Wednesday, June 8, 2011

మా చిన్ని అదితి కి అభినందనలు



"అచ్చట్లు ముచ్చట్లు అవ్వలకు ముద్దు ,
తప్పట్లు తట్టితే తాతలకు ముద్దు ,
జోలల్లు పాడితే పాపలకు ముద్దు ,
మాచిన్ని అదితి మాకు ముద్దు ."
అని పాడగానే కిలకిలా నవ్వేది మా చిన్ని అదితి . కళ్ళు విప్పార్చుకొని మరీ చూసేది . అబ్బో మా అదితి కళ్ళు ఎంత అందమైనవో ! పుట్టీ పుట్టగానే కళ్ళు తెరిచేసింది . అప్పుడే లోకాన్ని చూసేయాలని ఎంత ఆరాటమో ! కళ్ళు మిల మిలా మెరుస్తూ , చాలా బ్రైట్ గా వుండేవి . కార్ లో నా పక్కన , కార్ సీట్ లో కూర్చొని రెప్ప వేయకుండా , సీరియస్ గా చూసేది . అమ్మ ఇంట్లో వున్నంతసేపూ నాతో నే ఆటలూ పాటలూ . కాని అమ్మ బయటికి వెళ్ళిందో అంతే ఏడుపే ఏడుపు . అమ్మా కావాలి , అమ్మమ్మా కావాలి :) అంతే తప్ప పాపం ఎప్పుడూ గొడవ చేయలేదు . అసలు పుట్టిన రెండో రోజే ఇంట్లో స్నానం చేయించాలి అంటే ఎంత భయము వేసిందో ! మా అమ్మాయికి , అల్లుడి కి నా గొప్ప చూపించుకోవాలి కదా ! పైగా వాళ్ళిద్దరికీ బేబీ టబ్ లో కాకుండా చక్కగా నూనే రాసి , నలుగు బెట్టి స్నానం చేయించాలని కోరిక . పైగా మా అమ్మ తో సున్ని పిండి ప్రత్యేకముగా చేయించి తెచ్చుకుంది నా కూతురు :) నాకొచ్చు నాకొచ్చు అని బడాయికి పోయి , మా అత్తగారిని మనసులో తలుచుకొని , టబ్ లో కూర్చొని , కాళ్ళ మీద పసిపిల్లను వేసుకొని స్నానము చేయించేసాను . పాపము హాయిగానే వుండిందో , నొప్పే పుట్టిందో తెలీదు కాని , కుయ్ , కయ్ అనకుండా స్నానం చేయించేసుకుంది మా బంగారక్క . ఏడాదికే ముద్దు ముద్దు మాటల తో ,
" ఐ లవ్ యు ,
యు లవ్ మి ,
వుయ్ అర్ ఆర్ హాపీ ఫామిలీ ,
వితె గ్రేట్ కీస్ అండ్ హగ్ ,
ఐ లవ్ యూ అమ్మమ్మా ."
అనిపాడేది . ఎంత సంతోషమో కదా ! మరే మా బంగారుతల్లి అంతా నా పోలికే :)

ఇలా నా మనవరాలి గురించి చెప్పాలంటే బోలెడు కబుర్లు వున్నాయి . అన్నీ నిన్నా మొన్నా జరిగినట్లే వున్నాయి . నిన్న మొన్నటి పసికూన 10త్ మంచి పర్సెంటేజ్ తో పాస్ అయ్యింది . ఈ రోజు నుంచి కాలేజ్ గర్ల్ ! పిల్లలు పెరుగుతూ వుంటే వారి ఆటపాటలను చూస్తూ మురిసిపోవటము బాగానే వుంటుంది కాని అప్పుడే ఇంత పెద్దవాళ్ళు ఐపోయారా అని బెంగ కూడా వేస్తుంది ! కాని తప్పదు కదా !!!
భవిష్యత్తు లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని ,
నీకు ఇష్టమైన , నచ్చిన ఫీల్డ్ లో రాణించాలని కోరుకుంటూ ,
ఆల్ ద బెస్ట్ అదితీ .

మా అదితి కి ఇష్టమైన చాక్లెట్ కేక్ తిని , ఈ రోజు నుంచి కాలేజీ కి వెళుతున్న మా అదితి ని మీరందరు కూడా విష్ చేసేయండి మరి.. పెద్దల ఆశీర్వాదమే పిల్లలకు రక్ష కదా !

Friday, June 3, 2011

నాకూ బ్లాగుకూ ఋణం తీరిపోయి _ _ _ _ _



మన రోజువారీ కార్యక్రమం మొదలెడుదామని లాప్ టాప్ తీసాను . జిమేయిల్ తీసాను వాకే మేయిల్స్ చూసుకోవటం ఐపోయింది . లేఖిని తీసాను . ఆ తరువాత బ్లాగ్ డాష్ బోర్డ్ క్లిక్ చేసాను . ఇదేమిటి కొత్తగా పాస్ వర్డ్ అడుగుతోంది పేద్ద తెలీనట్లు ! మర్చిపోయిందేమోలే పాపం ఇచ్చేస్తే పోలే ! పాస్ వర్డ్ టైప్ చేసాను . రయ్ ((((( మని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పాస్ వర్డ్ అడిగింది . హుం . . . మళ్ళీ ఇచ్చాను . అయ్యారే . . . . . యిదియేమి చోద్యము * * * * * ఎన్నిసార్లు పాస్ వర్డ్ ఇచ్చినా ఇటుల మాయమైపోవుచున్నది !!!!! మళ్ళీ . . . . . మళ్ళీ . . . అడుగుతోంది . ఏమి చేతును ?????? కాళ్ళూ చేతులూ ఆడకున్నవి >>>>> ఇక నేను బ్లాగ్ వ్రాయలేనా ????? అసలు ఏమైంది దీనికి ??? కొంపదీసి నిన్నటి వెల్లుల్లి ఘాటు పడక ఢాం * * * * * అన్లేదుకదా . . . . . అనవసరం గా వెల్లుల్లి కష్టాలు రాసానే !!!!! అప్పటికీ కొన్ని కష్టాలే రాసాను . అన్నీ రాసి వుంటే లాప్ టాప్ నే ఢాం . . . ఢాం అనేదేమో ((((( అని పరి పరి విధములుగా చింతించాను . కాని ఏమీ లాభం కనిపించలేదు . . . . .

ఇంక నా వల్ల కాదు అనుకొని మా మనవడి ని తీసుకు రమ్మని కార్ పంపాను . హాయ్ అమ్మమ్మా అనుకుంటూ మనవడు , మనవరాలు ఇద్దరూ వచ్చేసారు . మా కొడుకు కోడలు యు. యస్ కు వెళ్ళిపోయినప్పటి నుంచీ నాకు విక్కీ నే చేదోడు వాదోడు . అందుకే వాడికే నా గోడు చెప్పుకున్నాను . ఓ గంట సేపు తిప్పలు పడ్డాడు . సారీ అమ్మమ్మా ఏమైందో రావటం లేదు నాకూ తెలీటం లేదు అని చేతులెత్తేశాడు ! వాడికే రాక పోతే ఇక నాకు దిక్కెవరు ? అయ్యో . . . నాకూ బ్లాగ్ కూ ఋణం తీరిపోయిందా ? 2 1/2 సంవత్సరాలుగా నా కష్ట సుఖాలను పంచుకున్న నా బ్లాగ్ మూగపోయిందా ????? ఏదీ దారి ? కళ్ళు చెమ్మగిలిపోగా రాని డాష్ బోర్డ్ వైపు అలాగే చూస్తూ కూర్చున్నాను . నా తోపాటు విక్కీ కూడా బిక్కమొహం వేసాడు . . . . .

సాయంకాలం మావారు రాగానే ఏడుపు గొంతుతో హేమండీ నా డాష్ బోర్డ్ కనిపించటం లేదు అని చెప్పాను . ఆయన గాభరా పడిపోతూ ఏమిటీ అన్నారు . ఓహో ఈయనకు డాష్ బోర్డ్ అంటే తెలీదు కదూ అనుకొని అదేమిటో , అదిలేక పోతే నాకెంత ఇబ్బందో పదినిమిషాలు వివరించి చెప్పాక అంతా విని ఓష్ అంతే కదా . . . నీ ఏడుపు మొహం చూసి ఇంకేమైందో అనుకున్నాను అని తీసిపారేసారు . ఇంకేమి కావాలి . ఇంతకంటే పెద్ద కష్టం ఏముంటుంది అని గొణుకున్నాను . ఏమనుకున్నారో , ఈ ఏడుపు పోతే తప్ప అన్నం పెట్టననుకున్నారేమో , లేదా జాలే వేసిందో పోనీ రవికి ఫోన్ చేసి కనుక్కో అని ఓ సలహా పడేశారు ! ఇంతరాత్రి ఏమి కాల్ చేస్తానులే అని వూరుకున్నాను .

ఒకటా ? రెండా ? మూడు బ్లాగులు నన్ను వదిలి వెళ్ళిపోయాక నాకు మనశ్శాంతి వుంటుందా ? రాత్రంతా నిద్రనే లేదు . నాకు ఎంత కంపెనీ ఇచ్చాయి ! ఎంతమంది స్నేహితులను సంపాదించిపెట్టాయి ! నాకు తోడూ నీడగా వున్నాయి ! ఇప్పుడు నన్ను దిక్కులేనిదానిగా వదిలేసి వెళ్ళిపోయాయి ! వాటికీ నాకూ ఋణం అంతేనేమో ! అయ్యో సాహితీ ఇక నేను నిన్ను చూడలేనా ! కమ్మటి కలలు కంటూ , చల్తే చల్తే అని హాపీగా బ్లాగ్ లోకాన్నీ చుట్టి రాలేనా ! అకటా ఎంత కష్టం వచ్చింది . పగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టాలు ఇవ్వకు దేవుడా !!! హుం ఎంత దిగులు పడ్డా ఏమిలాభం !

మరునాడు పొద్దున గబ గబా పనులు కానిచ్చుకొని , మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం అనుకొని సిస్టం ఓపెన్ చేసాను . శ్రీమద్ రమా రమణ గోవిందో హరి !!!!! మొదటికే మోసం * * * నెట్ గయాబ్ * * * ఆ పోవటం పోవటం ఐదు రోజులు అత్తా పత్తా లేకుండా పోయి నిన్న నే వచ్చింది . . . చిన్నగా జిమేయిల్ ఓపెన్ చేసాను . వచ్చింది . వెల్లులి కామెంట్స్ పబ్లిష్ చేసాను . లేఖిని వచ్చింది . ఇక తీయనా వద్దా . . . టెన్షన్ * * * టెన్షన్ * * * డెస్క్ టాప్ మీద వున్న ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాను . . .

రెడీ . . .
వన్ . . .
టు . . .
త్రీఈ . . . ఈ . . . ఈ . . .
ధైర్యం విలోలంబాయే ( కరెక్టేనా ? ఏమో ?)
దేవా * * * దేవా * * * దేవా * * * శ్రీ ఆంజనేయా , ప్రసన్నాంజనేయా * * *
క్లిక్ & & & & &
వావ్ ( ( ( ( ( * * * * * వచ్చేసిందీ . . . ఈ . . . ఈ. . .
హబ్బా ఎంత సంతోషం ! మాటల్లో రాతల్లో చెప్పలేనంత !!! తప్పిపోయిన బిడ్డ దొరికినంత :))

Thursday, May 26, 2011

వెల్లుల్లి కష్టాలు !!!!!


వెల్లుల్లి కష్టాలు !!!!!



పొద్దున లేచినప్పటి నుంచి , రాత్రి పడుకునేవరకూ తిండి గోలే . ఏమి వండాలి అనే ఆలోచనలే ఎంతకూ తెగవు . అసలు జనాభాకి ఎందుకింత తిండి రంధి ? ఏమైనా అంటే " కోటి విద్యలూ కూటికొరకే " అనే సామెతొకటి ! మా కజిన్ సత్య అంటుంది రాత్రి పడుకుంటే ఓ పట్టాన నిద్ర పట్టదక్కా అని . ఎందుకు అంటే పొద్దున లేవగానే బ్రేక్ ఫాస్ట్ ఏమి చేయాలి అని ఒకటే టెన్షన్ . మా ఆయన్ని అడుగుతే పొద్దున లేచాక చూసుకోవచ్చుగా పడుకో అంటారు . ఏదో వకటి చెప్పండి అని పదే పదే అడుగుతుంటే విసుక్కుంటూ ఏదో చెప్తారు . అప్పుడు హమ్మయ్యా డిసైడ్ అయ్యింది అనుకొని హాపీగా నిద్రపోతా అని చెప్పింది :) హుం . . .

సరే ఇంట్లో అంటే ఎలాగో ఓలాగా తిప్పలు పడి సద్దుకుంటాము కాని , బయటకి వెళ్ళి నప్పుడు తిండి కోసం తిప్పలు చెప్పలేనన్ని . అసలే మా ఇంట్లో వెల్లుల్లి , మసాలాలు గట్రా తినము . మా తాతగారి ఇంట్లో ఐతే రాములక్కాయలు ( టమాటాలు ) కూడా నిషేదం ! మా ఇంట్లో మా అమ్మ ఉల్లిపాయలు , ఆలుగడ్డ కూర, టమాటాకూర , పప్పుచారు , పకోడీలు మొదలైన వాటిల్లో వేసేది . మా అత్తగారి ఇంట్లోనూ అంతే తప్ప వెల్లుల్లి అనే ఒక పదార్ధం వుంటుంది అని కూడా నాకు తెలియదు . అవునా అలాంటి అమాయకురాలిని ఈ వెల్లుల్లి ఎన్ని కష్టాలపాలు చేసిందో !

మాపెళ్ళైనాక మూడు నెలలు అత్తగారింట్లో ఆడుతూ పాడుతూ వంట నేర్చుకున్నాక ఓ శుభరాత్రి ఏమండీ  నన్ను పటియాలా తీసుకెళుదామని సదరన్ ఎక్స్ ప్రెస్ ఎక్కించారు . ఆ రాత్రి కి ఎలాగూ ఇంట్లోనే భోజనం చేసాము కాబట్టి , మరునాడు వుదయము తినేందుకు పూరీలు , కొబ్బరి పచ్చడి , మద్యాహ్నం కోసం పులిహోర , పెరుగన్నం కట్టి ఇచ్చారు మా అత్తయ్యగారు . అవే ఆ రోజు రాత్రి కూడా తినేసాము . మరునాడు వుదయము నుంచి మొదలయ్యాయి కష్టాలు ! ట్రేన్ లో బ్రెడ్ & ఆంలెట్ తెచ్చారు . చీపాడు ఆంలెట్ నేను తినను అనేసాను . పోనీ బ్రెడ్ సాండ్విచ్ తిను అన్నారు మావారు . ' బ్రెడ్డా ' అది జ్వరం వచ్చి నప్పుడు కదా తింటారు అన్నాను . ఇంతలో అరటిపళ్ళు వస్తే అవి తిని బ్రేక్ ఫాస్ట్ పని ముగించా . మొదటిసారి కాపురాని కి వెడుతున్నానని అమ్మ ఇచ్చిన కారపూస , మైసూర్పాక్ , పళ్ళతో ఆ రోజూ ఎలాగో నెట్టుకొచ్చాను . మరునాడు ఆగ్రా లో దిగాము . రైల్వే కాంటిన్ కు తీసుకెళ్ళి చపాతీలు , పాలక్ పన్నీర్ తెప్పించారు . చపాతీలుకూడా జ్వరం వచ్చినప్పుడు మాత్రమే తినే పదార్ధం అని అప్పట్లో నా ఘాడాభిప్రాయం . అప్పటికి నవలా సాహిత్యము తెలీదు కాబట్టి , భానుమతి అత్తగారి కథ లు చదవలేదు కాబట్టి పన్నీరు వంటకాలలో వాడుతారు అని తెలీదు కాబట్టి అదికూడా తిన్లేదు ! ఆ రోజు కు ఆపిల్స్ తో సరిపెట్టుకున్నాను . అలాగే ఆగ్రా అంతా తిరిగాము . రాత్రి కి డిల్లీ వెళ్ళాము . అక్కడ పొద్దున తెప్పించిన పూరీ , ఆలూ కూరలో ఏదో వాసన . అదేమిటో తెలీదు . ఎప్పుడూ తిన్లేదు . ఎలాగో కూర లేకుండా పూరీ మటుకు తినేసాను . మద్యాహ్నమూ హోటల్ లో అన్నీ కూరలలోనూ ఏదో వాసన . అబ్బే ఇంత పిచ్చి వాసన తో ఇక్కడి వాళ్ళు ఎలా తింటారు బాబు అని బోలెడు హాచర్య పోయాను . ఆ రోజంతా నీరసము గా డిల్లీలో చూడవలసినవి చూసాను . మరునాడు ఉదయానికి పాటియాలా చేరుకున్నాము . యూనిట్ వాళ్ళు పాపం ఎంటో ప్రేమగా పూరీ కూరా పంపారు . అదేమిటి బాబూ ఇక్కడా కూరలో అదేవాసన ! అంతే మళ్ళీ ఉత్త పూరినే తిన్నాను . లంచ్ కు పక్కింట్లో వున్న మేజర్ . జగనాథ్ వాళ్ళు పిలిచారు . వెళ్ళామా . . . ఏవో డ్రింక్స్ ఇస్తారు కాని భోజనము పెట్టరే ! పెట్టినా వీళ్ళింట్లోవి ఏమి వాసనలొస్తాయో ! ఆకలి నక నక లాడిపోతోంది . చివరాఖరికి భోజనము వడ్డించారు . ఎదురుగా టేబుల్ మీద ఘుమ ఘుమ లాడుతూ టమాటో పప్పు , కొబ్బరి పచ్చడి , బీన్స్ కొబ్బరి కూర , సాంబారు , తెల్లటి అన్నం కనిపించాయి . కొంచం కొంచం చిన్నగా . . . నోట్లో పెట్టుకున్నాను . ఏ వాసనలూ లేవు . అంతే అటాక్ . . . ఏమండీ  ఉరుము చూపులు , మేజర్ . జగనాథ్ హాచర్య చూపులూ ఏవీ పట్టించుకోలేదు . హాయిగా సుష్టుగా భోంచేసేసాను :) మిసెస్ జగనాథ్ కు మావారు బోలెడు బోలెడు థాంకూలు చెప్పేసారు . మిసెస్. జగనాత్ ద్వారా ఆ వాసనలు వెల్లుల్లి , గరం మసాలాలవని అతికష్టం మీద తెలుసుకోగలిగాను . వాళ్ళూ అవి తినరు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆ వాసనలు రాలేదు :)

ఆ విధము గా మూడు రోజులు నన్ను ముప్పతిప్పలు పెట్టిన వెల్లుల్లి మీద నాకు ద్వేషం కాక ప్రేమ వస్తుందా ? ద్వేషమైనా ప్రేమైనా పార్టీలలో మా ఏమండీ  ఉరుము చూపులు , ఇంటి కి వచ్చాక క్లాస్లూ భరించలేక తినక తప్పలేదు . అలా చిన్నగా నామీద కొద్దిగా విజయము సాధించింది వెల్లులి . కొద్దిగానే సుమా ! నార్థ్ ఇండియన్ కూరలలో మాత్రము వెల్లుల్లి తినగలను అంతే . డెలివరీ లు అయ్యాక వెల్లుల్లి ఖారప్పొడీ తినక తప్పలేదు . అలా ఏదో వాసన వచ్చీ రానట్లు ఒక్క పాయ వేస్తే తినగలిగిన స్తితికి వచ్చాను . ఐనా దాని మీద నాకేమీ ప్రేమకారిపోదు ! మా రోజువారి వంటలలో మాత్రము ఏమాత్రమూ తినను గాక తినను . ఏదైనా వూళ్ళ కెళ్ళినప్పుడు మ ఏమండీ  తో చివాట్లు తింటాను . ఎప్పుడూ చివాట్లు తిని ఏమి బతుకుతాము లే అనుకొని ఇలా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ రోజు ఏ దేవుడి రోజైతే ఆ దేవుడి పేరు మీద వుపవాసము వుంటాను :) అదీ ఎక్కువరోజులు వెళితే కష్టమే ! అదేమిటో ఇదివరకు హోటల్స్ లలో టిఫిన్స్ బాగుండేవి . ఇప్పుడు దోస , ఇడ్లీ చట్నీలలో కూడా వెల్లుల్లి వేస్తున్నారు . అదేమిటో అర్ధం కావటము లేదు . ఆ మధ్య రాజమండ్రి వెళ్ళి నప్పుడు హోటల్లో వెల్లుల్లి లేకుండా ఏమిస్తావు బాబూ అంటే పెరుగన్నం అన్నాడు .పోనీ అదే తే అన్నాను . వాళ్ళ టేస్ట్ తగలెయ్య ! పెరుగన్నము లో ఉల్లిపాయ వేసాడు . అదీ తినే ఆశ లేదు . హుం . . .

ఈ మధ్య పెళ్ళిళ్ళల్లో కూడా మసాలా కూరలు ఎక్కువైపోయాయి . అక్కడా పెరుగన్నము , ఇంకా సుగర్ వారు దయ తలచలేదు కాబట్టి , స్వీట్స్ తోనూ సరిపెట్టేసుకుంటున్నాను . ఏదైనా వూరు వెళ్ళినప్పుడు పూరీ పంచదార , (మళ్ళీ కూర్మా అంటే బోలెడంత మసాలా , నూనే వేస్తారు ) పెరుగన్నము , పండ్లు వీటి తోటే గడుపుకుంటాను . అలా ఎన్ని రోజులుండగలను ? మరునాటికి నీరసం మొహం పడుతుంది . ఈ మద్య మా ఏమండీ  తోనే కాక లక్ష్మిగారి తోకూడా చివాట్లు తింటున్నాను . ఇలా ఐతే ఎలా మాలా ? మనము ఇంకా బోలెడు వూళ్ళు తిరగాలి . మీరిట్లా నీరసపడిపోతే ఎట్లా . ఇదివరకు ఎప్పుడూ వెల్లుల్లి వేసారా లేదా అని ఎప్పుడూ గమనించలేదు . ఈ మధ్య మీకోసమని అన్ని చోట్లా అడుగుతున్నాను అంటారు !

ఓసారి సుజ్జి నాకు హాస్టల్ లో తినాలనిపించటము లేదు అంది . ఐతే మాయింటికి వచ్చేయి మంచి లంచ్ పెడతాను కాకపోతే మేము ప్యూర్ వెజిటేరియన్స్ మి . కూరలలో వెల్లుల్లి , మసాలా కూడా వేయము అన్నాను . అదేమిటి నేనేమన్నా ఆశ్రమానికి వస్తున్నానా ? ఇలా ఐతే నేను సన్యాసం పుచ్చుకోవలసిందే అన్నది . చూద్దాం రా అన్నాను . వచ్చి తిని వెళ్ళింది కాని ఇప్పటి వరకు సన్యాసుల్లో కలిసిన ధాఖలా ఐతే లేదు మరి :)

అసలు ఎక్కడికైనా వెళితే వెజిటేరియన్స్ మి అంటేనే తిండి దొరకటము కష్టం . ఆ పైన వెల్లులి లేకుండా అంటే అసలే దొరకదు . మా మాజాంగ్ ఫ్రెండ్సైతే దిస్ ఈజ్ ఫర్ యు అని ప్రత్యేకం గా చేసి పెడతారు . అన్ని చోట్లా అలా దొరకదుకదా ! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కష్టాలో ! చివరకు ఇంట్లో ఇప్పుడు వచ్చిన వంటావిడ కూడా వెల్లుల్లి లేకుండా అంటే ఎలా అమ్మా వండేది అంటుంది . మా వంటమనిషి , శైలజ అమ్మా మీకు మంచి ఖారం తేనా అని రాజమండ్రి నుంచి అడిగింది . సరే కొత్త ఖారం కదా తీసుకురా అన్నాను . తను వూరి నుంచి వచ్చాక ఓరోజు మామిడి కాయ పప్పులో లైట్ గా వెల్లులి వాసన వచ్చింది . ఆ మన ఇంట్లో ఎల్లుల్లి వాసనా నెవర్ (((( నా భ్రమేమో అనుకున్నాను . కాని రెండోరోజు మామిడికాయ ముక్కల ఖారం వేస్తూ శైలజ తెచ్చిన కొత్త ఖారం అందులో వేయబోయాను . శైలజ గాభరగా వుండండమ్మా అది వేయకండి అందులో కొంచం వెల్లుల్లి వుంది అన్నది . అదేమిటి అందులో వెల్లుల్లి వుండటమేమిటి అంటే మేము కొత్త ఖారం కొట్టించేటప్పుడు కొంచం వెల్లుల్లి అందులో వేస్తాము సువాసన వుంటుంది అన్నది . నీ సువాసన బంగారం కాను , నేను వెల్లుల్లి తిననని తెలుసుగా ఎందుకువేయించావు ? అందుకేనా రెండురోజుల నుంచి కూరలు వెల్లుల్లి వాసన వస్తున్నాయి అని కోపం చేసాను .అలా . . . ప్రస్తుతం ఆమెకు వంట నేర్పే పనిలో వున్నాను . ఆమె నాకు వెల్లుల్లి కొద్ది కొద్దిగా అలవాటు చేసే ప్రయత్నం లో వుంది . చూద్దాం ఎవరు గెలుస్తారో :)