Sunday, October 25, 2009

టీ కప్ తో చిటపటలు

అదో అన్నిటికన్నా పెద్ద కప్పు వుందే , దాని తో పాలు తాగి నా మనవలు మనవరాళ్ళు బలవాలనే కోరికతో కొన్నాను . వాళ్ళు అందులో సగము కూడా తాగరు అది వేరే సంగంతి. పక్కన నల్ల చారల తో వొగలుపోతూ వుందే అది పదహారు సంవత్సరాల క్రితం ఐదుగురు సహోదరుల తో అమెరికా నుండి వచ్చింది .అందుకే అమేరికా ఫోజులు కొడుతుంది ! మిగితా ఐదు ,ఇండియా పనివాళ్ళ ధాటికి ఆగలేక అమెరికా కి పారిపోగా ఇదొక్కటి వుందునా పోదునా అనుకుంటూ ఏక్ అకేలాగా మిగిలింది ! దాని పక్కన వున్న కప్పులలో మావారికి , ఇంటికి వచ్చినవారికి కాఫీ ఇస్తానన్నమాట. ఆ మూల గోడకి వదిగి పోయి కనిపిస్తోందే స్టీల్ గ్లాస్ అందులో నేను సర్వకాల సర్వావస్తలందు కాఫీ కాని టీ కాని తాగుతాను. ఇక అన్నిటికి దూరంగా వుందే గ్రీన్ కప్ అది మడి కప్పు ! ఏంటీ మీ ఇంట్లో మడితో కాఫీ తాగేవారున్నారా ? అని ఆశ్చర్య పోకండి . ఇప్పుడు ఆ కథా కమీషు చెప్ప పోతున్నాను . అదేమిటి మధ్యలో బ్లు అండ్ బ్యూటిఫుల్ గా ,బుజ్జి కప్ వుంది దాన్ని పరిచయము చేయలేదేమి అంటున్నారా ? కంగారు పడకండి అన్నీ వివరం గా చెప్తాగా !

మా ఇంట్లో పొద్దున కాఫీ క్లబ్ పదిగంటల వరకు వుంటుంది . అంటే ఆ తరువాత తాగమని కాదు , అప్పటినుండి టీ తాగుతాము. ఇంటికి వచ్చినవారికి వారి ఇష్ట ప్రకారము కాఫీ నో ,టీ నో ఇస్తాము. పొద్దున లేవగానే మొదటి కాఫీ నేనే కలుపుకుంటాను. అప్పుడే వేడి చేసిన పాల లో ఫిల్టర్ డికాక్షన్ వేసి ఒక స్పూన్ పంచదార తో కలుపుకొని ( అదేమిటో మొదటి కాఫీ ఎవరు కలిపినా నాకు నచ్చదు . ఆ తరువాత ఎవరిచ్చినా తాగుతాను ! ) , నాకు గ్లాస్ లో , మావారికి కప్ లో తీసుకొచ్చి , ఆయనకిచ్చాక , నేను బాల్కనీ లోని నా కుర్చీలో సెటిల్ అయ్యి , ఉదయించే సూర్యుడిని , ఆకాశములో ఎగిరే పక్షులను , అవీ ,ఇవీ చూసుకుంటూ , ఒక్కో చుక్క ఆశ్వాదిస్తూ చిన్నగా తాగుతాను. మా వారేమో ఎవరో తరుముతున్నట్లు అంత వేడి కాఫీ హడావిడిగా తాగేసి , ఇంకా తాగుతున్న నన్ను చూసి కుళ్ళు తో , జాంబెడు తాగుతున్నావా అంటూ మొదలుపెడుతారు . నేను నా లోకం నుండి బయటకొచ్చి పొద్దున్నే ఈ గొడవ ఎందుకని మా వారికి ఇంకో కప్ కాఫీ తెచ్చిస్తాను . హాయిగా తాగొచ్చుగా ? తాగితే మావారెందుకవుతారు ? నువ్వు సోలెడు తాగుతావు సరె నాకెందుకు తెచ్చావ్ అని చిట పటలాడుతారు . ఇహ నాకొళ్ళుమండి పోతుంది . నేను జాంబడే తాగుతానో , సోలెడే తాగుతానో మానెడు సోలెడు తాగుతానో నా ఇష్టం అనేస్తాను ! సరే నీ ఇష్టం కాని మా ఆఫీస్ లో కి కాఫీ పంపమన్నా ఆ పెద్ద కప్లలో పంపుతావు. మంచి నీళ్ళంటే ఆ స్టీల్ గ్లాస్ లు పంపుతావు అని చిట పట లాడి పోతారు !

మరేం చేయను ? గాజు గ్లాస్లు అన్ని మాయమై పోయాయ్ !1 ఎలా పోయాయా అని నేను శారదా తలపగలు కొట్టున్నాము .మొత్తం బాక్స్ పోయింది ! ఇక కప్స్ విషయాని కొస్తే ఆ గ్రీన్ కప్ ని పరిచయం చెసానే ఆ సైజ్ కప్స్ కావాలంటారు మా వారు అవీ అన్నీ పోయి ఒక్కటంటే ఒక్కటే మిగిలింది .అందుకే దానిని మడి కప్ అని అందులో మావారి కిస్తాను.ఈ మద్య అదీ సొట్ట పోయంది . ఆ సైజ్ కప్ లు కొందామంటే నాకు దొరకటం లేదు. కాదు నువ్వు సరిగా వెతకటం లేదు అని చిట పట లాడుతారు.

ఇహ ఈ చిట పటలు భరించలేక ఈ రోజు మధ్యాహ్నము శారద ను తీసుకొని వాల్యుమార్ట్ కెళ్ళి ఓ డజను గ్లాస్ లు , ఓ డజను చిన్న కప్లు కొనుకొచ్చాను. రాగానే మావారికి ఆ కప్ లో టీ పంపించాను .

ఆయన ఇంట్లోకి రాగానే టీ తాగారా అని అడిగాను ! ఏం మాట్లాడలేదు . అక్కడే వున్న మా అబ్బాయి ఏమైంది డాడీ అన్నాడు.

" ఆ పంపిందిరా ఓ గుటికెడు."

" అదేమిటి ? ఫంక్షన్స్ ల లో ఇస్తారే చిన్న ప్లాస్టిక్ గ్లాస్ లు అందులో పంపిందా ? "

వెంటనే నేను అందుకొని ఏంకాదు ఇదో ఈ కప్ లలో ఇచ్చాను అని కొత్త బుజ్జి కప్ చూపించి , జాంబెడే తాగుతారో , సోలెడే తాగుతారో , చిటికడే తాగుతారో గుటికెడే తాగుతారో మీ ఇష్టం ముందు 1000 రూపాయలివ్వండి . డజను కప్స్ , డజన్ గ్లాసెస్ తెచ్చాను అని ఇంట్లో వున్న కప్ లు అన్ని వరుసగా పేర్చి చూపించి 1000 రూపాయలు వసూలు చేసుకున్నాను. డజను గ్లాస్లు ,డజను కప్పులు 1000 రూపాయలా అనకండి . మొగుడి దగ్గర అలానే వసూలు చేయాలి ! ! !

లేక పోతే రోజూ జాంబెడు , సోలెడు అంటూ నా కాఫీ కి దిష్టి పెడుతారా ?

7 comments:

జయ said...

బాగుంది కప్పుల పురాణం. పొద్దున్నే తీరిగ్గా అంతసేపు సోలెడు కాఫీ తాగుతూ కూచున్నావంటే నాకుమాత్రం నిజంగానే మహా కుళ్ళుగా ఉంది.

ఉష said...

అబ్బా ఏమి అల్లారు? ;)

మురళి said...

:-) :-)

కొత్త పాళీ said...

కప్పు కప్పనియేవు కప్పు నాదనియేవు నీకప్పు యెక్కడే చిలకా! .. హ హ హ. బాగుంది కప్పు బాగోతం.

జాంబెడు = ?? చెంబెడు అని అర్ధమా?

మాలా కుమార్ said...

మరే మీరందరు కుళ్ళుకోబట్టే రెండోసారి తాగటము మానేసాను .

మాలా కుమార్ said...

ఉషా ,
నా అల్లిక నచ్చినందుకు థాంకు.

మురళి గారు ,
నవ్వారా ? అయితే మీకూ థాంకు.

మాలా కుమార్ said...

కొత్తపాళి గారు ,
మీ కవిత బాగుందండి !
జాంబు అంటే గ్లాసు. ఏ భాషో నాకు తెలీదు, మా అత్తవారింట్లో స్టీల్ గ్లాసుని జాంబు అంటారు .