రధచోదకుడు
మాలాకుమార్
మా వారికి , రాజమండ్రి లో వర్క్ వచ్చింది .
ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనుకుంటూ కోనసీమ అందాలు చూడబోతున్నానుకదా , అని మహదానందంగా , మావారి తో పాటు , నేను , చుటికి బయిలుదేరాము . మన వీలు ప్రకారము
ప్రయాణము చేయవచ్చని , మావారు , కార్ లో
వెళుతే మనకు కావలసిన చోట ఆపుకోవచ్చని నేను , చాలావరకు
కార్లోనే వెళుతుంటాము. వర్క్ మొదలుపెట్టే హడావిడి లో మావారు , కొత్త డ్రైవర్ నరసింహ డ్రైవింగును , మద్య మధ్య లో
స్లొరా నరసింహ , అంటున్నారే కాని ఎక్కువగా పట్టించుకోలేదు .
రాజమండ్రి చేరగానే , సీతారామయ్యగారి మనవరాలు లోని ఇంటి లాంటి
ఇల్లును ఊహించుకున్న నాకు , మా ఇల్లు చూసి నిరాశకలిగింది ,
కాని పోనీలే గోదావరి అందాలకు దగ్గరగా వున్నాను కదా అని సంతోషించాను
.
మావారు
పొద్దున్నే వర్క్ దగ్గరికి వెళ్ళిపోయారు . మద్యాహ్నము నరసింహ వచ్చి సార్ అక్కడికే
కారియర్ తెమ్మన్నాడమ్మా అన్నాడు. మరి నువ్వు తిన్నావా అంటే లేదమ్మా అన్నాడు . సరే
నువ్వు తినేసి సార్ కు తీసుకుపో అని వాడికి వడ్డించాను . తింటూ తింటూ బొట బొటా
కన్నీళ్ళు కార్చటము మొదలెట్టాడు . నాకు గాభరా వేసి , ఏమైంది నరసింహ అంటే , “నువ్విట్లా అన్నం పెడుతుంటే మా అమ్మ యాదికొస్తోందమ్మా” అని ఏడవటము మొదలు పెట్టాడు .
“ ఓరినీ దుంపతెగ , మీ అమ్మ
యాదికొస్తే అన్నం ముందు ఆ ఏడుపేమిటిరా నాయనా , ముందా ఏడుపు
ఆపు” అన్నాను .
“ఇప్పుడేనమ్మా నేను మా అమ్మని వదిలిరావుడు . హైదరాబాద్
లో అని కొలువులో చేరిన , సారేమో ఇంతదూరం తెచ్చిండు “. అని కాసేపు భాధ పడి వెళ్ళాడు .
మా
డ్రైవర్ నరసింహ 22
/ 23 సంవత్సరాలవాడు . వాళ్ళ అమ్మా వాళ్ళూ కొత్తపేట లో వుంటారు .
కొత్తగా పనిలో చేరాడు . చిన్నవాడు కాబట్టి నాతో చనువుగా మాట్లాడుతుండేవాడు . పైగా
నన్ను చూస్తే వాడికి అమ్మ యాదికొస్తోంది . అంతవరకు బాగానే వుంది , కాని ప్రతిపూటా అన్నం ముందు ఏడుపే ! వాడి ఏడుపు చూసి నాకు గుండె దడ !
తిరిగెళ్ళేటప్పుడు , కొత్తపేటలో వాడి కి తెలిసిన సేటు దగ్గర
కొంచం ధర తగ్గించి చీర ఇప్పిస్తానన్నాడు . దారిలో ఆలంపూర్ లో మహిమగల తల్లి వుంది
చూపిస్తా నన్నాడు . వాళ్ళ వూరి కబురులన్నీ చెప్పేవాడు . ఇదేమిటో , ఎంతో ఊహించుకొని రాజమండ్రి వచ్చి , మావారేమో పనిలో, నేనేమో కొత్తపేట ముచ్చట్లలో బిజీ అయ్యాము , అనితెగ
గింజుకున్నాను !
అలా అలా
పదిహేను రోజులు గడిచాయి . ఈ లోపల ధవళేశ్వరం , కడియం , పట్టిసీమ వెళ్ళొచ్చాము
. రోజూ సాయంకాలం గోదావరి వొడ్డున షికారుకెళ్ళే వాళ్ళము.అక్క్డ
మల్లెపూల,
కంకాంబరం దండలు పెద్దపెద్దవి చాలా చౌకగా దొరికేవి.కొనుక్కొచ్చి
దేవుడికి, నాకు కాగా గుమ్మాలకు కూడా కట్టేదానిని. ఒక
సాయంకాలము , రాజమండ్రి కి వెళ్ళివస్తుండగా , ఏమండి నాకు కొంచం హైదరాబాద్ వెళ్ళే పని వుంది , ఒకరోజు
పనే , నువ్విక్కడ వుంటావా ? హైదరాబాద్
వస్తావా ? హైదరాబాద్ నుండి రాగానే చుట్టుపక్కల చూసొద్దాం
అన్నారు . నేనిక్కడే వుంటే , ఆయన తిరిగి వస్తారు , నేనూ వెళితే మళ్ళీ వచ్చే అవకాశము తక్కువే అని నాలో నేను స్వగతం అనుకొని ,
“నేనిక్కడే వుంటాను లెండి , ఒక్కరోజే గా
పరవాలేదు నరసింహ తోడుంటాడు లెండి . మీరింకెవరన్నా డ్రైవర్ ని తీసుకొని వెళ్ళండి” అన్నాను . నామాట పూర్తికూడా కాకముందే , నరసింహ ,"
ఏందమ్మా ? ఈడకొచ్చినప్పటి సంది చూస్తున్నా ,
ఏదేదో చూడాలంటావు , వంటిమీద సోయిలేదు . ఇంటి
ద్యాస లేదు , చిన్నోడు (మా మనవడు)
గుబులు పడతాడని లేదు , ఇంకెన్నాళ్ళుంటవు ? " అని దులిపేసాడు . అంతే నేనుకాని , ఏమండీ కాని
కిక్కురుమంటే ఒట్టు !
పెళ్ళికెళుతూ
పిల్లిని చంకన పెట్టుకొని వచ్చినట్లు వీడిని తీసుకొచ్చినందుకు తిట్టుకుంటూ , నరసింహ
గొడవ భరించలేక నేను కూడా హైదరాబాద్ ప్రయాణమైనాను ." నరసింహ
స్లోరా " , " నరసింహ స్లోరా " ఏమండీ అంటున్నా
బేఫికర్‌గా మమ్మలిని గాలిలో తేలియాడించాడు. పైగా ఏంది సారూ గా ఎడ్లబండిలా తోలమంటావా
? అని దబాయింపు ! అట్లాగే ఆలంపూర్ లొ మహిమగల తల్లి ని
చూపించాడు .కొత్తపేట లో సేట్ దుకాణానికి తీసుకెళ్ళాడు . అయినా అదేమిటో ఏమండీ వాడి స్పీడ్ భరించలేక,వాడిని దిగమని , వెనుక కూర్చోమని , ఆయన డ్రైవింగ్ తీసుకున్నారు . వెనుక సీట్లో ఒక్కడే కాలుమీద కాలేసుకొని ,
వెనుకవైపు రెండు చేతులూ బార్లాజాపుకొని దర్జాగా కూర్చొని “ ఏంది సారూ నువ్వేమన్నా చిన్నగా తోలుతున్నావా వెనుక కూర్చుంటే గట్లనే
అనిపిస్తాది .” అని నస మొదలు పెట్టాడు .
”వరేయ్ ఇట్లా మాట్లాడవంటే నిన్ను దింపేస్తా , ఏ లారీ లోనో రా” అని ఏమండీ,
“ఏందీ నేను లారీలో రావాలా ? “
అని వాడూ , ఇదెక్కడి గొడవరా దేవుడా అని
భయపడుతూ నేను , ముడుచుకొని కూర్చొని మా చుటికీ ఎలాగో హైదరాబాద్ చేరాము !
ఆ
తరువాత ఏమండీ నరసింహను పనిలోనుంచి తీసేసారు . ఒకరోజు నేను బడీచావిడి లో కూరలు
కొంటుండగా “అమ్మా , అమ్మా” అని
వినిపించింది . ఎవరా అని చూస్తే నరసింహ రోడ్ కడ్డంగా హడావిడిగా పరిగెత్తుకొస్తూ
కనిపించాడు . ఒకరికొకరం కుశలం అడుగుకున్నాక , " అమ్మా ,
నేనేమి చేసినా ? సారు నన్ను ఎందుకు పనిలోనుండి
తీసేసిండు ? నువ్వు సానా మంచిదానివి , సారుకు
కోపం సానా ఎక్కువ . నువ్వు ఇన్నేళ్ళ సంది , సారుతో కాపురం
ఎట్ల చేస్తున్నవో ? " అని జాలిగా నన్ను చూస్తూ
వెళ్ళిపోయాడు ! ! ! ! !
అదేమిటో నాకు దొరికే పనివాళ్ళు (పనివాళ్ళు
అనకూడదుట, హెల్పర్స్ అనాలిట మా మనవరాలు చెప్పింది) అందరూ ఇదో ఇలాంటివాళ్ళే
దొరుకుతారు.
6 comments:
పాపం నీ మీద అంత ప్రేమ చూపించిన నరసి0హ ని ఇలా గుర్తుచేసుకుంటున్నావన్నమాట.
ఎంత అభిమానంగా ఉన్నా అంత దురుసుగా డ్రైవ్ చేస్తే ఎలా? అందుకే తీసేసి ఉంటారు.
jaya kadaamari .
ravichandragaru
avunandi .
మా బావ గారి కాంట్రాక్ట్ ల లో కూడా ఇలాంటి డ్రైవర్ లను చూసే వాళ్ళము. పాపం పూర్ నరసింహ. ఇంతకు ఇక మళ్ళీ వెళ్ళలేదా గోదారి అందాలు చూడటానికి?
భావన ,
చూసానండి , కాకపోతే ఒక నెల వుందామనుకున్న దానిని , మావారి వర్క్ పూర్తవుతుండగా మళ్ళీ వెళ్ళి , హడావిడిగా నాలుగు రోజులలో చూసొచ్చాను .
Post a Comment