Wednesday, May 26, 2010
మా వారూ - ఆవాకాయ * * * అను మాలా విలాపం . . .
ఎందుకోగాని ఈ సారి ఆవకాయ పెట్టే ఓపిక గాని , మూడ్ గాని అస్సలు లేదు . కొత్త ఇంట్లో పనిమనిషి సరిగ్గా లేదు , సావిత్రి డుమ్మా లో వుంది , ఖమ్మం నుండి ఆవాలు తెప్పించలేదు ఇలా , ఆవకాయ పెట్టకుండా తప్పించుకునే కారణాలు వెతుక్కుంటూ వున్నాను . ఐనా తప్పదుకదా ! అందరూ బాగుంటున్నాయి అంటున్నారని బాంబే స్టోర్ నుండి నూనే వగైరా సామానులు తెచ్చాను . కాని , ఉప్పును ఎండబెట్టకుండా , ఖారం జల్లెడ పట్టకుండా కాలం వెళ్ళదీస్తున్నా . నాలుగైదు సంవత్సరాల నుండి మావారి కజిన్ , వాళ్ళ ఇంటికి దగ్గర లో మామిడి తోట వుందనీ , అక్కడ మనము ఎంచుకున్న చెట్టునుండి కాయలు తెంపిస్తున్నారని , చాలా బాగుంటున్నాయని చెపుతూ వచ్చారు . కాని నేనెప్పుడూ వెళ్ళి తెచ్చుకోలేదు . సరే ఈసారి ఆవాలు సరైనవి లేవుకదా , కనీసం మామిడి కాయలైనా మంచివి తెద్దాం అనుకొని వస్తానని చెప్పాను . నేను వెళ్ళి కాయలు తెచ్చుకుందామనుకున్న శుభముహూర్తాన , గాలి వచ్చి కాయలన్ని రాలిపోయాయని , కావాలంటే ఓ పాతిక కాయలు మాత్రం దొరుకుతాయని , పాపం మా బావగారు ఎంతో ఫీలైపోతూ ఫోన్ చేసి చెప్పారు . పోనీలెండి అని ఆయనను ఓదార్చి , అమ్మయ్య ఈ వారం ఆవకాయ పెట్టే పని తప్పింది అనుకున్నా ! ఇంతలో మాఅడపడుచు విజయ ఫోన్ చేసి , నేను పనమ్మాయిని మాట్లాడాను , ఈ సారి మా ఇంటికొచ్చేయ్ వదినా అంది . ఇహ తప్పదుకదా . ముక్కుతూ మూలుగుతూ విజయా వాళ్ళ ఇంటికెళ్ళి ఎలాగో ఐందనిపించుకొని , అమ్మయ్య అని నిట్టూర్చాను . ఆడపడుచుల సాయం తో ఆవకాయ పెట్టేసావు కదా , ఈ మాలా విలాపం ఎందుకంటారా ? అసలు కథ ఇప్పుడే మొదలైంది మరి . నన్ను తీసుకెళ్ళటానికి మావారు వచ్చి ఐందా అమ్మాయ్ ఆవకాయ పని అని మా అమ్మాయిని అడిగారు . మాతో ముక్కలు తుడిపించి మమ్మీ , విజ్జత్తనే కలిపారు డాడీ అని మా మీదో కంప్లైంట్ చేసి , ఈ సారి అస్సలు ఆవఘాటు లేదు అన్నది మా అమ్మాయి . అంతే పితృహృదయం ద్రవించి పోయింది !!!
మావారు పని మీద కొత్తగూడెం వెళ్ళాల్సి వచ్చింది . అక్కడనుండి కాల్ చేసి , వస్తూ ఖమ్మం నుండి ఆవాలు తేనా అని అడిగారు . ప్రస్తుతం పితృహృదయం పొంగి పొరలి పోతోందనే మాట మరచి ఎందుకు ఆవకాయ పెట్టేసాను కదండీ అన్నాను . కాదులే ఇక్కడనుండి ఆవాలు తెస్తాను కొద్దిగా పిల్లలమటుకు పెట్టేయకూడదూ అన్నారు . ఇహ తప్పదుకదా , ఒక్క కిలో మటుకు తెండి ఎక్కువ తెస్తే చేసే ఓపిక లేదు అని గొణుకున్నాను . ' ఖారం తేనా ? '
' వద్దండి . మొన్నటి ఖారం వుంది . "
" అదా ? ఎర్రగా , గొడ్డు ఖారం లా వుంది వద్దు . ఇక్కడి నుండి మంచిది తెస్తాను "
మంచి వరంగల్ ఖారమని , చక్కగా ఎర్రగా పండులా మెరిసి పోతోందని తెచ్చాను . అది గొడ్డుఖారం లా వుంది హుం . ఇంకా నా నిట్టూర్పు పూర్తికానేలేదు ," మెంతులున్నాయా ? "
" వున్నాయండి ."
" శెనగలు ? ఈ మధ్య నువ్వు శెనగలేయడం లేదు . మా అమ్మ వేసేది ."
" మహా ప్రభూ నేను ఆవకాయ పెట్టటము అత్తయ్యగారి దగ్గరే నేర్చుకున్నాను . శెనగలేస్తే నూనె ఎక్కువ పీలుస్తున్నాయని శెనగలు వేయటము మానేసాము . అదీ అత్తయ్యగారు చెపితేనే . అన్ని వున్నాయి మీరేమీ తేనక్కరలేదు , ఒక్క కిలో అవాలు మాత్రం తెండి బాబూ చాలు "
" ఇక్కడ మామిడికాయలు బాగుంటాయి తెచ్చేదా "
" వద్దండి బాబూ వద్దు . ఇప్పుడే మామిడికాయలు తెస్తే ఎట్లా ? ఆవాలు కడగాలి , ఎండబోయాలి , పొడి కొట్టలి అప్పుడు కదా మామిడి కాయల అవసరం "
ఇంత చెప్పినా ఆవాలు రెండు కిలోలు , ఖారం రెండు కిలోలూ తెచ్చారు . మా ఆపత్భాంధవి సావిత్రి కూడా వచ్చింది . అమ్మయ్య ఆవాల పని ఆమె చేసింది . మామిడికాయలకు ఒక్కదానిని వెళ్ళే ఓపిక లేక, కారు లో తీసుకెళుతారు కదా అని , మావారిని వెంట బెట్టుకుని వెళ్ళాను చూసారూ అదే నేను చేసిన పెద్ద పొరపాటు . కాయల వాళ్ళు పిలిచి పిలిచి మరీ రుచి చూపిస్తుంటే ఈయన గారు మహదానందం గా పెద్ద ముక్కలు రుచి చూసేస్తున్నారు . నేను వూరుకోలేక అంత పెద్ద ముక్కలు అన్ని తినకండి అని చిలక్కు చెప్పినట్లు చెప్పాను . వింటేనా ? పైగా నావైపొక సీరియస్ లుక్ ! కాయలు బేరమాడబోతే ఇవి బాగున్నాయి ఇచ్చేయ్ అన్నారు . మేము ప్రతిసారి వాళ్ళ తో గీసి గీసి బేరమాడతాము . అదేం లేదు .ఇవి బాగున్నాయా , బాగున్నాయి , ఎన్ని కావాలి ముప్పై నా ఇచ్చేయ్ అంతే ! ముక్కలు కొట్టే అతని దగ్గరా అంతే ఎంతకు బాబూ రెండు రుపాయలకొకటి కొడతావా సరే కానీయ్ . అదికాదండి పోయిన సారి రూపాయకే కొట్టాడు అంటే కాదమ్మగారు ఇప్పుడు రేట్ పెరిగింది అని అతను. మా వారేమో ఒక్కో కాయా కడిగి తుడిచి మహా శ్రద్దగా ఇస్త్తుంటే ఎలా కొడుతున్నాడా అని నేను చూస్తుండగానే ఈయన గారు , చిన్న ముక్కలు కొట్టు బాబు అన్నారు . చిన్నవా , టెంక సరిగ్గా రాదు అని చెప్ప బోయాను . నీకు తెలీదు వూరుకో , ఎపుడూ నువ్వూ , విజయ పెద్ద ముక్కలు కొట్టించి వేస్ట్ చేస్తారు . చిన్న ముక్కలైతే , ఎక్కువ వస్తాయి , పిల్లలు పారేయకుండా తింటారు అనేసారు . ఐనా వూరుకోలేక ఈ కాయల మీద కొంచం నల్లగా రసి వుందండి వాసన వస్తాయేమో అన్నాను . హుం నా గోలే కాని వినే నాధుడేడి ? కాదట బ్రహ్మాండం గా వున్నాయని కొట్టే అతను , మా వారు కితాబులిచ్చేసారు . ఇహ చేసేదేమీ లేక దిక్కులు చూస్తూ నిలబడ్డాను . కాయలు కొనడానికి వచ్చేవాళ్ళు , నన్ను ఏకాయ బాగుంటుంది అని సలహాలడగుతుంటే , అహా నన్నే కదా అడుగుతున్నారు అని చెప్పేస్తున్నాను . అది చుసి మావారికి కుళ్ళుపుట్టి ఆమె నడుగుతున్నారా ఆమె కేమి తెలీదండీ అనేసారు వాళ్ళతో . ఇన్ని సంవత్సరాల నుండి ఆవకాయ పెడుతున్నాను నాకు తెలీదా ????
పాపం మధ్యాహ్నం అన్నం తినలేక ఎమైందా అనుకున్నారు . నాకు చాన్స్ దొరికింది కదా , అని చెప్పానా ,అంత ముక్కలు తినొద్దు నోరు పొక్కి పోతుంది అని విన్నారా ? సార్ సార్ అని పిలిచి పిలిచి మరీ ఇచ్చారని తినేసారు బాగయిందిలే లల్ల లా అని పాడేసుకున్నా కాని పాపం మూడు రోజులు ఏమి తినలేక ఇబ్బంది పడుతుంటే చెప్పొద్దూ మహా జాలేసింది . సరే మొత్తానికి కొత్త ఆవాకాయ తిరగ కలిపి వేసే సమయానికి తినగలిగే స్టేజ్ కొచ్చారు . కంచం లో వేసిన ఆవకాయ చూసి , ఇందులో ముక్కలేవి మాలా ? అంతా పేస్ట్ లా వుందే అని తెగ హాచర్య పోయారు ! మరి చిన్నారి పిల్లల కోసం బుజ్జి బుజ్జి ముక్కలు కొట్టిచ్చారుగా , టెంక వూడి పోయి , ముక్క ఖారం లో కలిసి పోయి , నమిలే పనిలేకుండా హాయిగా మింగేసేలా తయారయ్యిందన్న మాట . ఊం కానీయండి , మింగేయండి అనగానే , కంచం లోకి , నా మొహం లోకి , శూన్యం లోకి , నిశ్సబ్దం గా , దీర్ఘం గా చూసి , పోనీ మళ్ళీ ఆవకాయ పెట్టరాదూ , పాపం పిల్లలు ఇదెలా తింటారు అని స్టేట్మెంట్ ఇచ్చారు . మళ్ళీనా అదెలా కుదురుతుంది ? అవాలు లేవుకదా కాస్త నసిగాను . ఎందుకు లేవూ ఒక కిలో దాచమని సావిత్రి కి చెప్పావుగా ! అన్నారు . ఏమిటీ నేను రహస్యం గా చెప్పాననుకున్నానే నేను చెప్పే రహస్యం ఇలా వుందా ? లేక ఈయనవి పాము చెవులా అని నేను సంధిగ్దావస్త లో కాసేపు వుండి , కుదరదు గాక కుదరదు .నాకు ఇంకా ఆవకాయ పెట్టే ఓపిక లేదు గాక లేదు . ఐనా ఈ ఆవకాయంతా ఏం చేయను ? బోయినపల్లి మార్కెట్ దగ్గర , ఈ జాడీ లన్నీ పెట్టుకొని అమ్ముకోనా అని ఏడుపు గొంతు తో అరిచాననుకున్నాను ! మాలా , నీకంత కష్టం కలిగిస్తానా ? ఇవన్ని మా సైట్ కు తీసుకెళ్ళి గాంగ్ వాళ్ళ కిచ్చేస్తాలే అని నన్ను ఓదార్చారు .
శ్రీరామచంద్రా నారాయణా ఎన్ని కష్టాలు తెచ్చావురా నాయనా ( మా అబ్బాయో , మా మనవడో పక్కన వుంటే నేను శ్రీరామచంద్రా , అనగానే మిగితాది వాళ్ళు అనే వాళ్ళు . పక్కన వాళ్ళు లేక పోబట్టి అది కూడా నేనే అనుకోవాల్సి వచ్చింది ) . ఇప్పుడు నేనెవరిని చూసి జాలి పడను ?
ముచ్చటగా మూడోసారి ఆవకాయ పెట్టక తప్పదా ?????
హారి భగవంతుడా ఏదీ దారి * * * * *
Subscribe to:
Post Comments (Atom)
25 comments:
:-) :-)
అయ్యో అలా చూడొద్దండి..."ఇక్కడ నేను ఇలా భాద పడుతుంటే ఏంటానవ్వు?" అనే కదా మీ చూపుకి అర్ధం...
కనీసం నేనయినా మాలా గారి దగ్గర లేకపోతినే..ఎంచక్కా ఆవిడ రామచంద్ర అనగానే మిగిలినది నేను అనేవాడిని అని నేను తెగ ఫీలయ్యానండి మీకోసం...
చాలా చక్కగా, ఆద్యంతం ఆసక్తి కలిగేలా, హాస్యాన్ని మేలవించి రాసారండి...
:)))
మూడుసార్లు ఆవకాయా! మీ ఓపికకి నా జోహార్లు.. ఇంతకీ వెల్లుల్లి వలిచే పని ఎవరికి అప్పగించారు?
maala gaaru first time mee blog chadivanu'chala chala bavundi
neneppudo chadivana bhanumati gari attagaru avakaya katha gurtochindi.
మాలా గార్కి ఎన్ని కష్టాలు తెప్పించావురా దేవుడా!!!!!
మాలగారు ఎంత ఓపికండీ మీకు.. ఆరు మామిడి కాయలతో నేను నా ఫ్రెండ్ ఈ సారి ఆవకాయ పెట్టాం .. అలా చూడకండి.. ఆ కొంతా పెట్టినందుకే అబ్బో అని తెగ పోజులు కొట్టేసుకున్నాం ఇద్దరం ఒకరికొకరం.. మా ఆయన చెత్తలా ఉంది అని కామెంట్ ఇచ్చినా ( దీనినే కుళ్ళు అంటారు..ఆ మాటలు మీరు పట్టించుకోకండి) సగం పచ్చడి ఆయనే తిన్నారనుకోండి.. ఎలా అయినా గ్రేటండీ బాబు మీరు ..ఆవాలు,కారం విషయంలో ఇంత శ్రద్ద తీసుకుని పెడతారా... ??? మేమేంటో అలా అలా చేసేసాము.. ఇన్ని రకాల కష్టాలు పడతారంటే నేను అసలు ఆవకాయ పెట్టే సాహసమే చేయలేను.. మనదంతా తెచ్చే,కొట్టే ,పెట్టెలా సింపులు పద్దతి :)
మాలావిలాపమ్ము చదివి మదీయ హృది ద్రవించినది
అయినా మీరు మరీ చోద్యమండీ.. తెలుగుదేశం లో పుట్టి ఆమాత్రం ఆవకాయ పెట్టడానికి చిరాకైతే ఎలా? మమ్మల్ని చూడండి..(భానుమతి అత్తగారిలా) అయిదొందల కాయలు యెడం చేత్తో పెట్టేస్తాం. అయినా ఈ కాలం వాళ్ళకి మరీ సున్నితాలు లెండి.. మాకాలంలో ఇలా వుండేదా...అహహహ్ మాలాగారూ, నేను మీ వారి సైడ్ చేరిపోయా. ఎందుకంటే దంచలేనమ్మే భుజాలు నొప్పి అంటుందిట. అలాగ ఈ సారి నేనసలు ఆవకాయే పెట్టలేదుగా. ఎంచక్క అందర్నీ కామెంట్ చెయ్యొచ్చు. మీరు బలే దొరికిపోయారు. తప్పదు. ముచ్చటగా మూడోసారీ మీరు ఆవకాయ పెట్టకా తప్పదు, నేను కామెంటకా తప్పదు. ఏమంటారు?
అమ్మో ఆవకాయ అంటే ఇన్ని కష్టాలా? నేనెప్పుడూ పెట్టలేదు, ఈసారి మా అమ్మని కూడా పచ్చళ్ళ జోలికి పోవద్దని పేధ్ధ warning ఇచ్చేసాను. నేను మంచి కూతుర్ని కదా మాలా గారూ :)
మాలా గారు! నాకో చిన్న అనుమానం.. ఈ సారి కూడా కుదరక పోతే ? ఏం చేస్తారు.. అపశకునం కాదండోయ్.. ! జస్ట్ డౌట్ అంటే.. :)
ఈ వేసవి ఇండియాలో ఆవకాయ ప్రహసనాలు చదివీ చదివీ, ఈర్ష్యతో నేను పర్మనెంటుగా ఆకు పచ్చ రంగులోకి మారిపోయాను! మరేం చెయ్యాలి? మాకిక్కడ చచ్చేంత చలి! మావిడికాయలు కలల్లోకి కూడా రావటంలేదు.
పైన ఎవరో చెప్పినట్టూ నేను క్రితం డిసెంబరులో (నవ్వకండీ! మాకిక్కడ అప్పుడే సమ్మరు!) నాలుగంటే నాలుగు మావిడికాయలతో ముక్కల మెంతి పచ్చడి కొంచెం పెట్టి మా స్నేహితులందరిలో హీరోయిన్ లెవెల్లో పోజులు కొడుతున్నాను. మా స్నేహితులు చాలా వరకు తమిళులవటంతో ఆ మాత్రానికే "అబ్బా! మీకు "మాంగా ఊరగా" పెట్టుకోవటం వచ్చా?" అని ఆరాధనగా చూపులూ, "కొంచెం మాకూ రుచి చూపించొచ్చుగా?" అని నసగటాలూ, అబ్బో! చెప్పుకుంటే చాల వుంది లెండి!
జులైలో హైదరాబాద్ వస్తున్నాను, కొత్త ఆవకాయతోటి అన్నం తింటానూ.......
(అప్పటి వరకూ ఈ లాలా జల ప్రవాహానికెలా ఆనకట్ట వేయటం?)
శారద
మాలా కుమార్ గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
హాయిగా ఉంది చదువుతోంటే మీ టపా.నన్ను రమ్మంటారేమిటీ మీరు మూడోసారి పెట్టేఆవకాయ రుచి చూడటానికి :))
అబ్బాయ్ శేఖర్ పెద్ద వాళ్ళను చూసి అలా నవ్వుతే కళ్ళు పోతాయ్ !
* నిషిగంధ గారు ,
మేము వెల్లుల్లి తినమండి . అందుకే ఆ పని తప్పింది .
* అనానొమస్ గారు ,
మీకు నా బ్లాగ్ నచ్చినందుకు చాలా థాంక్స్ అండి .భానుమతి అత్తగారు గుర్తొచ్చినందుకు మరీ మరీ థాంక్స్ అండి .
నిహరిక గారు ,
మరేనండి ఎన్ని కష్టాలో !
*నేస్తం గారు ,
నేనసలు వార్ల మాటలు పట్టించుకోనండి . నిజమే వాళ్ళకి ఎంత కుళ్ళో నాకు అనుభవమే కదా .
*కొత్తపాళి గారు ,
మీ హృదయం దృవించిందా నండి . థాంక్ యు .
శ్రీ లలిత గారు ,
అలాగే అలాగే నండి .అనుభవజ్ఞులు కదా , మూడోసారి ముచ్చటగా మీతోనే ఆవకాయ పెట్టిస్తాను లెండి . ఐదొందలొద్దు కాని ఒక వంద పెట్టండి చాలు .
*స్పురిత గారు ,
మీ అమ్మగారికి వార్నింగ్ ఇచ్చారా ? నీజమేనండి మంచి కూతురే మీరు .
ఏమండోయ్ నాగిని గారు ,
మళ్ళీ ఆవకాయ కలపటానికి నేనేమైనా చెవిలో పువ్వు పెట్టుకున్నానేమిటి ? ఆవఘాటు తక్కువ వున్న ఆవకాయని , ఆవఘాటు వుండి ,ముక్క తక్కువైన ఆవకాయ లో కలిపేశా . అంతే ! అందరూ ఆవకాయ బ్రహ్మాండం గా వుందని తినేస్తున్నారు . మీరీ రహస్యం ఎవరికీ చెప్పకండేం .
* శారద గారు ,
డిసెంబర్ లో ఆవకాయ పెట్టుకుంటున్నారంటే మీరు చాలా గ్రేట్ అండి .
జూలై లో వస్తున్నారా ? ఇంకెంత నెలే కదా లాలాజలాన్ని ఆపేసుకోండి . ఏ చేస్తారు మరి .
*తెలుగింటి వీరనారీమణి గారు ,
మీరొస్తానంటే నే వొద్దంటానా ? రండి రండి . మా ఆవకాయ రుచి చూసి , మీ మెంతి బద్దలకన్నా రుచిగా వుందో లేదో చెప్పండి .
మాలా గారు, నా నవ్వును తప్పుగా అర్ధం చేసుకోవద్దండి..మీ టపా చదువుతుంటే సాబ్ జీకి మీకు మధ్య ఊరగాయ సంభాషణ, మార్కెట్ దృశ్యాలు ఇవన్నీ నాకు కళ్ళ ముందే జరుగుతున్నటు కనిపించాయి...దానివల్ల టపా చదువుతున్నంతసేపూ చిరునవ్వు పెదవులను వదలేదంటే నమ్మండి...
అయ్యో మాలా గారూ..
ఎన్ని ఆవకాయ కష్టాలొచ్చాయి మీకు. ప్చ్ ప్చ్ ప్చ్! అన్నట్టు, ఓ ఆవకాయ జాడీ నాకూ పంపిద్దురూ.. అసలే దేశం కాని దేశంలో ఉన్నాను పాపం! ;-)
శేఖర్ గారు ,
అయ్యయ్యో అదేమి లేదండి .నేనూ జస్ట్ జోక్ చేసానండి అంతే .
థాంక్స్ అండి .
Mam, inka naaku chadhavaalani undhi.
Kaani net lo kurchoni chadhivithe time theliyakapothe ela intiki vellaali kadha
Mee Avakaaya story mmmmmmmmmm
Superrrrrrrrr Mammmmmmmm
అలాగే మధురవాణి ,
నాకూ సాయం చేసినదానివవుతావు , తీసుకెళ్ళు .
*anita teacher ,
thaaaaaaaaaaank youuuuuuuuuuuuuu
aavakaya ruchiki kallallo neellu vasthunnayi
ayina mudosari kalipe aavakaya kosam athrurhaga eduru chusthunna
etu elopu e kalipina aavakaya ayipothundi
avakaya ruchiki kallallo neellu vasthunnayi athaya
vasthe vachayile inthaki eppudu kaluputhav mari pedda mukkaltho ?
వంశీ ,
మొత్తానికి కామెంట్ రాయటము నేర్చుకున్నావు గుడ్ . ఆవకాయ పెట్టటము ఐయింది . నువ్వెప్పుడొస్తే అప్పుడు నీకు ఇస్తాను .
What light of day isn't today?
Post a Comment