Saturday, December 18, 2010

అమ్మ నా కోడలా :)))))
అనగ అనగా ఒక వూళ్ళో కాంతమ్మ అని వొకావిడ వుంది . అదిగో . . . అంత వూళ్ళో కాంతమ్మ అనే వొకావిడేనా ఇంకెవరూ లేరా అని చచ్చు , పుచ్చు ప్రశ్నలడగద్దు . కథ పక్క దారి పడుతుంది . సరే ఆవిడకొక చక్కని చుక్క లాంటి కూతురుంది . ఆ అమ్మాయి పేరు చుక్క . ఓరోజు కాంతమ్మ చెరువు కు నీళ్ళు తేవటానికి , చుక్కను వెంట పెట్టుకొని వెళ్ళింది . చెరువు లో బిందెతో నీళ్ళు ముంచి , బిందెను ఎత్తబోయింది చుక్క . కాలు బురదలో పుసుక్కున జారి ఆ బిందె తో సహా బుళ్ళుక్కుమని నీళ్ళలో మునిగిపోయింది చుక్క . అయ్యో అయ్యో అని కాంతమ్మ కేకలు పెట్టసాగింది . అప్పుడు చక్కనైన ఓ అబ్బాయి వచ్చి , బాధపడకండి , నేను మీ అమ్మాయిని తీసుకొస్తాగా అన్నాడు . మా బాబే మాబాబే నీపేరిమిటినాయనా అంది కాంతమ్మ . ' దాని మొగుడు ' అని చెప్పి గబుక్కున చెరువులోకి దూకాడు దాని మొగుడు . చుక్కను రక్షించి , బయటకు తెచ్చి లాఘవంగా గుర్రమెక్కించుకొని వస్తానత్తా అని దౌడుతీసాడు . చుక్క కూడా కిల కిలా నవ్వుకుంటూ ప్రియుడి సరసన కూర్చొని తుర్రుమన్నది గమనించని కాంతమ్మ లబో దిబో మంటూ ఏడవసాగింది . అప్పుడు దారిన వెళుతున్న వాళ్ళు ఏందుకేడుస్తున్నావు అంటే నా కూతురి ని వాడెత్తుక పోయాడు అన్నది . అయ్యో ఎవరువాడు అని అడిగారు దారినపోయే దానయ్యలు . దాని మొగుడు బాబూ . మా చుక్కను వాడినుంచి రక్షించండి అని ఆదానయ్యలను వేడుకుంది కాంతమ్మ . అంత దాని మొగుడు దాన్నెత్తుకు పోతే ఏడుస్తావేమిటి అని పకపక నవ్వుతూ వెళ్ళిపోయారు దానయ్యలు . . . . . .

ఏమిటీ పొద్దున్నే కథలు చెపుతున్నావు , పనీపాటా లేదా అంటే ఎందుకు లేదు ? ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ముగించి వచ్చా . ఓ పది రోజుల క్రితం మా అబ్బాయి యు.యస్ నుంచి వచ్చాడు . రెండు నెలల క్రితమే ఇక్కడి నుంచి యు.యస్ కు షిఫ్ట్ అయ్యారులెండి . పని మీద ఇటొచ్చాడు . వాడంతే వాడి కాళ్ళకు చక్రాలున్నాయి . ఎప్పుడే దేశం లో , ఏవూళ్ళో వుంటాడో వాడికే తెలీదు ! ఐందా , సరే పిల్లగాడు అంత దూరము నుంచి వచ్చాడు కదా అని రోజూ ఏదో చేసిపెడుతునే వున్నాకాని , ఈ రోజు పొద్దుటి నుంచి కాస్త సుస్త్ గా వుండి గోధుమరవ్వ ఉప్మా చేసాను . మా వాడికి ఉప్మానే ఎక్కదు . అందులో గోధుమరవ్వది .నిన్న తెచ్చిన పుల్లారెడ్డి స్వీట్లు రెండు , మొన్న తెచ్చిన వెల్లంకి చక్కిలాలు రెండు కసా పిసా నములుతూ అబ్బా ఏమిటి మాతే ఈ ఉప్మా ? అన్నాడు మావాడు . నిన్న రాత్రి రగడా కట్లెట్ చేసాను . మొన్న చాట్ చేసాను . ఆలూ పరోఠా , మూలీ పరోఠా , పాలక్ పూరీ ఇలా రోజు చేస్తునేవున్నానుకదరా ఓరోజు ఉప్మా చేస్తే గొణుగుతావు . ఐనా నేను వైన వైనాలు గా వండలేను బాబూ మీ అవిడను వండమను అని నేను , మా ఆవిడను ఇబ్బందిపెట్టకురా వండిందేదో తిను అని మా ఆయనా క్లాసులుపీకితే ఓ చెంచాడు తిని పైకి వాడి రూములోకి వాడు , బాల్కనీ లోకి నేనూ , ఆఫీస్ కు మావారూ , ఎక్కడివాళ్ళం అక్కడ సద్దుకున్నాము .

బాల్కనీ లో కుర్చీలో సెటిలై పేపర్ తీసాను . ఈ సారి న్యూ ఇయర్ పార్టీలు ముందుగానే చేసుకుంటున్నారట . ఆ వార్త చదువుతూ వండగా మేడం అని వినిపించింది . ఎవరా అని చూస్తే ఓ కొరియర్ బాయ్ చేతులో కంట్రీ ఓవెన్ పాకెట్ పట్టుకొని వున్నాడు . ఏమిటీ అంటే అనుపమ గారు , బిపిన్ గారికి యు. యస్ నుంచి ఆర్డర్ చేసారండి అన్నాడు . ఓహో వీళ్ళూ న్యూ ఇయర్ పార్టీ ముందుగానే చేసుకుంటున్నారా , కేక్ పంపినట్లుంది అనుకొని బిపు ను పిలిచాను . బిపు వచ్చి తీసుకొని , కంట్రీ ఓవన్ నుంచి వెజ్ పఫ్ లు పంపింది అను అన్నాడు . హోరినీ అప్పుడే ఎప్పుడు చెప్పావురా గోధుమరవ్వ ఉప్మా చేసానని నువ్వు తినలేదనినూ అని బోలెడు హాచర్యం ప్రకటించా !!!!!

హి హి హి నేను చెప్పలేదు మాతే అన్నాడు బిపు .

ఐతే మీ ఆవిడకు సిక్స్త్ సెన్సా అన్నాను నవ్వుతూ .

యెప్ అని నవ్వుకుంటూ వాళ్ళావిడ పంపిన వెజ్ పఫ్స్ తీసుకొని లోపలికి తుర్రు మన్నాడు !!!!!

అవును మరి వాళ్ళావిడ వాడికి పంపింది :)))

7 comments:

లత said...

బావుందండీ.
మా అబ్బాయి కూడా గోధుమరవ్వ,బొంబాయిరవ్వ ఉప్మాలు దగ్గరికి రానివ్వడు ఒక్క పెసరట్టు వేసినప్పుడు తప్ప.
అసలు ఇంటికి వచ్చేముందే ఉండే నాలుగు రోజులకి మెనూ ఫిక్స్ అయిపోతుంది ఫోన్ లో.

సి.ఉమాదేవి said...

కొత్త సంవత్సరంలో అల్లుడొస్తాడంట! ఏం చేయాలో ఏమిటో మంచింగ్ కు ఏంకావాలో
చక్కని ఐడియాలివ్వండి మాలాగారూ!

సి.ఉమాదేవి said...

కొత్త సంవత్సరంలో అల్లుడొస్తాడంట! ఏం చేయాలో ఏమిటో మంచింగ్ కు ఏంకావాలో
చక్కని ఐడియాలివ్వండి మాలాగారూ!

శివరంజని said...

హహహహహ మాల కుమార్ గారు కధ మాత్రం భలే ఉంది ...చాలా చాలా

రాధిక(నాని ) said...

కథ సూపర్ మాల గారు.:))

మాలా కుమార్ said...

లత గారు ,
ఈ అబ్బాయిలంతా ఇంతేనండి . అమ్మను సతాయించకపోతే తోచదు పాపం :)

& ఉమాదేవిగారు ,
నేనైతే ఇలా స్టఫ్డ్ పరోఠాలు , చాట్ లు చేస్తానండి . కారపూస లాంటివి చేసే వోపిక పోయింది . అందుకే ఇలా వెల్లంకి నుంచో , బాలాజీ నుంచో తెస్తుంటాను . కొత్త సంవత్సరము లో అల్లుడు వస్తున్నాడా ? బెస్ట్ ఆఫ్ లక్ :))))

మాలా కుమార్ said...

శివ రంజని ,
కథ నచ్చిందా ? థాంక్ యు .

&రాధిక గారు ,
థాంక్ యు .