Thursday, December 3, 2009

కుంకుమ తిలకం

హిందూ సాంప్రదాయము లో పసుపు , కుంకుమకు ముఖ్యపాత్రనే వుంది . ఏ శుభకార్యము తలపెట్టినా , ముందుగా పసుపు ,కుంకుమ లనే కొంటారు . ఆ తరువాతనే ఏమి కొన్ననూ . అమ్మవారికి , కుంకుమపూజ చేస్తే చాలామంచిది అని , పర్వదినాలలో తప్పక చేస్తారు . కుంకుమను , సుమంగళీ చిహ్నముగా భావిస్తారు .

మా అమ్మ కుంకుమను ఇంట్లోనే తయారు చేసేది . ప్రతిరోజూ అమ్మవారికి , ఆ కుంకుమ తోనే పూజ చేసి , ఆ పూజా కుంకుమను , ముతైదువులకు పంచేది . మా బంధువులు , మితృలు అందరూ కావాలని అడిగి తీసుకునేవారు . ఈ పోస్ట్ ఆ కుంకుమ తయారి గురించి .

కావలిసిన సామానులు :
10 కిలోలు , పసుపుకొమ్మలు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .
ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చా పచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .

ఈ కొలతలు మా అమ్మ చేసుకున్నవి . ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .

పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .

నేను కైలాసగౌరి నోము చేసుకున్నప్పుడు , మా వియ్యపురాలు ,( మా కోడలు అమ్మగారు ), కృష్ణవేణి గారు , విజయనగరకాలనీలో ఒక ముసలావిడ దగ్గర , కుంకుమ కొట్టించారు . అయితే అప్పుడు , మేము పసుపు కొమ్ములను , నిమ్మరసములో నాన వేయలేదు . పటిక , ఎలిగారము వేసాము . ఆ ముసలావిడ పసుపు కొమ్ములను కొట్టేటప్పుడే , కొద్ది కొద్దిగా ,దాదాపు పది నిమ్మకాయల రసమును పిండింది . పొడిని , తెల్లబట్ట తో జల్లించి , నువ్వుల నూనెను కలిపింది . తరువాత ఇంటికి తెచ్చాక , నేను కొద్దిగా రోజ్ వాటర్ ను కలుపుకున్నాను . ఈ కుంకుమ , ఎరుపు రంగులో కాకుండా , బజారులో దోరికే రంగులో కాకుండా మధ్యస్తము గా బాగుంది . బజారు కుంకుమ కొంచము ముదురు మెరూన్ కలర్ లో వుండి , కొంచము నలుపు రంగులో కనిపిస్తుంది .

ఓపిక , టైము వుంటే కుంకుమను తయారుచేసుకొని చూడండి . ఎంతైనా మనము సొంతముగా తయారు చేసుకున్న ఆనందమే వేరుకదా !

4 comments:

Anonymous said...

కుంకం తయారు చేసికునే పధ్ధతి వ్రాశారు,బాగుంది. ఈ రోజుల్లో సాంప్రదాయంగా బొట్టు పెట్టుకునే వాళ్ళే కనిపించడం లేదు.అదేదో ఓ కనిపించీ,కనిపించనట్లుగా ఓ స్టిక్కరో,మరేదో పెడుతున్నారు.బొట్టు పెట్టుకోకపోవడం ఫాషన్.

జయ said...

బాగుంది, కుంకుమ తయారు చెయటం. రోజూ పూజ పునష్కారాలకు ఇలాంటి కుంకుమే మంచిది. పేరంటాలకు, మనం పెట్టుకోటానికి...అరోగ్యంగా ఉంటుంది.

భావన said...

బలే వుందే నేను కుంకుమ తిలకం సినిమా ఏమో అనుకుని దడుచుకున్నా సుమి. నేను నాకు సవత్సరానికి సరిపడా కుంకుమ తిరుపతి నుంచి తెప్పించుకుంటా.. అక్కడ బాగుంటుంది బహుశా మీరు చెప్పినట్లు చేస్తారేమో.

మాలా కుమార్ said...

హరెఫలె గారు ,
ధన్యవాదాలండి .

జయ థాంక్ యు .

భావన ,
మీరు తిరుపతి నుండి తెప్పించుకుంటారా ? మీ శ్రద్ధ కు మెచ్చుకుంటున్నాను . గుడ్ .