Monday, December 2, 2013

నా అభిమాన రచయిత్రి కి జలుబొచ్చింది !

 



1971 లో అనుకుంటా ఓరోజు మా ఫ్రెండ్ స్వర్ణ నేను లైబ్రెరీ కి వెళుతున్నాను నువ్వూ వస్తావా అని అడిగింది.అక్కడ ఏమి బుక్స్ వుంటాయి అనీడిగాను. తెలుగు , ఇంగ్లిష్ నావెల్స్ వుంటాయి. రోజుకు అద్దె పావలా తీసుకుంటాడు , నువ్వెప్పుడూ నవలలు చదవలేదా అని అడిగింది. ఇంతవరకు నవలల గురించి తెలీదు. పెళ్ళైయ్యెవరకూ చందమామ , ఇంకా ఏవో కొన్ని పిల్లల పుస్తకాలు మా అమ్మ తెప్పించేది చదివేదానిని. పెళ్ళయ్యాక పూనా లో అవన్నీ దొరకేవికాదు. పైగా అప్పుడు పిల్లల పుస్తకాలు చదువుతుంటే అందరూ వెక్కిరిస్తారేమో నని మానేసాను. ఆంధ్రజ్యోతి వీక్లీ దొరికేది అది చదివేదానిని. అందులో 'జీవనతరంగాలు ' యద్దనపూడి సీరియల్ వచ్చేది అది మాత్రం చదివాను అని చెప్పాను. అవునా అని తెగ హాశ్చర్యపోయి యద్దనపూడిదే ' సెక్రెటరీ ' అని నవల సూపర్ హిట్ . అది చదువుదువుగాని ఇప్పిస్తానురా అని బలవంతాన ఆర్కే లైబ్రరీ కి తీసుకెళ్ళింది .అంతే అది మొదలు పిల్లల పుస్తకాల నుంచి నవలలకు మారిపోయి , వాటికి ఎడిక్ట్ అయ్యాను. ఇంట్లో పనులు,  పసిపిల్ల మా అమ్మాయిపనులు , కాలేజీకి వెళ్ళిరావటము , చదువు ఇన్ని వూపిరాడని పనుల మధ్య ఎలాగోలాగా సమయం చూసుకొని రోజు కొక నవలైనా చదివేదానిని :) ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. అప్పట్లో చాలా వరకు రచయిత్రిల వి , చాలా వరకు సాఫ్ట్ ప్రేమ కథలే వచ్చేవి. అందుకే ఇప్పటికీ నాకు అవే నచ్చుతాయి.భారి డైలాగులు , విషాదాంతాలు , రక్తపాతాలు వున్నవి సినిమాలైనా నవలైనా నచ్చవు.హాస్యం వున్నవైతే మరీ మరీ నచ్చుతాయి :) అదో అలా అలా పొత్తూరి విజయలక్ష్మి నవలలకు , కథలకు వీరాభిమానినైపోయాను :)

'పెళ్ళి చూపులకు పెళ్ళికొడుకు వస్తాడని పార్క్ లో ఎదురు చూస్తున్న పెళ్ళి కూతురికి , చంకలో పిల్లవాడు , చేతిలో పాలసీసా , జుట్టు చెదిరిపోయి,షర్ట్ బటన్స్ వూడిపోయి హైరానా పడుతున్న పెళ్ళి కొడుకు ' ను, 'చీ దిక్కుమాలిన ఆడజాతి .వీళ్ళకు నీతీ నిజాయితీలేవు .'అని మొత్తం ఆడజాతినే అసహ్యించుకునే , హృదయం గాజు గ్లాసు లా  విరిగిపోయిన ఉమాకాంతరావును, బనీను గుడ్డతో జాకిట్టూ, జాకిట్టు గుడ్డతో బనీను కుట్టే పారిజాతం నూ ,ఆడపెళ్ళి వారింట్లో అన్నీ సరిగ్గా అమురుతాయో అమరవో నని , వంటవాడిని, సామాను తోసహా తీసుకొని బయలు దేరిన తాతగారిని , అబ్బో ఇలా చెపుతూ పోతే అంతులేని బోలెడు చిత్ర విచిత్రమైన పాత్రల తో మనసారా , కడుపారా పొర్లి పొర్లి నవ్వించే కథలను వ్రాయటము పొత్తూరి విజయలక్ష్మిగారికే సాధ్యమేమోనని నా హభిప్రాయం :) 

ఇంత నవ్వించే నవలలో, కథలల్లో "ఆత్మ కథ" అనే ఓ సీరియస్ నవలా వుంది. ఇంకా ఏమైనా సీరియస్గా వున్నవి వ్రాసారేమో నాకు తెలీదు కాని ఇది మటుకు చదివాక హృదయం చాలా భారమైపోయింది.అందులోని హీరో బల్వీర్ ను చాలా రోజులు మర్చిపోలేకపోయాను :( 



అనుకోకుండా ఈమధ్యనే విడుదలైన పొత్తూరిగారి పుస్తకం "కొంచం ఇష్టం కొంచం కష్టం " నా చేతికి చిక్కింది . ఇదో ఇక్కడ దీని గురించి వ్రాసాను.

ఓ రెండేళ్ళ నుంచి, లైబ్రెరీల చుట్టూ ఏమి తిరుగుతావు , హాయిగా నువ్వే బుక్స్ కొనుక్కో , ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు అన్న మా అబ్బాయి సలహాతో బుక్స్ కొనటం మొదలు పెట్టాను. అదేమిటో పొత్తూరి గారివి కొత్తగా పబ్లిషైనా బుక్స్ దొరికాయి కాని పాతవి దొరకలేదు. ఎలాగా అని దిగులుపడుతుంటే పి.యస్. యం లక్ష్మిగారు, ఆ బుక్స్ వెనకాల ఆవిడ ఫోన్ నెంబర్ వుందికదా కాల్ చేసి ఆవిడనే అడగండి అన్నారు. అమ్మో ఆవిడకు కాల్ చేసి మాట్లాడటమే ఏమంటారో అన్నాను. ఏమంటారు ? ఎవరైనా మీ బ్లాగ్ చదువుతానంటే మీరు సంతోషిస్తారాలేదా ఆవిడా అంతే అన్నారు కాని ధైర్యం చేయలేకపోయాను:) ఈ లోపల ఉమాదేవిగారు ఆవిడను అడిగి ఏవో కొన్ని వున్నాయట అడగండి పరవాలేదు ఆవిడేమీ అనుకోరు అన్నారు. ధైర్యే సాహసే పుస్తకాలే అనుకుంటూ ఆవిడకు ఫోన్ చేసాను.ఐతే పాతవి ఆవిడ దగ్గరా లేవట! కొత్తవి వున్నాయి అన్నారు. అవి నాదగ్గరా వున్నాయని చెప్పాను. చాలా బాగా , ఎప్పటి నుంచో తెలిసినట్లు ఓ ఫ్రెండ్ లా మాట్లాడారు . చాలా సంతోషమనిపించింది:)

ఓరోజు ఉమాదేవి గారు ఫోన్ చేసి ఈ రోజు రచయితల మీటింగ్ త్యాగరాయగాసభలో వుంది వస్తారా అని అడిగారు. నేనేమీ రయిత్రిని కాదుకదండీ అంటే పొత్తూరివిజయలక్ష్మి గారిని కలవచ్చు అని తాయిలం చూపించారు :)ఇహ ఆగుతామా :) వెళ్ళాను. లోపలికి వెళుతూనే పొత్తూరి విజయలక్ష్మిగారు కనిపించారు.ఉమాదేవి గారు నన్ను పరిచయం చేసారు.మీరు మొన్న కాల్ చేసారు కదా అని వెంటనే గుర్తుపట్టారు. "మాలాగారి అభిమానం లో తడిసి , నాకు జలుబొచ్చిందండీ " అన్నారు విజయలక్ష్మిగారు. "అయ్యో పాపం " అనుకున్నాను మనసులో :) అలా నా అభిమాన రచయిత్రి ని కలిసాను :)

7 comments:

చెప్పాలంటే...... said...

bhale baagaa cheppaaru mala gaaru

Unknown said...

హ్హహ్హహ్హ బాగుంది చక్కగా కలిసారు రాధిక (నాని)

శ్రీలలిత said...


బాగా వ్రాసారండీ మీ అనుభవం...

సి.ఉమాదేవి said...

చాల బాగా చెప్పారు మీ ఆనందానుభూతిని!

మాలా కుమార్ said...

మంజు గారు,
రాధిక గారు,
శ్రీలలిత గారు,
ఉమాదేవి గారు అందరికీ థాంక్స్ అండి.

Vineela said...

wow lucky you andi..nenu kuda avida books ki abhimani ni

MURALI said...

ఓహ్ సూపర్