Sunday, July 11, 2010

సొరకాయ టిక్కీ

రెండు పుల్కాలు , సొరకాయ కూరనో , టమాట పాలకూర పులుసుకూరనో చేసి పెడితే , మా వారు చాల రుచిగా మంచి భోజనం పెట్టినట్లుగా సంతోషపడిపోతారు . మా మామగారు కూడా సొరకాయ కూర చేసిన రోజు , ఇవ్వాళ్ళ వంట బాగా కుదిరిందమ్మాయ్ అనేవారు . మాకు వారం లో కనీసం నాలుగు రోజులైనా సొరకాయ కూర తప్పనిసరి . డి .డి కాలనీ లో వుండగా మా ఇంట్లో సొరకాయలు తెగ కాసేవి . మా కూరలతను , అమ్మా అవి నాకు ఇస్తే అమ్ముకొస్తాను అనేవాడు . నాయనా అవి మాకే సరిపోవు , ఇంక అమ్మటము కూడా నా అనేదానిని . ఇప్పుడూ , ఈ ఇంట్లో కూడా సొర విత్తనాలు వేసాను . ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి .

నేను ఎక్కువగా పెసరపప్పు కాని , సెనగపప్పుకాని వేసి , ఇంగువ పోపేసి వండుతాను . అప్పుడప్పుడు , పాలు పోసి కాని , నువ్వుపిండి వేసి కాని , పచ్చి కొబ్బరి వేసి కాని కూడా వండుతాను . ముక్కల పులుసు , సాంబార్ లో కూడా సొరకాయ ముక్కలు వేస్తాను . కాని ఏమాట కామాటే చెప్పుకోవాలి , యాక్ అనక పోయినా నాకు సొరకాయ కూర అంత ఇష్టం వుండదు . తప్పదన్నట్లు తింటాను . కాక పోతే అప్పుడప్పుడు , నా కోసం , మా పిల్లల కోసం ఇదిగో ఇలా వెరైటీస్ చేస్తుంటాను . ఈసొరకాయ టిక్కీ నేనూ , నా మనవడు గౌరవ్ కలిసి చేసాము .

సొరకాయ టిక్కీ కి కావలసిన సామానులు ;
సొరకాయ తురుము 1- కప్పు ,
ఉడక పెట్టిన ఆలుగడ్డల ముద్ద రెండు కప్పులు ,
పచ్చిమిరపకాయ , అల్లం ముద్ద - 1 టీ స్పూన్
కొద్దిగా కొత్తిమీర , పుదీనా - వాటిని శుభ్రం గా కడిగి , సన్నగా కట్ చేసుకోవాలి ,
గరమ మసాలా పొడి ఒక స్పూన్ ,
జీలకర్ర పొడి , ధనియాల పొడి కొద్దిగా ,
కార్న్ ఫ్లోర్
సొరకాయ తురుమును గట్టిగా నీరు లేకుండా పిండాలి . అందులో , కారన్ ఫ్లోర్ తప్ప మిగితావన్నీ కలపాలి . బాగా చపాతీ పిండి లా కలిపాక చిన్న చిన్న వుండలు చేసుకొని కావలసిన షేప్ చేసుకోవాలి .
మూకుడు లో నూనె వేసి , బాగా కాగాక , ఈ టిక్కీ లను ఒకటొకటి తీసుకొని , ఒక పళ్ళెం లో వేసుకొని వుంచుకున్న కారన్ ఫ్లోర్ లో పెట్టి , టిక్కి కి చుట్టూ అంటుకునేటట్లు తిప్పాలి . ఆ తరువాత దానిని నూనెలో వేసి , గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి . అంతే సొరకాయ టిక్కీ రెడీ !

ఈ టిక్కిలలో సొరకాయ తురుము బదులు , క్యాబేజ్ తురుము కాని , కారెట్ తురుము కాని , బీట్రూట్ తురుము కాని , పాలకూర కాని , ఉడకబెట్టిన బఠానీలు కాని వేసుకోవచ్చు .

అన్నట్లు సొరకాయ తురుము పిండగా వచ్చిన నీరు పారబోయద్దండోయ్ . అందులో ఓ టమాట , కాస్త కొతిమీర వేసి చేసుకుంటే సొరకాయ సూప్ ఐపోతుంది .

ఈ టిక్కి ల మీద ఖట్ మీట్ చట్నీ , గిలకొట్టిన పెరుగు , చాట్ పౌడర్ , సన్నగా తరిగిన ఉల్లిపాయ , కొత్తిమీర్ , పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తింటే స్స్ . . . . .

రేపు ఖట్ మీట్ చట్నీ చెపుతాను . అన్నీ ఒకే రోజైతే మీకే గుర్తుండవు మరి.



ఈ ఫొటో మా గౌరవ్ తీసింది . బాగుంది కదూ .

5 comments:

చందు said...

adurs!!!!!!!

భావన said...

ఇదేదో బాగుంది సొరకాయ రుచి ఆ చప్పటి వాసన తెలియకుండా. మళ్ళీ మధ్యలో ఆ సొరకాయ జ్యూస్ ఏంటండి... :-(

సి.ఉమాదేవి said...

ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు సొరకాయ గురించి.అయితే రుచిపరంగా అందులో చేర్చాల్సినవి చేరితే టిక్కీలన్నీ టకటకా ఖాళీ!Well done.

మాలా కుమార్ said...

సావిరహే గారు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

భావనా
పోనీలే ఏదో ఒకటి నచ్చింది . థాంక్ యు .

& c.ఉమా దేవి గారు ,
నా బ్లాగ్ కు స్వాగతం అండి .
థాంక్ యు .