Saturday, March 14, 2009

మల్లెలు మల్లెలు

ఎండాకాలం వస్తూ ఎండలని,వడగాలినే కాదు మల్లెల ని,మామిడి రసాలని వేప గాలి ని వెంట పెట్టుకొని వస్తుంది.సాయంకాలము చల్లటి నీళ్ళ తో స్నానం చేసి,తెల్లటి గ్లాస్కో చీరను కట్టుకొని ,మల్లెపూలు పెట్టుకొని వేపచెట్టు కింద నులక మంచం మీద పడుకొని ,కొబ్బరి ఆకుల మద్యలోనించి కనిపిస్తున్న చంద్రుడి ని చూస్తూ బినాకా గీతమాల వింటూ వుంటే ఈ వడగాలి,ఎండా చమట ఎం చేస్తాయి.మామిడికాయ పప్పు లో చల్ల మిరపకాయలు ,గుమ్మడి వడియాలు ,కొత్త మామిడికాయ ముక్కల కారం,కొత్తావకాయ,మామిడి పండ్లు ఎండలని లెక్క పెట్టనిస్తాయా?మల్లెపూల సువాసన ముందు అన్ని బలాదూర్.వాటి తెల్లదనము ముందు సూర్యుడు వెలాతెలా .

పోట్టిచలమా లో ఎండాకాలం వస్తూనే అమ్మ ఖాళీ జాగా లో తాటాకుల గుడిసె వేయించేది.రోజు అందులో నీళ్లు చల్లి మంచాలు వేసేవాడు పెద్దులు.ఉష ను ఆడిస్తూ నిద్ర పుచ్చుతూ నేను జయ ఎన్ని కబురులో అమ్మ పడుకోండి అని హెచ్చరించే వరకు సాగి పోతూనే వుండేవి.

గుంటూరు హాస్టల్ లో డాబా మీద హేమ ,ఇది మల్లెల వేళ అని పాడుతుంటే ,పక్కనుంచి రాధా మాధవ పూల సువాసన వస్తువుంటే నేను , మణి ఇంకా పాడించు కునే వాళ్ళము.మణి పెద్ద పెద్ద మల్లెపూల దండలు నా రెండు జడలకి ఎంతో ఆప్యాయం గా పెడుతుండేది.ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ వున్నారో.చింతలపాడు లో అరుగుల మీద పడుకుంటే ,పద్మ ని నిద్ర పుచ్చటాని కి అమ్మమ్మ బూచివాడు వచ్చి బుట్టల్లల్లు తున్నాడు అని పాడేది.ఆమె ఫేవరేట్ పాట మీరా జాల గలదా జావళి పాడుతూ మల్లెపూలు కడుతూ వుండేది.పాలేరులు కింద నీళ్ళు చల్లటము తో వచ్చే మట్టి వాసనా,వెనక నించి వచ్చే వేపగాలి ,మల్లెలలసువాసన అమ్మమ్మ పాట మరుపురానివి.

పోలంపల్లి లో ఏప్రిల్ లో వున్నా పది రోజులు డాబా మీద పక్కలు , వేపగాలి చెప్పలేని ఆనందం.

బర్కత్పురా లో బండలు కడిగి కిందనే పక్కలు వేసుకునే వాళ్ళము.మల్లెపూల దండ పెద్దదాని కోసము,ట్రాన్సిస్టర్ కోసము నాకు విజయ కి కాంపిటీషన్ .ఆవకాయ కలిపే రోజు ఇంట్లో పండగ వాతావరణమే.ముక్కలు తుడిచిన పిల్లల కు గోల్డ్ పాస్ (గోల్డ్ స్పాట్) లంచం.ఆవకాయ కలిపిన బేసన్ లో వేడి అన్నము నెయ్యి కలిపి బామ్మ ముద్దలు పెడుతుంటే పిల్లలందరూ దానికి పోటి.

బాల్కానీ లో కూర్చొని వేప చెట్టు గాలి ని అనుభవిస్తూ కాఫ్ఫీ తాగుతూ నేను సంజు ఎన్ని కబురు లో .బర్కత్పురా వదిలాక వేపచెట్టే లేదు.ప్రతి ఎండాకాలం మొదట్లో బడీ చావిడి వెళ్లి కృష్ణ లో రొండు గ్లాస్కో చీరలు వాటికి చక్కటి అంచులు కొంగులు వున్నవి తప్పక తెచ్చు కోవలిసిందే.అక్కడ గన్నే క రస తాగ వలిసిందే .డి.డి.కాలోనీ లో వున్నప్పుడు అదితి విక్కీ కి కి డాబా మీద వెన్నెల్లో అన్నం తిపిస్తే ఎంత త్రిల్ అయ్యే వాళ్ళో !
వక నులక మంచం కాని చిన్న నవారు మంచం కాని కొనమంటే కొంటాను కాని ఎక్కడ వేసుకుంటావు అంటారు మా వారు.నిజమే కదా ఎక్కడ వేస్తాను.వక్కరోజు మురిపెంగ మూడో అంతస్తు ఎక్కగలను కాని రోజు ఎక్కలేను గా. కొబ్బరి చెట్లు వున్నాయి వక వేపచెట్టు పెడదామని మెట్ల పక్కన వేసాను.వానాకాలం చక్కగా చిగురిస్తుంది.కొమ్మ రెమ్మా రాగానే ఎండకాలము వాడి పోతుంది.పాపం దాని కి జాగా సరి పోవటము లేదు.నా ఆశ లా రెపరెప లాడుతోంది.పోనీ కొబ్బరి అకులోనుంచి చంద్రుడిని చూసి సంతోషిస్తాను హుం ! చంద్రుడి కి కొబ్బరాకులకి ఏమి అవినాభావ సంబందమో.

మొన్న మల్లెపూలు వచ్చాయమ్మా అని శారద మల్లెపూలు తెచ్చింది.చటాకు పన్నెండు రూపాయలట ! .ఎంత చిన్నగా వున్నాయో.తిరుపతి లో ,విజయవాడ లో చాలా బాగుంటాయి.విజయవాడ లో చెరుకు రసాలు కుడా ఎంత బాగుంటాయో.మొహిత్ పుట్టినప్పుడు సుబ్రహ్మణ్యం తెచ్చారు.అప్పటి నుండి వాటి రుచి మరిగాము.ఎప్పుడు మా వారు అటునుండి వస్తున్నా ఈ సీజన్ లో తప్పక తేస్త్తారు.మల్లెపూలు వచ్చేసాయి.చిన్న మామిడి కాయలు వచ్చేసాయి.ఇంకేమి కావాలి .

7 comments:

భాస్కర రామిరెడ్డి said...

మీ మొదటి పారా చదువుతూ ఏమి కోల్పోయామో గుర్తుకు వచ్చింది.ఇప్పుడు పల్లెటూళ్ళు కూడా అన్నీ ఏమో గానీ చాలావరకు మారిపోయాయని పిస్తుంది.

ramya said...

మాలాగారు, మీ పోస్ట్ చూస్తుంటే ప్రాణం లేచివచ్చింది :) వేసవి సాయంకాలం..మల్లెలు...బటర్స్కాచ్ ఐస్క్రీం లో మామిడి పండుముక్కలు...వైటు డ్రెస్సు....నాకూ నచ్చేవి :)

ramya said...

మామిడికాయ పప్పు,కొత్తావకాయ ఇవి కూడా :)

Kottapali said...

మీరు బర్కత్పురానా, నేను బర్కత్పురానే
మల్లెలు లేత మామిడి పిందెలు కొత్తావకాయ వేప్పూత ..

పరిమళం said...

వేసవిలో వెన్నెల పూయించారు మీ టపా తో ....

హర్షోల్లాసం said...

అహా అసల ఆవకాయకలిపిన గిన్నేలో నెయ్యి........ లో అసల చదువుతుంటేనే నోరూరి పోతోంది.రాస్తుంటే ఇంక రుచే తెలుస్తొంది.అదివారం బద్దకంగా లేచాము."పొద్దునే మా వారు చుపించి నువ్వు ఎప్పుడైనా చేశావా.అమ్మ,అత్తగారు ఇస్తే తెచ్చకోవటం కాదు ఇది చూడు అని" వెళ్ళిపోయారు.

మాలా కుమార్ said...

andari ki thanks andi.
koththapali paligaru okappudu maadi barkathpurane.ippudu srinagar colony.
sorry harshollasam garu.poddunne mee madya godava pettinanduku.