మా అత్తగారు ,మా వదినగారితో చాలా నోములు పట్టించారట .వదినగారు అవన్నీ ఈమధ్య ఒకొటొకటిగా తీర్చటము మొదలు పెట్టారు. అందులో బాద్రపదమాసములో ఉండ్రాలతద్దె తీర్చారు. ఇప్పుడు అశ్వయుజమాసం బహుళతదియ ( 7 వ తారీకు అక్టోబర్ ) నాడు అట్లతద్దే తీరుద్దామనుకున్నారు ,కాని ,దేవీనవరాత్రులలో కుడా తీర్చవచ్చు అని నవరాత్రులలో అట్లతద్దె నోము ఉద్యాపన చేసారు.
ఆవిడ చిన్నతనములోనే ఈ నోము పట్టారట . ఐదుగురు కన్నెపిల్లలకు ముందురోజు రాత్రి గోరంటాకు పెట్టాలి. తెల్లవారుఝాముననే ఐదుగురితో కలిసి చద్ది అన్నము తిని ఉయ్యాలలూగాలి. ఆ తరువాత వారికి తలస్నానము చేయించి, తనుకూడా చేసి , గౌరీదేవిని పూజించి ఐదు అట్లను ,కొంచము బెల్లము ముక్కను పెట్టి నివేదన చేయాలి. ఐదుగురు కన్నెపిల్లలకు తలా ఐదు అట్ట్లను , బెల్లము తో ( ఆ రోజులలో అట్లు బెల్లము తోనే తినేవారుట ! ) . వాయనము ఇవ్వాలి.ఇలా ఐదు సంవత్సరములు వివాహమునకు పూర్వమే నోచుకోవాలి. వివాహము తరువాత ఎప్పుడైనను ఉద్యాపన చేయవచ్చు.
నోచుకునేటప్పుడు అదుగురు కన్నెపిల్లలు , ఉద్యాపనకు పదిమందిమంది ముత్తదువులు కావాలి. మా పదిమందికీ , ముందు రోజే గోరింటాకు కోన్లు, షాంపూ పాకెట్స్ ఇచ్చారు. ఉదయము 8 గంటలకు చిక్కడపల్లి లోని మావదినగారంటికి వెళ్ళాము. అంతకు ముందే ఆవిడ గౌరీ పూజ చేసుకున్నారు. పది అట్లు అమ్మవారికి నివేదన చేసారు. అందరికీ పది అట్లు కొంచము బెల్లము ముక్క తో , ఒక జాకిట్ బట్ట ,పసుపు ,కుంకుమ , గాజులు , పూలు ,దక్షిణ ,తాంబూలం ఇచ్చారు. తిమ్మనం ( బియ్యపండి ,పాల తో చేసే ఓ పాయసము ) కూడ వాయనము తో పాటు ఇచ్చారు. ఉద్యాపన అప్పుడు , ఉయ్యాలలూపటము , చద్ది అన్నము పెట్టటము అవసరము లేదట. వాయనము ఇచ్చిన తరువాత , బోజనము పెట్టారు.
మా ఇంటి పద్దతి అని ఇలా చేసారు . కాని, కథ లో వేరుగా వుంది .
కథ ---
ఒక రాజుగారి అమ్మాయి ,తన చెలికత్తెలతో కలిసి అట్ల తద్దె నోమునోచుకుంది.చెలికత్తెలందరూ ఉపవాసమున్నారు ,కాని రాచకన్య మాత్రము ఉండలేక ,సాయంకాలమైయ్యేసరికి సొమ్మసిల్లి పడిపోయింది .ఆమె సోదరుడు అరిక ( గడ్డి ) కుప్పకు నిప్పుపెట్టి , చెట్టుకి ఒక అద్దము వేళ్ళాడ తీసి , మంట చూపించి ,చంద్రోదయం అయ్యింది భోజనము చేయవచ్చునని చెప్పాడు. అదినిజమనుకొని ఆ రాచకన్య వాయనము అందించి , భోజనము చేసింది వ్రతలోపము కలుగుట వల్ల ఆమెకు మంచి సంబంధము దొరకలేదు .ఆమె చెలికత్తెలందరికి వివాహాలైనాయి . ఆమె విచారించి , గ్రామమున కల కాళికాలయమునకు వెళ్ళి, అమ్మా! అందరిలా నేనూ వ్రతమాచరించాను ,వారందరికి వివాహాలైనాయి నాకు మాత్రం కాలేదు అందుకు కారణము తెలుపుమమ్మా ! అని అడిగింది .అంత గౌరి ఆమె చేసిన లోటును , పొరపాటును తెలిపి మరల చేయమంది .రాచకన్య మరల నోచింది .ఆనాడే అశ్వయుజమాసం, బహుళ తదియ కావటమువలన ఆమె యధావిధి గా వ్రతం ఆచరించింది .వ్రత పలితముగా ఆమెకు మంచి భర్త లభించాడు .ఆమె తన భర్త తో హాయిగా జీవించింది .
ఉద్యాపన -
ఈ వ్రతం అశ్వయుజమాసం ,బహుళ తదియనాడు ఉపవాసం చేసి ,చంద్రోదయం అయ్యేవరకు ఏమీ తినకూడదు . గౌరీ దేవికి పది అట్లు నివేదన చేయాలి .అలా తొమ్మిది సంవత్సరములు చేసి ,10 వ సంవత్సరమున , 10 మంది ముత్తైదువులను పిలిచి , వారికి తలంటు స్నానము చేయించి , 10 అట్లు ,పసుపు ,కుంకుమ , రవికల బట్ట , దక్షిణ తాంబూలము సమర్పించి , సంతృప్తిగా భోజనము పెట్టవలెను.
ఈ నోము నోచుకుంటే కన్నెలకు మంచి మొగుడొస్తాడని , పెళ్ళైన స్త్రీలకి నిడు ఐదవతనం కలుగుతుందని ,భర్తలు ఆయురారోగ్యాలతో విలసిల్లుతారని నమ్మకము.
ఈ పండగ వైభవము పట్టణాలకంటే పల్లెలో ఎక్కువగా కనిపిస్తుంది.అందరూ ఉత్సాహము గా జరుపుకుంటారు .తొలి కోడి కూసినప్పుడే లేచి ఉట్టికింద కూర్చొని గోంగూరపచ్చడి , కందిపులుసు మొదలైన వాటి తో చద్ది అన్నము తిని తాంబూలం వేసుకుంటారు.ఇక అప్పటి నుండి నిద్ర పోరు .ఆట పాటల తో గడుపుతారు .అట్లతద్దోయ్ ఆరట్లో , ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అని పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఉయ్యాలలు ఇంట్లోకాక తోటలలో పెద్ద పెద్ద చెట్లకి వేస్తారు .ఈ పండుగ ని అందరూ జరుపుకుంటారు. అందుకే అస్టాదశ వర్ణాలవారికి అట్లతద్దె అనే పేరు వచ్చింది.
5 comments:
చిన్నప్పుడు ఉయ్యాల లూగిన అనందం మాత్రం నేను మరచి పోలేదు. కాకపోతే, ఏదో నోములు, వ్రతాల గురించి నువ్వు రాసినప్పుడో, చెప్పినప్పుడో వింటమే. బాగుంది. ఏదో దగ్గిరుండి మా అక్క నాకు కూడా నోము చేయించిందా అన్న ఫీలింగ్ వొచ్హేసింది నాకు.
జయ
థాంక్ యు
మరచిపోతున్న తెలుగింటి పండుగలన్నింటినీ గుర్తు చేస్తోందండీ మీ బ్లాగు..
భర్త ల గోల ఏమో తెలియదు కాని అట్లతద్దె కు పొద్దుటే లేచి ఆ చీకటి వెలుగుల మధ్య వూయలూగటం ఆడు కోవటం మరుపు రాని అనుభూతులు.. ఇక్కడ పిల్లలు బయట సమ్మర్ లో టెంట్ లు వేసుకుని వెన్నెల లో ఆడుకుంటుంటే నాకైతే అట్లతద్ది కబుర్లే గుర్తు వస్తాయి బలే గుర్తు చేస్తున్నారు అన్ని.
ఆ రోజున నేను "అట్లతద్ది" గురించి రాద్దాం అనికున్నా కానీ ఎందుకనో రాయలేదు..మీ టపా ఇవాళే చూస్తున్నాను..బాగుందండి..మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు.."అట్లతద్దోయ్..ఆరట్లోయ్..ముద్ద పప్పోయ్ మూడట్లోయ్.." అని పాడుకునే వారట..
Post a Comment