Sunday, November 21, 2010

మాయదారి చంద్రుడు



కిర్రు . . . కిర్రు మనే బండి చప్పుడు , అప్పుడప్పుడు , ఏహెయ్ . . . నడవండే అని ఎడ్లను అదిలిస్తున్న మస్తాన్ మాటలు , పక్క వాయిద్యం లా కీచురాళ్ళ ద్వనులు తప్ప , అంతటా నిశబ్ధం గా వుంది . బండి తాపిగా వెళుతోంది . చిన్నగా ముడుచుకొని , అమ్మ దగ్గరకు ఒదిగాను . ' చలేస్తోందా ? అమ్మలూ ' అమ్మ అడిగింది .
' ఊం ' అన్నాను కొద్దిగా వణుకుతూ .
అమ్మ , పక్కనే వున్న గొంగళి తీసి కప్పి దగ్గరగా పొదుపుకుంది . ఇంతలో ఎక్కడి నుంచో సన్నటి సువాసన గాలి లో తేలిపోతూ వచ్చింది . గుండె నిండుగా పీల్చి , ఎంత బాగుందో అన్నాను .
' మొగలి డొంక దగ్గర పడుతోంది పాపగారు . మొగలిపూల వాసన ఇది ' అన్నాడు మస్తాన్ .
'అమ్మలూ ఇటు చూడు , చందమామ ఎంత బాగున్నాడో ! ' అంది అమ్మ .
అమ్మ మీదు గా బయటకు వంగి చూసాను . ఆకాశం లో నిండు చందమామ తెల్లగా మెరిసిపోతున్నాడు. చందమామ వెలుగు లో , ఇసుకలో ని , బండి చారలు తళ తళ లాడుతున్నాయి .
'అమ్మాయిగారూ , ఈ రోజు కార్తీక పున్నమి కదండి అందుకే చంద్రుడు అంత పెద్దగా వున్నాడు .' అమ్మతో అన్నాడు మస్తాన్ .
మొగలి డొంక దగ్గర పడుతున్నట్లుంది . చాలా ఘాటుగా మొగలిపూల సువాసన అంతకంతకూ ఎక్కువకాసాగింది .
బండి చిన్నగా వెళుతూనే వుంది . ఆకాశం లో అందం గా వున్న చంద్రుని చూస్తూ , చందమామ లోని అవ్వ కథ చెపుతూ , ఆకలేస్తోందా ? అని అడిగింది అమ్మ .
' అవును . నువ్వు చందమామ కథ చెప్తుంటే ఇంకా ఆకలేస్తోంది ' అన్నాను .
అమ్మమ్మ పంపిన అన్నం మూట విప్పింది అమ్మ . అందులో అన్నం , కంది పచ్చడి , గోంగూరపచ్చడి వున్నాయి . మద్యాహ్నం , బస్ దిగ గానే , కీసర వొడ్డున కూర్చొని , నేనూ , అమ్మా తిన్నాక , మళ్ళీ నాకోసం మని జాగ్రత్తగా మూట కట్టింది అమ్మ . అందులోనే కందిపచ్చడి , అన్నం కలిపి ముద్దలు అమ్మ పెడుతుంటే ఎంత తిన్నానో కూడా తెలీలేదు ! అలా . . . . . అలా . . . . . మా ప్రయాణం సాగిపోతూ వుంది . . .' వూరు దగ్గర పడుతోంది , తుమ్మ డొంక లొచ్చేస్తున్నాయి జాగ్రత్త , తల లోపలికి పెట్టుకోండి ' అని మస్తాన్ చెపుతూనే వున్నాడు , ఓ పెద్ద తుమ్మ కొమ్మ మొహానికి గీరుకొని ,చుర్ మనటం తో , అబ్బా . . . అంటూ లేచాను .
ఓహ్ . . . ఇదంతా కలా ????? కాదు ,,, కాదు చిన్ననాటి జ్ఞాపకం . కీసరలో బస్ దిగటం , కీసర వొడ్డున అమ్మమ్మ పంపిన కందిపచ్చడి , గోంగూరపచ్చడి తో అన్నం తినటం , ఆ తరువాత బండి ప్రయాణం , మొగలిపూల సువాసన ఆస్వాదిస్తూ , కార్తీక పౌర్ణమి , నిండు చంద్రుని చూస్తూ , అమ్మ చెప్పే కథలు వింటూ , అమ్మ చేతి , అమ్మమ్మ కందిపచ్చడి అన్నం ముద్దలు తినటము , ఎన్ని సార్లు గుర్తుతెచ్చుకున్నా , కొత్తగా అనిపించే మధురమైన బాల్య స్మృతి .

అంతే ఈ సారి వన భోజనాలకు కంది పచ్చడి చేసేయాలని డిసైడ్ ఐపోయాను .



కందిపచ్చడి కి కావలసినవి ;
కందిపప్పు 1 గ్లాస్ ,
రెండు ఎండు మిరపకాయలు ,
జీలకర్ర 1 చెంచా ,
చింతపండు కొద్దిగ ,
గ్లాస్ వేడి చేసి చల్లార్చిన నీరు .
మూకుడు లో కందిపప్పును , నూనె వేయకుండా , ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి . కందిపప్పు వేగాక అందులోనే మిరపకాయలు కూడా వేసి వేయించాలి . దింపేముందు , జీలకర్ర వేయాలి . రోలు ను శుబ్రంగా కడిగి , వేయించుకున్న పప్పు , మిరపకాయలు , జీలకర్ర , చింతపండు , ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి . పచ్చడి గట్టిగా అనిపిస్తే , కాచి చల్లార్చిన నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ రుబ్బుకోవచ్చు .
మెత్తగా రుబ్బిన పచ్చడిని , అన్నం లో నెయ్యి వేసుకొని కలుపుకొని తినటమే తరువాత చేయవలసిన పని :)

ఆహా . . . అలా తినేస్తే కార్తీక పౌర్ణమి రోజు వనభోజనం చేసినట్లు కాదు కదా ?????
అందుకే , పెరట్లోని బాదాం ఆకులను కోసుకొచ్చుకొని , ఎంచక్కా విస్తరి కుట్టుకోవాలి . , అన్నం , కందిపచ్చడి , విస్తరి తీసుకొని మేడ మీదికి పదండి . డాబా పైకి వచ్చారా ?
తెల్లని బెడ్ షీట్ నేలపై పరుచుకోండి . పరిచారా ?
వాకే , దాని మీద విస్తరేసుకొని , అన్నం , కందిపచ్చడి వడ్డించుకొని . . .
సరే ఓసారి తల పైకెత్తి చూడండి . అకాశ వీధిలో అందాల చందమామ వయ్యారీ తారల తో ఎలా సయ్యాట లాడుతున్నాడో కదా !!!! వావ్ ,,,,, తెల్లని వెన్నెల ధారలలో తడిసిపోవట్లేదూ . ఆ పైన చిరు చిరు చలి . . .
వాకిట్లోని పారిజాతాల పరిమళాలు , , , , ,
పక్కింటి చెంబేలీల సువాసనలూ , , , ,
సందులో విచ్చుకుంటున్న జాజిపూల పలకరింపులూ . . .
తెల్లని బెడ్షీట్ పైన , పచ్చని ఆకులో , పొగలు కక్కుతున్న మల్లెపూవులాంటి అన్నం , ఎర్రని కందిపచ్చడి . . .

చుక్కలు *********** కనిపిస్తున్నాయా ****** ఇంకెందుకు ఆలశ్యం కానీయండి .

ఇంత వరకూ వాకే . . . ఆ పైనే వచ్చిపడ్డాయి తిప్పలు . వెన్నెల సోనలను కురిపిస్తున్న చందురుని ఫొటో తీద్దామని ఎంత ప్రయతించినా ఊం హూ అంటాడే ! హాల్ లోని పెద్ద కిటికీ నుంచి కనిపిస్తున్న జాబిలిని బతిమిలాడాను , ఒక్క ఫోజ్ ఇవ్వమని . డాబా పై కొబ్బరాకు సందులోని వెన్నెలరేడును వేడుకున్నాను . అబ్బే . . . మాట వింటేనా ??? చూస్తూండగానే తెల్లారిపోయింది . నన్నూ , నా కెమేరాను చూసి , ఎదురింటిస్తంబం మీద ఓ పిట్ట వాలింది . సరే , దానినెందుకు చిన్న బుచ్చాలని ఓ ఫొటో తీసేసాను . అది చూసి బిల బిల లాడుతూ కాకులొచ్చి , గోడపై బైఠయించి , మమ్మలినీ తీయవూ అన్నాయి . వాకే డన్ ! మాయదారి చందురుడే కాని , నేను నీకు కనిపించనా అని మొహమంతా ఎర్రబరుచుకుంటున్న సూర్యునీ ఫొటో తీసాను . అంతే ఇంకేం చేస్తాను ?????

హాపీ కార్తీక పౌర్ణమీ :)

32 comments:

కృష్ణప్రియ said...

మాల గారూ,

రాత్రి కందిపచ్చడే ఇంక మా ఇంట్లో.. :-( కానీ బాదం ఆకులెక్కడివి మాకు?

Padmarpita said...

మాల గారూ..చంద్రుడు ఫోజ్ ఇవ్వనంటే ఏం!!!
సూర్యుణ్ని చల్లబరిచారుగా మీ ఫోటోలో బంధించి:)

జేబి - JB said...

కార్తీక పౌర్ణమి + కంది పచ్చడి : చుక్కలు కనిపించాయండి.
అమ్మ గుర్తొచ్చింది, ఎప్పుడు భారత్ వెళ్తానో ఏంటో :-(

నేస్తం said...

హూం.. ఈ రోజు మాత్రం చందమామ మీద ఉన్న పాటలన్నీ పాడేసుకుంటాను ..అదేంటో నన్ను ఏడిపించడానికే అన్నట్లు చుక్కలు కూడా రాత్రి 8 అయితే గాని రావు :)అయినా మీరేంటండి కంది పచ్చడి గోరుముద్దలు అని ఇలా ఆకలి పెంచుతున్నారు..

3g said...

హ్మ్మ్..... మీ కందిపచ్చడి కంటె చందమామ కబుర్లు చాలా బాగున్నాయ్.

శిశిర said...

ఎంత బాగా రాశారండి. సూపర్బ్. చాలా చాలా బాగుంది మీ వర్ణన.

మంచు said...

అవును చందమామ కబుర్లు చాలా బాగున్నాయ్...
అదేంటి ఇందాక నేను చదివినప్పుడు రెండు సార్లు ఉంది పొస్టు..ఇప్పుడు ఒక్కసారే ఉంది :P

లత said...

కంది పచ్చడి నా ఫేవరెట్ ఐటం. మా ఇంట్లో ఎవరూ తినరు కానీ నా కోసం స్పెషల్ గా అప్పుడప్పుడు చేసుకుంటాను

వేణూశ్రీకాంత్ said...

మాల గారు, కలలో కలలాంటి ఙ్ఞాపకంలో అలానే అక్కడే ఆగిపోయాను చాలా సేపు, ఎంత బాగుందో, అమ్మ గుర్తొచ్చింది.

Manjusha kotamraju said...

ఆహా బాదం ఆకులలొ భోంచేసి ఎన్ని నాళ్ళయిందోనండి..బాగుంది మీ Post

రాధిక(నాని ) said...

మాల గారు,అసలే ఉపవాసమున్నానండి..ఇలా కందిపచ్చడి చేసి మంచి మంచి ఫొటోలతో నా ఆకలిని ఇంకా పెంచేస్తున్నారు:(

Srujana Ramanujan said...

హాపీ కార్తీక పౌర్ణమీ

Nice pictures

శ్రీలలిత said...

రోట్లో చేసిన కందిపచ్చడి రుచే వేరు
మాలగారి చందమామ వర్ణనే జోరు

మధురవాణి said...

మాలా గారూ,
Simply superb! మీ చిన్నప్పటి జ్ఞాపకం ఎంతందంగా ఉందో! చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఎక్కడికో తీస్కెళ్ళిపోయారు. :) బాదం ఆకుల విస్తరిలో వేడి అన్నం, కందిపచ్చడి ఫోటోలు అద్భుతం! చూస్తుంటేనే నోరూరిపోతోంది. :)

మాలా కుమార్ said...

కృష్ణప్రియ గారు ,
బాదాం ఆకుల కేమండి , బోలెడున్నాయి మా ఇంట్లో . మీకెన్ని కావాలంటే అన్ని తీసుకోండి .

$ పద్మార్పిత గారు ,
అవునండి చద్రుడు చుక్కలను మాయం చేస్తే , సూర్యుని ఫొటో తో అడ్జెస్ట్ ఐపోయాను :)

$ జెబి గారు ,
పెసరట్టే బ్రహ్మాండం గా చేసినవారికి కంది పచ్చడి ఓ లెక్కా ? అమ్మ కోసం అంటే , పాపం భారత్ ఎప్పుడెళుతారో ఏమో :)

మాలా కుమార్ said...

నేస్తం గారు ,
ఆ చందమామ పాటలు కాస్త గట్టిగా పాడండి , మేమూ వింటాము .

$ 3g గారు ,
చందమామ కబురులు నచ్చాయా ? వాకే థాంకు .

$ శిశిర ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

మంచు కొండా ,
ఇందాక రెండు కళ్ళద్దాలు పెట్టుకొని చదివారేమో :)

$ లత గారు ,
కందిపచ్చడి మీ ఫేవ్రేటా ? ఐతే నేను చేసిన కంది పచ్చడి నచ్చిందాండి ?

$ వేణూ శ్రీకాంత్ ,
మీ అమ్మను గుర్తు తెచ్చానా ?
థాంక్ యు .

మాలా కుమార్ said...

మంజు ,
థాంక్ యు .

$ రాధిక గారు , ,
రెండు సంవత్సరాల నుండి నేనీ ఉపవాసాలు మానేసానండి . అందరూ ఇలా ఉపవాసం వున్నాము అని చెప్పినప్పుడు , నేను మానేసానే అని ఫీలైపోతూ వుంటాను .

$ సృజన ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారి కవితే హోరు .
అమ్మో శ్రీలలిత గారి సాంగత్యం లో నాకూ ఒక లైను కవిత వచ్చిదే :))))

$ మధురవాణి ,
అంత నచ్చేసిందా ? ఐతే ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటి కొచ్చేయ్ , బాదం ఆకుల విస్తరి లో భోజనం వడ్డిస్తా .

Unknown said...

ఎంత బావుందో మాలగారూ.. చాలా బాగా రాసారు. కందిపచ్చడి కూడా అద్భుతం..

మనసు పలికే said...

మాల గారు, చాలా బాగుందండీ టపా..:) మరి ఆ ఫోటోలు పెట్టలేదు..:(

మాలా కుమార్ said...

ప్రసీద గారు ,
థాంక్ యు .

$ మనసు పలికే ,
తీసిన ఫొటొ లు అన్నీ పెట్టానండి . నల్లటి ఆకాశం లో తెల్లగా మెరుస్తోందే , అది ఆ మాయదారి చంద్రుడేనండి :)
థాంక్ యు .

ఇందు said...

నేను వెదికానండీ బాబూ..మీ కిటికీలొ చందమామ ఫొటో చూసి సంత్రుప్తి చెంది వెల్లిపోయా..మళ్ళి హనుమంతురావుగారి పూర్ణొంకాయ అప్పుడు మీ కందిపచ్చడి కనపడింది. చాల బాగుంది :)

హనుమంత రావు said...

మాలగారు, నమస్తే
మొత్తానికి కందిపచ్చడి పట్టేసాను. అన్నీ కుదిరితే
వంటకం రుచిలోనే....చంద్రుడు,చుక్కలు,రంభాదులు
ఒకటేమిటి ఆ ఆనందానుభూతి వాహ్.....ముఖ్యంగా
బాదం ఆకులో తిన్నా అలగే పనసపొట్టు కూర
అరటాకులో తిన్నా ఆ రుచే వేరు...ఈకృత్రిమ ప్రపంచంలో
యేం తెలుస్తుందండీ...థాంక్యూ ఒన్స్ అగైన్...దినవహి

మాలా కుమార్ said...

ఇందుగారు ,
అయ్యో సారీ అండి . పోనీలెండి నా చంద్రున్ని చూసి సంతృప్తి చెందారు కదా !
వెతికి మరీ నా కంది పచ్చడి రుచి చూసినందుకు , మా చంద్రున్ని మెచ్చుకునందుకూ థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

హనుమంతరావు గారు నమస్కారమండి ,
అమ్మయ్య నా కంది పచ్చడిని పట్టేశారన్నమాట :)
ఈ చంద్రుని గోలలో టైటిల్ లో కందిపచ్చడి రాలేదు . పాపం చాలా మంది మిస్ అయ్యినట్లున్నారు :)
మీ వ్యాఖ్య కు ధన్యవాదాలండి .

3g said...

//మంచు కొండా ,
ఇందాక రెండు కళ్ళద్దాలు పెట్టుకొని చదివారేమో :)//

:):):)

మురళి said...

బ్రెహ్మాండంగా ఉందండీ కంది పచ్చడి.. ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా తగులుస్తారేమో కదండీ..

మాలా కుమార్ said...

మురళి గారు ,
అవునండి . వెల్లుల్లి కూడా వేస్తారు . కాని మేము వెల్లుల్లి తినమండి . అందుకే నా వంటలలో వెల్లుల్లి వుండదండి . ఏదో నార్త్ ఇండియన్ వంటలు చేసినప్పుడు , నామకహా ఓ రెబ్బ వేస్తాను :)

మాలా కుమార్ said...

3g ,
:):):)

శివరంజని said...

హహహహ మాల గారు ఆ టైటిల్ ఏమిటండి బాబు ...త్వరగా రాలేదని చంద్రుడిని అంత మాటనేస్తారా ? ఫోస్ట్ చాలా బాగుంది

మాలా కుమార్ said...

శివాని ,
మరి చుక్కలని రానీయకపోతే ఏమనాలేమిటి ?
నా పోస్ట్ నచ్చినందుకు థాంక్ యు .