Tuesday, November 17, 2009

నోములు నోయరుగా , టెన్షన్ పడరుగా


ఓ అప్పుడెప్పుడో అంటే మొదటి ఫొటోలో మా వదినగారు వున్నారే అప్పుడన్నమాట నోముకొని , ఇదో రెండో ఫొటో లో వున్నారే ఇప్పుడు తీర్చుకుందామనుకున్నారన్నమాట. మరి ఆవిడ తో పాటు మాకూ టెన్షన్ వుంటుందా ? వుండదా ? అసలే , నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు , ఏదో వూరెళుతూ , ఆత్తగారి కళ్ళు గూట్లో వున్నాయనుకోవే కమలమ్మా అని చెప్పివెళ్ళారు . అప్పుడు నిజంగానే , మా అత్తగారు ఆవిడ కళ్ళు వంటింటి గూట్లో పెట్టి వెళ్ళారేమో నని తెగ వెతికా . నిజంగా నిజం . అంటే అత్తగారున్నపుడు ఎంత జాగ్రత్తగా పని చేస్తానో , ఆవిడ లేకపోయినా అంత జాగ్రత్తగానే పని చేసుకోవాలని అర్ధం అని తరువాత తెలిసిందనుకోండి .అది వేరే సంగతి . కాని ఇప్పుడు ఈ ఫొటోల వెనకాల జాగ్రత్తగా గమనిస్తే , మా అత్తగారిదో , మా మామగారి దో ఫొటో కనిపిస్తుంది . అంటే నేను సరిగ్గా చేస్తున్నానాలేదా అని గమనిస్తునే వున్నరన్నమాట !

మా వదినగారు , ఫోన్ చేసి పలానా రోజు నీకు వీలవుతుందా ? అని అడుగగానే ఆ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్న నేను , ఎందుకు వీలు కాదండి ? వీలవుతుంది . నేనేమి చేయాలో చెప్పండి అన్నాను . నువ్వేమి చేయొద్దమ్మా , మీ సావిత్రి తో 20 మందికి వంట వండించు.. ఆమె లేక పోతే కాటరింగ్ కి ఇద్దాము అన్నారు . కాటరింగ్ వద్దండి , సావిత్రి వండుతుంది . ఏమైనా నైవేద్యాలు ప్రత్యేకం గా చేయించాలా ? అని అడిగా . పూర్ణాలు , పులిహోరా , వక కూర , పప్పు , వాయినానికి 16 కుడుములు చాలు అన్నారు . ఓస్ అంతేకదా చేయిస్తాను . మరి ముతైదువులని పిలవాలికదా , వాయినాల కోసం చేటలు చేయించాలికదా ? అని అడిగాను . అవన్నీ నేను చేసుకుంటానులే అన్నారు .సరే అన్నాను .

సావిత్రి తో పలాన రోజున మావదినగారు 20 మందిని తీసుకొని వస్తున్నారు . మీరు ఎక్కడికీ వెళ్ళొద్దు . ఇంట్లోనే వుండాలి అన్నాను

ఆ రోజాండీ అంటూ ఆమె మొదలుపెట్టగానే నా బి . పి రయ్ మంది .ఏం ?

"మరేం లేదండీ ఆ రోజు మా కజిన్ వూరు నుండి వస్తానంది . తను నాకు డబ్బులివ్వాలి . ఆ రోజు కలవక పోతే వాళ్ళ వూరు అనంతపూరు వెళ్ళాల్సి వుంటుంది . "

"ఎంతివ్వాలి ? "

"300 . పరవాలెదు లెండి వుంటాను లెండి ."

అమ్మయ్య బతికించారు అనుకునేంతలో శారద , అమ్మా రేపు మా అమ్మ కాకినాడ వెళుదామంటోంది . మా కొత్త ఇల్లు గృహప్రవేశం చేస్తుందిట . అంది . అంతే నా బి. పి రయ్ .. . . రయ్ . . . రయ్

మీ ఇద్దరిలో ఎవరైనా ఇల్లు కదిలారో కాళ్ళిరక్కొడుతాను . అన్నానే కాని వీళ్ళు ఏలేబర్ యూనియన్ వాళ్ళకో ఫోన్ చేయరుకదా ? వాళ్ళొచ్చి నన్ను జైల్లో వేయరుకదా అనే డౌట్ ! ! అంతలోనే ఆ వీళ్ళకంత ధైర్యం ఎక్కడేడిచిందిలే అని నా ధైర్యం ! వాళ్ళకు నా టెన్షన్ సంగతి తెలుసుగా , కాకపోయినా నా మొహం చూసి కనిపెట్టే వుంటారు .మీరు టెన్షన్ పడకండి మేమెక్కడికీ పోము అని హామీ ఇచ్చారు . ఆ ఏడుపు ముందే ఏడవచ్చుగా ? అమ్మయ్య ఈ ఎపిసోడ్ అయ్యింది .

మా వదినగారు ఏమి చేయొద్దు , అన్ని నేనే తెచ్చుకుంటాను అన్నంతమాత్రాన ఎలా వదిలేస్తాను ? అసలే నాకు అన్నిటికీ టెన్షన్ ఎక్కువ. ఏరొజైనా టెన్షన్ పడే విషయము లేకపోతే ఏ టెన్షన్ లేదే అని టెన్షన్ పడతానని , మా వారు , పిల్లలు వెక్కిరిస్తూవుంటారు . అలాంటిది ఇంతటి బృహత్కార్యం నా భుజాలమీద వుంటే ఇక చెప్పేది ఏం వుంది . అనుకున్నాక మూడు రోజులలోనే ఓ ప్పది సార్లు మా వదినగారికి ఫోన్ చేసివుంటాను . ఇక ముందు రోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను . ఈ పిల్ల కి నేరక పోయి చెప్పానురా దేవుడా అనుకున్నారో ఏమో పాపం ఆవిడకి జొరం వచ్చేసి , రాత్రి ఫోన్ చేసి రేపు నోము చేసుకోగలనంటవా మాలా అని అడిగారు . అంతే నా బి . పి రయ్ . . . రయ్ . . . .రయ్ . . . . . రయ్ . . . .

కాస్త ధైర్యం తెచ్చుకొని , పరవాలేదండి నోచుకోగలరు అంతా నిర్విఘ్నం గా జరిగి పోతుంది అని ఆవిడకి ధైర్యం చెప్పాను .

ఏ పండగ పబ్బం ఐనా ఇల్లు కడగటము నాకు అలవాటు . కాని ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే మా అబ్బాయి చెప్పాడు , ఇక్కడ కడగటాలు పెట్టుకోకు , మొత్తం మూడంతస్తుల నీళ్ళు , మొదటంతస్తులోకి వస్తాయి , అన్ని ఎత్తి పోయాలి అని . ఏం చేస్తాను ? అందుకే బాల్కనీ , మెట్లు కడిగించి , ఇంటి ముందు ముగ్గేసి వూరుకుంటున్నాను . ఇప్పుడూ అదేపని చేసాను . అమ్మవారు పంపినట్లు పూలవాడు , బంతిపూలు తెచ్చాడు . బంతిపూలు , చామంతులు , గులాబీ లు కొన్నాను . బంతిపూలదండ కట్టి గుమ్మానికి కట్టాను . మామిడాకులు కూడా వుంటే బాగుండేది . పండగ రోజులలో ఐతే బజారులో అమ్ముతారు . మా పక్కింట్లో చెట్టు వుంది కాని , వాళ్ళ పనివాడికి , మా సావిత్రికి పోట్లాట వచ్చినప్పటినుండి వాడు కోసుకోనివ్వటము లేదు . దానికి కూడా టెన్షన్ ఎందుకమ్మా నేను తెస్తాను అని మా అమ్మాయి వాళ్ళింటినుండి తెచ్చింది .

ముందంతా ఇంత టెన్షన్ పడ్డానా ? అసలు సమయం వచ్చేసరికి అంతా చాలా బాగా జరిగింది . ఆ రోజు సావిత్రి మంచి మూడ్ లో , వంట చాలా బాగా చేసిందని అంతా మెచ్చుకున్నారు . లలితసహస్రనామాలు అందరూ కలసి చదువుతుంటే ఇల్లంతా పులకించి పోయినట్లనిపించింది . పొద్దుటినుండి సాయంకాలము 5 గంటల వరకు అందరు ముతైదువులు ఇల్లంతా తిరుగుతూ వుంటే , ఆ కార్యక్రమం అంతా కన్నులపండుగ గా వుండింది .

ముత్తైదువలకేనా , బాలలకు తాంబూలం ఇచ్చారు . ఇంతేనా ? ఐతే నాకేదీ అంటూ . మా మరిదిగారి మనవడు మిహిర్ అడిగాడు . అవునుకదూ , మరి అప్పుడు అక్కడ వున్న మా కుటుంబ పెద్ద , మా మొగ దిక్కు వాడే కదా ! తప్పుతుందా వాడికి , వాడి తో పాటు మిగితా మొగపిల్లలకి తాంబూలము తో పాటు 100 రూపాయలు దక్షిణ .

ఇంత పుణ్య కార్యము మా ఇంట్లో జరుపుకొని , మాకింత మంచి అనుభూతిని కలిగించినందుకు థాంక్ యు వదినగారు .


హరిణీ ,
ఫొటోలు తీసి ఇచ్చినందుకు థాంక్ యు . వాటి కోసం నిన్ను టెన్షన్ పెట్టాను కదూ ! హి హి హి

3 comments:

మురళి said...

బాగుందండీ...

జయ said...

బాగుంది, మీ నోము, వాయనాలు అన్నీ కూడా. చక్కగా రాసావు.

K Phani said...

meeru enta tension paddaaro antaku dubble happygaa jariginatlugaa vundi meedi chaduvutunte chaalaa bhagaa raasaaru kudaa.photos kudaa vachina andarini cover chesetlugaa tisaaru.adikuda chaalaa bhagundiidi chadivinanduku maaku koncham punyam vastundemo.