Sunday, November 15, 2009

చంక లో పిల్లను చూసుకుంటు

ఏడెనిమిదేళ్ళ క్రితం అనుకుంటా వరంగల్ వెళ్ళినప్పుడు , మావారిని పోరు బెట్టి వేయిస్తంబాలగుడి కి తీసుకెళ్ళాను. మా చిన్నప్పుడు , వేయిస్తంబాలగుడి ఎదురుగా వుండేవాళ్ళము . రోజూ , గుడి కెళ్ళి ఆడుకునేవాళ్ళము . అక్కడ తెల్ల రంగులో ,పాము పడగ ఆకారములో కింద చిన్న శివలింగము తో వున్న , చిన్ని , సువాసనలు వెదజల్లే పూల చెట్టు వుండేది . ఆ పూలు చాలా ముద్దుగా వుండేవి . ఆ తరువాత ఆ పూలు మళ్ళీ నేనెక్కడా చూడలేదు . ఆ పూలు చూడాలనే కోరిక తో , ఆ గుడికి వెళ్ళాను .కాని గుడి మంటపము ముందు వుండే ఆ పూపొద లేదు . అక్కడ ఎవరిని అడిగినా తెలీదన్నారు . సరే ఏంచేస్తాం అనుకుంటూ లోపలికి వెళ్ళగానే చమక్ మంటూ ఆవాహన నవల గుర్తుకు వచ్చింది . పూల జాడ తెలీలేదు , కనీసము నవలైనా చదువుదాము అనుకున్నాను .

హైదరాబాద్ రాగానే మొదట చేసిన పని ఆర్కే లైబ్రరి కి వెళ్ళి ఆవాహన నవల కోసం అడగటము , అక్కడ లేదని పించుకోవటము . అక్కడి నుండి ఆవహన కోసం వేట మొదలు పెట్టాను . ఎన్ని లైబ్రరీ లు తిరిగానో , ఎన్ని షాప్స్ లలో అడిగానో !

కొంచం ఆగండి , నెయ్యిగిన్నె తెచ్చుకొని , మిగితాది మొదలు పెడుతాను . ఇక నేను చెప్పేది వింటే ఎంత మంది , ఎన్ని మొట్టికాయలు మొడుతారో , బొప్పి కట్టకుండా చూసుకోవాలిగా !


ముదిగొండ శివప్రసాద్ గారి పెద్దమ్మాయి సుష్మ మా అమ్మాయి సంజు కు , ఇంజనీరింగ్ లో క్లాస్మేట్ , చాలా మంచి ఫ్రెండ్ . దాదాపు మా ఇంటి అమ్మాయి లా వుండేది . మా అత్తగారికి తనంటే చాలా ఇష్టం . వాళ్ళ చదువు ఐపోతూనే సంజు పెళ్ళై యు. యస్ వెళ్ళింది . ఇక ఆ తరువాత సుష్మ ని నేను కలవలేదు . మరి నవల కోసం అడగాలంటే మొహమాటం వేసింది . ఆ తరువాత మేము వాళ్ళ ఇంటి దగ్గరే నాలుగు సంవత్సరాలున్నాము . రోజూ వాళ్ళింటి ముందునుండి వాకింగ్ కి వెళుతూ లోపలికి వెళ్ళి అడుగుదామా ? అని ఓ క్షణం అనుకునేదాన్ని ! ఉమగారు ( శ్రీమతి శివప్రసాద్ గారు ) కూడ పరిచయమే కదా , అడగచ్చుగా అనుకునే దాన్ని . కాని ఏదో బెరుకు . అలా మొహమాటము గా వాళ్ళ ఇల్లు చూసుకుంటూ , షాప్ లో అడుగుతూ , ( అన్నట్లు ఓ నాలుగు రోజుల క్రితం నెమలికన్ను మురళి గారిని కూడా అడిగాను ) ఆ బుక్ కోసం బెంగెట్టుకున్నాను .

నిన్న మా అమ్మ దగ్గరికి వెళుతూ , ఎందుకో సంజు తో ఇదే చెప్పాను . తను వెంటనే సుష్మ కి ఫోన్ చేసి , అమ్మకి , అంకుల్ రాసిన ఓ నవల కావాలట , అంకుల్ ఫ్రీగా వుంటే ఇంటికి వెళుతాము అంది . ఐతే సాయంకాలము రండి , అప్పుడైతే నేనూ వుంటాను అంది . అంతే సాయంకాలము నేనూ , జయ వాళ్ళ ఇంటికి వెళ్ళాము . సుష్మ నన్ను చూస్తూనే చాలా సంతోషించి , మాలా ఆంటీ మీరేమీ మారలేదు , 16 సంవత్సరాల క్రితం ఎలావున్నారో ఇప్పుడూ అలానే వున్నారు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది .

పప్పా , వీరు మా ఫ్రెండ్ సంజు వాళ్ళ అమ్మగారు , అని సుష్మ నన్ను ముదిగొండ శివప్రసాద్ గారికి పరిచయము చెయగానే , ఆయన నన్ను గుర్తు పట్టారు . మీరు బర్కత్పురా లో మేడ మీద వుండే వారు కదా ? మీ అమ్మాయి పెళ్ళికి మీరు బుట్ట బాగా అలంకరించారు . పెళ్ళి చాలాబాగా చేసారు నాకు గుర్తే అన్నారు .ఆయన జ్ఞాపక శక్తికి ఆశ్చర్య పోయాను . ఉమ గారు ఈమధ్య లలితాసహస్రనామాలని ఇంగ్లిష్ లోకి అనువాదము చేసారట . ఆ పుస్తకము చూపించారు . ఆ పుస్తకము రాయటము మొదలు పెట్టగానే దేశం లోని అన్ని అమ్మవారి దేవాలాయాలని సందర్షించారట . అనుకోకుండా ఎక్కడేక్కడో వున్న అమ్మవారి దేవాలయాలని దర్షించుకున్నాను అన్నారు .

ఆవాహన సినిమాగా తీయటానికి మాటలు అవుతున్నాయట . ఈ మధ్యనే 500 కాపీలు ప్రింట్ చేయించాను . అని తెచ్చి ఇచ్చారు . దానిని చాలా అపురూపముగా అందుకున్నాను . ఇంకా శ్రీపదార్చన , ఇది అన్నమయ్య సినిమాకు మూలకథ అట , ఇచ్చారు . పఠాభి అని ఇంకో పుస్తకం చూపించారు . శ్రీలేఖ ప్రింటింగ్ లో వుందని చెప్పారు . అది కూడా మంచి నవల అని విన్నాను . చదవలేదు . అందుకే అది వచ్చాక చెప్పమని సుష్మ కి చెప్పి , శివప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపి వచ్చాను .

చంకలో పిల్లను చూసుకుంటూ వూరంతా ఎనిమిది సంవత్సరాలు వెతుక్కున్నాను .

ఠపా . . . . ఠప్ . . .అబ్బా

2 comments:

నేస్తం said...

మాల గారు ఇలా మీరు ఊరిస్తూ రాసి పైగా మొట్టికాయలంటూ దిష్టి తీసుకుంటారా ఆయ్..

మాలా కుమార్ said...

నేస్తం గారు ,
సరె సరె థాంక్యు . అదే కంటి తో ఇది కూడ చుడండి మరి .

http://kamalamadapati.blogspot.com/2009/11/blog-post_16.html