Saturday, June 5, 2010

ముచ్చటగా మూడు కథలు

నేను నా బుక్స్ కొనుకున్నప్పుడల్లా , మా పిల్లల కోసం కూడా కథల పుస్తకాలు కొంటూ వుంటాను . ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు పిల్లలకు కథలు చెప్పుకోవటము ( వాళ్ళు నాకు , నేను వాళ్ళకు ) తప్పనిసరి . ముందుగా కొన్ని బుడుగు కథలు , అందులో కాళిదాసు కవిత్వం కొంత , నా కవిత్వం కొంత కలిపి చెప్పుకున్నాక , వేరే కథలు చెప్పుకుంటామన్న మాట . అందులోని , ముచ్చటగా మూడు కథలు చెపుతాను . ఆలకించండి .

అమ్మ పెట్టేవి రెండు .

ఒకరోజు మా మనవరాలు అదితి అన్నం తినటానికి మారాము చేస్తోంది . అప్పుడు అక్కడ పనిచేసుకుంటున్న , మా పనిమనిషి సుబ్బులు రెండు పీకమ్మా , ఆమే తింటది . మా అమ్మ అంతే చేస్తది అంది . అంతే ఆ పనమ్మాయి పేరుతోనే చిన్నప్పటి నుండి నేను విన్న కథ అదితి కి చెప్పాను . అంతే కాదు , నా మనవలు , మనవరాళ్ళందరికీ అన్నం తినేముందు ఈకథే చెపుతాను . నేను మొదలు పెట్టగానే , సుబ్బలక్ష్మి కథ వద్దు బాబోయ్ , మేము అన్నం తింటాం కాని ఇంకేదైనా కథ చెప్పు అంటారు వాళ్ళు ! వద్దు బామ్మా వద్దు మేము అన్న తింటాము అని మా మనవలు దండాలు మొదలు పెడుతారు . అన్నం మింగావా .. . మింగు లేక పోతే అమ్మమ్మ , సుబ్బలక్ష్మి కథ చెపుతుంది అని పాటలు పాడుతారు . అంత సరదా మా మనవలకి , మనవరాళ్ళకి ఈ కథ అంటే . అంతటి పేరు , ప్రఖ్యాతి కలిగిన కథ ఇది .

అనగనగా ఒక వూళ్ళో సుబ్బలక్ష్మి అని ఓ అమ్మాయి వుంటుంది . ఆ అమ్మాయికి పెళ్ళై అత్తవారింటి కి వెళుతుంది . కొత్త కోడలు వచ్చింది కదా అని మురిపెంగా అత్తగారు , పులిహోర , పాయసం చేసి , కోడలి కి వడ్డిస్తుంది . అప్పుడు సుబ్బలక్ష్మి నాకు మా అమ్మ పెట్టేవి రెండు కావాలంటుంది . ఏమిటమ్మా , మీ అమ్మ పెట్టేవి అని అత్తగారు ఆప్యాయంగా అడుగుతుంది . మా అమ్మ పెట్టేవి అని మాత్రమే అంటుంది సుబ్బలక్ష్మి . కొత్త కదా మొహమాటం పడుతోందేమో చెప్పటాని కి అనుకొని , అత్తగారు , లడ్డూలు చేసి పెడుతుంది .

అబ్బే , సుబ్బలక్ష్మి తింటేనా ?? ఊం హుం ! మా అమ్మ పెట్టేవీ . . . అని మొదలు పెడుతుంది .

సరే పోనీయ్ పాపం అనుకొని అత్తగారు గారెలొండి పెడుతుంది . అబ్బే తినదే ! మళ్ళీ మా అమ్మపెట్టేవీ అని రాగాలు మొదలుపెడుతుంది . ఇంటిల్లి పాదీ వచ్చి , నీకేం కావాలో చెప్పమ్మా , వండిపెడతాము . బంగారు తల్లి వి కదూ ఏడవకమ్మా అని బతిమిలాడుతారు . నాకు ఆకలేస్తోంది , మా అమ్మ పెట్టేవి కావాలి అని ఏడుస్తూ ఎంతసేపటికీ ఆపదే ! అపుడు సుబ్బలక్ష్మి భర్తకు విసుగొచ్చి ఇవి మింగుతావా మింగవా అని రెండు దెబ్బలేస్తాడు . అంతే సుబ్బలక్ష్మి ఏడుపాపేసి , ఇవే మా అమ్మ పెట్టేవి అని ఆనందంగా అని అత్తగారు చేసినవన్ని తినేస్తుంది .

మింగావా మింగు అని కూడా మా పిల్లలు అన్నం దగ్గర పాట పాడుతూ వుంటారు . ఇదండీ అమ్మ పెట్టేవి రెండూ కథ .

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -


ఇక రెండో కథ , కలసివుంటే కలదు సుఖం .

అనగనగా ఒక వూళ్ళో సంజ్యొత్ , సతీష్ ( అను , బిపు ) అనే అమ్మానాన్న వుంటారు . వారికి అదితి , విక్రం ( మేఘ , గౌరవ్ ) అని , ఇద్దరు పిల్లలుంటారు . ఒకరోజు అమ్మ బేగంపేట బేకర్స్ ఇన్ కు వెళ్ళి మంచి కేక్ తెస్తుంది . పిల్లలకిచ్చి మీరు తినండి , నాకు పని వుంది అని లోపలకు వెళుతుంది . నేను కట్ చేస్తాను అంటే నేను కట్ చేస్తాను అని ఇద్దరూ పోట్లాడుకుంటూ వుంటారు . ఎందుకంటే ఎవరు కట్ చేస్తే , వారు పెద్ద ముక్క తీసుకుంటారని రెండోవారికి అనుమానమన్నమాట . ఇంతలో పక్కింటి కరటకుడు వచ్చి నేను ఇద్దరికీ సమానం గా కట్ చేసి ఇవ్వనా అంటాడు . సరే అంటారు పిల్లలు .

కరటకుడు కేక్ ను కట్ చేసి చెరో ముక్కా ఇస్తాడు . అప్పుడు ఊ ఊ అక్కకు పెద్దది ఇచ్చావు , నాకు చిన్నది ఇచ్చావు అని తమ్ముడు ఏడుపు మొదలు పెడుతాడు . ఓహో అవునా , సరే ఐతే అని తమ్ముడి దాని లోనుండి కొంత కట్ చేసి తినేస్తాడు కరటకుడు . అప్పుడు అక్క నాకు చిన్నదిచ్చావు అని గొడవ పెడుతుంది . అప్పుడేమో ఎంచక్కా అక్క కేక్ లోనుండి కట్ చేసి తినేస్తాడు . అలా కేక్ మొత్తం తినేసి , పిల్లలకు టా టా చెప్పి హాపీగా వెళ్ళి పోతాడు . ఇద్దరూ ఏడుపు మొహాలేసుకొని కూర్చుంటారు . అమ్మ వచ్చి , సంగతి తెలుసుకొని , చూసారా , అందుకే సిస్టర్ , బ్రదర్ ఎప్పుడూ పోట్లాడుకో కూడదు . కలిసి మెలిసి వుండాలి . పెద్దవాళ్ళైనా కూడా ఒకరికొకరు ఫ్రెండ్లీ గా వుండాలి అంటుంది . అప్పటి నుండి పిల్లలు పోట్లాడుకోకుండా హాపీ గా కలిసి మెలిసి వుంటారు .

ఇహ కొసమెరుపేమిటంటే ఈ మధ్య ఈకథ చెపుతుంటే ఇంత కష్టం ఎందుకు , హాయిగా స్కేల్ తో కొలిచి కట్ చేసుకుంటే ఐపోతుంది కదా అంటున్నారండి , మా పిల్లలు . ఇదీ ఈ కథ ఎఫ్ఫెక్ట్ !!!!!!

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

ముచ్చట గా మూడో కథ :

ఆడిన మాట తప్పరాదు .

ఒకసారి అమ్మ అను ( సంజు ) , పిల్లలు , మేఘ , గౌరవ్ ( అదితి , విక్రం ) లను అడివికి పిక్నిక్ కు తీసుకెళుతుంది . చాలా సేపు ఆడుకున్నాక పిల్లలు అలిసి పోతారు . వాళ్ళదగ్గర వున్న నీళ్ళు ఐపోతాయి . అందుకని అమ్మ , పిల్లలూ మీరిక్కడే వుండండి , నేను ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో చూసి తెస్తాను అని , నీళ్ళు వెతుక్కుంటూ వెళుతుంది . ఇంతలో ఓ పులి గాండ్రు మంటూ అమ్మ మీదికి వస్తుంది . అప్పుడు అమ్మ అయ్యో నా పిల్లలు అనుకుంటుంది .
పులీ , పులీ , ప్లీజ్ ,ప్లీజ్ నన్నొదిలేయవా , నా పిల్లలు అక్కడ వొంటరిగా వున్నారు అని పులిని వేడుకుంటుంది .

ఆ నిన్నొదలను . నాకు చాలా రోజులకు ఆహారం దొరికింది అని గాండ్రిస్తుంది పులి .

అయ్యో , నా పిల్లలు అడవిలో ఒంటరి వాళ్ళై పోతారు . చాలా చిన్న పిల్లలు . ఇంటికి దారి కూడా తెలీదు . పోనీ వాళ్ళను ఇంటిదగ్గర వదిలేసి వస్తాను ప్రామిస్ అంటుంది అమ్మ .

సరే . నువ్వు తిరిగి రాక పోయావో , మీ ఇంటికి వచ్చి నీ పిల్లలను కూడా తినేస్తాను . పో , వాళ్ళను దింపేసి తొందరగా రాపో అని పర్మిషన్ ఇస్తుంది పులి .

అమ్మ పిల్లలను ఇంటిదగ్గర దింపేసి వాళ్ళను వదలలేక వదలలేక వదిలేసి ఏడ్చుకుంటూ పులి దగ్గరకు తిరిగి వస్తుంది . అప్పుడు పులి , అమ్మ చేసిన ప్రామిస్ ను తప్పలేదని , అమ్మను చాలా మెచ్చుకొని , నీ పిల్లల దగ్గరకే వెళ్ళిపో అని అంటుంది . అమ్మ పులికి థాంక్స్ చెప్పి , సంతోషం గా ఇంటికి తిరిగి వస్తుంది . కాబట్టి ఎప్పుడు కూడా ఆడిన మాటను తప్పరాదు అని నీతి .

( నా మొహం . ఇప్పుడైతే ఈ కథ మొదలు పెట్టగానే మా పిల్లలు అడవికి వెల్లేటప్పుడు గన్ తీసుకెళితే సరి . అప్పుడు ఏ ఆనిమల్ వచ్చినా కాల్చేయొచ్చు అంటారండి మా పిల్లలు . ఇవన్ని పంచతంత్రం మొదలైన పుస్తకాల లోవే . కాకపోతే కాస్త మార్చి వాళ్ళ పేర్ల తో చెపితే ఇంట్రెస్ట్ గా వింటారని ఇలా చెపుతానన్నమాట . కాక పోతే చిన్నపుడు బాగానే వినేవారు . ఇప్పుడే ఇలా తెలివి మీరిపోయారు హుం ! )

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - -

ముసలమ్మ సూది కథ కొనసాగింపు

మా అమ్మమ్మ అలా నేనేదంటే అలా నటే సూది వస్తుందా అని అడుగుతూ వుండేది . ఇహ విసుగూ , కోపం వచ్చి పక్కకు తిరిగి పడుకునేదానిని . కాసేపైనాక అమ్మమ్మ అమండూ నిద్రపోయావురా అని అడిగేది . అమ్మమ్మ , ముసలమ్మ సూది ఎలా వస్తుందో చెపుతుందేమోనని ఆశ తో గబ్బుక్కున లేదమ్మమ్మా అంటూ లేచి కూర్చునేదానిని . చటుక్కున అమ్మమ్మ లేదమ్మమ్మా అంటే సూది వస్తుందా అని అడిగేది . అంతే ఉక్రోషం తో మాట్లాడకుండా పడుకుండి పోయేదానిని . అప్పుడు అమ్మమ ' బూచివాడు వచ్చి బుట్ట్లల్లుతున్నాడు ' అని పాడటము మొదలు పెట్టేది . మా అమ్మమ్మ చాలా బాగా పాడేది . నాకు ఈ పాటలో ఈ ఒక్క చరణమే గుర్తుంది . చిరు చీకటిలో , కింద నుండి తడి మట్టిమీద నుండి సువాసనలు తేలుతూ వస్తున్న చల్లటి గాలి లో , అమ్మమ్మ సన్న సన్నగా పాడుతున్న పాట తో ఎప్పుడు నిద్ర పోయే దాని నో నాకే తెలీదు .

నా మనవళ్ళు , మనవరాళ్ళు ఎంతసేపటికీ నిద్ర పోకుండా ఇంకా ఇంకా కథలని వేధిస్తూ వుంటే నేనూ ఈ కథే చెప్పి , మా అమ్మమ్మ ట్రిక్నే ఉపయోగిస్తాను . కాక పోతే అమ్మమ్మ అంత మధురంగా పాడ్లేను . అసలు పాడనే లేను , కాని ఇదో ఈపాట తో వాళ్ళను నిద్ర పుచ్చుతాను .

ఆటలు ఆడి , పాటలు పాడి అలసి పోయానే
తియ్యా తియ్యని తాయిల మేదో తీసీపెట్టమ్మా .

గూటి లోని బెల్లం ముక్క కొంచం పెట్టమ్మా
చాటలోని చాయా పప్పూ చారెడు పెట్టమ్మా
అటకా మీది అటుకుల పళ్ళెం అమ్మా దింపమ్మా
తియ్యా తియ్యని తాయిల మేదో తీసి పెట్టమ్మ .

ఆటలు ఆడి పాటలు పాడి అలసీ పోయామే
తీయా తీయని తాయిల మేదో తీసీ పెట్టమ్మా .

10 comments:

ఖలీల్ జీబ్రాన్ said...

ఆ రెండో కధలో కరటకు లు ఎవరు ?
చిన్న పిల్లల దగ్గర కేక్ తీసుకొని తినేస్తోందా మీ సుబ్బులు

Kalpana Rentala said...

మాలా గారు,
మా అందరి కోరికను మన్నించి మీరు మరిన్ని కథలు చెప్తున్నందుకు సంతోషం.
ముచ్చటగా మూడు కథలు మీరు మార్చి చెప్పటం బావుంది. మీరన్నట్లు ఇప్పటి పిల్లల్లో ఒకనాటి అమాయకత్వం వుందటం లేదు అందువల్లే మనం కొత్త కొత్త కథల కోసం ప్రయత్నించటం. ఈ పాత కథలు వాళ్ళకు ఇప్పుడు బోర్ గా అనిపించినా పెద్దయ్యాక ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటున్నట్లే వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటారు.
కల్పన

lalithag said...

మీరు చెప్పిన పాట నండూరి పబ్లికేషన్స్ వారి "జేజి మామయ్య" పాటల పుస్తకంలో కనిపించింది.

ఇక్కడ జేజి మామయ్య పాటలు అనే లింకు మీద నొక్కితే ఆ పాటలు కొన్ని చూడచ్చు.
http://www.telugubhakti.com/telugupages/Pdfs/Children/ugadispecial.htm

మాలా కుమార్ said...

ఖలీల్ జీబ్రాస్ గారు ,
పాపం మా సుబ్బులును అనుమానించకండి . అది వాళ్ళ అమ్మ పెట్టేవి రెండూ తింటేకాని ఏమీ తినదు .

మాలా కుమార్ said...

కల్పన గారు ,
మా మధుర స్మృతులను అందరి తో పంచుకునే అవకాశం కలిపించిన మీకు చాలా థాంక్స్ అండి .
పిల్లలు అలా వాదిస్తారు కాని ఆ కథలన్నీ వాళ్ళకు చాలా ఇష్టమండి . అందులో వాళ్ళను ఇన్వాల్వ్ చేసేసరికి మరింత శ్రద్ధగా వింటారు . మీకు మళ్ళీ , మళ్ళీ ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

లలిత గారు ,
మీరిచ్చిన లింక్ చూసానండి .,చాలా సంతోషం వేసింది . ఆ పాట మా చిన్నప్పుడు రేడియో , బాలానందం లో నేర్చుకున్నది . మీరిచ్చిన లింక్ లో చూసి , నాకు ఇన్ని సంవత్సరాలైనా చాలా నే గుర్తుందే , ఎక్కువ మర్చి పోలేదే అని నన్ను నేను అభినందించుకున్నానండి . అప్పుడే ఒక పెళ్ళి పాట కూడా నేర్చుకున్నాము . మా బొమ్మల పెళ్ళికి పాడుకునే వాళ్ళము . అది ,
బుజ బుజ రేకుల పిల్లుందా , బుజ్జా రేకుల పిల్లుందా
స్వామీ రేకుల పిల్లుందా , స్వరాజ్యమొచ్చిన పిల్లుందా
ఇలా వుండేది . సరిగ్గా గుర్తులేదు . మీకు చాలా థాంక్స్ అండి .
నేను అతివల బ్లాగ్స్ గురించి రాసినప్పుడు , మిమ్మలిని మిస్ ఐనట్లున్నాను . సారీ .

నేస్తం said...

మాల గారు కధలు భలే మార్చి చెప్తున్నారే.. మా పిల్లల్లు అంతే ..మొన్న ఒకసారి అలా ఆ రాజుగారి కళ్ళు తెరుచుకున్నాయి అనగానే .. అప్పటివరకూ కళ్ళు మూసుకున్నాడా అని అన్నారు.. పైగా ఒక అడవిలో పులి ఉందిట ... అది జంతువులను వేటాడుతుందట అని చెప్పితే అర్ధంకావడం లేదు వీళ్ళకు :( ఒక ఫారెస్ట్లో ఒక టైగరు ఏనిమల్స్ ని చేజ్ చేసి తినేది అని చెప్పాలి :( ... నాకసలే 'నెయిల్ కట్టర్ 'అనే పదాన్ని కూడా 'గోళ్ళ కత్తెర ' తీసుకురా అని పలకకపోతే ప్రశాంతంగా ఉండదు..:)

lalithag said...

మాలాకుమార్ గారూ,
ఈ పాట కొన్నేళ్ళ క్రితం ఎవరో అడిగితే నా దగ్గరున్న సీడీలో విని అనుకుంటా రాసేందుకు ప్రయత్నం చేసి వారికి పంపించాను. ఆ విషయం కూడా మర్చిపోయాను. అనుకోకుండా కనిపించింది. మీరు గుర్తు చేశారు కదా అని ఇక్కడ రాస్తున్నాను.
కొన్ని చోట్ల చుక్కలు పెట్టాను, పాట అర్థం కాక. ఎవరైనా ఆ ఖాళీలు పూర్తి చెయ్యగలిగితే సంతోషిస్తాను.
ఇంకా, దీనికి స్ఫూర్తి అనిపించే ఇంకో పాట ఇక్కడ:
http://andhrabharati.com/dEshi/jAnapadagEyamulu/ellOrA2/ellOrA223.html

----------
బుజ బుజ రేకుల పిల్లుందా
బుజ్జా రేకుల పిల్లుందా
స్వామీ దండల పిల్లుందా
స్వరాజ్యమిచ్చిన పిల్లుందా

బుజ బుజ రేకుల పిల్లుందీ
బుజ్జా రేకుల పిల్లుందీ
స్వామీ దండల పిల్లుందీ
స్వరాజ్యమిచ్చిన పిల్లుందీ


పిల్ల పేరేంటి
మహలక్ష్మి

బుజ బుజ రేకుల కేం నగలు
బుజ్జా రేకుల కేం నగలు
స్వామీ దండల కేం నగలు
స్వరాజ్యమిచ్చిన వేం నగలు

..... నెలవంకా

బుజ బుజ రేకుల మాకొద్దు
బుజ్జా రేకుల మాకొద్దు
స్వామీ దండల మాకొద్దు
స్వరాజ్యమిచ్చిన మాకొద్దు

బుజ బుజ రేకుల జడగంటుంది
బుజ్జా రేకుల వడ్ఢాణముంది
స్వామీ దండల కాసులపేర్
స్వరాజ్యమిచ్చిన రత్నాలపేర్

బుజ బుజ రేకుల మాకొద్దు
బుజ్జా రేకుల మాకొద్దు
స్వామీ దండల మాకొద్దు
స్వరాజ్యమిచ్చిన మాకొద్దు

బుజ బుజ రేకుల కేం కావాలి
బుజ్జా రేకుల కేం కావాలి
స్వామీ దండల కేం కావాలి
స్వరాజ్యమిచ్చిన ఏం కావాలి

బుజ బుజ రేకుల విద్యా జ్ఞానం
విద్యకు తగిన వినయం శాంతం
సంగీత సాహిత్య జ్ఞానం
కలిగుందా మీ మహలక్ష్మి?

విద్యా జ్ఞానం కలిగుంది
వినయం శాంతం కలిగుంది
గానం గాత్రం కలిగుంది,
..... మహలక్ష్మి

మరి మీ పిల్లాడూ?
మీ పిల్లాడి పేరేంటి?

మాధవుడు

మరి మీ మాధవుడికి,

బుజ బుజ రేకుల చదువుందా
బుజ్జా రేకుల గుణముందా
చదువూ, గుణమూ, సంపదలూ
కలిగున్నాడా, మాధవుడు?

బుజ బుజ రేకుల చదువుంది
బుజ్జా రేకుల గుణముంది
చదువూ, గునమూ, సంపదలూ
కలిగున్నాడూ, మాధవుడు?

కట్నాలేంటి?

బుజ బుజ రేకుల కట్నాలొద్దు
బుజ్జా రేకుల కానుకలొద్దు
కట్నం కానుకలన్నిటికీ
సరి అవుతుందీ మహలక్ష్మి

ఆనంద మానంద మాయెనే
మా మహలక్ష్మి పెళ్ళి కూతురాయెనే
ఆనంద మానంద మాయెనే
మా మాధవుడు పెళ్ళి కొడుకాయెనే
------------

lalithag said...

మాలా గారూ,
మీ మనవళ్ళను కథలలో మీరు ఇన్వాల్వ్ చేసే ప్రయత్నాన్ని ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళగలరా?
రెండు లింకులిస్తున్నాను.

http://balasahityam.blogspot.com/2010/05/blog-post_10.html

http://kottapalli.in/2010/06/బొమ్మకు_కథ_రాయండి

ఒక దాంట్లో కథ పొడిగింపు, ఇంకో దాంట్లో బొమ్మకు కథ రాయడం.
పిల్లలతో పంచుకుని వారి ఆలోచనలు మీరు ఈ వేదికల మీద పంచుకుంటారా?
ఇలాగే మీ బ్లాగ్ముఖంగా ఉత్సాహవంతులైన పిల్లలున్న ఉత్సాహవంతులైన తల్లిదండ్రులందరికీ ఇది విజ్ఞప్తి.
Thanks in advance.

సుభగ said...

మాలా గారు,
చిన్నప్పుడు ఎప్పుడైనా గొడవ చేస్తే 'అమ్మ పెట్టేవి రెండూ పెడితే కాని మీరు దారికి రారు' అంటుండేది అమ్మ..
దీని వెనుక ఒక కథ కూడా ఉన్న సంగతి నాకు తెలియదండోయ్! తెలియజేసినందుకు నెనర్లు..