Wednesday, January 23, 2019

చక్కని పూలకు చాంగుభళా!


చక్కని పూలకు చాంగుభళా!
జ్ఞాపకాలు-9
21-1-2019
ఎప్పుడైనా బంతిపూల జడ వేసుకున్నారా :)
మానుకోటలో ఉన్నప్పుడు, ఒక మానుకోట అని ఏమిటి లెండి,కాంప్ క్వాటర్స్ ఉన్న చోటల్లా ఇంటి ముందు వెనుక చాలా స్తలం ఉండేది.ఇంటి చుట్టూ కర్రలతో దడి కట్టించి అమ్మ చాలా మొక్కలు పెంచేది.కాంపౌండు చుట్టూ ఎర్రని కాశీరత్నాలూ,లైట్ క్రీం కలర్ లో ఉన్న గిన్నె మాలతులు , వైలెట్ కలర్ శంఖంపూలు ఇలా ఒకటేమిటి రంగురంగుల పూల తీగలు అల్లించేది.లోపల వరసగా తెలుపు,గులాబీ, వైలెట్ రంగుల డిసెంబర్ పూల మొక్కలు, ఆ పైన జినియా, బంతి, చిట్టిచామంతి,కస్తూరి చామంతి,తెల్ల పచ్చ చామంతులు ఒకటేమిటి మా ఇంట్లో లేని పూలమొక్క లేదు.వంటి రెక్క లిల్లీ కాదు, చిన్న తెల్ల గులాబీలా ముద్దుగా ఉన్న లిల్లీ పూల మొక్క ఉండేది.అవి ఎంత ముద్దుగా, అందంగా ఉండేదో!నాన్నగారు రిటైర్ అయ్యాక ఖమ్మం లో ఇల్లు కట్టుకున్నప్పుడు సగం జాగా లో ఇల్లు కట్టించి, సగం జాగా అమ్మ మొక్కలకు కేటాయించారు.ఇహ చూసుకోండి ఎన్ని మొక్కలో.చివరికి ఇంటి గోడలను కూడా వదలలేదు.సన్నజాజి,చంబేలి,మల్లె,మొల్ల అన్ని రకాలూ పెట్టి ఇంటి చుట్టుతా గోడల మీద నుంచి డాబా మీద కు పాకించింది.ఖమ్మం లో ఊరి చివర ఇల్లు కావటం తో అప్పటికి పంపులు రాలేదు.బోర్ పడలేదు.టాంకర్ లో నీళ్ళు తెప్పించి, కొనుక్కునేవారు.అంత నీటి ఎద్దడిలో కూడా కూరలు వగైరా కడిగిన నీళ్ళు ఒక బకెట్ లో పోసి, మొక్కలకు పోసేది.మేడ మీద కు బిందె తో తీసుకుపోయి పోసేది.అమ్మ కష్టాన్ని గుర్తించినట్లు మొక్కలు విరగపూసేవి.దేవుడి పూజకు గన్నేరు,మందార, నందివర్ధనం బుట్టలతో కోసినా ఇంకా మొక్కల నిండా ఉండేవి.ఇంటి ముందు నుంచి వెళుతున్నవాళ్ళు , రంగురంగుల పూలతో సన్నని సువాసనలతో ఉన్న ఇంటిని ఒక్క నిమిషం ఆగి, తిరిగి చూడకుండా వెళ్ళేవారు కాదు.జినియా పూలు అరచేతి మందం తో, రంగురంగులవి, ముద్దవి, రెక్కవి ఎంత అందంగా ఉండేవో! మేము సెటిలై పూల మొక్కలు వేసుకుందామనుకున్నప్పుడు,ముద్ద లిల్లీలు, జినియాలు,కాశీరత్నాలు ,కస్తూరిచామంతులు ఎక్కడవెతికినా దొరకలేదు. చిన్న చిన్నవి రెక్కవి జినియాలు కనిపించాయే కాని అప్పటిలాగా అంత అందమైనవి కనిపించలేదు.చివరకు రాజమండ్రి వెళ్ళినప్పుడు కడియం నర్సరీకి కూడా వెళ్ళి వెతికాను దొరకలేదు.
సరే ఇక బంతిపూల జడకు, మానుకోటకు పదండి.మా ఇంటి పక్కనే నాన్నగారి కొలీగ్ ఒకాయన, వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి ఉండేవారు.ఆ అమ్మమ్మగారు వాళ్ళ మనవరాలితో పాటు నాకూ బంతిపూల జడ వేసేవారు.అప్పట్లో బంతిపూలు సంక్రాంతి రోజులల్లో మాత్రమే పూసేవి.ఇప్పట్లా తాటికాయలంత కాక , చిన్నవీ పెద్దవీ పసుపు, ఆరెంజ్ ఎరుపు కలిసిన రంగులల్లో , ఒంటి రెక్క, ముద్దబంతి ముద్దుముద్దుగా పూసేవి.కారం బంతి అని ఎరుపు రంగులో పూసేది.అది మా కంత నచ్చేది కాదు.పొద్దున్నే అమ్మ కుంకుడుకాయలతో ,తలస్నానం చేయించి,సాంబ్రాణి ధూపంతో తడి ఆర్పేది.మరి మాకు డ్రైయర్ లు లేవుకదా ! ఓ బుట్ట పట్టుకొని , నేను, భాను(మా పక్కింటి మనవరాలు, నా దోస్త్)పెద్ద పూలు ఏరి కోసేవాళ్ళము.అమ్మమ్మగారు ఇంటి ముందు ఉన్న చింత చెట్టు కింద ,నీరెండలో కూర్చోబెట్టి మా జడలకు బంతి పూలు కుట్టేవారు.ఒకరికి కుడుతుంటే ఇంకోరం, బంతిపూలకు కింద ఉన్న ఆకుపచ్చపొర పూల రేకులు ఊడిపోకుండా జాగ్రత్తగా ఊడదీసి ఇచ్చేవాళ్ళము.ఆవిడ సన్నటి సూదితో, పూలకున్న నల్లటి కొసలను జాగ్రత్తగా ఎక్కించి గుత్తిలా అలాగే పాయ పాయకూ ,అమరుస్తూ కుట్టేవారు.పసుపు ఒక వరుస , ఆరెంజ్ ఒక వరుస వంకీలుగానో , వరుసగానో కుట్టేవారు.ఒక్కోసారి సీతమ్మజడబంతి పూలు కూడా ఒక వరుస బంతి, ఒక వరుస సీతమ్మజడబంతి ఎంత అందంగా కుట్టేవారో!సీతమ్మ జడబంతి పూలు మెజంతా రంగులో ,ముఖమల్ బట్టలా మృదువుగా మెరిసిపోతూ , బంతిపూల మధ్య వయ్యారాలు పోతూ ఉండేవి ( సీతమ్మ జడ బంతి పూల రేకులు వంపులుగా ఉంటాయి). ఆ జడ పూర్తయ్యేందుకు ఒక్కొక్కరికి కనీసం మూడు గంటలైనా పట్టి, సాయంకాలమైపోయేది. మధ్య మధ్యే పానీయం సమర్పయామి అన్నట్లు,మధ్య మధ్య బిస్కెట్లు, చిరు తిండ్లూ అందజేయ బడుతుండేవి :) ఆ జడ ను భద్రంగా రెండు మూడు రోజులు కాపాడుకునేవారము. జడలేని రోజున అమ్మగారు నాజూకుగా దండ గుచ్చి,మా జడలల్లో పెట్టేవారు.అలాగే స్కూల్ కు కూడా వెళ్ళేవాళ్ళము.మరి అప్పుడు స్కూల్ కు పూలు పెట్టుకొని రాకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అనే పిచ్చి రూల్స్ ఏమీ లేవు :) అంత అందమైన బంతిపూల జడ సొగసు చూడతరమా !
నా సన్నజాజి పందిరి కింద నాతో ఉన్న పోరి,నిను వీడని నీడను నేనే అంటున్న  నా బాల్యం  :)  అదియును నేనే,ఇదియును నేనే :)   No comments: