించి దుమికే నీటిని అదిమేసి , మౌనముగా బటన్ కుట్టి ఇచ్చి , హంకీ , సాక్స్ తీసి ఇచ్చింది . అమ్మా నాకు అత్త జడవేయలేదు అని ఏడుస్తూ వచ్చింది కీర్తి . భోజనాల గదిలోనుంచి అమ్మా అని అరుస్తున్నాడు శ్రీకర్ . కీర్తి కి జడవేస్తూ అటెల్లింది సరోజిని . సరోజిని ని చూడగానే నారాయణమ్మ ఎటెళ్ళావు ? నేను జరుగుతున్నాకాని నాపని జరగటము లేదన్నట్లున్నావమ్మాయ్ . ఈ అనిత ఏదీ ? పొద్దుటి నుంచి కనిపించలేదు . ఈ మద్య పిల్ల కూడా మాటా పలుకూ లేకుండా వుంటోంది అన్నది . సరోజిని అనిత ను పిలుద్దామని అనుకునేలోగానే , చిన్నగా అనిత భోజనాల గది లోకి వచ్చింది . పిల్ల ల తో సమానము గా అల్లరి చేస్తూ ఉషారుగా వుండే అనిత , ఈ మద్య ఇలా డల్ గా ఎందుకు వుంటోందా అని దిగులు పడుతున్నారు , నారాయణమ్మ , సరోజిని . అనిత , నారాయణమ్మ భర్త శ్రీరాం గారి అన్నయ్య గారి అమ్మాయి . అనిత కు ఐ .ఏ .యస్ చదవాలి అన్న కోరిక . చదువంటే అమితమైన ప్రేమ . అది గుర్తించే , శ్రీరాం గారు వాళ్ళ అన్న గారి ని ఒప్పించి , వూరి నుండి తీసుకొచ్చి , తన దగ్గరే వుంచుకొని ,కాలేజ్ లో , ఇంటర్ లో చేర్చారు . అనిత చాలా చురుకైనది . బాబాయి ఇంట్లో ని పిల్ల లా కలిసిపోయి , పిన్ని కి చేదోడు గా వదిన తో స్నేహము గా , పిల్లలకు ప్రియమైన అత్త గా కలిసిపోయింది . అందుకే ఈ మద్య అనిత డల్ గా వుంటే తల్లడిల్లుతున్నారు నారయణమ్మా , సరోజిని .

పిల్లలను బుజ్జగించి , తినిపించేసరికి స్కూల్ ఆటో రానే వచ్చింది . గబ గబా పిల్లలను తీసుకెళ్ళి ఆటో ఎక్కించి , రోజులా ఆటో డ్రైవర్ కు జాగ్రత్తలు చెప్పింది సరోజిని . పిల్లలు టాటా చెప్పి వెళ్ళిపోయారు . భాస్కర్ , అనిత కూడా వెళ్ళాక చూస్తే , కూరల బండి దగ్గర మామగారు కనిపించారు . ఆయన కూరల బేరం ఇప్పటో తెమిలేటట్లు లేదనుకొని , ఆయన చేతిలో వున్న సరుకుల సంచీ తీసుకొని లోపలికి నడిచింది సరోజిని .
" మీ మామగారు , వచ్చారేమిటి ? " అడిగింది నారాయణమ్మ .
" అవునత్తయ్యా , బయట రాజమ్మ దగ్గర కూరలు బేరమాడుతున్నారు " అంది సరోజిని .
" ఊమ్హ్ , ఇహ ఇప్పట్లో కూరలొచ్చినట్లే , నేను వండి నట్లే " నిట్టూర్చింది నారాయణమ్మ . అంతలోనే లోపలి కొచ్చి కూరలు భార్య కిచ్చి , ' టిఫిన్ పెట్టేదేమన్నా వుందా లేదా ? నీ పూజలైనాయా ' అడిగారు శ్రీరాం గారు .
టిఫిన్లూ , ఆ తరువాత భోజనాలూ , ఆ తరువాత పిల్లలకు టిఫిన్లూ , రాత్రి భోజనాలూ . . . అబ్బ ఎంతసేపటికీ తిండి గోలే ! విసుగొచ్చేస్తోంది . కాసేపు ఏదైనా పుస్తకం చదువుకుందామన్నా వీలు చిక్కటము లేదు . మళ్ళొస్తా అని వెళ్ళిన జానకి వచ్చేజాడలేదు . సందున నాలుగు బకెట్ల బట్టలు పిలుస్తున్నాయి . ఇల్లంతా ఖంగాళిగా వుంది . మొగుడుగారినోసారి తీసుకొచ్చి , చూపించి , ఓ మొట్టికాయ వేస్తే ఎలావుంటుంది ? . మొగుడిని మొట్టటమే ! తన ఊహకు , తనే నవ్వుకుంది సరోజిని . ఏమైనా చేయక తప్పదుగా అనుకుంటూ పనంతా పూర్తిచేసి , భోజనం కానిచ్చి టి. వి ఆన్ చేసుకొని జాజిపూలు కట్టేందుకు కూర్చుంది సరోజిని . చిన్నగా అటూ ఇటూ చూస్తూ లోపలికొచ్చిన లక్ష్మమ్మను చూసి జ్వరం తగ్గిందా అని అడిగింది . తగ్గిందమ్మా అంది లక్ష్మమ్మ .
' లక్ష్మమ్మా నిజం చెప్పు , నీకు నిజం గా జ్వరం వచ్చిందా ? జానకి ని ఇక్కడ పని కి పంపి , నువ్వు వేరే చోట చూసుకున్నావు కదూ "
" నీదగ్గర దాచలేనమ్మ , ఏం చేయమంటావు చెప్పు ? అందరమూ సంపాదించినా సరిపోవటము లేదు . నీకు తెలీనిదేముందమ్మా ? "
" లక్ష్మమ్మా , జానకికి చదువుకోవాలని వుంది దాని ని స్కూల్ కు పంపు . నువ్వూ , మీ ఆయన సంపాదించేదానిలో సద్దుకోండి . ఐనా నీకు తెలుసా ఇంత చిన్నపిల్ల ని పనిలోకి పంపుతే , పంపినందుకు నిన్ను , పనిలోకి తీసుకున్నందుకు మమ్మలిని జైల్లో పెడతారు "
చిన్నగా గొణుకుంటూ చీపిరి తెచ్చి ఇల్లు ఊడుస్తోందల్లా , సరోజి ని చూస్తున్న చిన్న బాబు ప్రకటన చూసి , అమ్మా ఆ బాబు నిజం బాబేనా అని అడిగింది . ముద్దుగా వున్న చిన్నబాబు పడుతూ లేస్తూ నడుస్తున్నాడు .ఏదో డైపర్ ప్రకటన అది . ఆ బాబును చూస్తూ అవును అంది సరోజిని .
" అమ్మా ఆ బాబు కు పైసలిస్తరా ?" అడిగింది లక్ష్మమ్మ .
" ఇస్తారు " .
" మరి ఆ బుడ్డోడు సంపాదిస్తేగాని , తల్లి తండ్రులకు ఎళ్ళదా ? ఆ తల్లి తండ్రులను జైల్లో పెట్టరా ? సినిమాలలో , ప్రకటనలలో ఎక్కడచూసినా బొడ్డూడని పిల్లగాళ్ళను తీస్తారు . వాళ్ళకు చదువు అక్కరలేదా ? శ్రీదేవి , అలీ చిన్నప్పటి నుంచే సినిమాలలో పని చేస్తున్నరంట . స్కూల్ కు కూడా వెళ్ళలేదట . . అట్లాంటి పిల్లలు మా కృష్ణ నగర్ లో ఎంతమందో వున్నారు . ఈ రూల్స్ అన్నీ మాలాంటి రెక్కడితే కాని డొక్కాడని వాళ్ళకే కాని , పెద్దోళ్ళకు కాదు " .
ఏకధాటిగా మాట్లాడుతున్న లక్ష్మమ్మకు జవాబు ఏమి చెప్పాలో సరోజిని కి తోచలేదు .
" ఏమిటి లక్ష్మమ్మా ఇప్పుడొచ్చి ముచ్చట పెట్టావు ?" అంటూ గదిలో నుండి బయటకు వచ్చిన నారాయణమ్మ ను చూసి ఏమిలేదమ్మా అంటూ చిన్నగా లోపలికి జారుకుంది లక్ష్మమ్మ . " అమ్మాయ్ మేము గుడి కివెళ్ళి వస్తాము " అని చెపుతూ , సరోజిని మొహము చూసి , " ఏమిటమ్మాయ్ అట్లా మొహం వాడి పోయింది . పొద్దున భాస్కర్ అరిచాడని బాధ పడుతున్నావా ? అట్లాంటి చిన్న చిన్న గొడవలు మామూలేకదా ? ఐనా భార్యాభర్తల గొడవ తామరాకు మీది నీటి బొట్టులా వుండాలి . ఆ గొడవను మనసు బయటే వుంచేయాలి . మనసులోకి రానీయకూడదు ." అని చెప్పి వెళ్ళిపోయింది . అత్తగారిని చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యమే సరోజినికి . మామగారు ఎంత అరిచినా నవ్వుతూనే వుంటారు . ఒక్క మాటా మాట్లాడరు . ఏమీ కానట్లే , సాయంకాలము కాగానే , శుభ్రం గా తయారై , ముడి చుట్టూ పూలు తురుముకొని , మామగారితో కలిసి గుడికి వెళుతారు . ఇద్దరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వుంటారు . ఇంతలోనే దెబ్బలాట , అంతలోనే ముచ్చట్లు . అసలు ఏమీ చదువుకోని అత్తగారు , అన్ని విషయాలనూ కను సైగ తోనే సరిదిద్దుతారు . ఆమెలా ఎందుకు వుండలేక పోతున్నాను అనుకుంటూ , అత్తగారు , మామగారు వెళ్ళాక తలుపేసుకొని లోపలికి వస్తున్న సరోజిని కి ఫోన్ రింగ్ వినిపించింది . ఫోన్ తీయగానే " హాయ్ వదినా ఎలావున్నావు ?" అని అడిగింది ఆడపడుచు సుమ .
సంతోషం గా " హాయ్ సుమా నువ్వెలా వున్నావురా ? ఇప్పుడే అత్తయ్యగారు , మామయ్య గారు గుడికి వెళ్ళారు కొంచం ముందు చేసి వుంటే వాళ్ళ తో మాట్లాడేదానివి . ఐనా ఈ సమయం లో చేసావేమిటి ? కొత్తకాపురం ఎలా వుంది ? "
" చాలా మనాది గా వుందొదినా . మీరంతా ఒకటే గుర్తొస్తున్నారు . రోహిత్ బాగానే వున్నాడు . ఫ్రెండ్లీగానే వుంటాడు కాని , మిమ్మలిని వదిలి వుండలేక పోతున్నాను .అమ్మ ప్రసాదాలు గుర్తొస్తున్నాయి . నాన్న కు తెలీకుండా ఇద్దరమూ సినిమా కు ఎట్లా వెళ్ళే వాళ్ళము కదా ? ఆ విషయాలన్నీ రోహిత్ కు చెపుతూ వుంటాను . మా వదిన నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎంత ఆశ్చర్యపోయాడో తెలుసా ? "
" అవును సుమా నాకూ నువ్వు చాలా గుర్తొస్తున్నావు . పిల్లలు కూడా అత్తా అత్తా అని నిన్నే కలవరిస్తూ వుంటారు . కొంచం లో కొంచం నయం , అనిత రావటము తో మా అందరికీ కాస్త మనాది తగ్గింది ."
" వదినా అనిత ఎలా చదువుతోంది .దాన్నితీసుకొచ్చి నాన్న మంచి పని చేసారు . అది కోరుకున్నట్లే కలెక్టర్ అవుతుంది చూడు . దానికా పట్టుదల వుంది ."
" ఏమో సుమా , ఈ మద్య అనిత అదోలా వుంటోంది . ఏమడిగినా జవాబు చెప్పదు . . . . . ఒక్క నిమిషం బయట ఎవరో తలుపు కొడుతున్నారు చూసి వస్తాను ."
" మంచిదొదినా నేను మళ్ళీ చేస్తానులే వుంటా బై ."
"ఎవరదీ వస్తున్నా .. . . అంత గట్టిగా కొడ్తారేమిటి బాబు కాస్త ఆగలేరు ?? ?"

(సశేషం )
వచ్చేవారం దుర్గ గారి బ్లాగ్ లో కలుసుకుందాము .బెస్ట్ ఆఫ్ లక్ దుర్గ.

14 comments:

చెప్పాలంటే...... said...

మాలా గారు రాయడం రాదు అంటూనే ఎంత బాగా రాసారో!! "నేను జరుగుతున్నాకాని నాపని జరగటము లేదన్నట్లున్నావమ్మాయ్." చాలా బాగుంది.మొదటి సారి అయినా అలా లేదు ఎప్పటి నుంచో రాస్తునట్లే వుంది

లత said...

బావుందండీ, బాగా రాశారు

రుక్మిణిదేవి said...

mala garu, story lo manchi messages kooda ichhaaru.. very nice..

సుభద్ర said...

maalagaru,
chaalaa baagumdi..appude ayipooyimdaa?? anpistUmdi..naaku tention modalaindi..meeru maatram bhelEgaa rasaaru..

సుభద్ర said...

hi

psm.lakshmi said...

మాలాగారూ బాగా రాశారు. ఇంక కధలు రాయటం మొదలుపెట్టెయ్యండి.
psmlakshmi

Durga said...

మాలా గారు,
నాకో డౌటు, రాదు రాదు అంటే ముందే మీకు సింపతీ ఓట్ వచ్చేస్తుంది కదాని అలా చెబ్తున్నారు కాని మీకు కథలు రాయడం రాకపోవడం ఏమిటండి?
చాలా బాగా రాసారు! నేను రాస్తున్నాను. విష్ మి లక్!
నేను కూడా బాగానే రాసాను అని చెప్పాలి సరేనా.

జయ said...

చాలా బాగుంది అక్కా. సగటు స్త్రీ జీవన విధానం ఇదే. ఇంతకీ ఆ తలుపు కొట్టిందెవరబ్బా.సస్పెన్స్. మళ్ళీ వచ్చే భాగంలో దుర్గ గారి బ్లాగ్లో చదువుకో మంటావా:) ఓకే.

సి.ఉమాదేవి said...

ఇక మీ సాహితి కథా సాహితే!కథాత్మకమైన మీ బ్లాగులే చెప్తాయి మీరు కథలను రాయగలరని.Good.Keep it up!

మాలా కుమార్ said...

చెప్పాలంటే నండి మరేమో ఏమీ లేదండి :)

* లత గారు ,
థాంక్స్ అండి .

* రుక్మిణి గారు ,
మెసేజ్ గమనించారా ? థాంక్ యు అండి .

మాలా కుమార్ said...

సుభద్రా ,
హాపిగా దుబాయ్ లో షాపింగ్ చేసుకుంటున్నారు , ఇంకేమి టెన్షన్ :)

*లక్ష్మి గారు ,
అంతేనంటారా ? కథలు చెప్పటము కాదు రాయమంటారు :)

*దుర్గా ,
ఉష్ అలా సీక్రెట్ ఔట్ చేస్తే ఎలా హి హి హి .
బాగా రాశానా ? థాంకు .
ముందే చెప్పేస్తున్నా మీరు ఇంకా ఇంకా చాలా బాగారాస్తారు . బెస్ట్ ఆఫ్ లక్

మాలా కుమార్ said...

జయా ,
ఆ తలుపు ఎవరు కొట్టారో మరి దుర్గ గారే చెప్పాలి . నేనూ చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను .

*ఉమా దేవి గారు ,
రచయిత్రి గారే ఇంత మెచ్చుకుంటే అబ్బో అబ్బో అందలం ఎక్కినట్లుందండి . థాంక్ యు .

విశాలి said...

హెల్లో మాల గారు! ఇదిగో మీ బ్లాగు లోకి ఇప్పుడే అడుపెట్టాను. అన్నీ తీరుబడిగా తిరుగుతానండి. థాంక్స్

మాలా కుమార్ said...

విశాలి గారు నా బ్లాగ్ కు స్వాగతం అండి.