Monday, October 12, 2009

జాజిపూలు

సాహితి అనుకొని జాజిపూలు బ్లాగ్ లోకి వచ్చామా అనుకొకండి . ఇది నా పోస్ట్ శీర్షిక మాత్రమే ! కాకపోతే ఆ పేరు పెట్టటానికి నాందీ , ఉపోద్ఘాతం , ప్రస్తావన వగైరా చాలా వున్నాయ్ ! వాటి కథా కమీషూ అన్ని చెపుతాను .కాస్త ఓపికగా చదవండి.

అవి నాకు జ్యోతిగారు పరిచయం అయిన తొలి రోజులు . కొన్ని బ్లాగుల లింకులిస్తాను చదవండి , ఎలా రాయాలో ఐడియా వస్తుంది అన్నారు. సరే కానీయండి . కాని రాజకీయాలు సుదీర్ఘ చర్చలు లాటి భారీ ,భారీ వి వద్దు . నేనసలే ఏడు జాజిపూలెత్తు సుకుమారిని , అలాంటి సుకుమారమైనవే ఇవ్వండి అన్నాను. అదిగో అప్పుడు జ్యోతిగారిచ్చిన లింకులలో జాజిపూలు బ్లాగ్ లింక్ కూడా ఒకటి .

జాజిపూలు బ్లాగ్ లోకి వెళ్ళగానే పువ్వులలో బజ్జున్న పాపాయి ని చూడగానే తెగ ముద్దొచ్చేసింది . ఆ తరువాత చదవగానే అహా ఏమి నా భాగ్యము , నా అభిమాన రచయిత /త్రి లు రాయటము మానేసారే అన్న దిగులు తీరింది కదా అని తెగ సంతోషించాను . అంతటితో ఆగొచ్చుగా ! అబ్బే అంత మంచి బుద్ది ఏది ? నేస్తం గారు , మీ బ్లాగ్ నాకు తెగ నచ్చేసిందండి , ఇంత మంచి బ్లాగ్ పరిచయము చేసిన జ్యోతిగారి నెత్తిన పాలు పోసి ఉక్కిరి బిక్కిరి చేయను కాని మా ఇంట్లో పూసే జాజిపూలు మాల కట్టి సమర్పించుకుంటాను అన్నాను. అదే ఉత్సాహము లో జాజి తీగ దగ్గరికి వెళ్ళి చూద్దును కదా అప్పటి వరకూ ఒకటో రెండో వున్న పూలు కూడా లేవు ! పోనీ సీజను కాదేమో అనుకుందామా పక్కింటి వారి తీగ విరగ పూస్తోంది !

ఇప్పుడే గొప్పగా ప్రతిజ్ఞ చేసి వచ్చానే ఏమి చేద్దు ? కింకర్తవ్యం ? అని దిగులుగా వున్న నాతో మా శారద అమ్మా ! మా అమ్మ పని చేసే చోట మాలి , రూఫ్ గార్డెన్ చేసాడమ్మ , బాగుంది , అతనిని పిలుద్దామా ? అంది సరే అన్నాను.

మాలి హుస్సేన్ గారు వచ్చారు . మా ఇంటి చుట్టూ ,అతను , వెనుకాల నేను , నావెనుక శారద మూడు సార్లు ప్రదక్షణ చేసాక , చెప్పటము మొదలు పెట్టాడు.

బాదం చెట్టు కొమ్మలు కత్తిరించాలె ,

సరె ,

ఉసిరిచెట్టు కొమ్మలు కూడా కత్తిరించాలె ,

మంచిది .

జాజి తీగ కొమ్మలు కత్తిరించి , పందిరి మంచిగ వేయాలె

అవును . అది చాలా ముఖ్యం ! గోడ వెంట కాశీ రత్నం , బఠాణీ పూల తీగ వేస్తావా ?

వేయొచ్చు.

రెండు కొబ్బరి చెట్ల కి ఒకదానికి మాలతి , ఒక దానికి రాధామాధవం వేస్తే బాగుంటుందా ?

కొబ్బరి చెట్లకి వద్దు , ఈ గోడ వెంట , ఈ మెట్ల పక్కన వేస్తే , పై బాల్కని దనుక పోయి మంచిగ కొడుతయ్ !

అవును పాత సినిమాలలో బాల్కనీ లో స్తంబాలకు పూల తీగలు , వాటి దగ్గర సావిత్రి ఒహ్ ఎంత మంచి దృశ్యం !

కుండీలల కూడా సీజనల్ పూలు వేయొచ్చు . నువ్వు నర్సరీకి వస్తే నీకేవి కావాలంటే అవి తెద్దాము.

కుండీలలో ఆకు కూరలు వేస్తే బాగుండదా ?

బాగుంటది .

గుత్తులు గుత్తులుగా మాలతి పూల తీగ , సువాసనలు వెదజల్లుతున్న రాధామాధవాలు , ఎర్రని సోయగాల కాశీరత్నాలు ,గులాబీ బఠాణీలు పూల కుటీరం లోకి వెళ్ళిపోయిన నన్ను , మేడం ముందుగల చుట్టూ ఒక అడుగు మట్టి తవ్వి తీయాల అన్న హుస్సేన్ మాట ఈ లోకం లోకి తెచ్చింది.

ఏమిటి ?

చుట్టూ మట్టి తవ్వి , ఓ పది బండ్ల కొత్త మట్టి , ఎరువు పోయాల . పాత మట్టి పాడై పోయంది .

మొత్తం ఎంత అవుతుంది ?

5000 ల రూపాయలు.

5000 లా ?

అవ్ ఇద్దరు లేబర్ని తెస్త్త , మట్టి , ఎరువు అంత కలిపి అవుతది . ఆ ఇంకో మాట తీసిన మట్టి ఏడ పోయాల ?

మీరు తీసుకు పోరా ?

లేదు . మీరె పారేయించుకోవాలె . మేము బయట గోడ పక్కన పోస్తం !

నా మొహం చూసి ఏమనుకున్నాడో ఆలోచించుకొని నాకు ఫోన్ చెయ్య్ వస్తా అని వెళ్ళిపోయాడు .

రాత్రి బోజనాలు చేసేటప్పుడు చిన్నగా నసుగుతూ మాలి సంగతి చెప్పాను . ముగ్గురికీ కొర పోయి , నెత్తి మీద ఠపాఠప్ అని కొట్టుకున్నారు . మా అబ్బాయి , కోడలు మిడిగుడ్లేసుకొని చూస్తుంటే , మావారేమో , ఏమిటీ ఇంటిచుట్టూ రెండడుగులు తవ్వి పోస్తాడా ?

రెండడుగులు కాదు ఒకడుగే అని చిన్నగా గొణిగాను .

నువ్వు మాట్లాడకు .ఆ మట్టి బయట రోడ్ మీద పోస్తాడా ? అది ఎవరు తీయాలిట ?

లేబర్ ఎవరు దొరకరా ?

ఆ నువ్వూ , నేనే మోయాలి . ( నా కళ్ళ ముందు నేనూ , మా వారు మట్టి తట్టల తో ప్రత్యక్షం ) శ్రీధర్ , శారద సహాయం చేస్తారు చేయించుకో . కావాలంటే ఒక్క మూర కాదు పది మూరలు ,పది రకాల పూలు కొని పెట్టుకో ( మరే బతకమ్మలా పేర్చుకుంటా ! అయ్నా నా కోసం ఏమిటి ? ) అంతేకాని కొంప కూల్చకు . అని ఘట్టిఘా వార్నింగ్ ఇచ్చారు.

నా బాధ చూసి , మా ఆడపడుచు ఉష వాళ్ళ ఆడపడుచు ఆదిలక్ష్మి , మాలి అవసరము లేదండి , మా ఇంట్లో 300 రకాల చెట్లు వున్నాయి , నేనే చూసుకుంటాను . అంతగా ఐతే పబ్లిక్ గార్డెన్ లో మొక్కల పెంపకము మీద క్లాసులు జరుగుతుంటాయి .ఓ సారి వెళ్ళొస్తే మనకు కొన్ని కిటుకులు తెలుస్త్తాయి అని ఓ మంచి ఉపాయం చెప్పారు . మరునాడు చక చక గా పనులు పూర్తిచేసుకొని , పబ్లిక్ గార్డెన్ కి వెళ్ళాను . అక్కడా నన్ను విధి వెక్కిరించింది ! ప్రతి నెల మొదటి వారములో మూడు రోజులు క్లాస్లు వుంటాయి . ఈ నెలవి అయిపోయాయి .వచ్చేనెల ఫోన్ చేయండి , కనీసము నలుగురైనా వుంటే చెపుతాము అని చాలా మర్యాదగా చెప్పారు . హూం ! ఆ రోజు ఇంతవరకు రాలేదు .

ఈ లోపల శ్రీధర్ దాని కొమ్మలు కత్తిరించి , ఆకులు దూసి , గొప్పులు తీసి ఎరువులు వేసి , రోజూ బోలెడు నీళ్ళూ పోసాడు . తీగ చక్కగా గుబురుగా పెరిగి , కొమ్మా , రెమ్మా వేసిందేకాని , ఒక్కటంటే ఒక్క పూవు పూస్తే ఒట్టు ! నాకు చాలా విరక్తి కలిగి ఇక దానికి చేసిన పోషణ చాలులే ,మరీ ఎక్కువైనట్లుంది . కొన్నిరోజులు మాడ్డుదాం అని శ్రీధర్ కి చెప్పాను ,

నిన్న సాయంకాలం బాల్కనీ లో శూన్యం లోకి చూస్తూ , నేనసలు ఇంతటి మాట ఎందుకిచ్చాను ? ఇచ్చిన మాట తప్పటము మాఇంట , వంటా లేదే , మూరెడు కాదు , జానెడు , కాదు కాదు బెత్తెడు , పోనీ ఓనాలుగు పూలు ఇద్దామన్నా లేవే ! నా మాట దక్కకపాయెనే ! అని చింతిస్తువుండగా అమ్మా అమ్మా అని కిందనుంచి శారద పిలిచింది .ఏమిటా గావు కేకలు ?

మీరు తొందరగా జాజి తీగ దగ్గరికి రండమ్మా .

వెళ్ళి చూద్దునుకదా విచ్చుకొని ఓ పువ్వూ , విచ్చుకుంటూ నాలుగు మొగ్గలు , ఇంకా కొన్ని బుజ్జి బుజ్జి మొగ్గలు నన్ను చూసి చిలిపిగా నవ్వాయి .

21 comments:

నేస్తం said...

మాల గారు బ్రతికించారు..మీ పోస్ట్ మొదటి పేరా చదవగానే ఆనందం తట్టుకోలేక ఒక మారు ఫోన్ అందుకున్నా ..మరి మా ఆయనను కాసింత కుళ్ళబెట్టాలి కదా.. తరువాత సగం చదువుతుంటే భయం వేసింది..పొరపాటున నీ ఐరన్ బ్లాగ్ లో జాజిపూలు గురించి రాసినందుకే పూలు కాయడం మానేసాయి అంటే అర్ధం చేసుకో అని నాకే తిరిగి నాకే ఎసరు పెడతారేమో అని . సస్పెన్స్ నవల చదివినట్ట్లు ఊపిరి బిగపెట్టి మరీ చదివి కధ సుఖాంతం అయ్యేసరికి హమ్మయ్యా అనుకున్నాను..ఇంక పోస్ట్ సూపరో సూపర్ :)

sunita said...

మాలా గారూ, పొస్ట్ బాగుంది, పైన ఫోటోలో కనిపిస్తున్నది సన్న జాజి తీగ. ఆకుల కొన కోసుగా ఉంది ముదురాకుపచ్చ రంగులో. జాజితీగ ఆకు పొట్టిగా ఉంటుంది ఆకు రంగు సన్న జాజితో పోలిస్తే లేతగా ఉంటుంది. సన్న జాజి ఆకంత పొడవుండదు. జాజి మొగ్గ కూడా పొట్టిగా ఉంటుంది. సారీ! మరోలా అనుకోవద్దు.

తృష్ణ said...

సన్నజాజిపూలు(విరజాజి కాడ కొంచెం పొట్టిగా ఉంటుంది..)..
నాకెంతో ఇష్టమైన పూలు...నేను చదువుకునే రోజుల్లో తీగ పెంచినప్పుడు ఇలాగే చూసుకునే దాన్ని ఎప్పుడు మొగ్గలు వస్తాయా అని.... ఆ సువాసనే అద్భుతం...

కాశీరత్నం తీగె కూడా బాగా పెంచాను..ఎంతమందికి విత్తనాలు ఇచ్చానో...ఆ సన్నని ఎర్రని పూలు నాకు భలే ఇష్టం..ఆ ఆకులు కూడా డిఫరెంట్ గా, అందంగా ఉంటాయి.

బాగున్నాయండి మీ తోట కబుర్లు.నా చిన్నప్పటి తోట..మొక్కల పెంపకం గుర్తు వచ్చాయి..thankyou.

కొత్త పాళీ said...

Quite beautiful.
పూల మొక్కలకి, పొదలకీ, ఎరువు లాంటి పోషక పదార్ధాలు మరీ ఎక్కువగా వేస్తే, ఆకులు దట్టంగా పెరుగుతాయి గానీ పూలు రావు. ఈ విషయంలో కొంచెం మోతాదు పాటించాలి.

'Padmarpita' said...

ఇంక చూసుకోండి మరి మీ మూడు సాహితీపూలు, ఆరు మూరలౌతాయి త్వరలో...

Srujana Ramanujan said...

Quite nice. Ditto nestham comment

జయ said...

నువ్వు నాతోటి బ్లాగ్ స్టార్ట్ చేయించినందుకు, నా క్కూడా, కనీసం ఒక్క జాజి మొగ్గన్నా ఇవ్వచ్హు కదా! అందరూ మాలా కుమార్ మీ అక్కా అని అడుగుతున్నందుకైన ఇవ్వచ్హు కదా! ఎంతైనా చిన్నదాన్ని కదా!

శ్రీలలిత said...

మాలగారూ,

మా ఇంట్లో జాజితీగతో కూడా అదే సమస్య. మాలీ దొరకటంలేదు. ఆతీగని ఏం చెయ్యాలో తెలీటంలేదు. మీరు చెప్పినట్లు నెను, మా వారూ చెరో తట్టా నెత్తి కెత్తుకుందామంటే నా కన్నా సుకుమారులు మావారు.

ఆ జాజి ఎప్పుడు చివురించునో, ఎప్పుడు మొగ్గ తొడుగునో నా నిరీక్షణెప్పటికి ఫలించునో....

srujana said...

అన్నీ మంచి శకునములేనన్నమాట....బాగుందండి!

జ్యోతి said...

మీ ఎదురుచూపులు,కష్టాల సంగతేంటోగాని నా మల్లెపూల దండ ఎప్పుడిస్తారు??

భావన said...

అయ్యయ్యో మాల గారు ఎంత కష్టమొచ్చింది మీ జాజి తీగ కు, ఆ తీగ పూల కోసం ఎదురు చూసే మీకు.. కొత్తపాళి గారన్నట్లు టూమచ్ ఎరువు, నీళ్ళు ఇచ్చి వుంటారు, ఆపేరు గా ఇక చూసుకోండి మీ కష్టానికి బోలెడంత ప్రతిఫలం వచ్చేస్తోంది...... వచ్చేస్తోంది..... వచ్చేసింది ఈ నాలుగు పువ్వుల శుభారంభం తో.. ఇంక ఈ నాలుగు నలభై అయ్యి, ఆ నలభై నాలుగు వేలై మా అందరికి కూడా దండలు పంచేస్తారని ఆశిస్తూ..
అబ్బ మీ మాలి చెప్పిన కథ వింటే నాకైతే అబ్బ అనిపించింది కాశీరత్నం, మాలతీ లత, రాధా మాధవం, సన్నజాజి అయ్యో మా వూళ్ళొ మా దొడ్డి లోని మొక్కలన్ని మిస్స్ ఐపోతున్నాను రా దేవుడా..

ఉష said...

మాలా గారు, భలే పూల విషయాలు ఎన్ని చెప్పినా వింటాను. నాకు జాజులు అన్నీ ఇష్టమే - సన్నజాజి, విరజాజి, జాజిమల్లి, అడవిజాజి ఇలాగన్నమాట.

ఇక్కడ కూడా పూయిస్తాను, "మంచు కురిసే వేళలో మల్లె విరిసేనేందుకో" అన్నట్లుగా. :)

మంచి టపా.

పరిమళం said...

అబ్బా సన్నజాజులు కొందామన్నా దొరకవు ....త్వరగా పూయిస్తే జ్యోతిగారి వెనుక లైనులో చాలామంది ఉన్నాం :)

మాలా కుమార్ said...

నేను నా టెన్షన్ గురించే ఆలోచించాను కాని మీగురంచి ఆలోచించనందుకు చింతిస్తున్నాను .
నన్ను క్షమించండి నేస్తం గారు , నన్ను క్షమించండి !

మాలా కుమార్ said...

సునీత గారు ,
అనుకోవటానికి ఏముందండి ?
నేను రాసింది సన్నజాజి గురించే . మేము దీన్నే జాజి పువ్వు అంటాము . మీరు చెప్పిన దాన్ని విరజాజి అంటాము . ఆ తీగా వుంది . దానిగురించి ఇంకోసారి రాస్తాను .
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

తృష్ణ గారు ,
థాంక్స్ అండి .
పద్మార్పిత గారు ,
మీ దీవెన ఫలించాలని కోరుకుంటున్నానండి . థాంక్ యు.
సృజన , థాంక్ యు .

మాలా కుమార్ said...

కొత్త పాళి గారు ,
మీరు చెప్పింది నిజమేనండి . అంతే కాదు , ఆశలావు , పీక సన్నం అన్నట్లుగా మాకున్న కొద్ది పాటి స్తలములో బోలెడు చెట్లు వేసాను , అన్నిటికీ స్తలము సరిపోక కూడా ఈ బాధ !

మాలా కుమార్ said...

జయా ,
ఓ గోల పెట్టేస్తావు , నీకివ్వను అన్నానా ?

శ్రీలలితగారు ,
వారులు సుకుమారులైనా ,కాక పోయినా మన నెత్తినే తట్ట పెడుతారుకాని వారి నెత్తిన పెట్టుకుంటారేమిటండీ ? మనకున్న కోరికకి మన మిలా పాట్లు , ఎదురుచూపులు పడాల్సిందే !

మాలా కుమార్ said...

సృజన గారు ,
చాలా రోజులు ఇద్దరు సృజనలు ఉన్నారని నాకు తెలీలేదు . మిమ్మలిని కలవటము ఇదే మొదటిసారి .
నా బ్లాగ్ కు స్వాగతం అండి . థాంక్ యు.

మాలా కుమార్ said...

జ్యోతి గారు ,
ఇది చాలా అన్యాయము సుమండీ ! నేను మీకిస్తానన్నది జాజిపూలదండ . మీరు మల్లెపూలంటున్నారు.
అర్ధింపు : గురూజీ , ఇప్పుడు మల్లెపూదండ అంటే మొక్క వేయటము దగ్గరనుండి చేయాలి , ఇప్పటికే మొక్కలన్నీ కిక్కిరిసి ట్రాఫిక్ జాం లో వున్నట్లుగా వున్నాయి . ఇక నే స్తలము సంపాదించి , మొక్క వేసి అమ్మో నన్ను ఇంత కష్ట పెట్టటము , తగునా ఇది మీకు .
బెదిరింపు : మీమీద మాగురూజీ , మొట్టికాయలు అనే పొస్ట్ రాసేస్తానంతే !

మాలా కుమార్ said...

భావన గారు ,
మీఅందరి దీవెనలు ఫలించి , ఇప్పుడిప్పుడే ఓ బెత్తెడు దండ వస్తోందండి .

ఉష గారు ,
మీ తోట ముందు మా తోట హనుమంతుడిముందు కుప్పిగంతులులా వుంటుందండి ! మీ తోట సంగతులు వింటుంటే ఎప్పుడెప్పుడు మీ తోట చూద్దామా అని పిస్తుంది .

పరిమళం గారు ,
వచేస్తున్నాయండి పూలు . మీరూ మాయంటికి వచ్చేయండి , ఓ బెత్తెడు దండ ఇస్తాను .