Friday, October 9, 2009

ష్ మాటాడకు

యెలహంక స్టేషన్ లో దిగగానే , మేము హసన్ లోని ,ఆరెంజ్ కౌంటీ వాళ్ళ ,హోసల విలేజ్ రిసార్ట్ కి వెళ్ళటానికి , మా అల్లుడు ఏర్పాటు చేసిన రెండు క్వాలిష్ లు వచ్చాయి . అందులో ఒకటి మాకు ( నాకు ,మా అదితి కి ) నచ్చలేదు. సరేపోనీయ్ ఇంకోదాన్లో కూర్చుందాములే అనుకున్నాము. కాని , మా వారు, మా తోటి కోడలు, మా అమ్మాయి , కుట్ర చేసి మనకందరికీ ఒకటి చాలులే , ఇక్కడినుంచి 2 1/2 గంటల ప్రయాణమే కదా సద్దుకుందాం , 9000 మిగులుతాయి అన్నారు. సరే అనుకున్నాము. ఇంతలో బాగా వున్న క్వాలిష్ డ్రైవర్ , ఈ డ్రైవర్ కార్ కొన్నాక ఇప్పుడే మొదటిసారి వచ్చాడు , కాబట్టి అతనిని తీసుకెళ్ళండి , తిప్పి పంపుతే బాధపడతాడు అదీ , ఇదీ అని చెప్పి , మాకు సెంటు కొట్టి మాకు నచ్చని క్వాలిష్ ని మాకు అంటగట్టి , త్యాగరాజై వెళ్ళిపోయాడు. అంతే , మావారు దయార్ధహృదయులై , పాపం అతను బోణీ పోయింది అని బాధపడతాడు , మనము అంతా కలిపి ఓ ఐదారు ,గంటలకంటే ఎక్కువ ఈ కార్ లో ప్రయాణము చేయము కదా , కంపు లేదు ఏమి లేదు ఎక్కండి అని ఆ కార్ ఎక్కించారు ! ఇహ అప్పటి నుండి మా కష్టాలు మొదలైనాయ్ !

మేము కొంచం దూరం వెళ్ళగానే కొద్దిగా వాన మొదలైంది . పైన సామానులు కప్పటానికి ఏదైనా వుందా అంటే లేదన్నాడు . అతనికి మా బాష రాదు , మాకు అతని భాష రాదు ! సరే ఎలాగో వివరించి పక్కన ఆపి ఓ రెండు పట్టాలు కొని కట్టించారు . కష్టపడి అతని పేరు ధర్మరాజ్ అని తెలుసుకోకలిగాము ! . మా అమ్మాయి వచ్చిరాని కన్నడలో మాట్లాడుతుంటే ,మా తోటి కోడలు లక్ష్మి మురిసిపోతూ బాగానే కన్నడ నేర్చుకున్నావే అని మెచ్చుకుంది . ఇంట్లో కన్నడ మాట్లాడుతావా అని అడగగానే ,లేదు పిన్నీ మావాళ్ళు నవ్వుతారు అందుకే ఇంట్లో మాట్లాడను అంది . మరి నేను వూరుకోవచ్చుకదా ! నా నోరు ఆగక పెళ్ళై 16 సంవత్సరాలైంది ఇంకా నేర్చుకోక పోవటమేమిటి అన్నా . అంతే గుర్రున నావైపు చూసింది మా అమ్మాయి. ఈ హడావిడి లో చాలా దూరం వచ్చినట్లుగా అనిపించి , మద్యలో దారి అడగమని ధర్మరాజును పురమాయించిది . అబ్బే అతను ధర్మరాజు కదా నిషబ్ధముగా వున్నాడు . ఇక అందరూ అతనికి దారి తెలీదని , డ్రైవింగ్ రాదని డిసైడ్ అయిపోయి , సంజు కు ఏదో చెప్పటము , తనేమో కన్నడ లో అడగటము ,ధర్మరాజేమో ధర్మంగా తలూపటమూ జరుగుతూ పోయింది ! ఎంతసేపటికీ గమ్యం రాదు . నేనూ ఏదో చెప్పలికదా అనుకొని సంజు తో చెప్ప పోయాను . అంతే అబ్బ నువ్వుండమ్మా ! అందరూ చెప్పేవాళ్ళే , కాసేపు మాట్లాడకు అంది . సరేలే కానియ్ అనుకొని మాట్లాడకుండా కూర్చున్నాను.

అలా అలా వెళుతూనే వున్నాము . పెద్దలందరికీ టెన్షన్ వచ్చేసింది . ఇతను ఎక్కడికి తీసుకెళుతున్నాడా అని . ఎక్కడా బోర్డ్ అయినా కనపడటము లేదు , అందరూ చూస్తూ వుండండి కనిపిస్తుందేమో అంది సంజు . నేను చూసాను అన్నాను . నేను కిటికీ పక్కన వున్నాను కదా ! నా మాట నమ్మేసి , ఎక్కడ అంది .

వెనుకనే చూసాను .

మరి చెప్పలేదేమిటి ?

నువ్వు నన్ను మాట్లాడొద్దు అన్నావుగా !

అమ్మా !

సరే కార్ వెనుకకి తిప్పించింది . కొద్ది దూరము వెళ్ళగానే ఓ బోర్డ్ కనిపించింది . ఇదే నేను చూసిన బోర్డ్ అన్నాను. ఇదా ! దీనిమీద ఏదో అడ్వర్టైజ్మెంట్ వుందికదా ! అవును , నువ్వు బోర్డ్ చూసావా అన్నావు కాదా , అందుకే బోర్డ్ చుసాను అని చెప్పా . బోర్డ్ మీద ఏముంది అంటే చెప్పేదాన్ని . నువ్వు నన్ను ఎక్కువ మాట్లాడద్దు అన్నావుగా !

అమ్మా ! - సంజు

మాలా! - మావారు

కమలా ! - లక్ష్మి

ఆంటీ ! - బాల

అవి ఆర్తనాదాలా ? గావు కేకలా ?

స్వగతం : లేకపోతే నన్నే మాట్లాడకు అంటుందా హన్నా ! మంచిగైంది లే లల్లలా ! ఏదో మంచిదాన్ని కాబట్టి , ఇంకా ఎక్కువ దూరం తీసుకుపోలే , ఇంతటి తో వదిలేసాను .

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

తిరిగి వచ్చే రోజు , పొద్దుటి నుండి మా మరిదిగారు వెంకట్ , మా అల్లుడు సతీష్ ఒకటే ఫోన్లు , ఇక్కడ వానలు చాలా పడుతున్నాయి , మీరు ట్రేన్ లో రాకండి , ఫ్లైట్ లో రండి అని. మద్యాహ్నము వరకు ట్రేన్స్ వెళుతున్నాయి అని ,ఆ తరువాత కాన్సిల్ అయ్యాయి అన్నారు. ఇక అప్పుడు ఫ్లైట్ టికెట్స్ కోసం సంజు, బాల ప్రయత్నం మొదలు పెట్టారు. నేనేమో ఇంత వానలో వెళ్ళక పోతేనేమి , రెండు రోజులాగి వెళ్ళొచ్చుగా అని టెన్షన్ పడ్డాను . షరా మామూలే ! నువ్వు మాట్లాడకు , నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని మావారి డైలాగు .అయినా నాకు తెలీక అడుగుతాను ప్రాణానికి ప్రాణం ఎలా అడ్డేస్తారబ్బా ?

మొత్తానికి ఫ్లైట్ ఎక్కించారు ! ఎక్కిన కొద్ది సేపటికి , ఏమండీ అంత పెద్దాయన రాజశేఖర్ రెడ్డినే వర్షం లో కాపాడలేకపోయారు , మన ఫ్లైట్ సరిగ్గా వెళుతుందంటారా ? అని అడిగాను .

అబ్బ ఏంకాదులే ఎక్కినప్పటినుండి నస పెడుతున్నావు , నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా నన్నాను కదా !

వెధవది నా ప్రాణం కోసం కాదు బాబూ , చిన్న పిల్లలని తీసుకొని ఇంత మొండిగా బయిలుదేరకపోతే ఏం ? పైగా మీ అల్లుడు పెద్దవారు మీరున్నారు కదా అని మీ మీద భారం వేసాడు . ఇదో కిందికి చూడండి , ఇది నల్లమల అడివేనంటారా ? ఇన్ని చెట్లు కనిపిస్తున్నాయి , ఇది పావురాలగుట్టే మో !

మాలా నువ్వు నోరుమూస్తావా ముయ్యవా ?

మా గౌరు అన్నట్లు మనం ఏం చేయగలము అనుకొని నోరు మూసుకున్నాను.

ఇంతలో ఏర్ హోస్టెస్ స్నాక్స్ తెచ్చింది . నేను ఇటువున్న అదితిని , అటు వున్న మావారిని చూస్తూ కూచున్నాను . నీ కొంచం ఐస్ క్రీం కావాలా అంటూ మావారు నావైపు తిరిగి ఏమిటి తినటము లేదు ? కట్లెట్ బాగుంది , గార్లిక్ కాని మసాలా కాని ఎక్కువ లేదు తిను అన్నారు .

ఎలా తినను ? మీరు నోరు మూసుకోమన్నారు కదా !

అమ్మమ్మా ! యు ఆర్ టూమచ్ ! అని అదితి ,

మావారేమో

గుర్ ర్ ర్ ర్ ర్ . . . . .

15 comments:

మురళి said...

బాగుందండీ టపా.. టెక్స్ట్ కింద అండర్ లైన్స్ వస్తున్నాయి.. ఒకసారి చూడండి..

భావన said...

హి హి హి అమ్మలనే నోరు మూసుకోమంటారా... బాగైంది బాగైంది... మీ వారు నోరు మూసుకోమన్నారని మీరు తినటం మానెయ్యటమేమిటి ఇంకొంచం ఎక్కువ తినాలి కాని.. ;-) పిక్చర్ కు పెట్టిన లింక్ టేగ్ క్లోజ్ చెయ్యటం మర్చిపోయినట్లున్నారు చూడండి... బాగుంది మాల గారు హాయి గా నవ్వుకున్నాను...

Padmarpita said...

హ:) హ:) హ:).....

సుభద్ర said...

ఎదైనా అమ్మకే గా చెప్పగల౦!నేను అమ్మని లాస్ట్ ఇయర్ ఈ పాటికి ఇలానే విసుకున్నాను.ష్ ష్ అని నాకు భాదేస్తు౦ది ఇప్పుడు.మా అమ్మ కూడా మీలానే అనుకుని ఉ౦టారు కదా!!! మా అమ్మని గుర్తుచేశారు.గుర్రు తగ్గి౦దా???మీవారికి.

నేస్తం said...

:)nice post maala gaaru

మాలా కుమార్ said...

మురళి గారు ,
థాంక్స్ అండి , సరిచేసాను .

మాలా కుమార్ said...

భావన గారు,
నిజమేనండి మా వారి ఐస్ క్రీం కూడా తినేయాల్సింది . తోచలేదు .

మాలా కుమార్ said...

పద్మార్పిత గారు,
నేస్తం గారు ,
ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

సుభద్ర గారు ,
అవునండి , ఏదైనా అమ్మల తోటే కదా ! నేనూ , కాసేపు అందరి టెన్షన్ తగ్గించటాని కే అలా చేసాను . అయినా ఎక్కువ దూరం వెనకకి తీసుకెళ్ళలేదు లెండి .
మావారి గుర్ర్ ఎంతసేపో వుండదండి !

జయ said...

చాలా బాగుంది. అయినా! నాకు తెలీకడుగుతాను, అమెరికా కి చక్కర్లు కొట్టివొచ్హిన దానివి, నీకు విమానం అంటే అంత భయమేంటి?. వాళ్ళు ఏదో టెన్షన్ లో 'మాట్లాడకు ' అని ఉంటారులే!

మాలా కుమార్ said...

విమానం అంటే భయం కాదమ్మా , అది వస్తున్న దారి , నల్లమల అడవి , పావురాలగుట్ట అంటె భయం !

sunita said...

Baagundi!

Anonymous said...

good article. raaka poina vachi nattuga anipinchindi... I think we missed the trip
-Ravi Komarraju

మాలా కుమార్ said...

sunita garu ,

thank you .

మాలా కుమార్ said...

రవీ ,
మేమంతా కూడా మిమ్మలిని చాలా మిస్ అయ్యాము .
ట్రిప్ గురించి వేరే రాస్తాను . థాంక్ యు .