Wednesday, June 2, 2010

మాగాయే మహా పచ్చడి !!!
మాగాయే మహా పచ్చడి ,
పెరుగేస్తే మహత్తరి ,
అదివేస్తే అడ్డవిస్తరి ,
మానీయా మహా సుందరి.

అన్నారండి పెద్దలు . మాగాయ రుచి మహా గొప్పది . ఏ కూరలు చేసే ఓపిక లేనప్పుడు , పెరుగన్నం లో మాగాయ కలుపుకుని తిన్నామనుకోండి , గిన్నెడన్నమూ ఒక్కరికి కూడా సరి పోదు ! అందుకే నేను కూర వండటానికి బద్దకించను . అలాగే ఏ దోశో , చపాతి నో చేసుకొని , కూర వండే టైం లేక , శ్రీవారు బయటకు వెళ్ళే తొందర లో వున్నప్పుడు , కూర వండటము ఇంకా కాలేదా అని కోపం తో చిందులు తొక్కుతున్నప్పుడు , కొద్దిగా మాగాయ , పెరుగులో కలిపి , మెంతులు , ఇంగువ వేసిన ఘుమ ఘుమ లాడే పోపు వేసామను కోండి కోపం గీపం పోయి శుభ్రం గా లాగించేస్తారు .

అంతటి మహత్తరమైన మాగాయ మేము చేసే విధానము : -

పెద్ద సైజు మామిడికాయలు - 20
ఉప్పు - 4 పావులు
ఖారం - 2 పావులు
మెంతులను ఎర్రగా వేయించి కొట్టుకున్న మెంతి పొడి - అర్ధ పావు
ఆవపిండి - అర్ధ పావు
పసుపు
నువ్వుల నూనె - 1 1/2 కిలో
ఎండుమిరపకాయలు ,
మెంతులు -
పాల ఇంగువ ,
ఈ చివరవి మూడూ పోపుకు సరిపడ

చేసే విధానము : -
మామిడి కాయలను శుభ్రం గా కడిగి , తుడిచి , తొక్కతీసి మనకు కావలసినట్లు గా ముక్కలు కోసుకోవాలి . టెంక అవసరము లేదు . ఆ ముక్కలలో నాలుగు పావుల ఉప్పు , కొద్ది గా పసుపు వేసి బాగా కలుపు కోవాలి . ఒక జాడీ లోకి తీసుకొని మూత పెట్టి మూడు రోజులుంచాలి . మూడో రోజు ఆ ముక్కల లోని నీటిని గట్టిగా పిండి , వాటిని ఎండ లో పెట్టాలి . ఆ ఊటను పారబోయ కూడదు . మధ్య మధ్య లో నెరుపుతూ కచ్చా పచ్చా గా ముక్కలను ఎండనీయాలి . అంటే మరీ ఎండిపోయినట్లు కాకుండా , కొద్దిగా పచ్చిగానే వుండనీయాలి . ఆ తరువాత ముక్కలకు , ఎండ వేడి తగ్గిన తరువాత , ఒక పెద్ద బేసన్ లోకి తీసుకోవాలి . ఊటను ఒక సన్నని బట్ట తో వడకట్టుకొని ( గట్టిగా బట్టను పిండవద్దు . తేలికగా ఆ రసమును రానివ్వాలి ) , ఆ రసమును , రెండు పావుల ఖారం ను , అర్ధ పావు ఆవపిండి , అర్ధ పావు మెంతి పిండి , ఆ ముక్కలలో వేసి బాగా కలపాలి . ఒక బాణలి లో కిలోన్నర్ర ఇదయం నువ్వులనూనె ను పోసి , బాగా కాచాలి . నూనె బాగా కాగాక కొద్దిగా మెంతులు , ముచ్చికలు తీసిన కొన్ని ఎండుమిరపకాయలు వేసి ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి . ఆ తరువాత మంట తగ్గించి , పొడి చేసుకొని వుంచుకున్న పాల ఇంగువను వేసి వెంటనే , ఆ నూనె ను మాగాయ ముక్కలలోకి వంచేయాలి . ఇంగువ వేసినప్పుడు జాగ్రత్తగా వుండాలి ఎందుకంటే , కొన్ని సార్లు ఇంగువ వేయగానే నూనె పొంగుతుంది . ఆ తరువాత నూనె చల్లారాక మాగాయను జాడి లో భద్ర పరుచుకొని ఆరగించటమే !చుందా

ఈ ఆవకాయ , మాగాయ పెట్టినప్పుడు , ముక్కలు కోసే సమయము లో , అందులోనూ ఈసారి రెండు సార్లు ఆవకాయ పెట్టటముతో ఓ పది మామిడికాయల ముక్కల వరకూ మిగిలి పోయాయి . వాటిని ఏమి చేయాలా అని మా ఫ్రెండ్ ప్రభను అడిగాను . చుందా చేసేయ్ అంది . అసలు పిల్లలు చుందా తింటారా తినరా కనుక్కొని చేద్దాం , లేక పోతే వేస్ట్ అవుతుంది అనుకొని , మా కోడలికి ఫోన్ చేసి అడిగాను . తను కాసేపు ఆలోచించి నేను తీపి తినను కదా ఆంటీ , ఐనా కొత్త వెరైటీ చేస్తున్నారు కదా కొద్దిగా ఇవ్వండి అన్నది . మా అమ్మాయిని అడుగుతే అమ్మా చుందానా వెంటనే నేర్చుకొని , చేసేసెయ్ . సతీష్ , మా మాగారు ఎప్పుడూ బడీచావిడీ జోషీ షాప్ నుంచి కొనుక్కొస్తారు అంది . అమ్మయ్య అనుకొని ప్రభాకు చేద్దాము , చూపించు అని చెప్పాను . మీ కోడలు తీపి తినదా ఐతే కొద్దిగా ఖారం ది చేద్దాం అన్నది .

చుందా చేసే విధానము : -
పది మామిడికాయలను ( ముక్కలను ) తురమాలి . ఆ తురుమును లో ఓ పావు ఉప్పును కలిపి కొద్ది సేపు ఉంచాలి . ఆ తరువాత ఊరిన నీటిని పైపైన పిండాలి . అంటే నీరు మొత్తం తీసేయకుండా కొద్ది తడిని వుండనీయాలన్న మాట . ఆ తురుమును కొలుచుకొని దానికి రెట్టింపు పంచదారను వేసి బాగాకలిపి ఓ రెండు దాల్చిని ముక్కలను అందులో వేసి , దానిని ఓ గిన్నలో వేయాలి . ఆ పైన ఓ శుభ్రమైన బట్టను , ఆ గిన్నెకు వాసెన కట్టి ఎండలో పెట్టాలి . మధ్య మధ్య లో కలుపుతూ , పంచదార బాగా కరిగి , తీగ పాకం లా అయ్యేంత వరకూ ఎండ లో వుంచాలి . రెండు రోజలో అవుతుంది . అప్పుడు అందులో , జీలకర్రను దోరగా వేయించి కొట్టుకున్న పొడిని ఓ చెంచాడు కలపాలి . సగము విడిగా తీసుకొని అందులో మన టేస్ట్ ప్రకారము ఖారం కలుపుకుంటే సరి . తీపి , ఖారం చుందా రెడీ . ఇది జాం లాగా బ్రెడ్ లోకి , చపాతిలలోకి బాగుంటుంది . ఎండాకాలం పిల్లలకు మంచిది .

ఇహ తురుమును పిండిన నీటి లో , దానికి రెట్టింపు పంచదార వేసి , ఓ సీసాలో పోసి , మూత బెట్టి ఎండలో పెట్టాలి . రెండు రోజులలో పంచదార కరిగి , మాంగో షరబత్ రెడీ .

లేదా ఆ ఊటలో పోపేసుకొని పచ్చి పులుసు చేసుకోవచ్చు .

ఇవండీ ఈసారి నేను చేసిన పచ్చడులు , చుందానూ .

3 comments:

జయ said...

చాలా బాగుంది మాగాయ. నోరూరిపోతోంది.

భావన said...

అబ్బబ్బ మాగాయ కు తిరుగే లేదండీ బాబు. నేనైతే వరుగులు చేసి తెచ్చుకుని అప్పుడప్పుడు మాగాయ కలుపుకుంటా ఇక్కడ. ఏంటో వుప్పు ఎక్కువ తినటం మంచిది కాదు ఫ్యూచర్ లో బీపీ వస్తుంది అని మా అక్క పచ్చళ్ళు ( మా అక్క డాక్టరీ గిరి వెలగ పెట్టింది లే) ముఖ్యం గా మాగాయి మానెయ్ అంటుంది కాని అబ్బబ్బ ఆ పచ్చడీ తిరగమోత తలుచుకుంటే.... ఎందుకులే... :-(

మాలా కుమార్ said...

జయ ,
భావన ,
థాంక్ యు .