Tuesday, October 27, 2009

కార్తీకమాసము

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తిక మాసము. శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైనది .ఏంతో మహత్యము కలది. కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా ఆచరించె స్నాన , దాన , జప,పూజాదులు విశేష పలితాలనిస్తాయి. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ రూపము ధరించి సమస్త నదీ జలాలలోనికి చేరుతుంది. కాబట్టి ఈ నెలలంతా నదీ స్నానము చేస్తే శరీరము , మనసు రెండూ పవిత్రమవుతాయి . నదులు దగ్గరలేక పోతే చెరువులో , వాగులో , ఏవీ దగ్గర లేకపోతే కనీసము ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే " గంగేచ యమునే చైన గోదావరి సరస్వతి ! నర్మదే సింధు , కావేరీ జలెస్మిన్ సన్నిధిన్ కురు " అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానము చేసి నిర్మల హృదయము తో భగవదారాధన చేయాలి.

కార్తీకమాసము ముప్పై రోజులు పర్వదినాలుగా భావించి నదీ స్నానాలు , వుపవాసాలు , సాయంత్రము కాగానే ఇంటి ముందు దీపాలు వెలిగించటము , స్త్రీలు దీపాలను నదిలో వదలటము ,వనభోజనము చేయటము , వివిధ దానాలను , ముఖ్యముగా దీప దానము , సాలంకృత కన్యాదానము చేయటము మొదలైనవి నిర్వహిస్తారు. ఈ మాసము లో ఉపనయన దానము ,కన్యాదానము చాలా పలితమిస్తుంది .భక్తి తో సాలంకృత కన్యా దానమిచ్చినట్లు ఐతే అన్ని పాపాలు తొలిగిపోయి పితృదేవతల యొక్క స్తానాన్ని ,బ్రహ్మ పదాన్ని పొందుతారంటారు. దశమి ,ఏకాదశి ,ద్వాదశి తిధులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోనూ , కమలపూల తోనూ పూజిస్తే జీవించినన్నాళ్ళూ ధనానికి లోటులేకుండా వుండి , సమస్త సౌఖ్యాలు కలగటముతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట. అదేవిధముగ ఆరుద్ర నక్షత్రము రోజున , మాస శివరాత్రినాడు , సోమవారమునాడు , కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షల తోనూ పూజించినవారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యము పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది .

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం

జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం

దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం

రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం

సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్ధన కారణలింగం

సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం

కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం

దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం

సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేవచలింగం

దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం

అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం

అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

సురగురు సురవరపూజితం లింగం సురవరపుష్ప సదార్చితలింగం

పరమపదపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం

లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచివసన్నిధౌ

శివలోక మవాపోత్ని శివేన సహమోదతే .

<
/tr>
Get this widget | Track details | eSnips Social DNA



పైన వున్న ఫొటో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వున్న బిల్వ వృక్షముది . మా అల్లుడు సతీష్ అడుగగానే ఫొటో తీసి మేల్ చేసారు , థాంక్ యు సతీష్. .

7 comments:

Rani said...

బిల్వ వృక్షము అంటే రావిచెట్టా మాల గారు?

రవి said...

బిల్వ చెట్టంటే రావి కాదండి. రావి ఆకులు పెద్దగా త్రిభుజాకారంలో ఉంటాయి. దానికి కాయలు కాసి పళ్ళవుతాయి, వాటిలో పురుగులు ఉంటాయి. బిల్వ చెట్టు ఆకులు మూడు మూడు ఒకటిగా కలిసి ఉంటాయి. దీని కాయలను తల స్నానం చేసేప్పుడు సీకాయ లాగా వాడతారు.

మాలా కుమార్ said...

రాణి గారు ,
బిల్వవృక్షం గురించి ఇక్కడ చూడండి .
http://www.yogamag.net/archives/2005/cmar05/bilva.shtml

మాలా కుమార్ said...

రవి గారు ,
థాంక్స్ అండి .

Rani said...

Thanks Ravi garu and Mala garu :)

మరువం ఉష said...

ప్రాకృతిక మార్పులతో ఆరోగ్యనికి ముడిపెట్టిన ఈ ఆచార వ్యవహారాల మన సామ్ప్రదాయం పట్ల నకు ఎంతో గౌరవం, కాకపోతే మన పూర్వీకులు వాటి విశిష్టతని, మన దైనందిన జీవితంలో వాటి పాత్రని ఇంకొంచం వివరంగా తెలిపినట్లైతే నమ్మకం అనేది బలపడేది. కాలక్రమేణా పూజ అన్నది ఒక స్వార్థచింతనగా పరిణమించేది కాదు. తృప్తి, మనశ్శాంతినిచ్చే పూజ ఏదైనా కానీ నేను సిద్దం. ఇది మీ వ్యాసం కలిగించిన సదాలోచన నుండి వచ్చిన అభిప్రాయం. సదాచారాలు కలకాలం నిలవాలని ఆశిస్తూ..

మాలా కుమార్ said...

ఉషా గారు ,
అవునండి , మన ప్రతి పూజ , ఆచారము వెనుక ఎంతో అర్ధము , పరమార్ధము వున్నాయి . కాకపోతే అవి మనకు సక్రమముగా తెలియకపోవటము మన దురదృష్టము .
వాటి గురించి చదువుతున్నప్పుడు , చాలా సార్లు నాకనిపిస్తుంది , నేను మన సాంప్రదాయానికి ఎంతవరకు విలువ ఇవ్వగలుగుతున్నాను అని .
బాగా రాసారు , ధన్యవాదాలు .