Friday, May 28, 2010

ఎంతవారలైనా ఆవకాయ దాసులే !!!!



ఈ ఎండాకాలం ఏమో కాని , ఆవకాయ , గుమ్మడికాయ వడియాలు , చల్లమిరపకాయలు ఇవన్ని పెట్టటముతోటే సరిపోతుంది . అందులో ఆవకాయ ఇంటి ఇలవేలుపు . అది లేందే ఏరోజూ ఎవ్వరికీ ముద్ద దిగదు . పది సంవత్సరాల క్రితము వరకూ , ఖారం , పసుపు , ఆవపిండి , ఉప్పూ ఇంట్లోనే కొట్టించేవాళ్ళము . ఇప్పుడు ఆవపిండి ఒక్కటి మాత్రం ఇంట్లో చేస్తున్నాము . అదీ ఖమ్మం నుండి ఆవాలు తేవాలి . త్రీమాంగోస్ ఖారం , బుల్ల్ బ్రాండ్ ఉప్పు , ఇదయం నువ్వుల నూనె ఇందులో ఏ ఒక్కటి మారినా ఇలా విలపించాల్సిందే !


మా అత్తగారు పచ్చడులు పెట్టటము లో ఎక్స్పర్ట్ . ఈ ఆవకాయ సీజన్ లో , మా అత్తగారు , మామగారు హడావిడి పడిపోయేవారు . ఆవకాయ కలిపిన రోజు మా ఇంట్లో పండుగ వాతావరణమే వుండేది . ముక్కలు తుడిచేంత సేపు ఆ ఏడాది ముచ్చట్లు దొర్లి పోయేవి . అన్ని సిద్దం చేసుకున్నాక ,పిల్లా పీచూ అందరికీ గోల్డ్ పాస్ లు , టిఫినీలు పెట్టి బయటకు తోలేసేవాళ్ళము . ( ఇప్పుడూ అంతే అనుకోండి ) ఆ తరువాత , వంటగది లో , మా అత్తగారు పీటమీద కూర్చొని , ఒకొక్కరిని పిలిచేవారు . అంటే , నేను , మా తోటి కోడలు , మా ఆడపడుచులు అందరము ఎవరిది వారే కలుపుకునే వారమన్నమాట . ఆ కలుపుకునే వారు , అత్తగారు మాత్రమే ఆ గదిలోకి వెళ్ళేవారన్నమాట . అత్తగారి ఆద్వర్యం లో వాళ్ళు కలుపుకునేవారు . మిగితా వాళ్ళు బయట మా టర్న్ కోసం ఎదురుచూస్తూ వుండేవాళ్ళము . మా మామగారేమో బయటి వరండాలో కూర్చొని ఇంట్లోకి ఎవరూ రాకుండా కాపలా కాస్తూ వుండేవారు . మా మామగారు లోపలికి వచ్చినప్పుడు పొరపాటున ఎవరైనా వచ్చారో , ఆ పైన మీరు ఆవకాయ పెడుతున్నారా అని మరీ వంటగది లోకి వెళ్ళారో అంతే , మామయ్యగారి పని , వచ్చినవాళ్ళ పని గోవిందో గోవింద !! మన తిండి మనం తిన్నా , మన బట్ట మనం కట్టినా కనుమరుగు వుండాలి అనేది మా అత్తగారి సిద్దాంతం . అలా మాఇంట్లో అందరమూ , ఈ జనరేషన్ కూతుళ్ళూ , కోడళ్ళూ కూడా ఆవకాయ పెట్టటము నేర్చుకున్నాము .


మా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్న ఆవకాయ పద్దతి ; -


ముందుగా కావలసిన మసాలా సిద్దం చేసుకున్నాకనే మామిడి కాయలు తెచ్చుకోవాలి.

ఆవకాయకు ముఖ్యమైనవి మంచి ఆవాలు . మేము ఇన్ని సంవత్సరాలనుండీ ఖమ్మం లో , భారతమ్మ కొట్టునుండే ఆవాలు తెచ్చుకుంటున్నాము . రాగి రంగులో సన్నగా , చిన్నగా వుంటాయి . ఒక పెద్ద గిన్నెలో పోసి , జాగ్రత్తగా గాలించి , కడగాలి . ఆ పైన జల్లెడ లోకి నీరంతా పోయేట్టుగా వంపాలి . ఆ తరువాత మంచి ఎండ లో ఓ బట్ట మీద వేసి ఆరబెట్టాలి . మద్య మద్య లో వాటిని నెరుపుతూ (కదుపుతు) వుండాలి . లేక పోతే వుండలు చుట్టుకు పోతాయి . అలా రెండు , మూడు రోజులు బాగా ఎండపెట్టాలి . ఎండ వేడి చల్లారిన ఆవాలను మిక్సీ లో కొద్ది కొద్దిగా వేస్తూ పొడి చేసుకొని , మైదా జల్లెడ తో పట్టాలి. అప్పటి కప్పుడే ఆవకాయ కలుపుతే సరి లేక పోతే ఆ పొడిలో కొద్దిగా ఉప్పు కలిపి వుంచుకోవాలి.లేకపోతే ఆవపిండి కనరెక్కుతుంది .


ఉప్పును కూడా ఒక పూట ఎండబోయాలి . అది కూడా మద్య మద్య లో నెరుపుతూ వుండాలి . లేక పోతే వుండలు కడుతుంది . ఎండాక మైదా జల్లెడ తో జల్లెడ పట్టుకోవాలి . పచ్చడికి , అయోడిన్ ఉప్పు కాకుండా మామూలు ఉప్పైతేనే బాగుంటుంది . మేము బుల్ బ్రాండ్ ఉపు వాడుతాము .


ఖారం ఎవరి కి ఇష్టమైనది వారు వాడవచ్చు . మేము త్రీమాంగోస్ బ్రాండ్ ఖారం వాడతాము . అది కూడా ఎండబెట్టక్కర లేదు కాని మైదా జల్లెడ తో జల్లించుకోవాలి .


మెంతులు కడిగి ఆరబోసుకోవాలి .


ఇలా అన్ని సిద్దం చేసుకున్నాక , నాటు , లేదా , చిన్న రసాలు లేదా, తెల్ల గులాబీలు , వీటి లో ఏదో ఒక వెరైటీ వి మీడియం సైజు మామిడి కాయలు తెచ్చుకోవాలి . మామిడి కాయలను కొద్ది సేపు నీళ్ళ లో నానేసి , తడిలేకుండా శుభ్రం గా తుడుచుకొని , ముచ్చికలు తీసేసి ముక్కలు కొట్టించుకోవాలి . ఒక కాయకు పన్నెండు ముక్కలు , అంటే టెంక అన్ని ముక్కలకు సమానం గా వచ్చేట్లుగా నన్నమాట , జాగ్రత్తగా కొట్టించాలి . టెంక లేక పోతే ముక్క త్వరగా మెత్త బడి పోతుంది .దీని తరువాతనే మహా బోర్ , పెద్ద పని ముక్కలు పొర , జీడి లేకుండా తుడవటము . తప్పదు మరి .


ఆవకాయ పాళ్ళు ; -

మామిడికాయలు - 25

ఆవపిండి - 8 పావులు ( పిండి ఎక్కువ కావాలంటే 9 వేసుకోవచ్చు )

ఉప్పు - 6 పావులు

ఖారం - 4 పావులు

మెంతులు - కొద్దిగా

పసుపు

నువ్వుల నూనె - 2 కిలోలు

వేడి చేసి చల్లార్చిన నీళ్ళు గిన్నెడు


కలిపేవిధానము : -


ఒక పెద్ద పళ్ళెం లో కాని బేసన్ లో కాని ఎనిమిది పావులు ఆవపిండి పోసుకొని , కొద్ది కొద్ది గా నీళ్ళు పోస్తూ , ఇడ్లీ పిండి కన్నా తక్కువ , చపాతి పిండికన్నా ఎక్కువగా వుండేటట్లు మృదువుగా తడుపుకోవాలి . ఇంకొక గిన్నెలో ఖారం , ఉప్పు , పసుపు , మెంతులు పైన చెప్పిన పాళ్ళ ప్రకారం కలుపుకొని , ఆపొడిని నీళ్ళ తో తడిపి వుంచుకున్న ఆవపిండిలో వేసి , కొద్ది కొద్ది గా నూనె వేస్తూ చపాతీ పిండిలా తడుపుకోవాలి . ఆ తరువాత ఇంకొక గిన్నెలో ఒక పావు నూనె , కొద్దిగా ఆవపిండి , కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి , ఆ నూనెలో కొద్ది గా మామిడికాయ ముక్కలను ముంచి తీసి , కలిపి వుంచుకున్నా ఆవ ముద్దలో వేసి , కొద్దిగా ఆవ ముద్ద , ఆ ముక్కలు బాగా కలుపుకొని జాడిలో వేయాలి . అలా కొన్ని కొన్ని ముక్కలు నూనె లో తడిపి , కొద్ది ఆవముద్ద తో కలిపి జాడిలో వేస్తూ , మొత్తం ముక్కలకు పిండి సరిపోయేట్లుగా వేసుకోవాలి . ఒక వేళ ఆవముద్ద మిగిలి పోతే జాడీలో పైన సద్దేయవచ్చు . ఆ తరువాత జాడీ మూత గట్టిగా పెట్టేసి , పైన ఓ బట్ట వాసెన కట్టాలి . మూడో రోజు తిరగ కలుపుకోవాలి . అంతే ఘుమ ఘుమ లాడే ఆవకాయ సిద్దం .


" అందరూ ఇంత కష్టపడరట వదినా , ఇలా పాకెట్స్ కట్ చేసి వేసి అలా కలిపేసుకుంటారుట ."


" ఏమో విజయా , ఈ సారికి ఆవకాయ పెట్టేసాము . వచ్చేసారి ఆవకాయ పెట్టే ఓపిక వుంటుందో వుండదో . "


ఇవి ప్రతిసారి ఆవకాయ పని ఐపోయాక నేనూ , మా ఆడపడుచూ అనుకునే డైలాగులు !


ఏమైనా కాస్త ఓపిక తెచ్చుకొని నాలుగు రోజులు కష్టపడి తే ఏడాదికి సరిపోను ఆవకాయ వచ్చేస్తుంది .


" అత్త చేతికి కింది కోడలుకు , ఉప్పు ఉన్న ఊరగాయకు తిరుగు లేదు ."





14 comments:

Rani said...

నీళ్ళు తగిలితే వూరగాయలు పాడయిపొతాయి అంటారుగా, మీరెమో నీళ్ళతొ తడపాలి అంటున్నారు?

Unknown said...

నోరు ఊరిపోతుంది బాబోయ్!! మా ఇంట్లో చెయ్యరు.. బయట నుంచి తెచ్చుకుంటాం.. మనమే చేద్దాం అమ్మా అని చెప్పిన కూడా వినటంలేదు.. :(

manasa said...

నీళ్ళావకాయ అని విన్నాను..ఇదేనా..ఎందుకడుగుతున్నాను అంతే మా బామ్మ పెట్టేటప్పుడు నీళ్ళు కలపదు.కానీ నీళ్ళావకాయ అని ఒకటుందని విన్నాను.

Anonymous said...

మీ ఆవకాయ ఇంటికా, అమ్మకానికా? నీళ్ళు వేసి చేయడమైతే, ఉప్పు ఆవపిండిని ఎండబెట్టడమెందుకు, శుభ్రంగా నీళ్ళలో వుండలేకుండా కలిపేసుకోవచ్చు కదా? తెలిసీ చెప్పకపోయారో మీ ఆవకాయ నెలలో చెడిపోవు గాక!

మాలా కుమార్ said...

రాణి గారు ,
మీ అనుమానమే నాకూ ఎప్పుడూ వస్తుందండి . అదేమి మాయో తెలీదు . ఆ తరువాత ఒక్క చుక్క నీరు తగిలినా , తడి గరిట పెట్టినా పాడై పోతుంది !

* ప్రదీప్ గారు ,
అమ్మను ఎందుకు విసిగించటం , అక్కడ ఆవకాయ ఇచ్చాను కదా , తినేయండి .

మాలా కుమార్ said...

మానస గారు ,
ఇది సగం నీళ్ళ ఆవకాయ . మేము తడి ఆవకాయ అంటాము . నీళ్ళ ఆవకాయ అంటే పద్దతి అంతా ఇంతే కాని , అంతా కలిపాక , జాడీ లో పైనుండి ఓ చెంబెడు నీళ్ళు పోసి మళ్ళీ కలుపుతారు .

* ఏమండీ అనోనిమస్ గారు ,
అంత శాపాలెందుకండి ? మామూలుగా అడుగుతే చెపుతాను కదా !
ఆవపిండి ఎండపెట్టము , ఆవాలు ఎండపెడతాము , ఎందుకంటే పొడి బాగా రావాలి కదా ,
అలాగే ఉప్పు ను రాళ్ళు లేకుండా మెత్తగా జల్లెడ పట్టాలంటే ఎండ పెట్టక తప్పదు . ముందే చెప్పాను కదా అన్ని పొడులు మైదా జల్లెడ తో జల్లించాలని , అప్పుడే కదా పిండి మృదువు గా వుండేది .

స్వర్ణమల్లిక said...

మాల గారు,

మీ పోస్ట్ చదివాక అర్జెంటుగా ఆవకాయ అన్నం తినాలనిపిస్తోంది.

మా ఇంట్లో అయితే అంతా ఇదే పద్ధతి కానీ, ఆవపిండి, కారం, ఉప్పు నునేతోనే తడుపుతారు గట్టిగా చపాతీ పిండి లాగా. ఆ తరువాత మామిడి కాయ ముక్కలు వేసి కలిపి మరింత నునే పోస్తారు.

మా అమ్మ కూడా అత్త చేతి కింద కోడలే. ఇప్పటికీ మా బామ్మదే ఇంటి పెత్తనం. నాకు మాత్రం ఆ అదృష్టం లేదు. మా అత్తగారు ఎప్పుడో (పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే) ....... దాటిపోయారు, నేను ఉత్తమురాలినిగా అందుకే మరి.

శేఖర్ పెద్దగోపు said...

మా ఇంట్లో అయితే మామిడి ముక్కలను ఊరేసి, ఎండలో ఎండబెట్టి అప్పుడు ఆవపిండి..ఇంకా ఏవేవో కలుపుతారు..హైద్ కి వచ్చాకే నాకు మా ఇంటి ఓనర్ ఆంటి మీరు చెప్పినలాంటి ఆవకాయ ఇచ్చారు...దేని రుచి దానిదే అనుకోండి...
ఈ రోజుల్లో కూడా మీరింత ఓపిగ్గా ఊరగాయ పెడుతున్నారంటే గ్రేట్....ఏంటో మీలాంటి వారు మా పక్కింట్లోకి ఎప్పుడు నైబర్స్ గా వస్తారో!! :-)

Anonymous said...

ఆగండాగండి, ఉప్పును జల్లించి కలిపినా, ముతకగా కలిపినా నీళ్ళలో కరుగుతుంది. రాళ్ళ ఉప్పు వేడినీళ్ళలో కలిపి, ముతక ఆవపిండి వుండలు లేకుండా కలిపేస్తే వీజీ కాదా? ఎండబెట్టడమెందుకండి? పాయింట్ అర్థం చేసుకోరూ ..
కాబట్టి మీరు చేసిన ఆవకాయ శాంప్రదాయమైనది కాదు, కల్తీ సరుకు. ప్రియ వాళ్ళ బాటిల్స్ లోకి ఎక్కించి బాచిలర్స్ కంచాలను అలరించడానికి మాత్రమే పనికొస్తుంది.
అథెంటిక్ గుంటూరి ఆవకాయ్ రుచి , వేరు హై. ఖమ్మం అన్నారు అంటే తెలంగాణ ఆవకాయాన్నమాట! అవున్లేండి ఉగాది పచ్చడి కాక పానకం తాగుతారటగా! ప్చ్ .. ఏమిటో! ఈ ముక్కు కెసిఆర్ తెలంగాణ ముక్కుమంత్రి ఐతే ఆవకాయ లోకి గుడంబా కలిపినా కలపగలరు :))
( ..సరదాగా ..)

మాలా కుమార్ said...

స్వర్ణ మల్లిక గారు ,
మరి మీరింకా ఆవకాయ పెట్టుకో;ఏదేమిటి ?
ఐతే మీ ఆవకాయ కూడా మా టేస్టేనన్నమాట .

* శేఖర్ గారు ,
బహుషా మీ ఇంట్లో పెట్టేవి , తొక్కుడు పచ్చడి , మాగాయ కాబోలు .
మీరే ఏరియా లో వుంటారో చెప్పండి , మీ ఇంటి పక్కకు వచ్చేస్తాము . ఈ హైదరాబాద్ లో ఏ ఏరియా ఐనా మాకు ఒకటే .

మాలా కుమార్ said...

అనొనమస్ గారు ,
అబ్బ ఎందుకండి అంత ఘట్టిగా ఆగాండాగండి అని అరుస్తారు ? ఆగక నేనెక్కడికి పోతానండి ?
ఏమిటండి , ఆవాలు శుభ్రంగా కడిగి ఆరబోసుకోవటము కల్తీనా ? నాకు తెలీదండి . ఇసుక , మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఆరబోయాలని మా అత్తగారు చెప్పారండి . మీరు చెప్పారని మావారితో , ఏమండీ ఈ సారి ఉప్పు గడ్డలు వేడి నీళ్ళలో కరగబెట్టి , ఆవకాయ లో కలుపుతానండి , అని అన్నానండి . వెంటనే మా వారు అందరికీ , వాంతులూ విరోచనాలు పట్టుకొని , నిష్కారణం గా చచ్చిపోతారు అని తిట్టారండి . పోనీయండి , ఏమండీ , ఏమండీ , మన ఆవకాయ నాలుగు జాడీలున్నాయి కదా , ఒకటి మధురవాణి కిచ్చినా మూడు మిగులుతాయి . సుజ్జి కూడా అడిగింది , కాస్త తనకిచ్చేసి మిగితాది ప్రియా వాళ్ళకు అమ్మేద్దామండి , బోలెడు డబ్బులొస్తాయి అన్నానండి . అబ్బే మావారు వింటేనా , పైగా ఠాట్ , పూఠ్ అని అరిచేసారండి . ఏం చేయను చెప్పండి ? పదిహేడేళ్ళ కే పెళ్ళి చేసి , అత్తగారి మాట , మొగుడి మాట విని బుద్దిగా వుండమ్మా అని మా అమ్మా , నాన్నగారు చెప్పి పంపారండి . అప్పటి నుండి , అత్త చాటు కోడలిని , భర్త చాటు , భార్యని . మీ సలహాలు పాటించ లేక పోతున్నాను క్షమించండి .

satya said...

మాయ కాదండీ మాల గారూ! రహస్యం అంతా 'మరగ కాచి చల్లర్చిన నీరు ' లో వుంది.అందువల్లనే వూరగాయ పాడవకుండా యేటికేడాదీ నిలవ వుంటుంది.చింతకాయ పచ్చడీ, గోంగూర పచ్చడీ, మాగాయ ఇలా వేటిలొనైనా వూట తక్కువై ఎండినట్లుగా వుంటే మా ఇంట్లో పఠించే మంత్రం ఇదే.నీళ్లు కలిపిన ఆవకాయ ఘాటు అద్దిరి పోతుంది కదూ.!
ఇక శేఖర్ గారు చెప్పింది కూడా ఆవకాయ లో వెరైటీయే. దాన్ని ఎండావకాయ అంటారు.విశాఖ జిల్లా వారు పెడ్తారనుకుంటా. మీరు చెప్పిన నీళ్లావకాయకి కృష్ణా జిల్లా ప్రసిద్ధి.
మొత్తానికి మీ పోస్ట్ ధర్మమా అని అన్నిరకాల వూరగాయల్నీ తల్చుకోవడం జరిగింది.చాలా థాంక్సండీ.

మాలా కుమార్ said...

సత్య గారు ,
మిగితా పచ్చడుల లో కూడా ఇలా నీళ్ళు కలుపుతారని నాకు తెలీదండి ఈ ఎండావ కూడా తెలీదు అవునండి మాది క్రిష్ణా జిల్లా ఆవకాయే అనుకుంటా . ఎందుకంటే మా అత్తగారు వాళ్ళది మధిర . అది కృష్ణా బార్డరే కదా . మా అమ్ముమ్మా వాళ్ళది గుంటూరు . వాళ్ళు నూనె కాచి చల్లార్చి కలుపుతారు . ఒక్కో ప్రాంతం ది ఒక్కో అలవాటు . దేని రుచి దాని దే .మీకు తెలిసిన ఆవాకాయల గురించి మీరూ రాయండి .
థాంక్ యు .

భావన said...

ఎన్ని ఆవకాయలో... నోరు వూరి పోతోంది. yummy yummy in my tummy.