Saturday, July 10, 2010
సొరకాయ - పాము మంత్రం
మావారికి , ఇంటి కొస్తుంటే , దారి లో బండి మీద లేలేత సొరకాయలు కనిపించాయట . ఓటి కొనుక్కొచ్చారు . అంత పెద్ద లేత సొరకాయను చూడగానే ప్రాణం వుసూరుమనిపించింది . ఇద్దరి కోసం , గుప్పెడు బియ్యం , చిటికెడు పప్పు వండటమే ఇంకా అలవాటు కాలేదు . ఇప్పుడు టాంక్ బండ్ అంత పెద్దగా వున్న ఈ సొరకాయను , ఆయన ఒక్కరి కోసం , ఎన్ని రకాలు , ఎన్ని రోజులు వండాలిరా దేవుడా అనే నాబాధ . నాకు సొరకాయ ఇష్టం లేక కాదు కాని పాము మంత్రం నేర్చుకుందామనుకుంటున్నాను కదా ఎలా తింటాను ? పాము మంత్రం ఎందుకంటారా దాని కథా కమీషూ ఇక్కడ చెప్పానుగా . ఎవరెంత చెప్పినా నా భయం నాది . పాము మంత్రం నేర్చుకుంటే ఎందుకైనా మంచిది అని డిసైడైపోయాను . కాక పోతే నేర్పేది ఎవరా వెతకాలి . ఇంత బృహత్ కార్యం ముందు పెట్టుకొని సొరకాయ ఎలా తినేది ????? మరి పాము మంత్రం వేసేవాళ్ళు సొరకాయ తినకూడదుట ! లేత సొరకాయ కోయటం లేదండీ బాబూ . మావారు చెప్పారు , పాము మంత్రం పెట్టేవాళ్ళు సొరకాయ తినరని . ఆయనేది చెప్పినా నేనిట్టే నమ్మేస్తాను . నిజం ! ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది , ఎలా చెప్మా అని ధీర్గం గా ఆలోచనలో పడ్డాను .
లేడీస్ మీటింగ్ లో లక్ష్మి గారిని కలిసినప్పుడు ,పాముల సంగతి మళ్ళీ ఓసారి కఫర్మ్ చేసుకుందామని , లక్ష్మి గారూ ఇక్కడ పాములు వస్తాయాండీ అని అడిగాను . అబ్బే లేదండి . మేము పదేళ్ళనుండి వున్నాము . ఎప్పుడూ చూడలేదండి అన్నారు . మరి ప్రేమా వాళ్ళ ఇంటి . . . . .
' ఓ అక్కడకా వాళ్ళ ఇల్లూ కాలనీ చివర . పైగా అటువైపంతా అడవిలా వుంటుంది కదా అందుకే ఏమైనా వచ్చిందేమో . ఐనా కాలనీ అంతా సెక్యూరిటీ గార్డ్ లు తిరుగుతూ వుంటారు . అంతెందుకు సాయంకాలం చూడండి పిల్లలు ఎంతమంది ఆడుకుంటూ వుంటారో . '
' అవునండి . సాయం కాలం కాగానే పిల్లలంతా చిలకల్లా కిల కిల లాడుతూ ఎంత బాగా ఆడుకుంటూ వుంటారో . చాలా ముచ్చటగా వుంటుంది . కాని . . . మరి షకీలా కూడా చెప్పిందే , ఇక్కడెవరో రోజూ పాము కోసం పాలూ పోసి వుంచుతారని ?'
' ఎవరూ షకీలానా ? దాని మొహం అదో తింగరి బుచ్చి . దాని మొగుడు మాడ్రైవరే గా . నాగుల చవితి రోజు మా కోడలు మా ఇంటి పక్కనున్న పుట్టలో పాలు పోస్తుంది . అది చెప్పిందేమో . మా కోడలి కి భక్తి ఎక్కువ లెండి . అలా అని చదువుకోనిదనుకునేరు , యం ఫార్మసీ చేసింది . యు. యస్ లో వుండగా జాబ్ కూడా చేసింది . ఇక్కడి కొచ్చాక పిల్లల చదువు చూసుకోవటానికి జాబ్ చేయటము లేదు . ఎప్పుడూ పామును చూడలేదు . పాము ఎవరినీ కరిచినట్లూ వినలేదు . '
అమ్మయ్య పాము మంత్రం నేర్చుకునే బాధ తప్పింది . అవునండీ ఇంతమంది చెప్పాక నమొద్దూ ? ఇక హాయిగా సొరకాయ తినేయొచ్చు . ఆ సంతోషం లో రెండు రోజులుగా నేను చేసిన సొరకాయ వంటలు . పాము మంత్రం పెట్టని వాళ్ళు శుభ్రంగా , హాపీ గా తినొచ్చు . చాలా రుచిగా కూడా వుంటాయి .
సొరకాయ పరోఠా
కావలసిన సామానులు ;
సొరకాయ తురుము 1/2 కప్ ,
కొద్దిగా అల్లం ,
పచ్చిమిర్చి - 3
గోధుమ పిండి ,
శెనగ పిండి 1 కప్
కొతిమీర కొద్దిగా .
ముందుగా అల్లం , పచ్చిమిర్చి , ఇష్టమున్న వాళ్ళు వెల్లులి వేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
సొరకాయ తురుము , అల్లం ముద్ద , కొతిమీర , శెనగపిండి , ఒక చెంచా నూనె ను కలపాలి . సొరకాయ తురుము నుండి నీటిని పిండకూడదు . ఆ మిశ్రమము లో కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేస్తూ గట్టి పడేలా , చపాతీ పిండి లాగా తడుపుకోవాలి . ఆ పిండిని పదినిమిషాలు వుండనిచ్చి , తరువాత చపాతీలలా చేసుకోవాలి . అంతే సొరకాయ పరోఠా రెడీ !
అందులోకి కి మాగాయే మహా పచ్చడి వుందిగా !!
కప్ పెరుగులో రెండు చెంచాలు మాగాయ వేసి , మెంతులు , ఆవాలు , ఇంగువ తో పోపేస్తే మాగాయ పచ్చడి తయార్ !
సొరకాయ ముఠియా
కావలసిన పదార్ధాలు ;
సొరకాయ తురుము 1 కప్
పెరుగు కొద్దిగా
బియ్యం రవ్వ లేదా ఇడ్లీ రవ్వ 2 కప్ లు
ఈ మూడిటిని కలిపి రెండు గంటలు నాన బెట్టాలి .
నానాక , ఆ పిండిలో జీలకర్ర పొడి , వాము , ధనియాల పొడి , కొతిమీర , అల్లం , ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి , ఉప్పు మన ఇష్ట ప్రకారము వేసుకొని కలపాలి . పావు చెంచా ఈనో కూడా కలపాలి . కొంచము నీరు కనుక వుంటే గట్టి పడేందుకు శెనగ పిండి ని కలప వచ్చు . ఆ పిండిని పైన ఫొటో లో చూపిన మాదిరి వుండలు చేసుకొని స్టీం ఇవాలి . కుక్కర్ లో కాని , లేదా ఒక పెద్ద మూకుడు లో నీరు పోసి , ఈ వుండలు వుంచిన పళ్ళెమును వుంచి కాని వుడికేవరకు , స్టీం ఇవ్వాలి . ఆ తరువాత వాటిని చల్లారనివ్వాలి . అవి చల్లారాక , ముక్కలుగా కట్ చేసుకోవాలి .
మూకుడు లో నూనె వేసి , ఆవాలు , ఇంగువ , నువ్వులు వేసి పోపు చేసుకొని , అందులో ఈ ముక్కలను వేసి , కొద్ది సేపు వేగనివ్వాలి . ఆ పైన కొతిమీర చారాలి .
ఆ పైన తినేయటమే !
మిగిలి పోయిన అన్నము తో , పులిహోరనో , బిరియానీ నో కాకుండా వెరైటీగా ఈ ముఠియాలు చేసు కోవచ్చు . అన్నం ను మెత్తగా చేసి అందులో వాము , ధనియాల పొడి , అల్లం , కొద్దిగా శెనగ పిండి , ఈనో వేసి , చపాతి పిండిలా తడుపుకొని , మిగితా అంతా ముఠియా పద్దతి లో చేసు కోవాలి .
Subscribe to:
Post Comments (Atom)
16 comments:
ఇంతకన్న పాము మంత్రం నేర్చుకోవడమే సులభంగా వుంది. (ఎలాగూ పాములు కనిపించడం లేదుగా...అందుకని..). ఇవన్నీ ఇప్పుడు ఎవరు వండి వారుస్తారు బాబూ, ఎవరో మీలా ఆవకాయ, మాగాయ పెట్టుకున్న వాళ్ళు తప్పితే. మీ ఇంటికొస్తాము కదా. అప్పుడు తిని పెడతాం లెండి.
శ్రీలలిత గారు నా నోటిలోని మాటను అప్పుడే పోస్టారు. సొరకాయ నాకు నచ్చదు, నేనైతే పాముమంత్రం అనే విద్య నేర్చుకునేదాన్ని. హేతువాదులెవరైనా పాము కరచి అయ్యో బాబోయ్ అని అరుస్తూంటే, తాపీగా పాముమంత్రం వేసి కసి తీర్చుకునేదాన్ని.
సొరకాయ హల్వా చేయలేదా?
ముఠియా
ee pErEdO musTi vaaLLa tinDlu laa vunnaayi. :)
అబ్బ సొరకాయ .. యుక్.. మళ్ళి మరాఠీ లు పరాఠాలు వూరుకోద్దురూ... దానికంటే పాము మత్రం నేర్చుకుంటే పోలా పని చేసిందో లేదో ఎవ్వరూ టెస్ట్ చెయ్యరు కద ;-) అసలే ఇప్పుడే టీవీ 9 లో చూసా, సొరకాయ జ్యూస్ తాగి ఎవరో శాస్త్రజ్నుడూ డెల్హీ లో చనిపోయారట. నాకొద్దమ్మ సొరకాయ.
శ్రీలలిత గారు ,
పోదురూ మరీ బడాయి కాకపోతే మీకు రానివి , మీరు చేయనీ వంటలా ఇవి ?
* నీహారిక గారు ,
మావారు స్వీట్ తినకూడదని ఐదారేళ్ళ నుండి స్వీట్స్ చేయటము మానేసానండి . అందుకే హల్వా చేయలేదు .
చూస్తున్నా చూస్తున్నా , ఏమిటండి ఒకటో అనొనమస్ గారు మీకు సొరకాయ నచ్చదా , పాము మంత్రం నేర్చుకుంటారా ?
రెండో అనొనమస్ గారు ముఠియా ముష్టి పేరులా వుందా ?
ఏమ్మా భావనా సొరకాయ యాక్ నా , పాము మంత్రం నేర్చుకుంటారా ?
పాము మంత్రం లేదు గీము మంత్రం లేదు . మీకు తెలీదేమో మంత్ర గాళ్ళ పళ్ళు రాలగొడతారు .
కమ్మగా చేసి పెడితే తినము అని గోల చేసే మీలాంటి గోలపిల్లల కోసం మా వారు చెప్పే మంత్రం ఇది . శుభ్రంగా నోరు మూసుకొని తినండి . లేదా రేపు , సొరకాయ లో పోషక విలువలు , దాని వలన వుపయోగం అనే పోస్ట్ రాస్తాను . మీరంతా నాలుగేసి కామెంట్స్ రాయాలి తెల్సిందా . హన్నా !
:)
Vandatam lo majaa telisthe bhale untundi
ఏం కాదు మాల గారు... పాము మంత్రాలోళ్ళను ఏమి చెయ్యరట. మహా ఐతే పాములు పగ బడతాయేమో హి హి హి అందుకే నేను పాములు లేని చోట వుంటా కదా. అరచేతి నడ్డు పెట్టి సూర్యోదయం ఆపలేరు... ఇలా బెదిరించి మా చేత సొరకాయ తినిపించలేరు ఇంక్వి లాబ్ జిందాబాద్ (దానికి సొరకాయ కు సంభందం ఏంటి అని అడగకండి, కాస్త స్ట్రాంగ్ గా వుంటుందని వాడా). మనలో మాట మా అబ్బాయికి చెప్పకండి నేను ఇలా మాల గారి మీద తిరుగుబాటు చేస్తున్నా అని. వాడూ నేర్చుకుంటాడూ మళ్ళీ ;-)
మాల గారు,
సొరకాయ పులుసు చేయండి. చాలా బాగుంటుంది.సొరకాయ పాలు పోసి కూర వండితే ఇంకా బాగుంటుంది. ఇన్నిమాటలెందుకు నాకు సొరకాయ చాలా ఇష్టం,కానీ మా అబ్బాయి,మావారు ముట్టుకోరు.అదీ నా బాధ!!
సృజనా ,
అవును , చక్కగా వండటము లో వున్న ఆనందం తినటము లో వుండదేమో కదా .
* నీహారికా,
ఇలా చేసి పెట్టండి . మీవాళ్ళకు తెలీను కూడా తెలీదు , ఇవి సొరకాయ తో చేసారని . అప్పుడు ఎంచక్కా సొరకాయ తినాలనే మీ కోరిక కూడా తీరుతుంది .
భావనా ,
ప్లీజ్ ప్లీజ్ తినరా ? బంగారుతల్లి కదూ . వరాలమూట కదూ .తినండమ్మా .
ఇదో తినక పోయారో మీ అబ్బాయికి చెప్పేస్తాను .
అబ్బ పరాఠాలు భలే ఉన్నాయండీ, నాకు మాత్రం ఆనపకాయ (సొరకాయ ని మేము ఆనపకాయ అంటాములెండి) అంటే భలే ఇష్టం. అన్ని రకాల పప్పులు, కూరలు తినేస్తాను. ఆ అల్లరి పిల్లల మాటెందుకుగానీ నాకు వండి పెట్టండి, ఆనపకాయ
తో ఏం చేసిన నేను బుద్ధిగా తినేస్తాను :D
మా అమ్మే మా అమ్మే సౌమ్య ఎంత గుడ్ గర్ల్ , ఇదో ఇక్కడ సొరకాయ టిక్కీ లు కూడా పెట్టాను . తినేయండి .తొందరలోనే భాకిరీ రోటీ , సొరకాయ కోఫ్తా కూడా చేసి పెడుతాను . సరేనా .
అమ్మా, మాలగారూ ,ఈ సొరకాయలకి జోహార్లు కానీ ఈ సొరకాయ దంపడిని ఆపండి. మిగతా కూరల పేర్లు నేర్చుకోండి. బాబూ కావాలంటే నేను ఇంకొన్ని కొత్త రెసిపీలని ఇవ్వగలను కానీ చచ్చినా ఇవ్వను. మళ్ళీ దాని గురించి మొదలెడతారు. ఈ మధ్యన నాకు కలలో కూడా ఈ సొరకాయే వస్తోంది. మా ఇంట్లో సొరకాయని అసలు కొననంటే ఇక కొనను. ఇంతటితో ఈ సొరకాయి ప్రస్థావింపుకి అంతం.
బాబోయ్ బాబోయ్ కృష్ణవేణి గారు ఎంత కోపం చేస్తున్నారండి .
పోనీ లెండి ఇలాగైనా నా బ్లాగుకు వచ్చారు . చాలా సంతోషమండి .
మనలో మన మాట ప్లీజ్ ప్లీజ్ ఆ రెసిపీలేమిటో చెప్పరూ ! ఎంతైనా మనం మనం డిల్లీ వాళ్ళము కదండి , ఆ మాత్రం సహకరించాలండి .
Post a Comment