Friday, July 6, 2012

ఎదురీత




just yellow media pvt ltd వారు టి.వి సీరియల్స్ అంటే నాకున్న అభిప్రాయాన్ని పోగొట్టారు . యద్దనపూడి నవల ఆధారం గా తీసిన సీరియల్ అని ఎక్కడో చదివి ' రాధ-మధు 'చూసాను . చాలా నచ్చేసింది . ఆ తరువాత వారే తీసినవి , 'అమ్మమ్మా.కాం' , ' లయ ' కూడా నచ్చాయి . చక్కని కుటుంబ కథ ల తో ఎక్కడా బోర్ కొట్టించకుండా , ఎత్తులూ పైఎత్తులూ , అత్తా కోడళ్ళ సంవాదాలు , ఓర చూపులూ , కోర చూపులూ , మొహాల మార్పిడులూ వగైరా టి.వి సీరియళ్ళ ఆనవాయితీలు లేకుండా చాలా నీట్ గా వున్నాయి . అందుకే వారు తీసిన సీరియల్ అని తెలిసి ' ఎదురీత ' చూసే సాహసం చేసాను .

రామకోటయ్య మొదటి భార్య ఒక కొడుకును కని చనిపోతుంది . ఆ బాబును చూసుకుంటూ వుందామనుకున్న రామకోటయ్య పరిస్తితుల వల్ల రెండో పెళ్ళి చేసుకుంటాడు . ఆ రెండో భార్య , మొదటి భార్య కొడుకు శేషు ను సరిగ్గా చూసుకోదు అన్న నెపం తో శేషుబాబు ను ఆస్తి తో సహా తీసుకుపోతుంది అమ్మమ్మ . రామకోటయ్య బుచ్చిరెడ్డిపాలెం లో వున్న తన పూర్వీకుల ఆస్తిని మొత్తం శేషుబాబు కు ఇచ్చి , వరిశలేరు వెళ్ళిపోతాడు .భార్య సులోచన , ఇద్దరు కూతుళ్ళు సత్య , వీణ , కొడుకు రాజా తో స్వయంకృషితో సంపాదించుకున్న 40 ఎకరాల పొలము తో,హాయిగా వుంటారు. ఆ వూరి లో అందరికీ తలలో నాలుకలా వుంటూ , గౌరవం పొదుతుంటాడు . అంత చక్కని కుటుంబం లో కాలక్రమేణ వచ్చే మార్పులు , శేషుబాబు అమ్మమ్మ సుగుణమ్మ పెట్టిన చిచ్చుతో ఎలాంటి మార్పులు వస్తాయి , ఆ మార్పులను ఎలా ఎదురొడ్డి తట్టుకున్నారు అన్నదే కథ . ఆ సీరియల్ ను ఇక్కడ చూడవచ్చు .అన్ని కథలూ మన ఇంట్లోనో , పక్కింట్లోనో జరిగినట్టుగా వున్నాయే తప్ప , ఏదో సీరియల్ చూస్తున్నట్లుగా లేదు .

కుటుంబపు పెద్దగా , ఓ తండ్రిగా రామకోటయ్య పాత్ర చక్కగా మలిచారు . పిల్లలను క్రమశిక్షణతో ,మంచి విలువలతో ఎలా పెంచాలో రామకోటయ్య పాత్ర చూపిస్తుంది .ఎన్ని అవాంతరాలొచ్చినా , ఎవరు ఎంత బెదిరించినా బెదిరిపోక , తను చూసిన హత్య గురించి కోర్టులో సాక్షం ఇస్తాడు . అందే పిల్లల కు ఆదర్శం ఐయింది . ఎన్ని కష్టాలు వచ్చినా బెదిరిపోక ధైర్యం గా నిలబడతారు . తము నమ్మిన దానిని ఆచరిస్తారు . కుటుంబమంతా చక్కగా కలిసి మెలిసి వుంటారు .కుటుంబం మధ్య అనురాగాలు , ఆప్యాయతలు చక్కగా చూపించారు . అందుకే అన్యాయం చేసిన అన్నయ్యను కూడా ఆదరిస్తారు .వారిదగ్గర పనిచేస్తున్న వెంకట్రావును ఇంటి మనిషిలా కలుపుకుంటారు . పెద్దరికం ఇస్తారు . చివరికి మెస్స్ కు ఓనర్ ను చేస్తారు . ఆడపిల్లలైనా విధి ని ధైర్యంగా ఎదురుకుంటారు . రాజా చివరి ఉత్తరాలు చదువుతుంటే నిజం గా కళ్ళలో నీరు తిరిగాయి .

మిగిలిన పాత్రలు కూడా చక్కగా నటించారు . సుగుణమ్మ గా కనిపించిందేకాని , శివపార్వతి గా కనిపించలేదు .ఆ పాత్ర మీద ఎంత కోపం వస్తుందంటే , సుగుణమ్మ ఎదురుగా కనిపిస్తే కొట్టాలన్నంత . అంటే అంత బాగా చేసిందన్నమాట . శేషుబాబు చివరి వరకూ డమ్మిలా వున్నా చివరలో చక్కని పరిణితి చూపించాడు . పెద్దన్నయ్యగా తండ్రి బాధ్యత లు చేపడతాడు .భాస్కర్, గౌతం , అంకయ్య, బెనర్జి , బుచ్చిబాబు, వెంకట్రావు , వెంకయ్య, నీలిమ ,విజయ్ ఇంకా మిగిలిన పాత్రధారులు అందరూ బాగా చేసారు .

ఇక చిత్రీకరణ , కథ , మాటలు బాగున్నాయి . మేకప్ కూడా సహజం గా వుంది .నిర్మాతకో , దర్శకుడికో పొడుగుజడలంటే ఇష్టమనుకుంటాను . అందుకే హీరోయిన్లకే కాదు వీలైనంతవరకు ఆడపాత్రలన్నిటికీ పొడుగు జడలుంటాయి . కాకపోతే ఇంకొంచం శ్రధ్ధ తీసుకుంటే ఇంకా బాగుండేది .అప్పుడప్పుడు సవరాలు కనిపిస్తూ వుంటాయి:) అరణ్య కు పఫ్ తీయకుండా మామూలుగా జడవేస్తే బాగుండేది . చీరలు చక్కగా కట్టారు . పాత్రధారుల ఎంపిక కూడా బాగుంది . సత్య పాత్రకు వీణను తీసుకున్నా , వీణ పాత్రకు సత్యను తీసుకున్నా సరిపోయేవారు కాదు . రాజా పాత్రధారి ముద్దుగా వున్నాడు . ఆ పాత్ర చనిపోయినప్పుడు చాలా దుఖం వచ్చింది . చంపకుండా వుంటే బాగుండు అనిపించింది . కాని ఆ తరువాత కథ అంతా దానిమీదే ఆధారపడి వుంది కదా :) అంతా బాగుంది కాని ఇందులో కాస్త కోర చూపులు ఓరచూపులు కొద్దిగా ఎక్కువైనాయి .అందులో నటించినటీనటుల పేర్లు , వారి పాత్ర పేర్లతో చూపిస్తే బాగుండేది . నాలాంటి వారు ఎవరు ఎవరిగా నటించారో తెలీక తన్నుకలాడుతారుకదా మరి :) ముందునుంచీ తాపీగా తీసుకొచ్చి చివరలో హడావిడి ముగించినట్లు అనిపించింది .

ఈ సీరియల్ కథా రచయత ; గంగరాజు గుణం ,

మాటలు , కథనం , ఆజాద్ చంద్రశేఖర్,

నిర్మాత ; ఊర్మిళా గుణం ,

దర్శకుడు ; వాసు ఇంటూరి ,

సంగీతం ; యస్. పి బాలచంద్రన్ ,

గాయకుడు ; యస్.పి బాలసుబ్రమణ్యం ,

రచయత; చిర్రాపూరి విజయకుమార్ ,

మేకప్; నల్ల శ్రీను .

అసలు ,వీరే రాధ- మధు టీం తో యద్దంపూడి నవల ఇంకోటి సీరియల్ గా తీస్తే చూడాలని వుంది :)))

9 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

మాలా కుమార్ గారు.. ఒక సీరియల్ చూపించారు . బాగుందండీ! మాల గారు చెపితే..నాకు ఓకే..ణే! థాంక్ యు..మేడం.

రాజ్యలక్ష్మి.N said...

మాలా కుమార్ గారు..
ఈ సీరియల్ నేను పూర్తిగా చూడలేదు కానీ టైటిల్ సాంగ్ మాత్రం నాకు చాలా నచ్చింది..
స్టోరీ కూడా బాగుంది. మంచి సీరియల్ పరిచయం చేశారు..

Padmarpita said...

సీరియల్స్ చూడని నాలాంటి వారికి...మీ ఈ పోస్ట్ ఇన్స్పిరేషన్. బాగుందండి!

Kottapali said...

నాక్కూడ నచ్చింది ఈ సీరియల్. నేను ఎప్పుడో నెలకోసారి చూస్తుండేవాణ్ణి, మధ్యలో అత్తయ్యగారు కథ ఏం జరిగిందో టూకీగా చెబుతుండేవాళ్ళు. మీరన్నట్టు విపరీతాలు పైత్యాలు లేకుండా చక్కగా తీశారు. తెలుగు హీరోయిన్లు లేరో అని ఏడిచే దర్శకులు సత్యని తీసుకోవచ్చు. ఒక చిన్న జోకు. రామకోటయ్య పాత్ర చనిపోయాక, ఒకసారి ఏదో టీవీ వాళ్ళ ఫంక్షను వస్తుంటే, అందులో ఆ పాత్రధారిని చూసి మా అత్తయ్యగారు - అదేంటి రామకోటయ్య చచ్చిపోయాడుగా, మళ్ళీ వచ్చాడేంటి అనేశారు పైకి. :)

శ్రీలలిత said...

ఈ సీరియల్ నాకూ నచ్చింది. చెడుపనులు చేసేవారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందంటూ లేవనుకుంటున్న విలువలని చూపెట్టి, న్యాయాన్ని నిలబెట్టిందీ సీరియల్.

జలతారు వెన్నెల said...

నిన్న మీ పోస్ట్ చూడగానే, మీరిచ్చిన లింక్ నొక్కి చూడటం మొదలెట్టాను.
ఇంట్లో అందరు బద్ద శత్రువులు అయిపోయారు నాకు. తెలుగు serials చూస్తున్నావా ? అసలు నీకు బుద్దుందా అంటూ...ఊహు! కాదర్రా..వినండి, ఇదేదో బాగుందంట అన్నాను..వినలేదు వాళ్ళు. పైగా తెలుగు serials అనేవి బాగుంటాయా అని వెటకారం గా నవ్వారు.. నవ్వితే నవ్వారు అనుకుని,ear plugs పెట్టుకుని వారికి sound వినపడకుండా చూస్తున్నాను.అమ్మ తో ఈ రోజు ఉదయం మాట్లాడినప్పుడు చెపితే , బాగుంటుంది, చూడు చూడు అని చెప్పింది. చూసేసి (టైం పదుతుందేమో కొన్ని నెలలు అన్ని episodes complete చెయ్యలంటే) అప్పుడు నా అభిప్రాయాం చొమ్మెంట్ పెడతాను మళ్ళీ.

మాలా కుమార్ said...

వనజ వనమాలి గారు ,
నామీద మీకున్న నమ్మకానికి థాంక్స్ అండి .

*రాజి ,
అవునండి టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది . యస్.పి చాలా బాగా పాడారు . అది నేను పోస్ట్ లో రాయటం మర్చిపోయాను :)

*పద్మార్పిత గారు ,
నేనూ టి.వి కి చాలా దూరం అండి . కాని ఈ ప్రొడక్షన్ వారి బాగుంటాయని చూస్తాను .

మాలా కుమార్ said...

నారాయణ స్వామి గారు ,
మీకు కూడా ఈ సీరియల్ నచ్చిందంటే చాలా బాగున్నట్లు లెక్క :) మాకూ మీరు చెప్పినలాంటి జోకే జరిగింది . మావారు శ్రీరామరాజ్యం చూసొచ్చి , ఇందులో రామకోటయ్య వున్నాడు , నువ్వు చూసినప్పుడు ఎక్కడో గుర్తుపట్టు అన్నారు . నేను పరద్యానం గా రామకోటయ్య ఎక్కడున్నాడు ? చచ్చిపోయాడుగా అన్నాను . మావారు ఈ సీరియల్ రాక ముందు శ్రీరామరాజ్యం చేసాడేమోలే అని నవ్వారు . అప్పుడు నా బుర్రకు ఎక్కింది సీరియల్ లో కదా చచ్చిపోయిందీ అని :) మీ వాఖ్యకు థాంక్స్ అండి .

*శ్రీలలిత గారు ,
ఈ సీరియల్ లో ఒక కుటుంబం విలువలు ఎలా వుండాలో చక్కగా చూపించారు . నాకూ అదే చాలా నచ్చిందండి . థాంక్ యు.

*జలతారువెన్నెల గారు ,
ఈ సీరియల్ చూసేందుకు ఎక్కువ నెలలు పట్టదులెండి . 174 ఎపిసోడ్సే వుంది . చిన్నదే తప్పక చూడండి . మీకూ నచ్చుతుంది .మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూవుంటాను :)

Anonymous said...

hey all sahiti-mala.blogspot.com blogger discovered your website via search engine but it was hard to find and I see you could have more visitors because there are not so many comments yet. I have discovered site which offer to dramatically increase traffic to your website http://bestwebtrafficservice.com they claim they managed to get close to 1000 visitors/day using their services you could also get lot more targeted traffic from search engines as you have now. I used their services and got significantly more visitors to my blog. Hope this helps :) They offer best services to increase website traffic Take care. Mike