Sunday, May 30, 2010
అమ్మ చెప్పిన కథ
నేను ఆవకాయ పని లో వుంటే అందరూ కథలు చెప్పేసుకుంటున్నారే ! ఐతే నా ఆవకాయల పోస్ట్ ల కు కామా పెట్టాల్సిందే ,
రాత్రి ఆరుబయట పడుకున్నపుడు అమ్మ చెప్పే కథలంటే చాలా చాలా ఇష్టం గా వుండేది . ఎన్ని కథలు చెప్పినా కర్ణుడి కథ తప్పకుండా చెప్పాల్సిందే . అడిగి మరీ చెప్పించుకునే దానిని . చెప్పేంతసేపూ ఏడుస్తూ వుండే దానిని . నువ్వేడుస్తున్నావు చెప్పనంటే ఏడవనమ్మా అని బతిమిలాడి మరీ చెప్పించుకునేదానిని . కర్ణుడి కథ తరువాత స్థానం కృష్ణదేవరాయుడి ది . నేను పుట్టినప్పుడు మా నాన్నగారు తుంగభద్ర ప్రాజెక్ట్ దగ్గర పనిచేసేవారట . అందుకని ఎక్కువగా హంపీ వెళ్ళే వారట . దాని తో అమ్మ , ఆ హంపీ వీధులను వర్ణిస్తూ కథ చెపుతుంటే , నాకు హంపీ లో వున్నట్లుగా నే వుండేది .ఆ రెండు కథలు తప్ప ఇంకేవీ చెప్పనిచ్చేదానిని కాదు . అలా చిన్నప్పటి నుండి కర్ణుడన్నా , శ్రీకృష్ణదేవరాయుడన్నా ఆరాధన ఏర్పడింది . ఆ తరువాత బుడుగు కథ . బుడుగు కథ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను .
నా మనవళ్ళూ , మనవరాళ్ళకు కూడా నేను చెప్పే కథలు చాలా ఇష్టం . ప్రతి రోజూ బుడుగు కథ చెప్పుకోకుండా పడుకోము . నా పేరు బుడుగు , మా బామ్మ నన్ను హారి పిడుగా అంటుంది దగ్గర నుండి , చివరలో వున్న గ్రూప్ ఫొటో వరకూ అందరికీ కంఠతా వచ్చు ! ఐదారేళ్ళ పిల్లలకెవరికైనా గిఫ్ట్ ఇవ్వలంటే నేను బుడుగు పుస్తకం ఇస్తాను .
- - - - - - - - - -- - - - - - -- - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
ముసలమ్మ సూది కథ
మా అమ్మనే కాదు మా అమ్ముమ్మను కూడా కథలు చెప్పమని వేధించేదానిని . సెలవల్లో మా చింతలపాడు వెళ్ళినప్పుడు , సాయంకాలము ఆరు బయట వరండా నీళ్ళ తో కడిగి , పక్కలు వేసేవారు . ఇహ అమ్ముమ్మ పక్కన చేరి ఎన్ని కథ లో . మా ఆమ్ముమ్మ పేరు మా కెవరికీ తెలీదు , ఎందుకంటే ఎవరూ పేరు పెట్టి పిలిచేవారు కాదు కదా . అందుకన్న మాట . అందుకే అమ్మమ్మ పేరు తెలుసుకోవాలని మహా కోరిక గా వుండేది . నీ పేరు చెప్పు అమ్మమ్మా అంటే పేరు మర్చి పోయిన ఈగ కథ చెప్పేది . ఆ కథ నేను కొత్తగా చెప్పేదేముంది అందరికీ తెలిసిందే కదా . ఎంతకీ నిద్ర పోక కథలని వేధించే మాకు ఓ పొడుపు కథ చెపుతాను అది విప్పండి , ఆ తరువాత ఇంకోటి అని , మా అమ్ముమ్మ చెప్పిన కథ :
అనగనగా ఒక వూళ్ళో వొక పేద ముసలమ్మ వుంది . పాపం ఆమెకు ఎవరూ లేరు . కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు . ఐనా అలాగే కాలం వెళ్ళ దీసుకుంటూ వుంటుంది . ఇంతలో చలి కాలం వస్తుంది . కప్పుకోవటానికి ఏమీ లేవు . అందుకని తన దగ్గర వున్న పాతబట్టలతో బొంత కుట్టుకుందామనుకుంటుంది . సరే , పెరట్లో వున్న బావి గట్టు మీద కూర్చొని కుట్టుకుంటూ . . . కుట్టుకుంటూ . . . వుండగా సూది బావి లో పడి పోతుంది . పాపం పేద ముసలమ్మ కదా , ఇంకో సూది కూడా లేదు . ఇప్పుడు ఆ సూది ఎలా బయటకు వస్తుంది ?
" అవునమ్ముమ్మా ఎలా వస్తుంది ? "
" అవునమ్ముమ్మా ఎలా వస్తుంది అంటే వస్తుందా "
" అట్లా అనగానే ఎట్లా వస్తుందమ్ముమ్మా , ఎట్లా వస్తుందో చెప్పు "
" ఎట్లా వస్తుందో చెప్పు అంటే వస్తుందా "
" అబ్బా , అమ్ముమ్మా చెప్పు "
" అబ్బా అమ్ముమ్మా చెప్పు అంటే వస్తుందా "
" హుం"
" హుం అంటే వస్తుందా "
" ఎట్లా వస్తుంది చెప్మా "
" ఎట్లా వస్తుంది చెప్మా అంటే వస్తుందా "
? ? ? ? ? ? ?
( ఈ పోస్ట్ ను ఏదో కాస్త ఎడిట్ చేద్దామని ఓపెన్ చేస్తే పాపం ఎటో వెళ్ళి పోయింది . గురూజీ సాయం తో వెతికి తెచ్చాను , కాని దీనికి వచ్చిన ఒకేఒక కామెంట్ ను తిరిగి తేలేక పోయాను . కిరణ్ గారు , మీ కామెంట్ను నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి )
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
ఇదీ కిరణ్ గారి కామెంట్
meeru alaa aapeste ela vastundi chepmaa???
suudi ippinchi post aipo chesi undachu kada..?? :)
మాలా గారూ,
ఆ సూది ఎట్లా వస్తుందో చెపుదురూ.. ప్లీజ్..
ee katha purthiga cheppaledu????
మాలా గారూ,
ఆ సూది ఎలా వస్తుందో చెప్పండి..ఎంత ఆలోచించిన తట్టట్లేదు :-)
కిరణ్ గారు ,
మీరు అలా ఆపేస్తె ఎలా వస్తుంది చెప్మా???
సూది ఇప్పించి పొస్ట్ ఐపొ చెసి ఉండచు కద..?? :)
అంటే సూది వస్తుందా ?
& మధురవాణి ,
మాలా గారు ,
ఆ సూది ఎట్లా వస్తుందో చెపుదురూ . . ప్లీజ్
అంటే వస్తుందా ?
అశోక్ పాపాయి గారు ,
కథ పూర్తిగా చెప్పలేదూ అంటే ఆ సూది వస్తుందా ?
& రాధిక గారు ,
మాలా గారూ ,
ఆ సూది ఎలా వస్తుందో చెప్పండి . . ఎంత ఆలోచించినా తట్టట్లేదు :-)
అంటే ఆ సూది వస్తుందా ?
ఎన్ని కామె౦ట్స్ వస్తే అ౦త త్వరగా వస్తు౦ది కదా!!
ఆ సూది రాదు....మనతో విసుగువచ్చేవరకు మన౦ ఏమన్నా "అ౦టే వస్తు౦దా’అ౦టె వస్తు౦దా" అని అ౦టారు కదా!!!నాకు తెలుసుసోచ్చ్ ఈ కధ..
చాలా మ౦చి కధ గుర్తు చేశారు మాలగారు..నాకు ఒక్కొక్కటే చిన్నప్పటి కధ గుర్తు వస్తున్నాయి..ఇక నా పోస్ట్ చదవాటనికి రడీ అవ్వ౦డి..
మాలా కుమార్ గారు, అసలా సూది రాదంటే రాదు ..అంతే .. :-)
అవును ఆ సూది రాదంటే రాదు కదా మాలాకుమార్ గారు. ఇలాంటి కథలతో మనల్ని తెగ ఏడిపించి నవ్వించేవారు మన అమ్మమ్మలు, తాతయ్యలు. థాంక్స్ మాలకుమార్ గారు. ఇంకా కొత్త కథలు ఏవీ? మీరు చెపితే మేము వినటానికి రెడీ.
Post a Comment