Tuesday, February 21, 2017

నేనూ-నా జిం!

కొత్థ లాప్ టాప్ మీద టైప్ చేస్తుంటే మాలా మమ్మీ బాగానే టైప్ చేస్తున్నావే అన్నాడు సుపుత్రుడు.
"అవును రా చేయి పూర్తి తగ్గిపోయింది "చూడు అని చేతిని అటు తిప్పీ ఇటుతిప్పీ వాడు చూడకుండా కష్టం మీద చేతిని వెనక్కి తీసికెళ్ళీ హాపీగా చూపించేసాను.
"చేయే కాదు మామ్మ్ చూడటానికి కూడా ఫ్రెష్ గా ఉన్నావు.ఆక్టివ్గా కనిపిస్తూ ఇదవరకటి మాలా మమ్మీ లా ఉన్నావు ."అని మెచ్చుకున్నాడు.
అమ్మయ్య ఇక పొద్దున్నే ఆరింటికల్లా లేచి, ట్రాక్ సూటేసి జిం కెళ్ళక్కరలేదు , ఎంచక్కా 8.30 కు వలలి వచ్చి కాఫీ ఇచ్చేటప్పుడు లేవచ్చు ఊహించుకుంటూ సంతోషపడిపోతున్నాను.
"జిం కెళ్ళటం ఆపేయకండి డాడీ కంటిన్యూ చేయండి.ఈ సారి వన్ ఇయర్ కి కట్టేయండి." బాంబ్ పేల్చాడు.
"ఎందుకురా చేయి బాగయిందిగా " మళ్ళీ చూపించబోయాను.
"చెయ్యి చూసాలే. ఫిట్నెస్ కోసం వెళ్ళాల్సిందే.ఆగస్ట్ లో వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు ?ఎంత నీరసంగా కళ్ళుమూసుకుపోతూ, ఈ సోఫా లో పడుకొని, ఆ సోఫాలో పడుకొని, నేనున్న వారం లో నాలుగు సార్లు డాక్టర్ దగ్గరకు వెళ్ళావు.ఇప్పుడు చూడు ఎంత ఆక్టివ్ గా పన్లు చేసుకుంటున్నావో.లైఫ్ సెంటర్ కెళ్ళండి డాడీ మానకండి"
"అదికాదు బేటా , లైఫ్ సెంటర్ కు వెళ్ళినప్పటి నుంచీ లావవుతున్నాను.బరువు పెరిగాను.ఇలా టుం టుం అయితే కష్టం కదా!"
"ఏం కాదు అది హెల్దీ లావు బరువే!"
"నా ట్రాక్ సూట్ లు టైట్ ఐపోయాయి.ఒక్కొకటి 1000 రూపాయలపైన. మళ్ళీ ఎక్కడ కొంటాను.పైగా వన్ ఇయర్ కంటే లక్ష పైన పేచేయాలి."
"ఏం పరవాలేదు.నేను చెక్ ఇస్తాలే. పద ఇప్పుడే ట్రాక్ సూట్ కొనిస్తా."
చివరాకరుగా "నా మనవళ్ళు యు.యస్ రమ్మంటున్నారు.అప్పుడు నాలుగు నెలలు వెళితే కట్టిన డబ్బు వేస్ట్ కాదూ!"
అప్పటి దాకా నిశబ్ధం గా ఉన్న ఏమండీ "వినయ్ దానికి ఎక్సటన్షన్ ఇస్తానన్నాడులే!"
ఇంకా ఆశ చావక నా ట్రైనర్ సూర్య పెళ్ళిచేసుకొని ఊరెళ్ళిపోయాడు. కొత్త ట్రైనర్ పూజ నాకు నచ్చలేదు అన్నాను. స్వాతి ని అడుగుదాము లే ఆ అమ్మాయి బాగానే చేయిస్తుందిగా అన్నారు ఏమండి నా వైపు చూడకుండా!
ఐతే ఇది స్వదేశీ , విదేశీ కలిసి పన్నిన కుట్రా :(
"నిన్ను చిన్నప్పుడు బలవంతంగా , ఏడుస్తున్నా స్కూల్ కు పంపానని కక్ష తీర్చుకుంటున్నావా బేటా"
చిద్విలాసంగా నవ్వేసాడు.అందుకే వాడి కి నేనూ పిల్లలూ హిట్లర్ అని పేరు పెట్టింది.
ఈ రోజు కట్టేసారు.వినయ్ మొహమంతా నోరు చేసుకొని విశాలంగా నవ్వాడు.నవ్వడూ అతనికేం పోయింది.
మళ్ళీ పొద్దున్నే లేవటాలూ. . . పరుగులూ దేవుడా. . .

2 comments:

Lalitha said...

మీ ఇంట స్వదేశీ-విదేశీ కుట్ర ఫలించి మీరు జిం-కెళ్లి జింకలనోడించేంత చురుగ్గా అయిపోదురుగాక !

ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు US?

మాలా కుమార్ said...

మీ ఆశీస్సులు ఫలించుగాక :) థాంక్స్ అండి.యు.యస్ వస్తే మే లో వస్తామండి.లేకపోతే లేదు.ఇంకా ఏమీ అనుకోలేదు. అది ఓ వంక :)