Thursday, November 19, 2009

పుల్ల పుల్ల గా , తియ్య తియ్యగా , ఖారం ఖారంగా



కార్తీకమాసము , నోములు , పూజలే కే కాదు ఉసిరి కాయలకు కూడా ప్రసిద్దే ! ఎక్కడ చూస్తే అక్కడ బళ్ళ ల మీద పచ్చ పచ్చని రాశులుగా నోరూరిస్తూ కనిపిస్తున్నాయి . ఇవి విటమిన్ సి పుష్కలంగా లభించే ఫలాలు . రోజూ ఉసిరికాయ తినేవారిలో ఎటువంటి అనారోగ్యానైనా తట్టుకోగల శక్తి వుంటుందంటారు . . చాలా వరకు చర్మ వ్యాదులని రూపుమాపుతుంది . జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది . చెప్పాలంటే ఇంకా చాలా చాలా గుణాలున్నాయి . అంతెందుకు , క్రమం తప్పక రోజూ ఉసిరికాయను ఏదో రూపములో తినేవారు 100 సంవత్సరాలైనా , ఆరొగ్యం గా జీవించవచ్చుట !

చిన్నప్పుడు ఉసిరికాయ తిని వెంటనే మంచి నీళ్ళు తాగే వాళ్ళము . మంచినీళ్ళు తాగగానే నోరు తియ్య తియ్య గా వుండేది . అదో సరదాగా వుండేది . ఇప్పుడేమో వాటి తో రకరకాలుగా చేసుకొని తినటము అలవాటైంది !

ఉసిరికాయలు రావటము మొదలు కాగానే గింజలు లేకుండా , పొడుగు ముక్కలుగా తరుక్కొని కొంచం నూనె లో మగ్గనిచ్చి ( అంటే ముక్కలలో కొద్దిగా నూనెవేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట ) స్టవ్ మీదనుండి , దింపి , చల్లారక , కొద్దిగా మెంతిపిండి , ఉప్పు , ఖారం వేసుకొని , వేడి అన్నం లో నెయ్యితో కలుపుకొని తింటే స్ . స్. స్. ఉంటుందికదా , అలా అలా లొట్టలేయటమెందుకు ? వెంటనే చేసుకొని తినొచ్చుగా !

పెద్ద సైజు ఉసిరికాయలను నీడలో ఎండపెట్టి , పైపైన కొడితే , విచ్చుకుంటాయి . అప్పుడు , లోపలి గింజలను తీసేసి , పై తొక్కను మిక్సీ లో వేసి పొడి చేసుకొని , రోజూ ఉదయము పరగడుపున ఒక చెంచాడు తింటే చాలా మంచిది .

అలా పొడిని తినలేనివారు , పెద్ద ఉసిరికాయలను తురిమి , ఆ తురుములో సరిపడ ఉప్పును , పసుపును కలిపి వుంచుకొని రోజూ , బ్రేక్ ఫాస్ట్ తినేటప్పుడు , ఒక చిన్న చెంచాడు తింటేసరి .

అలా కూడా తినలేనప్పుడు , ఉసిరికాయ తురుములో ఉప్పు , పసుపు కలిపి మూడు రోజులుంచి , మూడో రోజు , కొద్దిగా మెంతిపిండి , పండుమిరపకాయల ముద్ద కలిపి వుంచుకోవాలి . ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇంగువ పోపువేసుకొని తింటే బాగుంటుంది .

ఇవన్నీ ఆరోగ్యపరం గా చేసుకునేవి . ఇక అసలు , సిసలు ఉసిరి ఆవకాయ అంటే ,

ఉసిరికాయలు 1 కిలో ,

నువ్వులనూనె కాని పల్లీనూనెకాని ఉసిరికాయలు మునిగేంత ,

ఉప్పు 250 గ్రాములు ,

ఖారం 250 గ్రాములు ,

పసుపు చెంచాడు ,

మెంతిపిండి 100 గ్రాములు .

ఆవపిండి 100 గ్రాములు ,

ఇంగువ ,

,పోపులోకి .ఎండుమిరపకాయలు ,

2 నిమ్మకాయలు .

ఉసిరికాయలను శుభ్రంగా కడిగి , తడిలేకుండా తుడిచి , కాసేపు నీడలో ఆరబెట్టాలి . తరువాత వాటిని ప్రెషర్ పాన్ లో వేసి , అవి మునిగేంతగా నూనె పోసి ,స్టవ్ మీద పెట్టాలి . ఒక్క విజిల్ రాగానే దింపేయాలి . లేదా ఒక గిన్నె లో వేసి , ఉడికేవరకు మగ్గ పెట్టవచ్చు . వాటిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీయాలి . నూనెను , మూకుడు లోకి వంచుకోని , స్టవ్ మీద పెట్టి , ఇంగువ , కొన్ని మెంతులు , కొన్ని ఎండుమిరపకాయలు వేసి వేయించాలి . అవి వేగాక ఉసిరికాయలలోకి పోసేయాలి . ఆ నూనె వేడి తగ్గాక , ఉప్పు , పసుపు , మెంతిపొడి , ఆవపిండి , రెండునిమ్మకాయల రసము వేసి కలిపేయాలి . దానిని అలాగే, మూత పెట్టివుంచి , మరునాడు రుచి చూసుకొని , ఏవైనా తక్కువ అవుతే కలుపుకొని , జాడి లోకి తీసుకోవాలి . ఈ పచ్చడి ఒక నెలవరకు , రంగు , రుచి మారకుండా వుంటుంది . ఇందులో ఇచ్చిన కొలతలు సుమారుగా ఇచ్చినవి . ఎవరికి కావలసిన మార్పులు వారు చేసుకో వచ్చు . ఉప్పు తక్కువ కాకుండా వుంటే సరి . ఉప్పున్న ఊరగాయకి , అత్త చేతికింద కోడలికి తిరుగుండదు అని సామెత .

ఉసిరికాయ జాం ;

ఉసిరికాయ తురుము ; ఒక గ్లాసు ,

పంచదార ; రెండు గ్లాస్లు ,

నెయ్యి పావు గ్లాస్ ;

జీడి పప్పు , బాదాం , ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమైనవి , మీకిష్టమైనన్ని .

మూకుడు లో నెయ్యి వేసి ,ఉసిరి తురుమును పచ్చివాసన పోయేదాకా వేయించాలి . వేగాక , అందులో పంచదార వేసి , సిం లో వుంచి , అడుగంటకుండా తిప్పుతూ వుండాలి . ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పొడి చేసుకొని వుంచుకోవాలి . మూకుడులోని జాం దగ్గర పడుతుండగా ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని వేయాలి . పంచదార తీగపాకం వచ్చేదాకా వుంచి , దింపేయాలి . చల్లారాక సీసాలోకి తీసి పెట్టుకోవాలి . తడి తగలకుండా వుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా వుంటుంది .

ఇది బ్రెడ్ లోకి , చపాతిలలోకి బాగుంతుంది . రోజూ పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యకరం . మా పిల్లల చిన్నప్పుడు ఇది తప్పక చేసేదానిని .

పైన ఫొటోలో వున్నవి రాచ ( చిన్న ) ఉసిరి కాయలు . ఇవి సామాన్యముగా బజారులో దొరకవు . ఎక్కువగా ఇళ్ళలోనే కనిపిస్తాయి . రుచి కి చాలా పుల్లగా వుంటాయి . బాల్కనిలోనుండి తెంపుకొని వుట్టివే తినేస్తూ వుంటాము . కచ్చాపచ్చాగా దంచి పప్పులో వేస్తుంటాను . పుల్ల పుల్ల గా మామిడికాయ పప్పులాగా బాగుంటుంది .

పచ్చి మిరపకాయలు , కొత్తిమీర , పోపు వేసి పచ్చడి కూడా చేస్తాను .

ఇక మీ ఇష్టం , వీటిల్లో ఏదైనా చేసుకొని , లేదా అన్ని చేసుకొని పుల్ల పుల్లగా , తియ్య తియ్య గా , ఖారం ఖారం గా లాగించేయొచ్చు !


ఈ చిన్న ఉసిరికాయలను ఆవిరి పైన ఉడికించి ,కొబ్బరి పచ్చడిలా చేసుకుంటే అన్నం తోనే కాకుండా ఇడ్లీలు , దోసెల తో కూడా బాగుంటుంది అని , సత్య గారు , నా మొట్టికాయలకు వంటింటి చిట్కా పొస్ట్ లో కామెంట్స్ లో చెప్పారు . ఇక్కడ వుంటే బాగుంటుంది అని , ఇక్కడ కలిపాను . థాంక్ యు సత్యగారు .



14 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

మాలా గారు,
మంచి విషయాలు తెలియచేసారు. మొన్నీ మధ్య ఒక పెద్దయానను, కలిస్తే, రోజు ఉసిరి తినే వారిలో జీవశక్తి పుష్కలంగా వృద్ధి చెందుతుందని చెప్పారు. నా లాంటి ఒంటి కాయి సొంఠి కొమ్ముగాడికి ఇక్కడే ఒక అడ్డంకి వచ్చింది. బ్రమ్మచారి గా ఉండటం వలన, ఫ్రిజ్ లేదు, ఉసిరిలోని గుణాలు పాడవకుండా, ఎక్కువరోజులు నిలవుండే విధంగా ఏమన్నా చూర్ణం చేసుకోవచ్చా?

సిరిసిరిమువ్వ said...

మాలా గారూ, ఈ ఉసిరికాయలకోసమన్నా మీ ఇంటికి రావాలి..అర్జంటుగా మీ ఇంటి అడ్రస్సు చెప్పండి!

భావన said...

బాగుందండి మీ బాల్కనీ లో వుంటే మేమెలా ఏది కావాలంటే అది చేసుకుంటాము మీరు మరి చోద్యం. మా దొడ్లో కూడా వుండేది. అయ్యో నా బంగారు వుసిరి కాయ.. ఇక్కడ దొరకదు.

శ్రీలలిత said...

ఇందాకే ఉసిరికాయలు కొన్నాను. వాటినేమి చెయ్యాలా ని అలోచిస్తున్నాను. మీరు రకరకాలు చెప్పారు. ఏదో ఒకటి ట్రై చేస్తాను. బాగుంటే క్రెడిట్ నాకు. బాగా రాకపోతే మీకు చెప్పడం తెలీలేదు. ఏవంటారు? ”మా ఇంటి కొచ్చావు ఏం తెచ్చావు? మీ ఇంటి కొచ్చాం ఏం పెడతావు? అన్నట్టుంది కదా..
just kidding..hahahha

Ruth said...

మాల గారు, మీకు కామెంటుదామని ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. కాని, ఏంటో మీ కామెంట్స్ పెట్టి అస్సలు నాకు కనిపించదు. ఇన్నాళ్ళకి కనిపించింది. ఆ, అసలు సంగతి, మంచి విషయాలు చెప్పారు ఉసిరి గురించి. నేనీ మధ్య ఉసిరి రెసిపీలు కల్లెక్ట్ చేస్తున్నాను (ఓన్లీ కలెక్టింగే, చెయ్యడానికి ఉసిరి కాయలు మాత్రం దొరకలేదు ఇంకా). మా ఇంట్లో(అంటె మమ్మీ వాళ్ళ ఇల్లు) కూడా ఉంది ఉసిరి చెట్టు.మేమైతే ఊరబెట్టుకుని కూడా తింటాము ఉసిరి కాయలు.

జయ said...

ఇన్నిరకాలు నేను చేయలేను గాని, చేసినప్పుడల్లా మా ఇంటిల్లిపాదికి సరిపోను పంపించు. కాస్త ఉసిరి తిని మేము కూడా ఆరోగ్యంగా ఉంటాం. O.Kay!!!

మాలా కుమార్ said...

శ్రీ లలిత గారు,
పరవాలేదు లెండి , చేసేయండి . బాగానే వస్తుంది . అయినా మీకు తెలీని రసిపీలా ఇవి ?

మాలా కుమార్ said...

వీరుభొట్ల వెంకట గణేష్ గారు ,

నేను పొడి అని చెప్పింది అదేనండి . పొడి అంటే చూర్ణమే . ఇంట్లో చేసుకునే వీలు లేక పోతే ఏ ఆయుర్వేద షాప్ లలోనైనా దొరుకుతుంది . డాబర్ వారి ప్రొడక్ట్స్ బాగానే వుంటాయి.

మాలా కుమార్ said...

సిరిసిరి మువ్వ గారు ,
మీరొస్తానంటే నేనొద్దంటానా ? ఎప్పుడొస్తారో చెప్పండి . అడ్రెస్ ఇస్తాను . దానికేమైనా బాగ్యమా ? బంగారమా ?

మాలా కుమార్ said...

భావన గారు ,
మీది మరీ మరీ చోద్యమండి , మీరడుగుతే నేనివ్వనా ?

మాలా కుమార్ said...

రుథ్ గారు ,
చాలా థాంక్స్ అండి . మీరు కలెక్ట్ చేసుకున్న రసిపీలు నాకూ ఇవ్వండి ప్లీస్ .
అవునూ , నా కామెంట్ బాక్స్ కనపడటములేదా ? ఎటుపోయింది చెప్మా ? దాని వెతకటము నాకూ కష్టమేనే . ఏం చేయాలో మా గురూజీ ని అడిగి చూస్తాను . నాకిన్నాళ్ళూ ఈ విషయము తెలీదండి . చెప్పినందుకు థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

జయ ,
అలాగే చేయగానే ఫోన్ చేస్తాను , వచ్చి తీసుకు పో ( నువ్వచ్చేలోపల మిగులుతే ) .

తృష్ణ said...

కార్తీక మాసం అయ్యే లోపూ నేనూ ఈ "ఉసిరి" గురించి ఒక టపా రాదామని అనుకున్నాను కాని కుదరలేదండీ...హమ్మయ్యా..నా బదులు మీరు నా కోరిక తీర్చేసారు...

తృష్ణ said...

అన్నట్లు "ఉసిరి రసం" కూడా చాలా మంచిదండీ....రోజూ ఉదయం పరగడుపున ఒకటి,రెండు చెంచాలు 1:1 or 2:2 పాళ్ళలో తాగితే చాలా చాలా మంచిది...నేను చాలా రోజులు తాగాను. దీని గురించి వీలయితే నేను రాస్తానుండండి....