Monday, February 13, 2017

ఘుమ ఘుమల మసాలావడ





మొన్న సాటర్ డే టి వి లో వచ్చిన మా ప్రమదాక్షరి ప్రోగ్రాం చూడటం మర్చిపోయాను.చెప్పానుగా చేతికి దెబ్బ తగిలినప్పటి నుంచీ అన్నీ మర్చిపోతున్నానని.ఎవరో అన్నారు అందరికీ మెదడు మోకాల్లో ఉంటే రచయితలకు మణికట్టు లో ఉంటుంది. అందుకని నువ్వు అన్నీ మర్చిపోయావు అని.ఓహో అని నేనూ అలానే ఫిక్సైపోయా :) అసలు విషయానికోస్తే , ప్రోగ్రాం వచ్చిన రోజు లక్ష్మిగారు మీ వడలు టి.వీ లో బాగా పడ్డాయండోయ్ అన్నారు.చూద్దామంటే నిన్న టైం దొరకలేదు.ఇదో ఇప్పుడు చూసాను. నిజమే నండోయ్ నా వడలు బాగా పడ్డాయ్! యాంకరమ్మాయి రుచి చూసింది కూడా! వడలు అలా చూస్తుంటే ఆలోచనలు ఎటోపోయాయి.పోయీ . . . . పోయీ. . . . .
ఆవి మా పెళ్ళైన తొలి రోజులు.వెస్పా మీద ఝాం అంటూ హైదరాబాద్ అంతా చక్కర్లు కొడుతుండేవాళ్ళం.అలా . . . . అలా. . . పోతూ ఉండగా సాయంకాలం,కమ్మటి ఘుమ ఘుమలు ముక్కుపుటాలకు తగిలాయి.వెంటనే స్కూటర్ ఆపి చూస్తే అక్కడ రోడ్ పక్కన , బండి మీద ఒకతను వడలు వేయిస్తున్నాడు.ఇప్పుడంటే వంకాయ కూర తినాలన్నా భయం కాని అప్పుడేముంది. ఎంచక్కా పది పైసలకు ప్లేట్ తీసుకొని ఇద్దరమూ లాగించేసాము.ఏమాట కామాట చెప్పుకోవాలి , బండిమీద వండేవాటికి ఉన్న రుచి ఫైవ్ స్టార్ హోటల్ లోనూ ఉండదు.మా ఏమండీ బండతనిని తెగ బతిమిలాడి , రూపాయిచ్చి మొహమాటపెట్టి, రసిపీ తెలుసుకున్నారు.వెంటనే తిరుగు టపాలో ఇంటికి వెళుతూ పెసలుకొనుకెళ్ళి, యుద్దప్రాతిపదికన వాటిని నానబోసి మరునాడు వడలు చేసేసాను. తరువాత మా ఇంట్లో పార్టీకైనా స్టార్టర్ మసాలావడ తప్పని సరిగా ఉండేది.కాలక్రమేణా మేమూ , పుల్కాలు, సొరకాయ, బీరకాయల కు సెటిలైపోయాక కనుమరుగయ్యాయి!మళ్ళీ ఇన్నేళ్ళకు పాట్ లక్ లంచ్ లో నా వంతు వడలు వచ్చేసరికి గుర్తొచ్చి బయటకు వచ్చాయి :)

సరే ఎవరో ఒకరు అడిగేదాకా ఆగటం ఎందుకు ఇప్పుడే చెప్పేస్తున్నాను అమోఘమైన రసిపీ ;
1 గ్లాసు పెసలు,
1/4 గ్లాసు బియ్యం,
1/2 గ్లాసు శెనగపప్పు,
పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర,పుదీనా ఆకు,ఉప్పు, ( ఇష్టమున్నవాళ్ళకు వెల్లుల్లి.మనకు పడదు ),
చాట్ మసాలా పౌడర్.
పొద్దున్నే పెసలు, బియ్యం ఒక గిన్నెలో, సెనగపప్పు ఒక గిన్నెలో విడి విడిగా నానబెట్టుకోవాలి.శెనగపప్పు రాత్రికి నానబోస్తే బెటర్.రాత్రి పెసలు బాగా కడిగి, బట్ట మీద ఆరేసుకోవాలి.మరునాడు పొద్దున పెసలు బియ్యము గట్టిగా, బరకగా రుబ్బుకోవాలి.అల్లం , పచ్చిమిర్చి, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకోవాలి.పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కోవాలి.వాటికి ఉప్పు చేర్చి , అవి,నానిన శెనగపప్పు అలాగాఎ పెసర పిండిలో కలుపుకొని చిన్న చిన్న వడలు చేసుకోవాలి.వడ్డించేముందు లైట్ గా చాట్ మసాలా వాటి మీద చల్లుకుంటే రుచిగా ఉంటాయి.అంతే పెసర మసాలా వడ తయార్!
ప్రమదాక్షరి మితృలారా నన్ను క్షమించండి, రోజు చాట్ మసాలా పౌడర్ తెచ్చికూడా వడల మీద చల్లటం మర్చిపోయాను.చేతి దెబ్బా. . . మతి మరుపూ. . . .

1 comment:

Lalitha said...

మీ మసాలావడ ఘుమఘుమలు బ్లాగంతా గుబాళించాయి. 🥘