Thursday, October 22, 2009

నాగులచవితి

ఈ రోజు నాగులచవితి కదా , మీరేమి రాయలేదేమి అని ఫణి ఇప్పుడే చాట్ లో అడుగగానే ,ఒహో ఏమైనా రాయాలికదూ అనుకొని , పాములతో నాకున్న పరిచయం రాద్దామని మొదలు పెట్టాను ! అలా అంటే నేనేదో సద్దాం ఆంటీ ఇంటికథ నవల లో జాంబవతి లాగా తరతరాల పాములను పెంచుకొనే దాన్ని అనుకోకండి !

మా నాన్నగారు పొట్టిచెలమ ,( నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ కాంప్ ) లో పనిచేసేటప్పుడు , అక్కడ టెంపరరీ ఇళ్ళు, సగము రాళ్ళ గోడలు, సగము తడికల తో కట్టి ,పైన రేకులతో కప్పిన ఇళ్ళలో వుండేవారము. అక్కడ కాంప్ తప్ప మిగితా ప్రదేశం అంతా కొండలు , చెట్ల తో వుండేది . కాబట్టి మాకు , మేము పడుకున్నప్పుడు పైన దూలం మీదనుండి , బియ్యం డబ్బా పక్కనుండి , బాత్ రూంలొ , చదువుకునేటప్పుడు టేబుల్ కిందనుండి ఇలా ఓ చోటని కాదు ఎక్కడ పడితే అక్కడ మాకు హాయ్ చెప్పటానికి వచ్చేసేవి . అవీ అలాటి ఇలాటి మామూలు పాములుకాదు నాగుపాములు ! ఏదో అలా వాటి తో సహజీవనం చేసేసాం !

ఆ తరువాత నా పెళ్ళైనాక , జబల్పూర్ లో వున్నప్పుడూ ఇంతే ! ఎక్కడపడితే అక్కడ హల్లో చెప్పేసేవి .ఓసారి నేను రోడ్ మీద వెళుతుండగా గోధుమరంగు లో వున్న ఓ పాము నా ముందునుండి వెళ్ళింది . అబ్బ ఈ పాము ఎంత అందముగా వుంది అని చూస్తూ వుండిపోయాను . అది కొంచం దూరం వెళ్ళాక , బాబోయ్ ఇది . . . ఇది పాముకదూ ! గోధుమవన్నె తాచంటే ఇదేనేమో అనుకొని , అప్పుడు గడ గడా వణికిపోయి , అక్కడినుండి కిందపడుతూ , మీద పడుతూ పరుగో పరుగు ! అక్కడే ఓసారి మావారు ఆఫీస్ కి వెళుతుండగా రోడ్ కడ్డంగా పెద్ద లావు చాంతాడంత పాము వెళుతూ కనిపించిందట . భయం తో అది రోడ్ దాటి వెళ్ళేవరకు స్కూటర్ ఆపి పక్కకు వుండి పోయారట. ఆ పాము గారే ఎదురింట్లోకి దూరందిట ! వాళ్ళ ఇంటి కి వెళ్ళి తలుపుకొట్టి ఇలా ఓ పాము మీ ఇంటి వెనుకకి వెళ్ళింది అనగానే ,అదే చేయదండి ,ఇటే తిరుగుతుంటుంది అన్నాడట ఆ ఇంటాయన ! మా ఇంటాయన మటుకు ఇప్పటికీ దాన్ని తలుచుకుంటునే వుంటారు .

ఇక బరోడాలో వున్నప్పుడు మా ఇంటి ఆవరణలో ఓ పెద్ద ,నల్లటి పాము ,రాత్రులు తిరుగుతూ వుంటుందని , దాని నెత్తిన ఓ మణి కూడ వుంటుందని అక్కడి వాళ్ళు చెప్పేవారు. దాన్ని చూడటానికి నేను , జయ చాలా రాత్రులు ,పాముకు కనిపించకుండా , లైట్లు ఆర్పి , కిటికీ వెనుక కుర్చొని కాపలా కాసాము , అబ్బే ఎక్కడా చడీ చప్పుడు లేదు . దర్షనబాగ్యము కలుగలేదు !

పాములతో ఇంత అనుబందం వున్నా నాకు పాములంటే చచ్చేంత భయ్యం ! వాటి బొమ్మ చూడాలన్నా భయమే ! ఎప్పుడూ ఓ అనుమానం వస్తుంది సుభద్ర గారు ఎంచక్కా వాటి కుటో తీసి బ్లాగ్లో ఎలా పెట్టారా అని.

సరె ఇక నాగుల చవితి విషయానికి వస్తే కార్తీకశుద్ద చతుర్దశి నాడు అంటే ఈరోజు నాగుల చవితి .పుట్టిన బిడ్డలు బతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను నాగ ప్రతిష్టచేసి పూజించటము సాంప్రదాయము . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి ,నాగలక్ష్మి , నాగేశ్వరరావు ,నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు .ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి పూజించి పాలు పోసి చలిమిడి , చిమ్మిలి నైవేద్యం పెడుతారు . ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవిదగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారి కి ఈపుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు.

నన్నేలు నాగన్న , నాకులమునేలు ,

నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .

పడగ తొక్కిన పగవాడనుకోకు ,

నడుము తొక్కిన నావాడనుకొనుము .

తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .

ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .

అని పుట్టలో పాలు పోస్తూ , నూకవేసి వేడుకుంటారు .

ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !

మా అత్తగారితో నేను ప్రతి నాగుల చవితికి కాచిగూడ హనుమంతునిగుడిలో వున్న పాము పుట్టదగ్గరికి వెళ్ళేదానిని . అప్పుడు గుడి చాలా చిన్నగా, గుట్టమీద వుండేది . ( ఇప్పుడు వున్న గుడిని కొత్త డిజైన్ లో డెవలప్ చేసిన ఆర్కిటెక్ట్ మా అల్లుడు సతీష్ .వాళ్ళ కుటుంబానికి కూడ ఆ గుడితో చాలా కాలము నుండి అసోషియేషన్ వుంది .) చలిమిడి , చిమ్మిలి , కొబ్బరిముక్కలు , అరటిపండు తిని ఉపవాసం వుండేవాళ్ళము. దీపావళి రోజే కొన్ని టపాకాయలు పిల్లలకు కనిపించకుండా దాచి ఈ రోజు కాలిపించేవారము .

దిబ్బు దిబ్బు దీపావళి , మళ్ళీ వచ్చే నాగుల చవితి .

10 comments:

మురళి said...

...ఎప్పుడు తిన్నా చలివిడి ముద్దా... బాగుందండీ టపా..

K Phani said...

bhagaa raasaaru.naakasalu aa chalimidi nuvvula prasaadam ante chalaa istam kuda.malli vaatini vidi rojulalo chesukoni tinte anta ruchani pinchavu kuda.chalaa fastgaa mee anubhavaalato chavitini bhagaa purti chesaaru. naa peru kuda mee bloglo cherindi ee vidhamgaa chala thanks adaggaane raasinanduku.inkotikuda nuvvulu tisukoni navvulu ivvu ani kudaa adugutaaru kada.

పరిమళం said...

అబ్బా ముందు భయపెట్టినా తర్వాత నాగులచవితిని ,నాగన్నను వేడుకొనే పాటనూ చాలాబాగా వివరించారు .గోధుమరంగు త్రాచు అనగానే మీ బ్లాగ్ లోంచి పారిపోదామనుకున్నా అంత భయం నాకు పాములంటే ! కానీ ఇప్పుడు మీ నాగన్న పాట కంఠతా పడితే ఎందుకైనా మంచిదని ఫిక్స్ అయ్యా !

మరువం ఉష said...

బాగా వ్రాసారు. మా చిన్నప్పటి సంగతులూ గుర్తుకు వచ్చాయి. బుగ్గవాగు, మాచెర్ల, రెంటచింతల ఆ ప్రాంతాల్లో, మీ రన్న వూర్లోనూ మాకూ అవే అనుభవాలు. నాగులవచవితి చలిమిడి , చిమ్మిలి కోసం సం. అంతా చూసేదాన్ని.

మాలా కుమార్ said...

మురళిగారు ,
థాంక్స్ అండి.

మాలా కుమార్ said...

ఫణీ ,
నేనే నీకు థాంక్స్ చెప్పాలి . నువ్వు చెప్పేదాకా రాయాలని వున్నా బద్దకం గా వూరుకున్నాను ( గురూజీ మీరిది చదవకండి ) .ఇలాగే నీకు తోచిన టాపిక్స్ చెప్పు .నేనూ నాబుర్రకి, చేతికి పదును పెడుతాను . నువ్వుల సంగతి మరిచిపోయాను .

మాలా కుమార్ said...

పరిమళం గారు ,
నాకు కూడా పాములంటే బోలెడంత భయ్యం ! అందుకే ఒక్క పాము బొమ్మనే పెట్టటానికి భయమేసి , తప్పదు కాబట్టి శివుడితో కలిపి పెట్టాను . భయపడి పారిపోకుండా నా పోస్ట్ మొత్తము చదివినందుకు నెనర్లు .

మాలా కుమార్ said...

ఉష గారు ,
అయితే మేము తిరిగిన వూళ్ళన్నీ మీరూ తిరిగారన్నమాట ! అయితే మీరు నా ఫాలోవర్ అన్నమాట.

భావన said...

చాలా కధ/అనుభందం వుందండి మీకు పాములతో. నాకు కూడా బొమ్మ చూసినా కాళ్ళు చేతులు వణికి పోతాయి. నాకు ఇంత వరకు ఒక్క పాము కూడా కనపడలేదు, మా అక్క కు మాత్రం కనపడతమేమి ఖర్మ మీద కూడా పడుతుంటాయి. మరి ఇద్దరం ఒకే ఇంట్ళో వుండే వాళ్ళము.. అమ్మోవ్ ఇంత కంటే ఎక్కువ రాయాలన్నా నాకు భయం. బోలెడన్ని వివరాలు ఇచ్చారు. బాగుందండి.

జయ said...

నాగుల చవితికి నేను ఎప్పుడూ ఏమి చేయలేదు. కాకపొతే క్రాకర్స్ తీసిఉంచి ఆరోజు కాలుస్తాను. ఢాండాం లు మాత్రం కాదు. పాములు మాత్రం నేను ఇప్పటికీ మరచిపోలేను.