Saturday, February 25, 2017

బ్లాగ్ పుస్తకం





ఓసారి సి.ఉమాదేవిగారు బ్లాగ్ పుస్తకం అవిష్కరిస్తున్నారట, వెళుదాం వస్తారా అని ఫోన్ చేసి అడిగారు.సరే నన్నాను.ఉమాదేవిగారి శ్రీవారు మమ్మలిని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వస్తానని వెళ్ళారు.అప్పటికి కొద్ది మంది ప్రమదావనం సభ్యుల తో తప్ప వేరే బ్లాగర్స్ ఎవరితోనూ పరిచయం కాలేదు.ఉమాదేవిగారికీ ఎవరూ తెలీదు.అలాగే వెళ్ళాము.అప్పటికే కొంతమంది వచ్చి హాల్ లో ఉన్నారు.అందులో ఓ అబ్బాయి నా దగ్గరకు వచ్చి, "మీరు సాహితీ బ్లాగర్ మాలాకుమార్ గారా ?"అని అడిగాడు.నేను ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబ్బై అవును అన్నాను.నాగార్జున అని అతని పేరు పరిచయం చేసుకున్నాడు.ఎవరితోనూ పర్సనల్ గా పరిచయము లేకపోయినా రెగ్యులర్గా వ్రాసే బ్లాగర్స్ అందరి పేర్లూ తెలుసు.అతనే మాకు మిగితా అందరినీ పరిచయం చేసాడు.సరే మీటింగ్ మొదలవుతోందని మీటింగ్ రూంలోకి వెళ్ళాము.అక్కడ కిరణ్ చావా, వీవెన్ మొదలైన వాళ్ళు ఉన్నారు.స్చప్ ఎవరెవరు ఉన్నారో గుర్తు రావటం లేదు.బ్లాగ్ ల గురించి, బ్లాగ్స్ గురించి పరిచయం చేసారు.బ్లాగ్స్ గురించి పరిచయం చేసేటప్పుడు ఆ బ్లాగ్స్ ను స్క్రీన్ మీద చూపించారు.ఆ విధంగా వచ్చిన బ్లాగర్స్ అంతా కూడా తమ తమ బ్లాగ్ లను పరిచయం చేసారు.నేనొక్కదాన్ని తప్ప అందరూ మాట్లాడ్ది, అక్కడున్న బోర్డ్ మీద సంతకం చేసి వచ్చారు.ఆ తరువాత కిరణ్ చావా అందరికీ బ్లాగ్ పుస్తకం ఇచ్చాడు.నాకు ఇవ్వలేదు.వరూధిని గారు మాలాగారికి ఇవ్వలేదు అంటే మాట్లాడిన వాళ్ళకే ఇస్తున్నాను అన్నాడు. పోనీ కొనుక్కుంటాను అన్నాను.మీరు మాట్లాడితేనే ఇస్తాను , అమ్మను అని ఖరాఖండీ గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు! ఏం చేయాలి? కొత్త వాళ్ళ తో మాట్లాడాలంటేనే భయం. పైగా స్టేజ్ మీద అంటే వణుకు, గొంతు లేవదు. మాట్లాడకుండా ఉందామటే పుస్తకం రాదు.అందులో నా బ్లాగ్ గురించి కూడా ఉంది.ఉమాదేవిగారు మీరు ఎలా కంప్యూటర్ నేర్చుకున్నారో, బ్లాగ్ ఎలా స్టార్ట్ చేసారో చెప్పిరండి పరవాలేదు అన్నారు.భయపడుతూ , వణుకుతూ వెళ్ళి , చిన్నగా మొదలుపెట్టి "మా మనవడి మీద పంతం తో అమీర్పేట్ లో కంప్యూటర్ ఇన్ష్టిట్యూషన్ కు వెళ్ళి నేర్చుకున్నాను అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు.అంతే ఉత్సాహం వచ్చి ఏదో నాలుగు మాటలు మాట్లాడి,బోర్డ్ మీద  సంతకం చేసి పుస్తకం తెచ్చుకున్నాను
అంత కష్టపడి తెచ్చుకున్నానా ఎవరో అడిగితే ఇచ్చాను.తిరిగి రాలేదు.ఎవరికిచ్చానో గుర్తులేదు :) అదేమిటో కొంతమంది తీసుకెళ్ళి తిరిగి ఇవ్వరు.కొన్ని సార్లు ఎవరికిచ్చానో గుర్తుండదు.గుర్తున్నా పదే పదే అడగటానికి మొహమాటం.ఇది వరకు నవోదయా, విశాలాంధ్రా తిరిగి తిరిగి పుస్తకాలు తెచ్చుకునేదానిని.ఇప్పుడు ప్రమదాక్షరి, కథాకుటుంబం లో అందరూ పరిచయం అయ్యాక కొత్తపుస్తకాల అవిష్కరణకు వెళ్ళి నచ్చినవి తెచ్చుకుంటున్నాను.కొత్తవి ఎమి వచ్చాయా అని వెతికే పని తప్పింది :)ఏమిటో మరీ ఈ పుస్తకాల పిచ్చి :)

8 comments:

Lalitha said...

మీ బ్లాగ్ పుస్తకం ఎవరు పట్టికెళ్లారో మీకు తిరిగి ఇచ్చేస్తే బాగుండును :( నాకు ఎవరికైనా పుస్తకాలు ఇవ్వలంటే అంతగా ఇష్టం వుండదు - అందులోనూ కొన్ని పుస్తకాలు ఇదివరకు అంత మంచి ప్రింట్లు రావట్లేదు.

ఉదాహరణకి నేను కాలేజ్ లో వున్నప్పుడు చదివిన అడివిబాపిరాజుగారి 'గోన గన్నారెడ్డి' నవలకి - ఇటీవల దొరికిన అదే నవల కొత్త ప్రింటుకి పోలికే లేదు - మరీ abridged edition లా అనిపించింది.

విన్నకోట నరసింహా రావు said...

పుస్తకం వనిత విత్తం పరహస్తం గతా గతః అని పెద్దలు ఏనాడో అన్నారు.
ఇంతకు "బ్లాగ్ పుస్తకం" అంటే ఏమిటండి?
వరూధిని గారంటే బ్లాగర్ "జిలేబి" గారేనా?

మాలా కుమార్ said...

లలిత గారు అలా తిరిగి ఇస్తే ఇంకలేనిదేమి=ఉన్నదండి :)

మాలా కుమార్ said...

నరసిమ్హారావు గారు,
బ్లాగ్ ల గురించి అంటే ఎలా మొదలుపెట్టాలి మొదలైన విషయాలు అందులో వివరించారు.అప్పటికి ఉన్న కొన్ని బ్లాగ్స్ ను అందులో పరిచయం చేసారు.బహుశా కిరణ్ కుమార్ చావా రాసినట్టున్నారు.నాకు సరిగ్గా గుర్తులేదు.వరూధినిగారంటే జిలేబీ బ్లాగర్ కాదు.ఆవిడ బ్లాగ్ పేరు సిరిసిరిమువ్వ.

విన్నకోట నరసింహా రావు said...

వివరణ ఇచ్చినందుకు థాంక్స్ అండి.

శ్యామలీయం said...

విన్నకోట వారూ,
"పుస్తకం వనిత విత్తం పరహస్తం గతా గతః" అని కాదండీ, "పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గతః" అని. పూర్తి శ్లోకం చిత్తగించండి

పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గతః
అథవా పునరాయాతు జీర్ణా భ్రష్ఠాచ స్వల్పశః


విన్నకోట నరసింహా రావు said...

శ్యామలరావు గారు, ఏదో లీలగా గుర్తున్నదేలెండి నేను ప్రస్తావించినది. సరిజేసినందుకు ధన్యవాదాలు. నిజానికి రెండవ పాదం వల్లనే ఆ శ్లోకానికి పూర్తి అర్ధం చేకూరుతుంది.

Zilebi said...


సాహితీ మాలాకుమార్ గారికి

మీరు యెట్లాగైనా ఆ బ్లాగ్ పుస్తకం సంపాదించి మళ్ళీ బ్లాగ్
లో ప్రచురించాలండీ

బ్లాగ్ లోకంలో రీటైర్డు బ్లాగ్ బండ్లు వస్తున్నాయి వారికి ఉపయోగకారిగా ఉంటుంది :)

జిలేబి